2003 గోదావరి పుష్కరాలు
2003 గోదావరి పుష్కరాలు జూలై 30 నుంచి ఆగస్టు 11 వరకు జరిగాయి. ఈ పుష్కరాల్లో 63.34 లక్షలమంది పుణ్యస్నానాలు చేశారు. ఈ పుష్కరాల్లో రాజమండ్రిలో పుష్కరఘాట్‌ను అభివృద్ధిపర్చడంతోపాటు భారీశివలింగాన్ని ఏర్పాటుచేసి జల్లుస్నానానికి అవకాశం కల్పించారు. పుష్కరాలకే పుష్కరుడి విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. అంతకుముందు పుష్కరాల్లో గోదావరిమాతను ఆవిష్కరించారు. వీటితోపాటు ఈ ప్రాంతంలో సుమారు 18 ఆలయాలు ఉన్నాయి. అందుకనే ఈ ఘాట్‌లో స్నానమాచరించడానికి అధికసంఖ్యలో తరలివస్తారు. 2003 పుష్కరాల్లో జిల్లావ్యాప్తంగా 12 రోజులపాటు 2, 19, 75,640మంది పుణ్యస్నానాలు చేసినట్లు అప్పటి జిల్లాకలెక్టర్ జవహర్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. రాజమండ్రి ఘాట్‌లోనే ఏకంగా 63,34,410మంది పుష్కరస్నానాలు చేసారు. ఆ ఏడాది పుష్కరాలు ప్రారంభంరోజైన జూలై 30న 3,35,100మంది పుష్కరస్నానాలు చేయగా రెండవరోజు 4,50,440మంది, మూడవరోజు 3,83,450మంది, నాలుగవరోజు 5,63,600మంది, ఐదవరోజు 6,40,000మంది, ఆరవరోజు 7,09,000, ఏడవరోజు 1,86,900మంది, ఎనిమిదవరోజు 6,46,400మంది, తొమ్మిదవరోజు 5,02,620మంది, పదవరోజు 5,64,400మంది, పదకొండవ రోజు 7,41,500మంది, ఆఖరిరోజైన పన్నెండవరోజు 5,21,000మంది పుణ్యస్నానాలు ఆచరించారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కానీ ఇంతకంటే ఎక్కువగానే భక్తులస్నానాలు ఆచరించినట్లు మరో లెక్క కూడా ఉంది.
పుష్కరాల నిర్వాహక కమిటీ
మార్చు- నారా చంద్రబాబు నాయుడు ( (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి), పుష్కర కమిటీ గౌరవ చైర్మన్)
- యనమల రామకృష్ణుడు (ఆర్థిక మంత్రి, పుష్కర క్యాబినెట్ కమిటీ చైర్మన్)
- చిక్కాల రామచంద్రరావు ( సహకార శాఖ మంత్రి)
- దండు శివరామరాజు ( దేవాదాయ శాఖ మంత్రి, పుష్కర క్యాబినెట్ కమిటీ కన్వీనర్)
- ఎస్.బి.పి.బి.కె సత్యనారాయణ రావు ( ఎంపీ, రాజమండ్రి)
- గోరంట్ల బుచ్చయ్యచౌదరి (శాసన సభ్యులు, రాజమండ్రి)
- జక్కంపూడి రామ్మోహన్ రావు (శాసన సభ్యులు, కడియం)
- ఎమ్.ఎస్. చక్రవర్తి (మేయర్, రాజమండ్రి)
- కె.ఎస్. జవహర్ రెడ్డి ( తూగో జిల్లా కలెక్టర్, పుష్కర కమిటీ చైర్మన్)
- ఎస్. సురేష్ కుమార్ ( రాజమండ్రి సబ్ కలెక్టర్, పుష్కర కమిటీ కార్యదర్శి)
- నాగులపల్లి శ్రీకాంత్ (స్పెషలాఫీసర్)
- గోవింద్ సింగ్ ( ఎస్పీ, తూగోజిల్లా)
- ఏ.ఆర్. శ్రీనివాస్ ( బందోబస్తు స్పెషలాఫీసర్)
- గ్రంథి లలిత ( డిప్యూటీ మేయర్, రాజమండ్రి)
- బర్రే కొండబాబు (స్టాండింగ్ కమిటీ ఛైర్మన్)
- టి.ఎస్.ఆర్. ఆంజనేయులు (మునిసిపల్ కమిషనర్, రాజమండ్రి)
- ఎ. కృష్ణమూర్తి (డీఎస్పీ, రాజమండ్రి)
ప్రచార కార్యక్రమాలు
మార్చు2003 పుష్కరాల సమయంలో టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదు. ప్రచారం విషయంలో దూరదర్శన్ ఛానల్ కీలకపాత్ర పోషించింది. అప్పట్లో ఉన్న న్యూస్ ఛానల్ వారు పుష్కరాను టెలికాస్ట్ చేసే పరిస్థితి లేదు.
అందువల్ల ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలవాళ్లు కరపత్రాల ద్వారానే పుష్కరాల ప్రచారం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా
మార్చుతూర్పుగోదావరి జిల్లాలో సమాచారశాఖ ద్వారా అలాగే ఆయా జిల్లా కలెక్టర్లు పలు జాతీయ బ్యాంకులు, వ్యాపార సంస్థలు, పబ్లిషన్స్, పర్యటకశాఖ వారు, ఇతరులు కరపత్రాలు, పుస్తకాలు ప్రచురించి పంపిణి చేశారు.
రాజమండ్రితోపాటు గోదావరి తీరాన ఎన్ని పుష్కర ఘాటులున్నాయి, ఎంతెంత దూరంలో ఉన్నాయి, అక్కడవుండే దేవాలయాల మ్యాప్ లను ఈ కరపత్రాల ద్వారా వివరించారు.
అన్నవరం దేవస్థానంతోపాటు ద్రాక్షారామ, సామర్లకోట, పిఠాపురం, తలుపులమ్మ లోవ, అంతర్వేది, అయినవిల్లి, ర్యాలి, వాడపల్లి, ద్వారపూడి వంటి దేవాలయాల రాజమండ్రికి ఎంతెంత దూరంలో ఉన్నాయో, ఆయా దేవాలయాల విశిష్టతలను వివరిస్తూ ఈ కరపత్రాలు ముద్రించారు.
రాజమండ్రికి వచ్చే భక్తులకోసం రైల్వే, బస్సు సమాచారం, పోలీసు, రెవెన్యూకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, హోటల్స్ వాటి వివరాలను తెలియజేస్తూ కూడా కరపత్రాలు ముద్రించి పంపిణిచేశారు.
పుష్కరాలు విశిష్టత, పుష్కరాలు ఎపుడొస్తాయి, ఎందుకొస్తాయి, పుష్కరాలలో ఏయే విధులు నిర్వహించాలి, ఏరోజు ఏదానం చేయాలి, గోదావరి ఎక్కడ పుట్టింది, ఎలా ప్రవహిస్తుంది వంటి సమాచారంతో ఉన్న పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి.
2003 పుష్కరాల కరపత్రాలను జూలై 8న కాకినాడ కలెక్టరేట్ లో యనమల రామకృష్ణుడు, ఎంపిలు ముద్రగడ పద్మనాభం, వంగ గీతా, కలెక్టర్ జవహర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఉదయలక్ష్మీలు ఆవిష్కరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా
మార్చుపశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇదే తరహాలో కరపత్రాలను అందజేశారు. కొవ్వూరు కేంద్రంగా గోపాదక్షేత్రం ద్వారా పుష్కర వేడుకలు నిర్వహించారు.
జిల్లా కెక్టర్ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని పుష్కర ఘాటులున్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి... ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల, పాలకొల్లు, భీమవరం, మద్ది ఆంజనేయ స్వామి వంటి ఆలయాల వశిష్టతను తెలియజేయడం వంటివి ఉన్నాయి.
జిల్లా పర్యాటక కేంద్రాలకు సంబంధించిన కరపత్రాలను పర్యాటకశాఖ వారు ప్రత్యేక కరపత్రాలు ముద్రించి ప్రచారంచేశారు.
మీడియా సెంటర్ ద్వారా పుష్కర సేవలు
మార్చు2003 పుష్కరాల సమయంలో అంతకుముందు 1991లో జరిగిన పుష్కరాల గురించిన సమగ్ర విషయాలన్ని తెలుసుకోవాలంటే అధికారులు, ఇతరులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసివచ్చింది.
అందుకోసం 2003 పుష్కరాల విశేషాలు, ఫోటోలను భద్రపరచడానికి సమాచార, పౌరసంబంధాల శాఖవారు పూనుకున్నారు. ఫోటోలు, వీడియోలు, ముఖ్యమైన పత్రాలను సీడీల్లో భద్రపరచారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రంగాన్ని నియమించి, రాజమండ్రి కేంద్రంగా సాగే ఈ పుష్కరాలకోసం గోకవరం బస్టాండ్ వద్ద ఒక మీడియా సెంటర్ ను ఏర్పాటు చేసింది.
పుష్కరాలకు సంబంధించిన వార్తలను, సమాచార సాధనాలకు అందించడానికి, పాత్రికేయులకు వెసులుబాటు కల్పించడానికి ప్రజలకు కనీస సమీచీరం చేరవేయడానికి ఈ సెంటర్ లో భారీ ఏర్పాట్లు చేశారు.
ఏరోజుకారోజు వార్తలను అందించడంతోపాటు ఆ సమాచారాన్ని, ఫోటోలను ఇంటర్నెట్ లోనూ, వెబ్ సైట్లలోనూ ప్రవేశపెట్టడంద్వారా మీడియా సెంటర్ కి రానలేని మీడియా ప్రతినిధులకు చేరవేసేవారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో 64 సమాచార కేంద్రాలను ఏర్పాటుచేసి, యాత్రికులకు ఉపయోగపడే కనీస సమాచారాన్ని వీటిద్వారా అందించేవారు.
పుష్కరాలను విజయవంతం చేయడానికి సమాచార పౌర సంబంధాల శాఖ రూ. 2.15 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు నిర్వహించే బాసర, ధర్మపురి, కాళేశ్శరం, కొవ్వూరు, భద్రాచలం, రాజమండ్రి, నరసాపురంతోపాటు మరో నాలుగు క్షేత్రాలను కలుపుకొని ఈ మీడియా సెంటర్ లను ఏర్పాటుచేసి, ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని చేరవేశారు. ఆన్ లైన్, వెబ్ సైట్ వంటి అధునాతన ప్రక్రియలు ఈ మీడియా సెంటర్ లోనే శ్రీకారం చుట్టారు. ఈ సెంటర్ కు ఐ.ఎస్.డి.ఎన్. లైన్ సౌకర్యం కల్పించారు. దీనికోసం 8 డిజిటల్ కెమెరాలు సిద్దంచేశారు. ప్రప్రథమంగా న్యూస్ డెస్క్ ను ఏర్పాటుచేశారు. ఈ డెస్క్ లో 12 మంది పౌరసంబంధాల అధికారులు, 8 మంది సాంకేతిక నిపుణలను రాజమండ్రి మీడియా సెంటర్ లో నియమించారు. 13 కంప్యూటర్స్, 3 స్కానర్స్, 3 ప్రింటర్స్, 4 ల్యాండ్ లైన్ ఫోన్లు 24 గంటలు అందుబాటులో ఉంచి, రోజుకు 73 వార్తల చొప్పున 12 రోజులుపాటు అందించారు.