తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి

(శివశంకరస్వామి నుండి దారిమార్పు చెందింది)

తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రి (ఎన్ ఏ - ఏప్రిల్ 1, 1977) సాహితీవేత్త, కథా రచయిత ,నాటక ప్రయోక్త, దర్శకుడు. భావకవితా ఉద్యమ పోషకుడు. వీరిని కొందరు శివ శంకర స్వామి గా కూడా వ్యవహరించటం ఉంది. వీరు సాహితీ సమితి సభాధ్యక్షుడిగా ఉన్నాడు. 1921-22 లలో తెనాలిలోని శ్రీరామ విలాస సభ నాటకసంస్థలో దర్శకుడిగా పనిచేశాడు.[1] భాష ఎలా ఉన్నా భావం నిర్దుష్టంగా నవ్యతతో ఉంటే సరిపోతుందనే మనస్తత్వం కలవాడవటం మూలానా అనేక మంది భావకవులకు ప్రోత్సాహాన్నిచ్చి ప్రాచీన, నవీన కవితా రీతులకు సమన్వయ మార్గం చూపిన సాహితీవేత్త.[2] వారి జన్మ దినం పై ఖచ్చితమైన సమాచారం లేదు. అందువల్ల ఖచ్చితమైన తేదీని ప్రకటించను వీలు కాలేదు. 

తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి
తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి
జననంఎన్ ఏ
కాజ గ్రామం, గుంటూరు జిల్లా
మరణంApril 1, 1977
ఒంగోలు
నివాస ప్రాంతంకొత్తపేట, ఒంగోలు
ఇతర పేర్లువిద్యావాచస్పతి

మహోపాధ్యాయ కవిసార్వభౌమ సాహిత్యాచార్య సాహిత్యసామ్రాట్ కవీంద్ర

సభాపతి
వృత్తిప్రముఖ సాహితీ వేత్త, కథా రచయిత , నాటక ప్రయోక్త , దర్శకుడు, కవి పండితుడు. కొంతకాలం గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీ లో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు.
ఉద్యోగంఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి
ప్రసిద్ధిప్రసిద్ధ సాహితీవేత్త, నాటక, కథా రచయిత, దర్శకుడు, కవి పండితుడు.
మతంహిందూ బ్రాహ్మిన్
భార్య / భర్తవర్ధనమ్మ
పిల్లలుకృత్తివాస తీర్థులు (ఒక్కరే కుమారుడు)
బంధువులుతల్లావజ్ఝల పతంజలిశాస్త్రి,తల్లావజ్ఝల సుందరం ,తల్లావజ్ఝల శివాజీ తల్లావజ్ఝల విద్యాపతి (ప్రముఖంగా పేరు గాంచిన మనుమలు)
తండ్రికృష్ణశాస్త్రి
తల్లిలక్ష్మీదేవి

జీవిత విశేషాలు

మార్చు

వీరు కృష్ణశాస్త్రి, లక్ష్మీదేవి దంపతులకు గుంటూరు జిల్లా, కాజ గ్రామం మంగళగిరి మండలంలో లో జన్మించారు [3]. వీరిపూర్వీకులు సుప్రసిద్ధ కూచిపూడి నాట్య కళను సృజించిన నారాయణతీర్థ యతీన్ద్రులు (1650-1745). దాదాపు శివ శంకర శాస్త్రి గారికి ఆరవతరం ముందు   వంశస్థులు. నారాయణ తీర్ధ యతీన్ద్రుల అసలు పేరు గోవింద శాస్త్రులు. కొన్ని పరిస్థితుల కారణంగా కాజా లో ఉంటున్న వీరి కుటుంబం తంజావూరు వలసవెళ్లింది. ఆయన పిన్న వయస్సులోనే సంగీతం క్షుణ్ణంగా అభ్యసించారు. అదే కాలంలో సంస్కృతం, పౌరాణిక ఐతిహాసిక గ్రంధాలను పుక్కిట బట్టారు . సంగీతంలో ఆయన దాధాపు ముప్ఫయి నాలుగు రాగాలలో ప్రసిద్ధుడు. వీటన్నిటినీ కూచిపూడి నృత్యానికి అనుగుణంగా అద్భుతంగా మలిచాడు. ఆయన గద్యం రాసినా, పద్యం రాసినా ఎంతో రసాత్మకమై, సౌందర్య  భరితమై ఉండేవి . వీరు దాదాపు 15 ప్రామాణిక పుస్తకాలు రచించారు. వాటిలో నేటికీ కొన్ని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో, తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలో లభిస్తాయి. పారిజాతాపహరణం , హరిభక్తి సుధార్ణవం వంటి రచనలు ఇక్కడ నేటికీ లభిస్తున్నాయి. దాదాపుగా ఈ లక్షణాలన్నీ శివశంకర శాస్త్రి గారిలో కనిపిస్తాయి . అదీ ఆశ్చర్యం గొలిపే విషయం . ఈత, గుర్రపుస్వారీ, చిత్రలేఖనం, తోటపని, టెన్నిస్ ఇతని అభిమాన విషయాలు. వీరు హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ, సంస్కృతం, పాళీ భాషలలో నిష్ణాతుడు. ఆయా భాషలనుండి తెలుగులోనికి అనేక గ్రంథాలను అనువదించారు.

సాహితీ సంస్థల స్థాపన, నిర్వాహణ

మార్చు

వీరు పెక్కు సాహితీ సంస్థలకు ప్రాణం పోసి సమర్ధ వంతంగా నడపటమే గాక, తరువాతి కాలంలో కొన్ని ప్రతిష్టాత్మక రాష్ట్రప్రభుత్వ సాహితీ  సంస్థలకు ఆధిపత్యం వహించారు. శివ శంకర శాస్త్రి 1920లో తెనాలిలో సాహితీ సమితి స్థాపించారు. తానే దానికి అధిపతి గా వ్యవహరించారు. ఈ కారణంగా వారికి 'సభాపతి' అనే బిరుదు ఏర్పడింది. ఈ సమితిలో ఆనాడు ఆంధ్ర దేశంలో ఉన్న సుప్రసిద్ధ కవులెందరో సభ్యులుగా చేరారు. 1934 లో నవ్య సాహిత్య పరిషద్, 1951 లో కవిత్రయ సమాజం, 1952 లో అఖిలాంధ్ర పరిషత్ను  స్థాపించి తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. 'నవ్య సాహిత్యానికి, వ్యావహారిక భాషోద్యమానికి ప్రధాన వేదికగా తల్లావఝుల శివశంకర శాస్త్రి అధ్యక్షతన గుంటూరులో 1936లో నవ్య సాహిత్య పరిషద్ ఏర్పడింది. నవ్య సాహిత్య పరిషద్కు పోటీగా వామపక్ష భావ జాలంతో కుందుర్తి ఆంజనేయులు అధ్యక్షుడుగా నవ్య కళా పరిషద్ 1939లో నర్సరావుపేట లో ఏర్పడింది. 1943 వరకూ కొనసాగింది' - అని వివరించారు పెనుగొండ లక్ష్మి నారాయణ తన బృహత్ పరిశోధనా సాహిత్య గ్రంధం -'గుంటూరు సీమ సాహిత్య చరిత్ర'లో.[2] సాహిత్య అకాడెమీ, నేషనల్ బుక్ ట్రస్టులలో సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ఉపాధ్యక్షుడిగా, శాశ్వత గౌరవ విశిష్ట సభ్యుడిగా ఉన్నాడు. దేశ స్వాతంత్య్ర సమయంలో రెండు పర్యాయాలు కారాగార శిక్ష అనుభవించాడు.

సంపాదకత్వం-- బహుముఖీయమైన ప్రజ్ఞ

మార్చు

వీరు సాహితీ, సఖీ పత్రికలకు సంపాదకత్వం వహించారు. పలు దేశీయ , విదేశీ భాషలను అధ్యనం చేసి ఆ భాషలనుండి అనేక గ్రంథాలను అనువాదం చేశారు. సంస్కృత వ్యాకరణ దర్శన చరిత్రతో పాటు హృదయేశ్వరి, వకుళమాల, కావ్యావళి, ర్యాంత్నాకరం వంటి విశిష్ట కావ్యాలను రచించారు. పాళీ భాష నుండి అనువదించిన జాతక కథలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఇవి ఆంద్ర రాష్ట్రంలో లోగిలి అనే ప్రచురణ సంస్థ వద్ద నేటికీ లభిస్తున్నాయి . గేయ నాటిక రచనలో ప్రత్యేక పేరు సంపాదించుకొన్నారు. శిల్ప శాస్త్రం , తత్వ శాస్త్రం, కామకళ, మనస్తత్వ శాస్త్రాలలోనే గాక బుక్ బైండింగ్ కళ లోనూ వీరికి ప్రవేశం ఉండటం ఆశ్చర్యం .  నాటక కళ లో ఎన్నో నూతన ఒరవడులను ప్రవేశపెట్టాడు. 1918-20ల మధ్య గుంటూరు ఆంధ్రా క్రైస్తవ కళాశాలలో పండితుడిగా పనిచేశారు. 1939-40ల మధ్య గుంటూరు దివ్య జ్ఞ్యాన సమాజంలో ఉంది అనేక ఖండ కావ్యాలు, పద్య గేయ నాటికలు రచించారు. మురారి కథలు, నీలకంఠం కథలు, 'ఆంధ్ర కథా మంజూష' కథా సంకలనం 1958 లో ది ఓరియంటల్ పబ్లికేషన్ కంపెనీ ప్రచురణకు సంపాదకత్వం వహించారు.   వీరు రాసిన అత్యంత హాస్యభరిత కథలలో 'గాదె' అనే కథను పెనుగొండ లక్ష్మి నారాయణ 'గుంటూరు కథలు'4 సంకలనం లో పునర్ముద్రించారు. పసిపిల్ల వాని మనస్తత్వంపై   శివశంకర శాస్త్రిగారికి ఉన్న సాధికారికతకు అద్దంపడుతోంది ఈ కథ. ఒంగోలులోని పీసపాటి వెంకట రంగయ్య మునిసిపల్ స్కూల్ తో వీరికి పెక్కు రీతులలో ఎంతో అనుబంధం ఉండేది.  

శివ శంకర శాస్త్రి గారు ఎంత గొప్ప పండితుడో అంత నిరాడంబరుడు. గుడిపాటి వెంకటాచలం, దేవులపల్లి కృష్ణ శాస్త్రీలను సాహితీ లోకానికి దిగ్గజాలుగా పరిచయం చేసి తన హృదయ నైర్మల్యాన్ని కనబరిచారు. వీరిమీద పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి, నోరి నరసింహ శాస్త్రి గారలు సమగ్ర వ్యాసాలు రాసి అప్పట్లో ప్రఖ్యాత ఆంగ్ల సాహిత్య జర్నల్ 'త్రివేణి' లో అచ్చువేశారు. అలాగే ఆంధ్ర ప్రభలో వి ఎం శర్మ , తిరుమల రామచంద్ర లు నిర్వహించే 'మరపురాని మహనీయులు' శీర్షికలో 'శివశంకరశాస్త్రి' గారి ముఖాముఖీని ప్రచురించారు. అజో విభో కందాళ ఫౌండేషన్ వారు శివశంకర శాస్త్రిగారిపై  ఏకంగా పుస్తకమే వేశారు. అయితే ఇవి చాలామటుకు అందుబాటులో లేవు.     

శివ శంకర శాస్త్రి గారి మనుమలలో పతంజలి శాస్త్రి ఒకరు . ఇతను నాటక ప్రయోక్త , దర్శకుడు,కథా రచయిత, వాతావరణ నిపుణుడు. ఇతని 'రామేశ్వరం కథల' సంపుటికి  ఇటీవల కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించింది . ఈ యన రాసిన 'కంచికి చేరని కథ' ఆకాశవాణిలో బహుబాషాల్లో ప్రసారమైంది. తల్లావఝుల సుందరం ఒక అద్భుత నాటక ప్రయోక్త , నటుడు , దర్శకుడు. తల్లావఝుల శివాజీ మరొక మనుమడు. వీరు గొప్ప చిత్రకారులు, వ్యాసకర్త, జర్నలిస్ట్. వీరికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవన సాఫల్య అవార్డు ఇచ్చి సత్కరించింది.     

స్వాతంత్రోద్యమం -జైలు శిక్ష

మార్చు

1930-31లలో సహాయ నిరాకరణోద్యమంలో, కాంగ్రెస్లో చేరి కారాగారశిక్ష అనుభవించిన స్వాతంత్ర సమరయోధుడు.   

బౌద్ధ మత స్వీకరణ

మార్చు

1947లో బౌద్ధమతం స్వీకరించి, కాషాయాంబరం ధరించి ఉపదేశం పొంది శివశంకర స్వామిగా ప్రసిద్ధులైనారు. ఈ కాలంలో వారు అనేక బౌద్ధమత గ్రంధాలను పాళీ భాషనుండి తెలుగులోకి అనువదించారు. అందులో ఒకటి బుద్ధ జాతక కథలు.  

1977 మార్చ్ 31 రాత్రి 12గం ల సమయంలో తుది శ్వాస విడిచారు. శివశంకర శాస్త్రి పార్థివ దేహాన్ని ఒంగోలుకు 16 కి మీ దూరంలో ఉన్న కొత్తపట్నం సముద్రం (బంగాళా ఖాతం)లో సముద్రం మధ్య జారవిడిచారు. ఇది వారి చివరి కోరిక -తన శరీరాన్ని జలచరములకు ఆహారంగా వినియోగించమని ఆయన తన డైరీ లో రాసుకొన్న విధంగానే ఆయన పెద్ద మనవడు విద్యాపతి వారి పార్థివ శరీరాన్ని పడవలో తీసుకెళ్లి సముద్రమధ్యంలో జారవిడిచారు.

రచనలు

మార్చు
  • 1. కావ్యావళి. (రెండు భాగములు)
  • 2. హృదయేశ్వరి (ఉపకావ్యము)
  • 3. పద్మావతీ చరణ చారణ చక్రవర్తి (పద్య నాటిక -- ముద్రి)
  • 4. రాజజామాత
  • 5. సహజయానపంథీ
  • 6. నోణక భార్య
  • 7. వరపరీక్ష (ఈ నాలుగు గీతి నాటికలు)
  • 8. వకుళమాల (గీతికాస్వగతము)
  • 9. రత్నాకరము (గీతికాసంవాదము)
  • 10. ఆవేదన (ఖండకావ్యము)
  • 11. కవిప్రియ (పద్యనాటిక)
  • 12. యక్షరాత్రి (గీతినాటిక)
  • 13. సాధకుడు (వాకోవాక్యము)
  • 14. కవిరాజు (సర్గబంధము)
  • 15. వ్యాకరణ దర్శన చరిత్ర (ఆంధ్రీకరణము ఈ రెండును రచనలో నున్నవి)
  • 16. మహారాష్ట్ర జీవనప్రభాతము
  • 17. జీవనసంధ్య
  • 18. మాధవీ కంకణము
  • 19. రమాసుందరి
  • 20. కాంచనమాల
  • 21. కుంకుమ భరిణె (అచ్చువడిన నవలలు)
  • 22. దీక్షితదుహిత (నాటిక)
  • 23. ప్రభువాక్యం
24.మురారి కథలు
25. నీలకంఠం కథలు,
26. 'ఆంధ్ర కథా మంజూష' కథా సంకలనం 
27. మహోదయం (వేంకటపార్వతీశ్వర కవుల షష్టిపూర్తి సందర్బంగా విడుదలైన ఆధునిక కవితా సంకలనం)

బిరుదులు

మార్చు
  1. విద్యావాచస్పతి
  2. మహోపాధ్యాయ
  3. కవిసార్వభౌమ
  4. సాహిత్యాచార్య
  5. సాహిత్యసామ్రాట్
  6. కవీంద్ర
  7. సభాపతి

మూలాలు

మార్చు
  1. నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14
  2. 2.0 2.1 పెనుగొండ లక్ష్మి నారాయణ (2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర(2020). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం.
  3. "ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, సంపాదకుడు- నాగభైరవ కోటేశ్వరరావు - జూన్ 1971- పుట 118". Archived from the original on 2020-09-25. Retrieved 2015-10-11.

4. గుంటూరు కథలు 2013, సంకలనం : పెనుగొండ లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు