అలసకోతులు వృక్షములపై నివసించే క్షీరదాలు. అవి తమ జాడ్యానికి లేదా నెమ్మదితనానికి మఱియు దక్షిణామెరికామధ్యామెరికా ఉష్ణమండల అరణ్యాలలోగల చెట్లపై తలక్రిందులుగా వ్రేలాడే గుణానికి బాగా ప్రసిద్ధి పొందిన జంతువులు. అలసకోతులలో మొత్తమున్న ఆఱురకాలు రెండు కుటుంబాలకు చెందినవి- రెండువ్రేళ్ల అలసకోతులు మఱియు మూడువ్రేళ్ల అలసకోతులు. ఇలా సంప్రదాయబద్ధమైన పేరున్నప్పటికీ నిజానికి అన్ని అలసకోతులకూ చెఱొక చేతికున్నవీ మూడు వ్రేళ్లే. రెండువ్రేళ్ల అలసకోతులంటే నిజానికి చెఱొక చేతికి మూడు వ్రేళ్లున్నా ప్రతిచేతికి రెండుగోర్లు మాత్రమే ఉన్నవని అర్థము.

అలసకోతికా పేరు దాని యొక్క నెమ్మదైన జీవక్రియ వలన మఱియు కదలికల వలనా పెట్టడం జరిగింది. ఇది ఒక పరిణామాత్మక అనుసరణ. ఎందుకంటే ఈ జంతువులు తినే ఆకులు, అలములలో పోషకవిలువలు మఱియు శక్తికారకాలు తక్కువ. అందువలన వీటి జీర్ణప్రక్రియ నెమ్మదైపోయింది.  ఇవి బద్ధకంగా ఉండటానికి మఱో కారణము- గ్రద్దలు, పులులు వంటి శత్రువులనుండి తప్పించుకోవడానికే. నేలపై వీటి కదలిక మరీ నెమ్మదిగా ఉంటుంది. ఇవి భూమిమీద ఇంత నెమ్మదిగానున్నా, నిజానికి నీటిలోనే కాస్త త్వరగా ఈదగలవు.  ఈ జంతువుకు ఒళ్లంతావున్న చింపిరిబొచ్చు , ఆకుపచ్చ నాచుకు దీనితో సహజీవనం చేయడానికి నివాసస్థలముగా తోడ్పడుతుంది. పైగా ఆ నాచు శరీరాన్ని ఆకుపచ్చరంగులో పూర్తిగా కప్పివేయడం వలన అలసకోతి సులభంగా శత్రువుల కంటబడకుండా పచ్చని చెట్లలో దాక్కోగలదు. ఆ నాచును తినడానికి వచ్చిన కీటకాలను, ముఖ్యంగా ఒకరకమైన ఱెక్కలపురుగులను ఈ అలసకోతి భక్షిస్తుంది.

అలసకోతులు పైలోసా అనబడే జాతిలోకి పిపీలికారులతోపాటు వర్గీకరించబడినవి. అంతరించిపోయిన అలసకోతులలో ప్రముఖంగా చెప్పుకోదగినవి ఏనుగంత పరిమాణం పొందే మహాజంతు పుడమి అలసకోతులు అలాగే సముద్ర అలసకోతులు.

వర్గీకరణం మఱియు క్రమాగతోన్నతి

మార్చు

జినార్త్రా అనబడే జాతిపరంపరకు చెందినవి ఈ అలసకోతులు, ఈ వరుసలోని జరాయువు గల ప్రాణులు దక్షిణామెరికా ఖండంలో సుమారు అఱుకోట్ల సంవత్సరాల క్రితం ఉద్భవించాయి. ఒక అధ్యాయం ప్రకారం ఈ జినార్త్రా కుటుంబపు ప్రాణులు, జరాయుప్రాణుల కుటుంబంనుండి పదికోట్ల సంవత్సరాల క్రితమే విడిపోయాయంట!

పిపీలికారులు మఱియుకవచకేసులు కుడా జినార్త్రా కుటుంబంలోకి చేర్చబడినవి. ప్రప్రథమ జినార్త్రా ప్రాణులు చెట్లపై నివసించేవి, శాఖాహారులు, దృఢమైన వెన్నుపాముగలవి, సంలీనమైన శ్రోణి మేఖలలు గలిగినవి, మోడుపన్నులు మఱియు చిన్నచిన్న మెదడులు గలిగినవి. అలసకోతులు శాస్త్రీయ వర్గీకరణ వరుసలో పైలోసా వరుసలోని ఫోలివోరా అనే ఉపవరుసలోనున్నాయి. ఈ వరుసల పేర్లన్ని లాటిన్ భాషలోని "ఆకుతిండి" మఱియు "బొచ్చు" అనేపదాలకు అన్వయమౌతాయి. పైలోసా జంతు వరుస నిజానికి క్షీరదాల జాతులలోకెల్ల చిన్నవరుసలలో ఒకటి.

ఫోలివోరా అనే ఉపవరుస ఐదు కుటుంబాలగా విభజించబడింది, వాటిలో మూడు అంతరించిపోవగా,ప్రస్తుతం జీవించివున్న కుటుంబాలు రెండే, అవి:

జీవక్రమం-వికాసం

మార్చు

ప్రస్తుత అలసకోతులకు ఒకే పూర్వీకజాతి దాదాపు నాలుగుకోట్ల సంవత్సరాల క్రితం, రెండు రకాల అలసకోతుల యొక్క సారూప్య గుణాలతో జీవించియున్నది. ఇది అభిసార క్రమాగతోన్నతికి నిదర్శనం.

 
స్కెలీడోథీరియం లెప్టోసెఫలం యొక్క శిలాజమునైసర్గిక ఇతిహాసపు రాష్ట్రీయ వస్తుసంగ్రహాలయంప్యారిస్

పూర్వ జినార్త్రాలో నేటి కన్నా చాలా ఎక్కువ రకాల జాతులు ఉన్నాయి. పురాతన అలసకోతులు చెట్లపైన కాకుండా, ఎలుగుబంటి వంటి శరీరపరిమాణంతో భూమిమీద తిరిగేవి. మెగాథీరియం అనబడే అలసకోతి జాతి పూర్వీకజంతువు ఏనుగు పరిమాణంతో ఉండేది.

ఒలిగోసీన్ శకపు అంతానికి కరేబియన్ ప్రాంతపు పైలోసాప్రాణులు అదే ప్రాంతసమీపంలోనున్న మహాసముద్రము చీలిపోవడం కారణంగా, అవి కాలానుగుణంగా బ్రతుకుతెరువుకొఱకు ఈతను నేర్చుకున్నాయి. మయోసీన్ యుగాంతానికి దగ్గరకాలంలో, నేటి పెరూ మఱియు చిలీ దేశప్రాంతాలలోని అలసకోతులు సముద్రతీరప్రాంతాలలోని జీవనానికి అలవాటుపడి, మెల్లగా నీటిలోకి ప్రవేశించాయి.  కొంతకాలం అవి నీటిపై ఈదుతూ, అప్పుడప్పుడు నేలపైకి వచ్చి జీవిస్తూ, కాలగమనంలో శాశ్వతంగా నీటిప్రాణులుగా మారిపోయాయి. అవే థాళ్లసోక్నస్ జన్యువుగల కుటుంబానికి చెందిన సముద్రంలోపల బ్రతికే అలసకోతులు.

అంతరించిన జాతులు

మార్చు

అంతరించిన మూడు అలసకోతి కుటుంబాలు:

  • మెగాథీరిడే: దాదాపు రెండుకోట్ల ముప్ఫైలక్షలయేళ్లపాటు జీవించిన నేల అలసకోతులు. ఇవి పదకొండువేలయేళ్ల క్రితం అంతరించిపోయాయి.
  • మైలోడాంటిడే: దాదాపు కూడా రెండుకోట్ల ముప్ఫైలక్షలయేళ్లపాటు జీవించిన నేల అలసకోతులు. ఇవి కూడా పదకొండువేలయేళ్ల క్రితం అంతరించిపోయాయి.
  • నోత్రోథెరిడే: దాదాపు కూడా కోటీ అఱవైలక్షలయేళ్ల క్రితం నుండి పదకొండువేలయేళ్ల క్రితం వరకు నివసించిన నేల అలసకోతులు. 

దక్షిణామెరికాలోని నివసించిన నేల అలసకోతులు ఏనుగంత పెద్దవి. మనుషులు తొలిసారిగా పదకొండువేల సంవత్సరాల క్రితం భూమిపై పుట్టిన తర్వాతనే ఇవి అంతరించిపోయాయి. సాక్ష్యాధారాల ప్రకారం, మనుషులు అప్పుడు వీటిని వేటాడి తినడం వలననే ఇవి అంతరించిపోయాయని తెలిసింది. ఉత్తర మఱియు దక్షిణామెరికా ఖండాలలోని దొరికిన నేల అలసకోతుల శిలాజాలనుబట్టి చూస్తే వాటిని అక్కడ నివసించిన ఆదిమానవులు చంపి, వండి తినేవారని తేలింది. హిమయుగం యొక్క అంతకాలంలో వచ్చిన వాతావరణంలోని పెనుమార్పులు కూడా ఆ నేల అలసకోతులు జాతిని అంతరింపజేయడంలో సిద్ధహస్తం వహించింది. ఆంటిల్స్ అనబడే కరేబియన్ దీవులగుంపులోమెగాలోఖ్నస్ అనబడే అలసకోతి జాతి ఐదువేలయేళ్ల క్రితం వరకు బ్రతికింది,  ఆ కాలానికి ఇతర నేల అలసకోతులన్నీ అంతరించిపోయాయి. ఈ మెగాలోఖ్నస్ అలసకోతి జాతి కూడా మనుషులు ఆ దీవులగుంపుకు చేరాక మెల్లగా అంతరించపోయింది. 

జీవశాస్త్ర విశేషాలు

మార్చు
 
ఆకులను తింటున్న గోధుమకంఠపు అలసకోతి(శా.నా: బ్రాడిపస్ వేరిగేటస్), కహూయితా రాష్ట్రీయ ఉద్యాన వనంకోస్టారీకాలో

శరీరశాస్త్రం

మార్చు

అలసకోతులు అఱవై నుండి ఎనభై సెం.మీ||ల పొడవు(అనగా ఇరవై నాలుగు నుండి ముప్ఫైయొకటి అంగుళాలు) మఱియు జాతినిబట్టి మూడున్నర నుండి ఏడూముప్పావు కిలోల బరువుంటాయి. రెండువ్రేళ్ల అలసకోతులు కాస్త పెద్దవిగా ఉంటాయి. అలసకోతులకు పొడవాటి చేతులూ, గుండ్రటి తలలూ మఱియు చిన్నచిన్నచెవులూ ఉంటాయి. మూడువ్రేళ్ల అలాసకోతులకు ఐదాఱు సెం.మీ||ల పొడవుగల చిన్నతోక కూడా ఉంటుంది. సాధారణంగా అన్ని క్షీరదాలకు ఏడు గర్భాశయ వెన్నుపూసలు ఉండగా, రెండువ్రేళ్ల అలాసకోతులకు మాత్రం ఆఱు, మూడువ్రేళ్ల అలాసకోతులకు ఏకంగా తొమ్మిది ఉంటాయి. అందువలన మూడువ్రేళ్ల అలాసకోతులు తమతమ తలలను 270 డిగ్రీల కోణం వరకు అటూయిటూ తిప్పగలవు.

అలసకోతులు రంగులను చూడగలవు, కాని వాటి దృష్టిస్పష్టత అంత బాగా ఉండదు. వాటి వినికిడి శక్తి కూడా తక్కువే. కాబట్టి, అవి తమ స్పర్శ మఱియు వాసనాశక్తులపై ఆధారపడి ఆహారాన్ని వెతుక్కుంటాయి.

సమాన పరిమాణమున్న క్షీరదాలతో పోలిస్తే, అలసకోతుల జీర్ణప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. పైగా వీటి శరీర ఉష్ణోగ్రత కూడా తక్కువగానే ఉంటుంది(మేల్కొని ఉన్నప్పుడు 30-34 డిగ్రీలు మఱియు నిద్రలోనున్నప్పుడు ఇంకా తక్కువ). అలసకోతులు భిన్నోష్ణములు, అనగా అవి తమ శరీర ఉష్ణోగ్రతను చుట్టూవున్న వాతావరణాన్నిబట్టి మార్చుకుంటాయి.అవి సాధారణంగా తమ గరిష్ఠ ఉష్ణోగ్రతను 25 నుండి 35 డిగ్రీల సెల్సియస్ వరకు , కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ వరకు నియంత్రించుకోగలవు. 

అలసకోతుల శరీర వెంట్రుకలు సాధారణ క్షీరదాలతో పోలిస్తే భిన్న దిశలో మొలుస్తాయి. అన్ని క్షీరదాలలోనూ, ఒంటిజుట్టు ఒంటికి లంబకోణంలో పెరుగగా, అలసకోతులు తలక్రిందులుగా ఎక్కువ వ్రేలాడుతాయిగావున ఒంటికి సమాంతరంగా పెరుగుతాయి. అలసకోతుల శరిరాలపై పెరిగే నాచు తనలోతానుగా ఒక సూక్ష్మపర్యావరణంగా భాసించి, పలురకాల పరాన్నజీవజాతులకు, సూక్ష్మసంధిపాదులకు ఆసరానిస్తుంది. అలసకోతుల బొచ్చులో పెరిగే కీటకాల రకాలు చాలావున్నాయి. వాటిలో అతి సాధారణమైనవి- రక్తంత్రాగే పురుగులైన దోమలుఇసుకయీగలునల్లులుగోవుచీడలు మఱియు తవిటి పురుగులు. అలసకోతుల శరీరాలపై కుమ్మరి పురుగులు మఱియు చిమ్మట పురుగుల ప్రత్యేకమైన సంఘములు నివసిస్తాయి.యాదృచ్ఛికంగా ఈ పురుగుల వలన అలసకోతులకు ఎటువంటి ఇబ్బంది లేనట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పురుగులు అలసకోతుల శరీరనాచును ఇంకా సారవంతం చేసి, వాటికి పోషకాలను అందజేస్తాయట.

కార్యకలాపాలు

మార్చు

అలసకోతులు చేతులు వ్రేలాడటానికి మఱియు ఆహారాన్ని పట్టుకోవడానికి బాగా సహకరిస్తాయి. వీటి శరీరబరువులో కేవలం పావువంతు మాత్రమే కండరాలున్నాయి. ఇంతే శరీర పరిమాణంగల ఇతర క్షీరదాలకు కండరాలు తమ మొత్తం శరీరబరువులో నలభై నుండి యాభైశాతముంటాయి. వీటి ప్రత్యేక చేతులకు, కాళ్లకు పొడవాటి వంపుతిరిగిన గోర్లుండటం వలన తక్కువ కష్టంతో ఇవి చెట్లకొమ్మలకు వ్రేలాడగలవు. అలసకోతులు సధారణంగా నేలపై నడవటానికి బదులుగా డేకుతాయి. మూడువ్రేళ్ల అలాసకోతులకు చేతులు కాళ్లకన్నా రెట్టింపు పొడవుంటాయి.

అలసకోతులు అవసరమున్నప్పుడే నడుస్తాయి, అప్పుడు కూడా చాలా నెమ్మదిగా. అవి సాధారణంగా నిమిషానికి పదమూడడుగులు లేదా నాలుగు మీటర్లు వేగంతో ప్రయాణిస్తాయి, ప్రమాదవేళలలో అవి కాస్తవేగంగా అంటే నిమిషానికి పదిహేను అడుగుల వేగంతో కదులుతాయి. అప్పుడప్పుడు అవి కొమ్మలపై కూర్చున్నా, సాధారణంగా అవి తినడం, నిద్రించడం మఱియు ప్రసవించడం కూడా తలక్రిందులుగానే చేస్తాయి. మరణించాక కూడా వాటి దేహాలు చెట్టుకొమ్మలకు అలా వ్రేలాడే ఉంటాయంట!  భూమిపై ఇవి చాలా నెమ్మదిగా కదిలినా ఆశ్చర్యకరంగా అలసకోతులు నీటిలో భూమిపైకన్నా వేగంగా (నిమిషానికి నలభైనాలుగు అడుగులు లేదా పదమూడున్నర మీటర్లు) ప్రయాణిస్తాయి. వాటి పొడవాటి చేతుల సహాయంతో అవి నిజానికి నదులు, సముద్రాలను సైతం దాటగల సమర్థతగలవి.నీటియందు పయనిస్తున్న అలసకోతులు  తమ సాధారణ హృదయస్పందన కన్నా దానిలో మూడవవంతుకు తగ్గించుకొని, తత్కారణంగా తమ ఊపిరిని నీటి అడుగున నలభై నిమిషాలవరకు ఆపుకోగలవు.

వన్య గోధుమకంఠపు అలసకోతులు రోజులో సగటు తొమ్మిదిన్నర గంటలపాటు నిద్రిస్తాయి. రెండువ్రేళ్ల అలసకోతులు రాత్రించర జీవులు. మూడువ్రేళ్ల అలసకోతులు కూడా రాత్రించర జీవులే అయినప్పటికీ, అవి ప్రొద్దునవేళలలో కూడా మెలకువగా ఉండగలవు. అవి రోజులో తొంభైశాతం కాలం కదలికలేకుండా వ్రేలాడుతూ గడుపుతాయి.

ఆహారము

మార్చు

పిల్ల అలసకోతులు, తమ తల్లుల మూతులకు అంటుకున్న ఆకుపసరును తిని ఏమి తినాలో, ఏమి తినకూడదో నేర్చుకుంటాయి.  సెప్రోఫియా అనబడే జాతికి చెందిన ఒక చెట్టు ఆకులను అన్ని రకాల అలసకోతులు ప్పకుండా తింటాయి.

రెండువ్రేళ్ల అలసకోతుల తమ నివాసపరిధిలోని 140 ఎకరాల వరకూవున్న స్థలంలో దొరికే పురుగులను, పండ్లును, బల్లులను తింటాయి. మూడువ్రేళ్ల అలసకోతులు మాత్రం శుద్ధశాఖాహారులై, కేవలం కొన్ని రకాల చెట్ల ఆకులనే తింటాయి.

అలసకోతులు చెట్లపై నివసించడాన్ని కాలగమనంలో తమకుతాము బాగా అలవాటు పఱచుకొన్నాయి. వాటి ప్రముఖ ఆహారమైన ఆకులు, తక్కువ పోషకవిలువలను కలిగి, త్వరగా జీర్ణమవ్వవు. అందుకని అలసకోతుల కడుపులు బాగా పెద్దవిగా ఉండి, వివిధ గదులు కలిగి ఉండి, వాటిలో ఆకులను జీర్ణీంపజేసే సూక్ష్మక్రిములను పుష్కళంగా కలిగి ఉంటాయి. మూడువంతులు పెరిగిన పిల్ల అలసకోతులకు, తమతమ కడుపులు ఆకులను జీర్ణించుకునే శక్తిని సంతరించుకోవడానికి కనీసం పుట్టిన తర్వాత ఒక నెల సమయం పడుతుంది.

మూడువ్రేళ్ల అలసకోతులు చక్కగా చెట్లుదిగి వారానికొకసారి మలమూత్ర విసర్జనకై ఆ చెట్టుకు దగ్గరగా ఒక గొయ్యిద్రవ్వి అందులో విసర్జనచేసి, ఆ గోతిని మట్టితో కప్పిపెట్టి తిరిగి చెట్టును ఎక్కుతాయి. అవి ప్రతివారం ఒకచోటనే విసర్జన చేస్తాయి, ఆయా సమయాలలో అవి క్రూరమృగాల దాడులకు ఎక్కువగా బలైపోతాయి. అలా ఒక విధిగా మలమూత్ర విసర్జన చేయడానికి, వాటీ ఒంటిపై నివసించే పురుగులకు సంబంధముందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అవి అలా విసర్జన చేసేటప్పుడు వాటి ఒంటిపైనున్న కీటకాలకు గ్రుడ్లు పెట్టుకునే చోటు దొరుకుతుందని, లేదా ఆ కీటకాలు అలసకోతి యొక్క మలకూపాలలోనే గ్రుడ్లుపెడతాయని వారి భావన. అవి అలా చెట్టు మొదలులో మలమూత్ర విసర్జన చేయడం ద్వారా ఆ చెట్టుకు అది ఒక ఎరువులాగ ఉపయోగపడుతుందని కూడా కొందఱి భావన. 

 
హాఫ్మన్ రెండువ్రేళ్ల అలసకోతి,(శా.నా ఖోలీపస్ హాఫ్మనీ), కోస్టారీకాలోని మాన్యువల్ రాష్ట్రీయ ఉద్యానవనంలో

సంతానోత్పత్తి

మార్చు

పాలి మఱియు గోధుమకంఠపు అలసకోతులు ఋతువాధారంగా సంయోగంలో పాల్గొంటాయి, కేసరి అలసకోతులు మాత్రం సంవత్సరం పొడవునా పిల్లలను కంటాయి. మూడువ్రేళ్ల మరుగుజ్జు అలసకోతి యొక్క సంతానోత్పత్తి పద్ధతుల గుఱించి ఎవరికీ తెలియదు. సాధారణంగా అలసకోతులు ఒక బిడ్డకే జన్మనిస్తాయి. మూడువ్రేళ్ల అలసకోతుల గర్భదారణ కాలం ఆఱునెలలుకాగా, రెండువ్రేళ్ల అలసకోతులకు ఒక సంవత్సరం.పసి అలసకోతులు తమ తల్లులతో ఐదునెలల వరకు కలిసి ఉంటాయి. పిల్ల అలసకోతులు ఒకొక్కసారి ప్రసవసమయంలో చెట్టుపైనుండి నెలకు పడి మరిణిస్తూంటాయి.  అప్పుడు కూడా తల్లిఅలసకోతులు చెట్టుదిగి తమ పిల్లలను కాపాడుకోవడానికి రావు. అలసకోతుల మర్మావయవాలు పైకి కనిపించవు. అందువలన జంతుప్రదర్శనశాల  వారికి సాధారణంగా అడిగిన లింగం కన్నా వేఱులింగపు అలసకోతులను ఎగుమతి చేయబడుతుంటాయి.

రెండువ్రేళ్ల అలసకోతుల సగటు జీవితకాలం అడవిలో ఇరవైయేళ్లు కాగా, పెంపకంలో ముప్ఫైయేళ్లు.

భౌగోళిక విస్తీర్ణం

మార్చు

అలసకోతులు ఎక్కువగా దక్షిణ మఱియు మధ్యామెరికా ఉష్ణమండల వర్షారణ్యాలలో నివసిస్తాయి. ప్రస్తుతం జీవిస్తూన్న ఆఱుజాతులలో నాలుగు జాతులు అంతరించిపోతే ప్రమాదానికి దూరంగా ఉండగా,  బ్రెజిల్ అట్లాంటిక్ అరణ్యాలలో నివసించే మూడువ్రేళ్ల కేసరి అలసకోతి మాత్రం అంతరించిపోవడం మొదలవడానికి దగ్గరగా ఉంది.  మూడువ్రేళ్ల మరుగుజ్జు అలసకోతి త్వరలోనే అంతరించిపోబోతోంది.

 
1825నాటి మూడువ్రేళ్ల మరుగుజ్జు అలసకోతి దృష్టాంతం

మానవులతో సంబంధం

మార్చు
 
డల్లాస్ ప్రపంచ కృత్రిమ జలాశయంలోని మూడువ్రేళ్ల అలసకోతి

కోస్టారీకాలోని అలసకోతుల మరణాలకు అధికంగా కారణమైనవి రెండు- వేట మఱియు కరెంటు వైర్లు. ఇవి తమ గోర్ల ఆధారంగా చెట్లనుండి వ్రేలాడుతాయి గనుక, వీటిని వేటగాళ్లు తుపాకీతో కాల్చినప్పటికీ ఇవి గోర్లతో అలా మరణించి చెట్లకే వ్రేలాడుతూంటాయి.

జంతువుల రవాణాలో పెంపుడు జంతువులుగా తరలింపబడే వాటిలో ఈ అలసకోతులు కూడా ఒకటి. అలసకోతుల విభిన్న జీవనశైలి వలన వాటిని ఇళ్లలో పెంచడం చాలా కష్టమౌతుంది.

సురినామ్ దేశంలోని హరిత సంపదా భండారము అనే సంస్థకు అధ్యక్షుడైన మోనీఖ్ పూల్ అనే వ్యక్తి, ఆఱువందలకు పైగా అలసకోతులను, పిపీలికారులను, కవచకేసులను మఱియు ముళ్ళపందులను వేటలనుండి రక్షించాడు.

కోస్టారీకాలోని అలసకోతి రక్షణ సంస్థ, అలసకోతులను రక్షించి, పెంచి, తిరిగి వాటిని తమ స్వస్థలాలకు తరలించడంలో గొప్పపని చేస్తోంది. అదే దేశంలో ఏవియారిస్ అలసకోతి అభయారణ్యం కూడా అలసకోతుల పరిరక్షణలో తోడ్పడుతోంది. ఆ సంస్థ దాదాపు 140కు పైగా అలసకోతులను కాపాడి తిరిగి జాగ్రత్తగా వాటిని అడవులకు తరలించింది. 

హిమయుగం ఆధారంగా తెరకెక్కిన మొదటి చిత్రం "ఐసెజ్"యొక్క కథ, సిడ్ అనే పురాతన కాలపు నేల అలసకోతి పాత్ర చుట్టూ తిరుగుతుంది.

సూచనలు

మార్చు

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అలసకోతి&oldid=3845485" నుండి వెలికితీశారు