హంతకులు దేవాంతకులు

హంతకులు దేవాంతకులు 1972 జూన్ 2న విడుదలైన తెలుగు సినిమా. ఎస్.ఆర్.కంబైన్స్ బ్యానర్ పై ఎన్.వి.సుబ్బరాజు, ఎం.కె.రాధా లు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జ్యోతిలక్ష్మీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

హంతకులు దేవాంతకులు
(1972 తెలుగు సినిమా)
Hantakulu devantakulu.jpg
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ,
జ్యోతిలక్ష్మి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.కంబైన్స్.
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • నిర్మాత: ఎన్.వి.సుబ్బరాజు, ఎం.కె. రాధా
  • ఛాయాగ్రాహకులు: ఎం. కన్నప్ప, కె.ఎస్. మణి
  • కూర్పు: నాయని మహేశ్వరరావు
  • స్వరకర్త: సత్యం చెళ్లపిళ్ళ
  • గీత రచయిత: రాజశ్రీ (రచయిత), దాశరథి
  • సహ నిర్మాత: జి.నాగేశ్వరరావు
  • కథ: విజయ బాపినీడు
  • సంభాషణలు: దాసరి నారాయణరావు
  • గాయకులు: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • కళ : బి. చలం
  • నృత్యం: చిన్ని-సంపత్

కథసవరించు

బలరాం, ప్రేమనాథ్, లైలా అనే ముగ్గురు దుండగులు క్రూరంగా హత్యలు, దోపిడీలు చేస్తూ ఉంటే వారిని అరికట్టడానికి రాజేష్ అనే యువకుడు సెంట్రల్ ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి పంపబడతాడు. రాజేష్ ఒక పక్కనుండి వలపన్నుకుంటూ వస్తాడు. ఈలోగా అదే గ్రామంలో రాజా నరేంద్రవర్మ దగ్గర కోట్ల కొలది విలువచేసే వజ్రకిరీటం ఉందని తెలుసుకుంటారు దుష్టత్రయం. రాజా నరేంద్రవర్మకు జ్యోతి, జయ, విజయ అనే ముగ్గురు కుమార్తెలు. వారు అన్ని విద్యలలోను ఆరితేరిన అమ్మాయిలు. ఆ వజ్రాల కిరీటాన్ని ఎలాగైనా దొంగిలించాలని ప్రణాళికలు వేసుకుంటున్న ఆ దొంగలలో కలతలు ఏర్పడతాయి. బలరాంను ప్రేమనాథ్ కాల్చి చంపుతాడు. లైలాను కూడా ఒక కొండపై నుండి లోయలోనికి తోసివేస్తాడు. ఐతే అదే సమయంలో ఆ ప్రాంతానికి వేటకు వచ్చిన రాజా నరేంద్రవర్మ లైలాను కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ప్రేమనాథ్ మీద కక్ష సాధించాలనుకున్న లైలా అతడు తన భర్త అని, తనకు ద్రోహం చేశాడని జ్యోతి, జయ, విజయలను నమ్మించి అతడిని బంధించి తీసుకువచ్చి అతడిని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఐతే తాము ఉన్నది ఉన్నది రాజా నరేంద్రవర్మ ఇంటిలోనని, అక్కడ కిరీటం ఉందని, ఆ కిరీటాన్ని తాము ఇద్దరమూ కలిసి చేజిక్కించుకుందామని ఆశలు రేపుతాడు. కానీ జయ, జ్యోతి, విజయలు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే కిరీటాన్ని దొంగిలించడానికి కాదుకదా కనీసం చేరడానికి కూడా లైలాకు వీలవదు. నరేంద్రవర్మ ఇంటిలో వంటమనిషిగా నటిస్తూ లైలా నరేంద్రవర్మ మేనల్లుడు నగేష్ ఖన్నాను వలలో వేసుకుని, ప్రేమిస్తున్నట్లు నటించి ఆ కిరీటం గురించి తెలుసుకుని అదను చూసి దొంగిలించడానికి ప్రయత్నిస్తారు లైలా, ప్రేమనాథ్. తీరా సమయానికి ముగ్గురు అక్కచెల్లెళ్ళు, రాజేష్‌తో సహా అక్కడ ప్రత్యక్షమై వారి ప్రయత్నాన్ని విఫలం చేస్తారు. జయ, జ్యోతి, విజయలు ఉంటే తమ పాచికలు పారవని గ్రహించిన హంతకులు వారిని కుట్రపన్ని వేరే చోటికి పంపించి, ఒంటరిగా ఉన్న మహేంద్రవర్మను చంపి కిరీటాన్ని దొంగిలించి పారిపోతారు. ఇంటికి వచ్చిన ముగ్గురమ్మాయిలు తమ తండ్రి శవాన్ని చూసి విలపిస్తూ, లైలా, ప్రేమ్‌లపై పగతీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు. పగబట్టిన ముగ్గురమ్మాయిలూ నగేష్ సహాయంతో ప్రేమ్‌, లైలాల స్థావరాన్ని తెలుసుకుని అక్కడికి బయలుదేరతారు. అక్కడ ప్రేమ్‌, లైలాలు ఇంకో ముఠానాయకుడు సుప్రీమ్‌కు కిరీటాన్ని అమ్మటానికి ప్రయత్నిస్తుండగా, టెలివిజన్‌లో ముగ్గురమ్మాయిలూ తమ వైపే వస్తూ ఉండడం చూస్తారు. వారిని దారిలోనే ఎదుర్కొంటారు ప్రేమ్‌, లైలాలు. ఇరువర్గాలకు మధ్య భయంకరమైన పోరాటం జరుగుతుంది. పోరాటంలో ముగ్గురమ్మాయిలూ ప్రేమ్‌ను చంపి తమ కసిని తీర్చుకుంటారు. లైలా స్పృహ లేనట్లు నటించి, సమయం చూసుకుని పారిపోతుంది. కిరీటం ఎక్కడున్నదీ లైలాకు మాత్రమే తెలుసు. లైలా కోసం నగేష్, ముగ్గురమ్మాయిలు శతవిధాలుగా వెతికి విఫలమౌతారు. లైలా ఏమైనట్టు? ముగ్గురమ్మాయిలు తమ శపథాన్ని ఎలా నెరవేర్చుకున్నారు? తన అమాయకత్వంవల్ల జరిగిన ఘాతుకానికి ప్రతీకారంగా నగేష్ ఏమిచేశాడు? సి.ఐ.డి. ఏజెంటు రాజేష్ ఏమిచేస్తాడు? అనే ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశంలో తెలుస్తుంది. [2]

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలకు సత్యం సంగీతం సమకూర్చాడు.[3]

పాటల వివరాలు
క్ర.సం. పాట రచయిత గాయకులు
1 ఇది లక్కీ లక్కీ ఆట అహ మూడు ముక్కల ఆట రాజశ్రీ ఎల్.ఆర్.ఈశ్వరి
2 రా రా రూ రూ చిన్నోడా నాలో నిన్నే చూసుకో ఆ ఒంటిగా కలుసుకో రాజశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి
3 చినుకు పడుతున్నది వణుకు పుడుతున్నది తోడు కావాలి నీడ రావాలి దాశరథి పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 హరేరాం హరేరాం హరేకృష్ణా హరేరాం హరేరాం హరేరాం హరేకృష్ణా హరేరాం ఆడామగా తేడాలేదు హరేరాం దొంగా దొరా భేదంలేదు హరేరామ్ రాజశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
5 హ హ హ ఊ ఆడు అడుగులు కదిపి ఆడలేను ఈ సారి గూటిలో పెదవులు తెరిచి పాడలేను రాజశ్రీ పి.సుశీల, సత్యనారాయణ

మూలాలుసవరించు

  1. "Hanthakulu Devanthakulu (1972)". Indiancine.ma. Retrieved 2021-05-20.
  2. భరద్వాజ (4 June 1972). "చిత్ర సమీక్ష: హంతకులు దేవాంతకులు" (PDF). ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original (PDF) on 3 జనవరి 2023. Retrieved 3 January 2023.
  3. రాజశ్రీ (2 July 1972). Hanthakulu Devanthakulu (1972)-Song_Booklet (1 ed.). ఎస్.ఆర్.కంబైన్స్. p. 11. Retrieved 3 January 2023.

బయటి లింకులుసవరించు