సిక్కిం రాచరికంపై ప్రజాభిప్రాయ సేకరణ
1975 ఏప్రిల్ 14 న సిక్కిం రాజ్యంలో రాచరికాన్ని రద్దు చేయడంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.[1] దీనిపై దాదాపు 63% మంది వోటు వేయగా, అధికారిక ఫలితాల్లో 97.55% మంది ఈ ప్రతిపాదనకు అనుకూలంగా వోటు వేసారు. ఫలితంగా దేశం భారతదేశంలో ఒక రాష్ట్రంగా మారింది.
| ||||||||||||||||
రాచరికాన్ని రద్దు చెయ్యడం | ||||||||||||||||
Results | ||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
నేపథ్యం
మార్చు19 వ శతాబ్దం నుండి సిక్కిం బ్రిటిష్ వలస పాలనలో భారతదేశపు రక్స్జిత రాజ్యంగా (ప్రొటెక్టరేట్) ఉంది. 1950 లో కుదిరిన ఒక ఒప్పందం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ ఏర్పాటు కొనసాగింది. దీని ద్వారా భారతదేశం, సిక్కిం లోని కమ్యూనికేషన్లు, రక్షణ, విదేశీ వ్యవహారాలు, అలాగే సిక్కిం "ప్రాదేశిక సమగ్రత" బాధ్యతలను స్వీకరించింది. అంతర్గత వ్యవహారాల్లో మాత్రం సిక్కింకు స్వయంప్రతిపత్తి ఉండేది.[2][3]
చోగ్యాల్ (చక్రవర్తి)కి భూటియా సామాజిక వర్గం (మధ్యయుగ కాలంలో వచ్చిన టిబెటన్ స్థిరనివాసులు) నుండి, కొంత వరకు స్థానిక లెప్చాల నుండి మద్దతు లభించింది.[4] ఈ రెండు సమాజాలు కలిపి సిక్కిం జనాభాలో 25% కంటే తక్కువ. మిగిలిన జనాభా బ్రిటీష్ రాజ్ సమయంలో వచ్చిన నేపాలీ సెటిలర్లతో ఎక్కువగా కూడుకుని ఉంది. ప్రజా ప్రాతినిధ్య సంస్థల ఎన్నికలలో, భూటియా-లెప్చా సమాజాలకు చెందిన ప్రతి ఓటు ఆరు ఓట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా లెక్కించబడింది. తద్వారా వారికి అనవసరమైన వెయిటేజీ వచ్చేది.[5] తన సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ వ్యూహాత్మక బఫర్ స్టేట్‌లో స్థిరత్వం కోసం భారత ప్రభుత్వం ఈ అసమాన వ్యవస్థను అనుసరించింది.[6][4]
1973 లో, పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, భారతదేశం చోగ్యాల్ నుండి పెరుగుతున్న శత్రుత్వాన్ని గ్రహించింది. "ఒక వ్యక్తి ఒక ఓటు" కోసం పిలుపునిచ్చే ప్రజాస్వామ్య ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది.[4] 1973 ఏప్రిల్‌లో జరిగిన హింసాత్మక ఆందోళనల తరువాత భారతదేశం, రాజకీయ ఉద్యమకారులకు, చోగ్యాల్‌కూ మధ్యవర్తిత్వం వహించి, ఒక కొత్త వ్యవస్థను తీసుకువచ్చింది. దీని ద్వారా భూటియా-లెప్చాలకు, నేపాలీలకు ఒక్కొక్కరికి15 సీట్ల చొప్పున కేటాయిస్తారు. అయితే ఓటర్లకు "ఒక మనిషికి ఒక ఓటు" ఉంటుంది.[4][a] తరువాతి ఎన్నికలలో, నేపాలీ-ఆధిక్యత ఉన్న స్థానాలతో పాటు, భూటియా-లెప్చా ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాలలో కుడా రాజరిక జాతీయ పార్టీని ఓడించి, కాజీ లెందుప్ దోర్జీ నేతృత్వంలోని సిక్కిం నేషనల్ కాంగ్రెస్ 32 సీట్లలో 31 గెలుచుకుంది.[4]
1974 మే - జూలై మధ్య, కొత్త ప్రభుత్వం సిక్కిం ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. ఇది సిక్కింకు కొత్త రాజ్యాంగం. భారత ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించిన 1973 మే ఒప్పందంపై ఆధారపడిన ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ముఖ్యమంత్రి, మంత్రుల మండలి, ముఖ్య కార్యనిర్వాహకుడు అనే మూడు వ్యవస్థలను సృష్టించారు. ప్రధాన కార్యనిర్వాహక అధికారి కార్యాలయం, బ్రిటిషు పాలనా కాలంలో ఉపయోగించిన వ్యవస్థలను పోలి ఉంటుంది. ఆ పదవిలో ఉన్నవారు అన్ని ముఖ్యమైన విషయాలపై చోగ్యాల్ ఆమోదం పొందాలని భావించినప్పటికీ, చోగ్యాల్‌కు అప్పటివరకూ ఉన్న అధికారాలను కత్తిరించేసింది.[4][7] భారత్‌తో సంబంధాలను కొనసాగించేందుకు కూడా అనేక నిబంధనలు ఉన్నాయి.[4][3] 1974 జూలై 4న, ఇది చోగ్యాల్ ఆమోదం పొందింది.[8][1]
1974 ఆగస్టు 13 న సిక్కిం నేషనల్ కాంగ్రెస్, కొత్త రాజ్యాంగంలోని 6 వ అధ్యాయాన్ని ఉదహరిస్తూ భారత ప్రభుత్వానికి లేఖ రాస్తూ, భారతదేశ రాజకీయ సంస్థలలో సిక్కిం ప్రజలకు భాగస్వామ్యం కావాలని కోరింది. ఆ అభ్యర్థన ఆధారంగా, సిక్కింకు అనుబంధ రాష్ట్ర హోదాను కల్పిస్తూ, భారత ప్రభుత్వం రాజ్యాంగ (ముప్పై ఆరవ సవరణ) బిల్లు, 1974 ను ఆమోదించింది. దాని ప్రకారం, భారత పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో సిక్కింకు ఒక్కో సీటును కేటాయించింది. ఈ బిల్లును 1974 సెప్టెంబరు 7 న భాత్రత పార్లమెంటు ఆమోదించింది.[8][9][10][11]
చోగ్యాల్ వ్యతిరేకించాడు
మార్చుభారత రాజ్యాంగ సవరణ 1950 నాటి భారత-సిక్కిం ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొంటూ చోగ్యాల్ దానిపై వెంటనే అభ్యంతరం తెలిపాడు. "మా ప్రత్యేక గుర్తింపును, అంతర్జాతీయ వ్యక్తిత్వాన్ని" కాపాడాలని ఆయన భారత ప్రధానిని కోరాడు.[9] భారతీయ వ్యాఖ్యాతల ప్రకారం, అతను సిక్కింను భారతదేశంలో "విలీనం" చేస్తున్నట్లు విదేశీ పత్రికలకు చెప్పడం ద్వారా సమస్యను "అంతర్జాతీయం" చేయడానికి కూడా ప్రయత్నించాడు.[9]
1975 ఫిబ్రవరిలో చోగ్యాల్, నేపాల్ రాజు పట్టాభిషేకం సందర్భంగా నేపాల్ వెళ్ళాడు. అతను భారతదేశానికి వ్యతిరేక ప్రచారంలో నిమగ్నమై ఉన్నాడు. సందర్శించే విదేశీ ప్రముఖుల నుండి తన వాదానికి మద్దతు సమీకరించే ప్రయత్నం చేశాడు.[9] ఇది సిక్కింలోని రాజకీయ ఉద్యమాలను రెచ్చగొట్టింది. రాచరికాన్ని రద్దు చేయాలని, సిక్కిం నుండి చోగ్యాల్‌ను బహిష్కరించాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. చోగ్యాల్ సిక్కింకు తిరిగి వచ్చినప్పుడు, ప్రదర్శకులు అతని ప్యాలెస్‌కు వెళ్లే మార్గాన్ని అడ్డుకోగా, ప్యాలెస్ గార్డ్‌లు ప్రదర్శనకారులపై దాడి చేశారు. జాతీయ అసెంబ్లీలోని ఒక సభ్యుడు గాయపడ్డాడు. చోగ్యాల్ గెరిల్లా దళాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు, చైనా-పాలనలో ఉన్న టిబెట్ నుండి ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్లు కూడా నివేదికలు ఉన్నాయి. చోగ్యాల్ మద్దతుదారుడొకడు కోర్టుకు వెళ్లి సిక్కిం ప్రతినిధులను భారత పార్లమెంటుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ఇంజక్షన్ పొందాడు. గ్యాంగ్‌టక్‌లో పలువురిపై కాల్పులు జరగడంతో వీధుల్లో హింస చెలరేగింది.[9]
ముఖ్యమంత్రి కాజీ లెందుప్ దోర్జీ భారత్‌ను జోక్యం చేసుకోమని అభ్యర్థించాడు. భారత్ తన సైన్యాన్ని పంపి, ప్యాలెస్ కాపలాదారులను నిరాయుధులను చేసింది. ప్యాలెస్ భద్రతను భారత దళాలు స్వాధీనం చేసుకున్నాయి.[9] రాచరికాన్ని రద్దు చేసి ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయాలని జాతీయ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ రెండు అంశాలపై 1975 ఏప్రిల్ 14 న ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించాడు.[9][8][12] సెప్టెంబరులో భారతదేశం సిక్కింను అనుబంధ రాష్ట్రంగా విలీనం చేసినప్పటి నుండి చోగ్యాల్, అతని మద్దతుదారులు ప్రజాభిప్రాయ సేకరణ కోసం డిమాండ్ చేస్తూ వచ్చారు.[13][1]
నిర్వహణ
మార్చుప్రజాభిప్రాయ సేకరణకు ముందు రోజులలో చోగ్యాల్ అనుకూల, విలీన వ్యతిరేక వ్యక్తులు, సంఘాలపై భారతీయ మద్దతుగల సమూహాలు నిర్దాక్షిణ్యంగా వేధించాయి, దాడులు చేసాయి. విలీన వ్యతిరేక గ్రూపులకు చెందిన చాలా మంది నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళారు. వారి ఇళ్లను ధ్వంసం చేశారు. ఉదాహరణకు క్యూజింగ్‌కు చెందిన కుంజాంగ్ దోర్జీ. డార్జిలింగ్‌లోని సిక్కిం స్టూడెంట్స్ అసోసియేషన్ స్థాపకుడు హేమ్ లాల్ భండారీ, 1974 సిక్కిం ప్రభుత్వ చట్టానికి ప్రతిస్పందనగా, "బ్రిటిషు పార్లమెంటులో రెండు సీట్ల కోసం భారతదేశ ప్రజలు తమ స్వాతంత్ర్యాన్ని వదులుకుంటారా?" అని అన్నాడు. భారత అధికారులు అతన్ని కొట్టి, జైల్లో వేసారు. సిక్కిం నేషనల్ పార్టీ మాజీ నాయకుడు ఫుర్బా భూటియా, సాంగ్‌లోని అతని ఇంట్లో హత్య చేయబడ్డాడు. ఇతర సిక్కిం జాతీయవాదులు షెరాబ్ పాల్డెన్, తేజేంద్ర రసైలీ, కుంగా టోప్‌డెన్, డానీ, నాడూ లెప్చా లను భారతీయ అధికారులు అరెస్టు చేసారు.[14]
ఓటర్లకు, రిఫరెండం అంటే సిక్కింను భారత్‌లో విలీనం చేయడం లేదా చోగ్యాల్‌ను రద్దు చేయడం అని చెప్పలేదు. వారికి ప్రశ్నతో కూడిన పింక్ పేపర్ స్లిప్‌లు ఇచ్చారు. తమకు ఆమోదం ఉంటే ఆ కాగితాన్ని గులాబీ పెట్టెలోను లేనట్లైతే తెల్లటి పెట్టెలోనూ వెయ్యాలని చెప్పారు. పరిణామాల గురించి పూర్తిగా అవగాహన లేని వోటర్లు, కాగితం రంగుతో సరిపోలిన పెట్టెలో వేసారు. పోలింగ్ స్టేషన్‌లలో సిఆర్‌పి (సెంట్రల్ రిజర్వ్ పోలీస్) సభ్యులు పింక్ "అప్రూవల్" బాక్స్‌లో ఓటు వేయాలని ఓటర్లను ఆదేశించారు.[15]
ఫలితాలు
మార్చుChoice | Votes | % | |
---|---|---|---|
For | 59,637 | 97.55 | |
Against | 1,496 | 2.45 | |
Total | 61,133 | 100.00 | |
మూలం: Direct Democracy[1] |
ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలను సునంద కె. దత్తా-రే ప్రశ్నించాడు, "ఈ సుదూర నివాసాలలో కొన్నింటిని చేరుకోవడానికి అత్యంత వేగవంతమైన రవాణా విధానమైన జీపులో వెళ్ళడానికి కనీసం రెండు రోజులు పడుతుంది. ఏర్పాట్లను పూర్తి చేయడం, ఎన్నికలు నిర్వహించడం, ఓట్లను లెక్కించడం ఏప్రిల్ 11 - 15 మధ్య చెయ్యడం సాధ్యమయ్యే పని కాదు."[16]
వోటర్లలో 70 నుండి 80% మంది భారతదేశం నుండి వచ్చిన బయటి వ్యక్తులని చోగ్యాల్ మద్దతుదారులు చెప్పారు.[16]
ప్రతిస్పందనలు
మార్చుచైనా, పాకిస్తాన్‌లు ఈ ప్రజాభిప్రాయ సేకరణను ప్రహసనంగాను, రాజ్యాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునే ముసుగు గానూ వర్ణించాయి. దీనికి ఇందిరాగాంధీ, టిబెట్‌ను విలీనం చేసుకోడాన్ని, తమ భూభాగమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఆక్రమించిన సంగతినీ వారికి గుర్తు చేస్తూ సమాధానమిచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణ "చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం" అని చోగ్యాల్ పేర్కొన్నాడు.[17][18]
US ప్రభుత్వం, ముఖ్యమైన వాణిజ్య మార్గాలలో సిక్కిం ఉన్న స్థానం కారణంగా, దాన్ని భారతదేశంలో విలీనం చేయడాన్ని చారిత్రాత్మక, ఆచరణాత్మక అనివార్యతగా భావించింది. సోవియట్ యూనియన్ సానుకూలంగా స్పందించింది. 1978లో, ఇందిరా గాంధీ తరువాత వచ్చిన ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్, సిక్కిం విలీనం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, విమర్శించాడు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగం ఆ ప్త్రకటన పట్ల హింసాత్మక నిరసనలకు పాల్పడింది.[19] దేశాయ్, "విలీనం చెయ్యాల్సిన చర్య కాదు" అని చెబుతూ, తాను దానిని రద్దు చేయలేనందుకు విచారం వ్యక్తం చేసాడు. చోగ్యాల్‌కు ప్రజాదరణ లేని కారణంగా "అక్కడ ఉన్న చాలా మంది ప్రజలు దీనిని కోరుకున్నారు" అని కూడా పేర్కొన్నాడు.[20]
అనంతర పరిణామాలు
మార్చుఫలితాల ప్రకటన తర్వాత, సిక్కిం ముఖ్యమంత్రి కాజీ లెందుప్ దోర్జీ ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలను ఇందిరా గాంధీకి తెలియజేసాడు. "తక్షణమే స్పందించి, నిర్ణయాన్ని ఆమోదించాలని" ఆమెను కోరాడు., దానికి ఆమె స్పందిస్తూ, భారత ప్రభుత్వం రాజ్యాంగపరంగా సిక్కిం భారతదేశంలో భాగమయ్యేలా పార్లమెంటులో సవరణ చేసి, రాజ్యాంగబద్ధతను ప్రవేశపెడుతుందని చెప్పింది.[21][22]
1975 ఏప్రిల్ 26న సిక్కింను రాష్ట్రంగా చేసే రాజ్యాంగ సవరణకు భారత పార్లమెంటు తుది ఆమోదం తెలిపింది.[23] 1975 మే 15న భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగ సవరణను ఆమోదించగా, సిక్కిం భారతదేశంలోని 22వ రాష్ట్రంగా రూపొందింది. చోగ్యాల్ పదవి రద్దైంది.[24]
సిక్కిం మాజీ చీఫ్ సెక్రటరీ దోర్జీ దహదుల్, సిక్కిం ఓటర్లను బెదిరింపులకు గురిచేసి ఈ రెఫరెండం జరిపారని, భారత మద్దతు ఉన్న ఎన్నికల అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం, స్వాతంత్య్ర అనుకూల సిక్కిమీయులను బలవంతంగా అణచివేయడం, ప్రచారానికి రాకుండా అడ్డుకోవడం జరిగిందనీ విమర్శించాడు. సిక్కిం ప్రభుత్వ చట్టం ప్రకారం అటువంటి ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించే అధికారం సిక్కిం ఎన్నికల కమిషన్‌కు లేదని అతడు అన్నాడు. LD కాజీ భార్య ఎలిసా-మరియా కాజినీ, ప్రజాభిప్రాయ సేకరణలో తన భర్త పాత్రను దూషిస్తూ, "కాజీ తన దేశాన్ని అమ్మేశాడని, అంటారు!" అని వ్యాఖ్యానించింది.[25] 1984లో, ఆమె, చోగ్యాల్‌కు సన్నిహితుడు, రచయిత అయిన నారీ రుస్తోమ్‌జీతో మాట్లాడుతూ, "మీరు, చోగ్యాల్‌లు ఖచ్చితంగా చెప్పింది నిజమే, ఇదంతా చాలా ఘోరమైన తప్పు." అని చెప్పింది.[26]
చోగ్యాల్ రెండవ కుమారుడు, ప్రిన్స్ వాంగ్‌చుక్, లండన్‌లో చదువుతున్న సమయంలో, భారతదేశ చర్యలను నిరసిస్తూ ది టైమ్స్‌లో కథనాలను ప్రచురించాడు. "భారతీయ చర్యలకు భౌగోళిక-రాజకీయ సమర్థనలు ఎలా ఉన్నా, వాస్తవం మాత్రం వేరే ఉంది. దీని ప్రత్యేక చట్టపరమైన గుర్తింపు భారత సైన్యం, పోలీసుల ఒత్తిడి ద్వారా సిక్కిం ప్రజలపై ఒత్తిడి చేయబడిన రాజ్యాంగ విరుద్ధమైన, చట్టవిరుద్ధమైన చర్యలతో సిక్కిం ప్రత్యేక ఉనికిని కాలరాచారు. అందుచేతనే, సిక్కింలోకి స్వతంత్ర పరిశీలకులను అనుమతించడానికి భారతదేశం నిరాకరించడం, సిక్కింను యూనియన్‌లో చేర్చడానికి భారత పార్లమెంటులో హడావిడిగా చేయడం గమనించవలసిన అంశాలు." అని అతను రాసాడు.[27]
విలీనం జరిగిన వెంటనే, ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. సిక్కింలోని భారత అధికారులు స్వాతంత్ర్య అనుకూల శక్తులను అణిచివేసేందుకు దీనిని ఒక అవకాశంగా ఉపయోగించుకున్నారు. కెప్టెన్ సోనమ్ యోంగ్డా, నర్ బహదూర్ భండారీ, అశోక్ కుమార్ సుబ్బా వంటి వ్యక్తులను పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో అరెస్టు చేసి జైలులో పెట్టారు. అలాగే సిక్కింలో సాధారణ ప్రజాభిప్రాయాన్ని అణిచివేసారు.[28]
కాజీ దత్తపుత్రుడు, భారత స్వాధీనానికి ప్రధాన వ్యక్తి అయిన నర్ బహదూర్ ఖతివాడా, సిక్కిం ప్రజాతంత్ర కాంగ్రెస్ పార్టీ స్థాపకుడిగా ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత, విలీనానికి వ్యతిరేక నాయకులలో ఒకడు అయ్యాడు. ఖాతివాడా 1977లో ప్రధాన మంత్రి దేశాయ్‌కి ఒక మెమోరాండం పంపాడు. విలీనాన్ని "చట్టవిరుద్ధం", "రాజ్యాంగ విరుద్ధం", "సిక్కిం ప్రజల కోరికలకు విరుద్ధంగా" జరిగిందని అతను అభివర్ణించాడు.[29]
విలీన వ్యతిరేక పార్టీ అయిన సిక్కిం జనతా పరిషత్, 1979 సిక్కిం ఎన్నికలను కైవసం చేసుకుంది. ఒక్క స్వతంత్ర సీటు మినహా అన్నింటినీ గెలుచుకుంది. కాజీ, తన సొంత జిల్లాలో అతుప్ లెప్చా చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో అవమానానికి గురై, కాలింపాంగ్‌కు వెళ్ళిపోయాడు. అయితే దానికి ముందు, ఎన్నికలను రద్దు చేయడానికి ప్రయత్నించి, విలీన వ్యతిరేక పార్టీల నియంత్రణను నిరోధించమని గవర్నర్ లాల్‌ను కోరాడు. విలీన వ్యతిరేక పార్టీలు విజయం సాధించినప్పటికీ, విలీనాన్ని తిప్పికొట్టడానికి పెద్దగా ప్రయత్నమేమీ చేయలేదు. SJP తన పత్రికా సమావేశాలలో విలీనాన్ని "జరిగిపోయిన వాస్తవం"గా అభివర్ణించింది. కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరా గాంధీకి దగ్గరయ్యేందుకు పార్టీ ఎత్తుగడలు వేసింది. ఆ క్రమంలో అది తన మద్దతుదారులను దూరం చేసుకుంది. పార్టీ తమను మోసం చేసినట్లు మద్దతుదారులు భావించారు. 1981 లో SJP తనను తాను రద్దు చేసుకుని భారత జాతీయ కాంగ్రెస్‌లో కలిసిపోయింది.[30]
చోగ్యాల్ పాల్డెన్ తొండుప్ నమ్‌గ్యాల్, తన మరణానికి రెండు సంవత్సరాల ముందు, ఎమ్మెల్యే పిఎల్ గురుంగ్‌తో, సిక్కిం స్వాతంత్ర్యంపై ఇంకా ఆశలు వదులుకోలేదని చెప్పాడు. భూటాన్ లాగా భారతదేశంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే, స్వతంత్రంగా ఉండే అవకాశం ఉందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. స్వాతంత్ర్యం అంటే రాచరిక పునరుద్ధరణ జరుగుతుందా లేదా అనేదానితో సంబంధం లేదని అన్నాడు. అతని రెండవ కుమారుడు, వారసుడూ అయిన యువరాజు వాంగ్‌చుక్, తన తండ్రి సిక్కిం సార్వభౌమాధికారంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాడని, అతనికి సింహాసనంపై కోరిక లేదనీ అన్నాడు. విలీనం ఎలా జరిగిందనే సత్యాన్ని పంచుకున్నాడని పేర్కొన్నాడు.[31]
ఇవి కూడా చూడండి
మార్చుగమనికలు
మార్చు- ↑ Two additional seats were reserved for Scheduled Castes and the Buddhist sangha, respectively.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 Sikkim (India), 14 April 1975: Abolition of the monarchy Archived 18 ఆగస్టు 2017 at the Wayback Machine Direct Democracy (in German)
- ↑ Rose, Leo E. (Spring 1969), "India and Sikkim: Redefining the Relationship", Pacific Affairs, vol. 42, no. 1, pp. 32–46, doi:10.2307/2754861, JSTOR 2754861
- ↑ 3.0 3.1 Lama, Mahendra (1994). Sikkim: Society, Polity, Economy, Environment. New Delhi: Indus Publishing Company. pp. 110–111.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 Gupta, Sikkim: The Merger with India (1975).
- ↑ Saha, Citizenship Dilemmas of the Nepalis (2022).
- ↑ Levi, Werner (December 1959), "Bhutan and Sikkim: Two Buffer States", The World Today, vol. 15, no. 12, pp. 492–500, JSTOR 40393115
- ↑ Rose, Modernizing a Traditional Administrative System (1978).
- ↑ 8.0 8.1 8.2 Bajpai, China's Shadow over Sikkim (1999).
- ↑ 9.0 9.1 9.2 9.3 9.4 9.5 9.6 Sen, Sikkim—Where Feudalism fights Democracy (1975).
- ↑ "Lawmakers Vote Sikkim Status of Indian State", The Spokesman-Review, 5 September 1974, archived from the original on 21 August 2019
- ↑ "Sikkim Bill Ratified", New Straits Times, 9 September 1974, archived from the original on 21 August 2019
- ↑ "Sikkim Referendum Slated on Indian Statehood", The Lewiston Daily Sun, 11 April 1975, archived from the original on 21 August 2019
- ↑ "Sikkim Leader Wants Appeal", The Montreal Gazette, 9 September 1974, archived from the original on 21 August 2019
- ↑ Kazi, Jigme N. (2020). Sons of Sikkim. Chennai: INotion Press. pp. 302–306.
- ↑ Kazi, Jigme N. (2020). Sons of Sikkim. Chennai: Notion Press. pp. 307–308.
- ↑ 16.0 16.1 "Indian hegemonism drags Himalayan kingdom into oblivion". Nikkei Asian Review. Nikkei. 21 February 2016. Archived from the original on 3 April 2017. Retrieved 4 December 2016.
- ↑ Sikkim Voters OK Merger With India Archived 21 ఆగస్టు 2019 at the Wayback Machine Sarasota Herald-Tribune, 16 April 1975
- ↑ Sikkim Votes On Indian Merger Archived 17 ఏప్రిల్ 2017 at the Wayback Machine Daytona Beach Morning Journal, 15 April 1975
- ↑ Use Tear Gas on Indian Mob Archived 21 ఆగస్టు 2019 at the Wayback Machine Gettysburg Times, 20 March 1978
- ↑ "Desai Deplores Annexation of Sikkim, but Says He Cannot Undo". The New York Times. 8 March 1978. Archived from the original on 11 September 2017. Retrieved 17 May 2021.
- ↑ India Slates State Status for Sikkim Archived 21 ఆగస్టు 2019 at the Wayback Machine Toledo Blade, 17 April 1975
- ↑ Sikkim Votes to End Monarchy, Merge With India Archived 19 ఆగస్టు 2017 at the Wayback Machine The New York Times, 16 April 1975
- ↑ Sikkim annexation OK'd Archived 21 ఆగస్టు 2019 at the Wayback Machine Eugene Register-Guard, 27 April 1975
- ↑ Sikkim Annexed, Now Indian State Archived 21 ఆగస్టు 2019 at the Wayback Machine Pittsburgh Post-Gazette, 16 May 1975
- ↑ Kazi, Jigme N. (2020). Sons of Sikkim. Chennai: Notion Press. pp. 308–310.
- ↑ Kazi, Jigme N. (2020). Sons of Sikkim. Chennai: Notion Press. p. 389.
- ↑ Kazi, Jigme N. (2020). Sons of Sikkim. Chennai: Notion Press. pp. 312–313.
- ↑ Kazi, Jigme N. (2020). Sons of Sikkim. Chennai: Notion Press. pp. 316–317.
- ↑ Kazi, Jigme N. (2020). Sons of Sikkim. Chennai: Notion Press. pp. 318–320.
- ↑ Kazi, Jigme N. (2020). Sons of Sikkim. Chennai: Notion Press. pp. 346–355.
- ↑ Kazi, Jigme N. (2020). Sons of Sikkim. Chennai: Notion Press. p. 376.