ఆచంట వెంకటరత్నం నాయుడు

ఆచంట వెంకటరత్నం నాయుడు (1935 మే 28 - 2015 నవంబర్ 25) ఒక రంగస్థల నటుడు.

ఆచంట వెంకటరత్నం నాయుడు
Aachanta Venkatarathnam Naidu.JPG
జననంమే 28, 1935
కొండపల్లి, కృష్ణా జిల్లా
మరణంనవంబర్ 25, 2015
తాడేపల్లిగూడెం
ఇతర పేర్లుఆచంట వెంకటరత్నం నాయుడు
ప్రసిద్ధిరంగస్థల నటులు
తండ్రివెంకటేశ్వర్లు నాయుడు

జీవిత విశేషాలుసవరించు

ఈయన 1935, జూన్ 28 వ తేదీన కృష్ణాజిల్లా, కొండపల్లిలో జన్మించాడు. వెంకటరత్నం నాయుడు తండ్రి ఆచంట వెంకటేశ్వర్లు నాయుడు, తల్లి వెంకట నరసమ్మ. తండ్రి రంగస్థల కళాకారుడు. అదే వారసత్వంగా ఈయనకు అబ్బింది. గుంటూరు హిందూ స్కూల్లో ఎస్.ఎస్.ఎల్.సి. పాసైన ఆచంట కొంతకాలం ఆయుర్వేద మందులకి రిప్రెజెంటేటివ్‌గా పనిచేసి, వృత్తికీ, ప్రవృత్తికీ సమన్వయం కుదరక వృత్తిని వదులుకొని నాటకాలలో ప్రవేశించాడు.

తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే నీతిశాస్త్రంలో శ్లోకాలు, పద్యాలు కంఠస్థం చేసి, స్పష్టమైన వాచికంతో, చక్కటి గాత్రంతో పాడుతుంటే స్కూల్లో ఉపాధ్యాయులు ప్రశసించేవారు. కేవలం పద్యనాటకమేకాక అనేక సాంఘిక నాటకాల్లో కూడా ఆచంట తమ ప్రతిభా పాటవాలను తెలుగు దేశ ప్రజలకి తెలియజేశాడు. గుంటూరు నాట్యసమితి ప్రదర్శించిన రామరాజు, నాయకురాలు, అపరాధి వంటి నాటకాలతో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తనకంటూ ఓ ముద్ర నేర్పరుచుకున్న నాయుడి ప్రతిభ చూసిన పలు నాటక సంస్థలు ఆయనకి పౌరాణిక చారిత్రక నాటకాల్లో కూడా ప్రధాన పాత్రలను ఇచ్చి ప్రోత్సహించాయి.

ఆంధ్ర లలిత కళాపరిషత్ ప్రదర్శించిన బొబ్బిలి నాటకంలో హైదర్‌జంగ్, తులాభారం నాటకంలో వసంతకుడు, సక్కుబాయి నాటకంలో కాశీపతి, రామాంజనేయ యుద్ధం లో యయాతి, హరిశ్చంద్ర లో విశ్వామిత్ర మొదలైన పాత్రలతో విజయదుందుభి మోగించాడు.

మయసభ ఏకపాత్రాభినయం నాయుడి నట జీవితంలో ఒక మైలురాయి. సాత్విక పాత్రలకంటే తామస పాత్రలు ఆయనకి ఎంతో ఇష్టం. ఆయనప్రతిభకు మెచ్చిన అనేక సంస్థలే కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సన్మానాలు, సత్కారాలతో ఆయనని అభినందించింది. ఈలపాట రఘురామయ్య, షణ్ముఖి ఆంజనేయ రాజు, ఎ.వి. సుబ్బారావు, మాధవపెద్ది సత్యం, పీసపాటి నరసింహమూర్తి మొదలైన ఉద్ధండులైన 40 మంది నటులంతా ఒక బృందంగా ఏర్పడి తులసీజలంధర నాటకం ప్రదర్శించారు.

డి.వి. సుబ్బారావు (హరిశ్చంద్ర పాత్రధారి) నెలకి 4 నాటకాలు ప్రదర్శించి, కళాకారులకు నెలకి కచ్చితంగా జీతాలిచ్చేవారట. దేనికైనా క్రమశిక్షణ, పట్టుదల, శ్రద్ధ ముఖ్యం అంటారు ఆచంట. బురదనాయుడు సతీసావిత్రిలో ఒరిజినల్ దున్నపోతుమీద వచ్చేవారట. విజయవాడకి సుమారు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘నున్న’ ప్రాంతంలో ఒక చిల్డ్రన్ నటశిక్షణాలయం స్థాపించి భావితరాలకు పద్యనాటక కళాకారులను తీర్చిదిద్దారు.

నటించిన నాటకాలుసవరించు

 1. శ్రీకృష్ణ రాయబారం
 2. శ్రీకృష్ణ తులాభారం
 3. బొబ్బిలి యుద్ధం
 4. రామరాజు
 5. నాయకురాలు
 6. అపరాధి
 7. రామాంజనేయ యుద్ధం
 8. సక్కుబాయి
 9. హరిశ్చంద్ర
 10. తులసీ జలంధర

నటించిన పాత్రలుసవరించు

 1. కరండకుడు
 2. దుర్యోధనుడు
 3. జలంధర
 4. జరాసంధ
 5. ద్రోణుడు
 6. అశ్వత్థామ
 7. గయుడు
 8. హైదర్‌జంగ్
 9. వసంతకుడు
 10. కాశీపతి
 11. యయాతి
 12. విశ్వామిత్ర
 13. తాండ్రపాపారాయుడు మొదలైనవి

పురస్కారాలుసవరించు

 • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే హంస అవార్డు (2000)
 • తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు (2002)
 • సి.హెచ్‌.సాంబయ్య స్మారక పురస్కారం (2009)
 • ఎన్.టి.ఆర్. రంగస్థల పురస్కారం (2001)

మరణంసవరించు

తెలుగు పౌరాణిక నాటక రంగానికి విశేషమైన సేవలను అందించిన ఆచంట వెంకటరత్నం నాయుడు తన 81వ యేట 2015, నవంబర్ 25, బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెంలో కుమార్తె గృహంలో మరణించాడు.[1]

మూలాలుసవరించు

 1. "రంగస్థల నటుడు ఆచంట కన్నుమూత". Archived from the original on 2021-01-22. Retrieved 2015-11-26.

ఆంధ్రభూమి వెబ్ నుండి[permanent dead link]