శ్రీ వేంకటేశ్వర దేవాలయం (ద్వారకా తిరుమల)

చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఉన్న నగరము

వెంకటేశ్వర ఆలయం, భారతదేశం, ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల మండలం లోని ద్వారకా తిరుమల గ్రామంలో ఉన్న వైష్ణవ ఆలయం. ఈ ఆలయం విష్ణు అవతారముగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని చిన్నతిరుపతి అనేపేరుతో కూడా పిలుస్తారు.[1] ఇది పూర్తి సౌకర్యాలతో కూడిన దివ్య పుణ్యక్షేత్రం. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖానసాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.

శ్రీ వేంకటేశ్వర దేవాలయం, ద్వారకా తిరుమల
ద్వారకా తిరుమల ఆలయం ప్రవేశం
ద్వారకా తిరుమల ఆలయం ప్రవేశం
శ్రీ వేంకటేశ్వర దేవాలయం (ద్వారకా తిరుమల) is located in ఆంధ్రప్రదేశ్
శ్రీ వేంకటేశ్వర దేవాలయం (ద్వారకా తిరుమల)
Location in Andhra Pradesh
భౌగోళికం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు
స్థలంద్వారకా తిరుమల
సంస్కృతి
దైవంవెంకటేశ్వరుడు (విష్ణువు)
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రావిడ
దేవాలయాల సంఖ్య1

ఆలయ పురాణం, చరిత్ర

మార్చు
 
ద్వారకా తిరుమల ప్రధానాలయం - http://www.aptourism.in/ నుండి తీసికొన్న చిత్రం

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రకారం:[2]

ఈ పుణ్యక్షేత్రాన్ని'వాల్మీకం' (చీమల కొండ)లో కఠోర తపస్సు చేసిన "శ్రీవేంకటేశ్వరుని" స్వయం ప్రతిరూపమైన "ద్వారకా" అనే మహాసన్యాసి పేరు మీదుగా"ద్వారకా తిరుమల" అనేపేరుతో పిలుస్తారు. భక్తులు శ్రీ వేంకటేశ్వరుడిని కలియుగ వైకుంఠ వాస అని పిలుస్తారు.ఈ ప్రాంతాన్ని "చిన్నతిరుపతి" అని కూడా అంటారు.శాస్త్రాల ప్రకారం గంగా, యమునా వంటి ఉత్తర భారత నదుల మూలాలు వరకు మరింత పవిత్రంగా పరిగణిస్తారు. కృష్ణా, గోదావరి వంటి దక్షిణభారత నదులు నది నుండి సముద్రంలోకి వెళ్ళే కొద్దీ మరింత పవిత్రమైనవి.అందుకే కృష్ణా, గోదావరి నదుల దిగువ ప్రాంతాలకు ఇరువైపులా అనేక పుణ్యక్షేత్రాలు పవిత్ర స్నాన ఘట్టాలు కలిగి ఉన్నాయి.ద్వారకా తిరుమల పరిధిలో ఉన్న ప్రాంతం భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉంది.ఈ రెండు గొప్ప భారతీయ నదులైన కృష్ణా, గోదావరి నదులు ఈ ప్రాంతాన్ని పూలమాలగా అలంకరించినట్లు బ్రహ్మపురాణం ద్వారా సూచించబడింది.

తిరుమల తిరుపతి దేవస్థానం "పెద్ద తిరుపతి" అని పిలువబడే వెంకటేశ్వర స్వామికి వెళ్లి విరాళాలు ఇవ్వాలనుకునే భక్తులు, కొన్ని కారణాల వల్ల, అక్కడికి వెళ్ళలేనివారు, ద్వారక తిరుమల ఆలయంలో వారి విరాళాలు సమర్పణ, పూజలు ఇక్కడ చేస్తుంటారు.[3] ద్వారకా తిరుమల పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందిన దేవాలయం. కొన్ని పురాణాల ప్రకారం, ఈ ఆలయం సత్యయుగంలో కూడా ప్రసిద్ధి చెందింది.ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తోంది. బ్రహ్మ పురాణం ప్రకారం, శ్రీరాముడి తాత అజ మహారాజు తన వివాహానికి వేంకటేశ్వరుడిని పూజించినట్లు తెలుస్తుంది. అజ మహారాజు ఇందుమతి 'స్వయంవరానికి వెళుతూ, అతను ఈ ఆలయం మీదుగా వెళతాడు. కానీ ఈ ఆలయంలో పూజలు చేయలేదు. వధువు ఇందుమతి అతనికి పూలమాల వేసింది. అయితే అతను స్వయంవరానికి వచ్చిన రాజులతో యుద్ధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. దారిలో ఆలయాన్ని విస్మరించినందుకు యుద్ధం సంభవించిందని అతను గ్రహించాడు.ఈ విషయం తెలుసుకున్న అజ మహారాజు వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థించాడు. అకస్మాత్తుగా ప్రత్యర్థి రాజులు యుద్ధాన్ని వెంటనే ఆపారని కథనం.

ఆలయ విశేషాలు

మార్చు
 
ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలోని మండపంలో అన్నమయ్య విగ్రహం
 
ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ద్వారకా మహర్షి విగ్రహం

ఒకే విమాన శిఖరం కింద రెండు ప్రధాన విగ్రహాలను చూడటం గొప్ప అద్భుతం.ఒక విగ్రహం పూర్తి విగ్రహం. మరొకటి భగవంతుని రూపంలోని పై భాగానికి చెందిన సగం విగ్రహం. విగ్రహ రూపం ఎగువ భాగం "ద్వారక" మహర్షిచే స్వయంప్రతిష్ఠితమైన విగ్రహం. పవిత్ర పాదాలను పూజించకుండా భగవంతుని ప్రార్థనలు పూర్తి కాదని, పూర్వపు సాధువులు భావించి, వైఖానస ఆగమం ప్రకారం భగవంతుని పాదాలను పూజించడానికి, స్వీయ - వ్యక్త విగ్రహం వెనుక పూర్తి విగ్రహాన్ని స్థాపించారు. ఈ ఆలయంలో తిరు కల్యాణోత్సవం సంవత్సరానికి రెండుసార్లు జరుపుతారు. ఒకటి "వైశాఖ" మాసంలో ప్రతిష్టించిన విగ్రహం కోసం జరిగింది.మరొకటి "ఆశ్వయుజ" మాసంలో ప్రతిష్టించబడిన విగ్రహం కోసం జరిగింది. ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేయక పోవడం ఇంకొక విశేషం. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహం క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చుతాయి.

ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల, గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పైభాగాన (లోపల) సప్తర్షుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మంటపం ఉంది. ప్రధాన మందిరంలో ఆంజనేయస్వామి, గరుడస్వామిల చిన్న మందిరాలు (ధ్వజస్తంభం వెనుక) ఉన్నాయి. ప్రధానాలయానికి తూర్పువైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, పడమటినైపున తిరువంటపడి పరికరాలశాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం ఐదు అంతస్తులది. గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. గుడి ప్రాకారం చుట్టూ పన్నెండుగురు ఆళ్వారుల విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి. పడమరవైపు ప్రక్కనే తలనీలాలు సమర్పించుకొనే కళ్యాణ కట్ట ఉంది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి.

గర్భగుడి మహిమ

మార్చు

గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత, అత్యంత స్ఫూర్తిదాయకమైన, మంత్రముగ్ధమైన అనుభూతిని పొందుతారు. పౌరాణిక దేవత వేంకటేశ్వరుడు విగ్రహ పరిమాణం వరకు కనిపిస్తాడు.దిగువ భాగం భూమిలో ఉన్నట్లు ఊహించబడింది. పవిత్ర పాదాలను బలి చక్రవర్తికి తన రోజువారీ పూజ కోసం"పాతాళ" లో సమర్పించినట్లు చెబుతారు. 11వ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీమద్ రామానుజులచే ప్రతిష్టించబడిన ప్రధాన విగ్రహం వెనుక ఉన్న శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం పూర్తి పరిమాణతో దర్శనమిస్తుంది. పద్మావతి, నాంచారి అమ్మవారల విగ్రహాలు అర్థమండపంలో తూర్పు ముఖంగా ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్ఠింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు.శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు.

ఆదిశేషునిపై శివుడు, విష్ణువుల కలయిక

మార్చు

ఇక్కడ అత్యంత విచిత్రమైన అంశం, కొండ, పాము రూపంలో కనిపించడం. అనంత అనే సర్పరాజు ఈ భూసంబంధమైన సర్పం కొండను స్వీకరించి, మల్లికార్జున దేవుడిని కొండపైకి తీసుకువెళుతున్నాడని పురాణ సంస్కరణను ధృవీకరిస్తుంది. తోకపై వేంకటేశ్వరుడు, ఇలా వైష్ణవం, శైవమతం రెండిటిని సామరస్యపూర్వకమైన రాజీగా ఒకే స్థలంలో సృష్టించటం విశేషం.[4] ఇది సంతోషకరమైన విషయముగా భక్తులు భావిస్తారు.

ప్రస్తుత నిర్మాణం, పునరుద్ధరణ

మార్చు

విమాన, మంటప, గోపుర, ప్రాకార మొదలైన అద్భుతమైన స్మారక చిహ్నాలు సా.శ.1762-1827 ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుడు ధర్మ అప్పారావు ఘనతను గుర్తుకు తెస్తాయి. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన రాణి రాణి చిన్నమ్మారావు (1877–1902) ఘనతగా నిలుస్తాయి.ఈ విషయాలు చిన్నతిరుపతి పుణ్యక్షేత్ర వైభవాన్ని చిరస్థాయిగా నిలిపాయి. ప్రధాన దేవాలయం దక్షిణభారత వాస్తుశిల్పానికి అద్దం పడుతోంది. దాని ఐదు అంతస్థుల ప్రధాన రాజగోపురం దక్షిణం వైపు, మరో మూడు గోపురాలు ఇతర మూడు వైపులా ఉన్నాయి. ఈ విమాన గోపురం పట్టణ శైలిలో ఉంది.పాత ముఖమంటపాన్ని నేటి అవసరాలకు అనుగుణంగా చాలా వరకు విస్తరించారు.ప్రాకారానికి అన్నివైపులా అనేక ఆళ్వార్ల ఆలయాలు ఉన్నాయి.విశాలమైన ప్రదేశం మొత్తం రాతితో చదును చేయబడింది. యాత్రికులకు కన్నుల పండుగలా కనిపించేలాగున ఒక క్రమంలో పూల చెట్లను పెంచారు.ఈ ఆలయంలో ఇంకా ఆంజనేయ స్వామి, గరుడ పర్వతం, సాధువు ద్వారక, శ్రీ తాళ్లకపాక అన్నమాచార్యుల విగ్రహాలతో కూడిన ఇతర ఆలయాలు ఉన్నాయి.గుడి ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది. మంటపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలో (తొలి పైమెట్టు వద్ద) పాదుకా మండపంలో స్వామి వారి పాదాలున్నాయి. పాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు ప్రక్కలా దశావతారాల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. మెట్లకు తూర్పునైపున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం ఉన్నాయి. పడమటివైపు పద్మావతి సదనం, దేవాలయ కార్యాలయం, నిత్యకళ్యాణ మండపం ఉన్నాయి.

పుష్కరిణి

మార్చు

గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ అంటారు. ఇక్కడ చక్ర తీర్ధం, రామ తీర్ధం అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్ళపై సుదర్శన (చక్రం) ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. 199లో పుష్కరిణి మధ్య మండపం నిర్మించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) నాడు తెప్పోత్సవం జరుపుతారు.

గ్రామ మండపాలు

మార్చు
 
ద్వారకా తిరుమలలో పాదాల కొండ వద్ద గరుడ విగ్రహం

గ్రామం లోపల విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనే కట్టడాలు వేరువేరు చోట్ల ఉన్నాయి. పర్వదినాలలో తిరువీధుల సేవ జరిగినపుడు ఆయా మండపాలలో స్వామిని "వేంచేపు" చేసి, అర్చన, ఆరగింపు, ప్రసాద వినియోగం జరుపుతారు.

కేశఖండన మొక్కు విధానం

మార్చు

ద్వారకా తిరుమలను దర్శించిన భక్తులు పెద్ద తిరుపతిలో లాగనే, తలనీలాలు (తల వెంట్రుకలు) మొక్కుగా సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. వెంకటేశ్వరుడు పద్మావతీ దేవిని వివాహం చేసుకోవడానికి పూర్వం ఆశ్రమజీవనం గడుపుతున్నప్పుడు, తన ఆవు పాలు తాగుతున్నాడని ఒక పశువుల కాపరి కోపంతో కొట్టడంతో తలపై ఆ దెబ్బకు కొంత చర్మం కందిపోయి జుట్టు తొలగిపోయింది. ఈ సంఘటన వల్ల వెంకటేశ్వరుని దివ్యమంగళ రూపానికి చిన్న మచ్చలా అనిపించిందని, గాంధర్య కన్య యువరాణి నీలాదేవి తన అపురూపమైన కొప్పునుంచి కొన్ని వెంట్రుకలను దేవదేవుని కోసం ఇచ్చిందట. నీలాదేవి గౌరవార్ధం భక్తులు ఇచ్చే మొక్కుకాబట్టి తల నీలాలు అంటారట. అట్టి మొక్కు తీర్చుకునే ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అంటారు.

అర్చన, కైంకర్యం, ఉత్సవాలు

మార్చు
  • నిత్య కార్యక్రమాలు - సుప్రభాతం, తీర్ధపు బిందె, ప్రాతఃకాలార్చన, బాలభోగం, గోష్ఠి, ప్రత్యేక దర్శనం (06:00 నుండి 13:00), అర్జిత పూజలు, వేద పారాయణం, మహా నివేదన (12:00), విరామం (13:00 నుండి 15:00 వరకు దర్శనం ఉండదు), ప్రభుత్వోత్సవం, సర్వ దర్శనం (15:00 నుండి 17:00 వరకు), పంచాంగ శ్రవణం, ప్రత్యేక దర్శనం (17:00 నుండి 21:00 వరకు), సాయంకాలార్చన, సేవాకాలం, పవళింపు సేవ, ఏకాంతసేవ తీర్మానం (21:00)
  • విశేష ఉత్సవాలు - ప్రతినెల ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య తిథులకు, పునర్వసు, శ్రవణ నక్షత్రాలకు, సంక్రమణం రోజులలో- రాత్రి 7:30కి విశేష ఉత్సవం - ప్రత్యేకమైన మూల మండపంలో స్వామివారి వేంచేపు, అర్చన, ప్రసాద వినియోగం
  • ఉగాది ఉత్సవం - చైత్రమాసం ఉగాదికి - ఉగాది మండపంలో వేంచేపు, పంచాంగ శ్రవణం, పండిత సన్మానం
  • శ్రీసీతారామకళ్యాణం - శ్రీరామనవమి రోజు జరుపుతారు
  • ఉట్లపండుగ - కృష్ణాష్టమి రోజు జరుపుతారు
  • తిరుకళ్యాణోత్సవాలు - వైశాఖమాసం (శుద్ధ దశమి నుండి నిదియ వరకు), ఆశ్వయుజమాసం (విజయ దశమి నుండి విదియ వరకు) - అలంకరణ, సాంస్కృతిక ఉత్సవాలు, భజనలు, ఉపన్యాసాలు, కళ్యాణోత్సవం, రథోత్సవం జరుపుతారు.
  • పవిత్రోత్సవాలు - శ్రావణ మాసంలో - శుద్ధ త్రయోదశినుండి మూడు రోజులు - పూర్ణిమనాడు పూర్ణాహుతి
  • తెప్పోత్సవం - కార్తీక మాసం క్షీరాబ్ధి ద్వాదశి నాడు - సుదర్శన పుష్కరిణిలో * అధ్యయన ఉత్సవాలు - మార్గశిరమాసం - ధనుర్మాసం నెల రోజులు ఉదయం తిరువీధి సేవ- ముక్కోటి ఏకాదశినాడు ఉత్తరద్వార దర్శనం, తరువాత 11 రోజులు అధ్యయన ఉత్సవం, రాత్రి తిరువీధి సేవ.
  • గోదా కళ్యాణం - పుష్యమాసం - భోగి నాడు-, తిరువీధి సేవ
  • గిరి ప్రదక్షిణం - పుష్యమాసం - కనుమ నాడు- తిరువీధి సేవలో స్వామివారు గ్రామం పొలిమేర దాటి దొరసానిపాడులో ప్రత్యేక మండపంలో అర్చన, ప్రసాదానంతరం గిరిప్రదక్షిణ పూర్వకంగా ద్వారకా తిరుమల గ్రామంలో ప్రవేశిస్తారు.
  • రధ సప్తమి - మాఘ మాసంలో జరుపుతారు ,
  • డోలా పౌర్ణమి - ఫాల్గుణ మాసంలో విశేషంగా తిరువీధి సేవలు జరుపుతారు.

మూలాలు

మార్చు
  1. "Tirumala Temple". Archived from the original on 23 అక్టోబర్ 2015. Retrieved 26 May 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "Sri Venkateswara Swami Vari Devasthanam". www.dwarakatirumala.org. Archived from the original on 2015-10-23. Retrieved 2017-11-30.
  3. https://tms.ap.gov.in/SVSDDT/cnt/about-temple
  4. https://tms.ap.gov.in/SVSDDT/cnt/about-temple

వెలుపలి లంకెలు

మార్చు