శ్రీహరి (నటుడు)
శ్రీహరి (ఆగష్టు 15, 1964 - అక్టోబరు 9, 2013) తెలుగు సినిమా నటుడు. ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు.
శ్రీహరి | |
శ్రీహరి ఛాయాచిత్రం | |
జననం | [1] యలమర్రు, భారతదేశం | 1964 ఆగస్టు 15
ఇతర పేర్లు | రియల్ స్టార్ |
భార్య/భర్త | శాంతి |
ప్రముఖ పాత్రలు | పోలీస్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా మగధీర షేర్ ఖాన్ భద్రాచలం |
జీవితసంగ్రహం
మార్చుశ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి.[2] శ్రీహరి తాత రఘుముద్రి అప్పలస్వామికి ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి వలస వచ్చారు. వీరిలో నాలుగవ కుమారుడు శ్రీహరి తండ్రి సత్యన్నారాయణ, తల్లి సత్యవతి. యలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిలు షాపు, సోడాలు అమ్మి జీవనం సాగించారు. శ్రీహరికి శ్రీనివాసరావు, శ్రీధర్ అన్నదమ్ములు. 1977 లో యలమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీహరి ఏడవ తరగతి పాసయ్యారు. తరువాత గ్రామంలోని అరెకరం భూమిని అమ్ముకొని హైదరాబాదుకు మకాం మార్చారు. ఏటా యలమర్రు గంగానమ్మ జాతరకు శ్రీహరి తప్పనిసరిగా వెళ్ళేవాడు.
యుక్తవయసు నుండే శారీరక ధారుడ్యంపై ఎంతో ఆసక్తి కలిగివుండేవాడు. ఉదయం చదువుకుంటూ, సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు షెడ్డులో మెకానిక్ గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో సినిమాలు శోభన థియేటర్ లో చూసేవాడు. హైదరాబాద్ లో నిర్వహించిన అనేక శారీరక ధారుడ్య పోటిల్లో పాల్లొని ‘మిస్టర్ హైదరాబాద్’గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకున్నారు. విశ్వవిద్యాలయం తరపున రెండుసార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని, బహుమతులు గెలుచుకున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు.
సినీ జీవితం
మార్చు1986లో సినిమాలోకి స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి...అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. 1989లో తమిళ సినిమా మా పిళ్ళై, తెలుగు 'ధర్మక్షేత్రం' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా వివిధ రకాలుగా రాణించారు.
పోలీస్ చిత్రంతో హీరోగా ఆయనకు మంచి పేరు లభించింది. హీరోగా చేసిన మొదటి చిత్రం 'పోలీస్' అయితే.. హీరోగా చేసిన చివరి చిత్రం 'పోలీస్ గేమ్' కావడం విశేషం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చివరి చిత్రం తుఫాన్.ఇప్పటి వరకు 28 చిత్రాల్లో హీరోగా నటించారు. రియల్ స్టార్‌గా ఖ్యాతి గడించారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు వంద చిత్రాల్లో నటించారు.
జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా....సినిమాలపై మక్కువతో ఈ రంగంవైపు అడుగులు వేసారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మనాయుడు’లో ఆయనకు తెలుగు సినిమాలో నటుడిగా అవకాశం దక్కింది. తాజ్ మహల్ చిత్రంలో పూర్తిస్థాయి విలన్ పాత్రలో కనిపించారు.
2000వ సంవత్సరంలో వచ్చిన ‘పోలీస్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
పృధ్వీపుత్రుడు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీరలో షేర్ ఖాన్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్న శ్రీహరి, ఇటీవల రామ్ చరణ్ హీరోగా నటించిన తుఫాన్,రఫ్ (2014) సినిమాల్లో నటించారు.
తెలంగాణ యాసకు గౌరవం
మార్చుసినిమాల్లో తెలంగాణ యాసకు గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చిన నటుడు శ్రీహరి. ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం, తుఫాన్ వంటి చిత్రాలలో ఆయన పలికించిన సంభాషణలు తెలంగాణ యాసలోఉన్న సౌందర్యాన్ని ఆవిష్కరించాయి. నిజజీవితంలో హైదరాబాదీ తెలంగాణయాసలో ఆయన సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా సాగేది.
వ్యక్తిగత జీవితం
మార్చుశ్రీహరి శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె అక్షర.
నాలుగు నెలలకే కుమార్తె అకాల మరణం చెందగా, తన కూతురు అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి, మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు మినరల్ వాటర్ ను అందించడంతోపాటు గ్రామంలో అనేక మౌలిక సదుపాయాల సాదనకు కృషిచేశారు.
తమ గ్రామానికి చెందిన శ్రీహరి రాష్ట్రస్థాయికి ఎదిగి గ్రామం పేరును నలుదిశలా చాటినందుకు గర్వంగా యలమర్రు గ్రామ ప్రముఖులు 1989 సంవత్సరంలో శ్రీహరిని హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు.
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013 న కాలేయ సంబంధ వ్యాధివలన ముంబై లో కన్నుమూసారు.
నటించిన చిత్రాలు
మార్చుపురస్కారాలు
మార్చు- 2005 లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు.
మూలములు
మార్చు- ↑ Srihari Profile on IMDB
- ↑ మరణ వార్త
- ↑ ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April 2020). "గురి తప్పిన 'సాహస వీరుడు'". www.idreampost.com (in ఇంగ్లీష్). Archived from the original on 5 ఆగస్టు 2020. Retrieved 22 June 2020.