అల్లుడా మజాకా
అల్లుడా మజాకా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో 1995 లో విడుదలైన చిత్రము. ఇందులో చిరంజీవి, రమ్యకృష్ణ, రంభ, ఊహ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై దేవివరప్రసాద్ నిర్మించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించాడు. పోసాని కృష్ణమురళి చిత్రానువాదం సమకూర్చాడు. ఈ సినిమా కిలాడీ అనే పేరుతో కన్నడలో పునర్నిర్మాణం చేసారు.
అల్లుడా మజాకా | |
---|---|
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
నిర్మాత | దేవివరప్రసాద్ |
తారాగణం | చిరంజీవి, రమ్యకృష్ణ, ఊహ, రంభ |
ఛాయాగ్రహణం | కె. ఎస్. హరి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1995 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ సినిమా విడుదల కావడంతోటే ఇందులో మహిళలను అభ్యంతరకరంగా చూపించారంటూ కమ్యూనిస్టులు, హిందూ జాతీయ వాదులు నిషేధించాలని కోరారు.[1] సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత సెన్సారు బోర్డు వారు ఈ చిత్రాన్ని నిషేధించగా, అందుకు వ్యతిరేకంగా చిరంజీవి అభిమాన సంఘాలు హైదరబాదులో ధర్నా నిర్వహించారు. దాంతో వారు నిషేధాన్ని వెనక్కు తీసుకుని సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తీసివేసి ప్రదర్శించవచ్చని అనుమతి ఇచ్చారు.
కథ
మార్చుసీతారాముడు తండ్రి ముప్ఫై ఏళ్ళుగా ఊరికి పంచాయితీ ప్రెసిడెంటుగా పనిచేస్తుంటాడు. వీరి కుటుంబాన్నే కాక ఊళ్ళో వారందరినీ అదే ఊళ్ళో ఉన్న వసుంధర ఆమె సోదరుడు పెద్దయ్య వేధిస్తూ ఉంటారు. పెద్దయ్య కొడుకు శివ విదేశాల్లో చదువుకుని ఆ ఊరికి వస్తాడు. పెద్దయ్య శివని వసుంధర పెద్ద కూతురు పప్పిని వివాహం చేసుకోమని కోరితే అతను మాత్రం పొగరుబోతు అమ్మాయైన పప్పిని కాదని అణకువైన అమ్మాయియైన సీతారాముడి చెల్లెలు మల్లీశ్వరిని ప్రేమిస్తాడు. సీతారాముడి తండ్రి తన భూమిని సాగుకోసం పేదలకు పంచి పెట్టి ఉంటాడు. ఆ భూముల్లో అపారమైన గ్రానైటు నిక్షేపాలున్నాయని తెలుసుకున్న పెద్దయ్య సంబంధానికి ఒప్పుకొని ఆ భూమిని తన కొడుక్కొ కట్నంగా ఇవ్వమంటాడు. సీతారాముడి తండ్రి అందుకు అంగీకరించడు. పెద్దయ్య వివాహాన్ని రద్ధు చేయిస్తాడు. వసుంధర కూడా శివ తన కూతుర్ని కాదని మల్లీశ్వరిని ప్రేమించినందుకు అతడి మీద కోపంగా ఉంటుంది. కూలీలను మోసం చేసి వారి భూములను స్వాధీనం చేసుకుంటుంది వసుంధర. పెద్దయ్యతో మాట్లాడి శివకు చెప్పకుండా అతని వివాహాన్ని పప్పితో నిర్ణయిస్తారు. అదే లోపు మల్లీశ్వరి శివ వల్ల గర్భవతి అయిందని తెలుస్తుంది. కూలీల భూములు అన్యాక్రాంతం అయిపోయినందుకు సీతారాముడి తండ్రి విచారంతో ఆత్మహత్య చేసుకుంటాడు.
శివ కోసం ఎదురు చూస్తూ సీతారాముడు, మల్లీశ్వరి పట్నం చేరుకుంటారు. శివ తిరిగి రాగానే అతని కళ్ళెదురుగా మల్లీశ్వరిని వ్యభిచారం కేసులో ఇరికిస్తారు వసుంధర, పెద్దయ్యలు. శివ ఆమెను దగ్గరకు రానీయడు. పెద్దయ్య సీతారాముడిని ఒక పోలీసు అధికారి హత్య కేసులో ఇరికించి మరణశిక్ష పడేలా చేస్తాడు. అతను జైలు నుంచి తప్పించుకుని శివను పెళ్ళి చేసుకోబోతున్న పప్పిని బలవంతంగా పెళ్ళి చేసుకుంటాడు. ఎప్పుడో వదిలేసిన వసుంధర భర్త లాయరు శివరామకృష్ణ సహాయంతో సీతారాముడు పెరోల్ మీద బయటకు వస్తాడు.
తారాగణం
మార్చు- సీతారాముడుగా చిరంజీవి
- పప్పీగా రమ్యకృష్ణ, వసుంధర పెద్ద కూతురు
- రంభ
- మల్లీశ్వరిగా ఊహ, సీతారాముడి చెల్లెలు
- వసుంధరగా లక్ష్మి
- పెద్దయ్యగా కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- లాయరు శివరామకృష్ణగా గిరిబాబు, వసుంధర భర్త
- మల్లికార్జునరావు
- శివగా చిన్నా, వసుంధర కొడుకు
- శ్రీహరి
- అల్లు రామలింగయ్య
- ఎ. వి. ఎస్
- చలపతిరావు
- మహేష్ ఆనంద్
సంగీతం
మార్చుఈ సినిమాకు కోటి సంగీత దర్శకత్వం వహించాడు.
చిన్నపాప , రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
అత్తో అత్తమ్మ కూతురో , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కె ఎస్ చిత్ర
ఉంగా ఉంగా , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , సుజాత
మావూరి దేవుడు , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
పిట్టకూత , రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర
రెడ్డు రెడ్డు , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,కె ఎస్ చిత్ర.
మూలాలు
మార్చు- ↑ http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/1808/9/09_chaptr%204.pdf
- ↑ "Alluda Mazaka". Spotify. Retrieved 13 May 2021.