కే.వి. చలం

(కె.వి.చలం నుండి దారిమార్పు చెందింది)

చలం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. అయోమయ నివృత్తి పేజీ చలం చూడండి.

హాస్యనటుడు కె.వి.చలం

మద్రాసు తెలుగు యాసను పట్టుకుని హాస్యం కలిపి ప్రాచుర్యం కల్పించి నవ్వించిన హాస్యనటుడు కె.వి.చలం. మామూలుగా అతను సరదాగా ఆ మాటలు మాట్లాడుతూ జోక్స్‌ చెప్పేవాడు. అల్లూరి సీతారామరాజు (1974) చిత్రంలోని పిళ్లే పాత్ర ఆ తెలుగులోనే మాట్లాడుతుంది. కె.వి.చలం ఆ పాత్ర ధరించి, ఆ భాష మాట్లాడ్డంలో గట్టివాడనిపించుకుని పేరు తెచ్చుకున్నాడు. అలాగే శివరంజని (78) సినిమాలోనూ చిత్రనిర్మాత పాత్రలో బాగా నవ్వించాడు. ఆ మాటలతో ఆ సినిమాలో " మీ అమ్మావాడు నాకోసం కని ఉంటాడు" అనే పాట కూడా వుంది. (యాసతోనూ ఆ భాషలోనూ పాడింది బాలసుబ్రహ్మణ్యం) చాలా అలరించింది.

సినీ జీవితం

మార్చు

చలం ముందు చిన్న చిన్న వేషాలు వేసినా, మొదటి నుండి హాస్యనటుడు కాడు. చిన్నప్పుడే కొంత నాటకానుభవం ఉంది. వ్యాపారరీత్యా మద్రాసు వచ్చాడు. మద్రాసు వచ్చిన తరువాత సినిమాల మీద మోజు పెంచుకున్నాడు. మద్రాసులో కూడా చిన్న చిన్న నాటకాల్లో వేశాడు. డాక్టర్‌ రాజారావు గారి బృందంలో నటించాడు. ఇంకొకరి ‘యాస’లో మాట్లాడ్డం సరదా ఉండేది. దాని కోసం చాలా సాధన చేసేవాడు. చలం విచిత్రమైన యాసలలో మాట్లాడటం చూసి హాస్య పాత్రలు ఇచ్చారు.

పేరు తెచ్చిన సినిమాలు

మార్చు

విజయావారి హరిశ్చంద్ర (1965)లో చిన్న వేషంలో కనిపించడంతో సినిమా ప్రవేశం జరిగినా, తేనె మనసులు (1965)తో బాగా తెలిశాడు. అందులో ఇంగ్లీషును తెలుగులా మాట్లాడే మేనేజరు వేషం వేసి "కమ్ము హియరూ, వాడ్డూయూ వాంటూ" అని చెప్పిన సంభాషణలకు చక్కటి నవ్వు వచ్చింది. అలాగే అతను బందిపోటు దొంగలు (1968) లో కూడా ‘మిస్టర్‌ అమెరికా’ అనే పాత్ర ధరించాడు. వచ్చీరాని తెలుగులో, ఇంగ్లీషు కలుపుతూ మాట్లాడే ఈ పాత్ర కూడా అతనికి రాణింపు తెచ్చింది. అక్కడి నుంచి కె.వి.చలం కమేడియన్‌గా మారి, వందకు పైగా చిత్రాల్లో హాస్య పాత్రలు ధరించాడు. కన్నెమనసులు (1966), స్త్రీ జన్మ (1967), నేనంటే నేనే (1968), మరపురాని కథ, మనుషులు మారాలి, ప్రేమకానుక, భలే రంగడు (1969), పెద్దక్కయ్య (1970), వంటి చిత్రాల్లో హాస్యం మిళాయించిన పాత్రలు చేసి పేరు తెచ్చుకున్నాడు.దాసరి చిత్రం చిల్లరకొట్టు చిట్టెమ్మలో పాత్ర కె.వి.చలానికి మంచి పేరు తెచ్చింది.ఈయన కుమార్తె 'దేవి' కొన్ని చిత్రాల్లో నటించింది.

చలం హాస్యం అనగానే అతిగా చేసేవాడు కాదు. ముఖ్యంగా సంభాషణ చెప్పడంలో తమాషా చేసేవాడు. భాషేమిటో తెలియనీయకుండా, చైనా, రష్యాలు, మలయాళం, బెంగాలీ మాట్లాడేవాడు. ఆ భాష వరసా, తీరూ అంతా సహజంగా వుండడంతో అతనికి ఆ భాష వచ్చుననే అంతా అనుకునేవాళ్లు. అతని కృషి అంతా అందులోనే. ఆ భాషలతో కాకపోయినా, మామూలు హాస్యపాత్రలు కూడా నటించాడు.

సరదాగా మాట్లాడుతూ, తానూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ తిరిగిన కె. వి. చలం- దుర్మరణం పొంది అందర్నీ దిగ్భ్రాంతుల్ని చేశాడు! రాత్రివేళ, రైలుపట్టాలు దాటుతూ ఎలక్ట్రిక్‌ ట్రెయిన్‌ కింద పడి చలం ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెల్లారేసరికి విని, సినిమారంగం నివ్వెరపోయింది. అతని అకాలమరణానికి ఎంతగానీ బాధపడింది. అతని అంతిమయాత్ర చాలా గొప్పవాడికి జరిగినంత ఘనంగా జరిగింది. దాసరి నారాయణరావు పూనుకొని, ఘనమైన వీడ్కోలు జరిపించి, అతని కుటుంబాన్ని ఆదుకున్నారు

వనరులు

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కే.వి._చలం&oldid=3362827" నుండి వెలికితీశారు