కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు
కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నదిపై కట్టిన జలాశయం, నీటిపారుదల వ్యవస్థ. 2004 లో ఆమోదించిన ఈ ప్రాజెక్టు 3.875 టిఎమ్సిల సామర్ధ్యంతో 80,060 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఒంగోలు, ఇతర గ్రామాల తాగునీటి కొరకు ఉద్దేశించబడింది.
కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయం | |
---|---|
దేశం | భారతదేశం |
ప్రదేశం | మల్లవరం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
ఆవశ్యకత | సాగునీరు & తాగునీరు |
స్థితి | క్రియాశీలం |
నిర్మాణం ప్రారంభం | 2006 |
ప్రారంభ తేదీ | 2008 |
యజమాని | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | ఆనకట్ట |
నిర్మించిన జలవనరు | గుండ్లకమ్మ నది |
పొడవు | 5,699 మీ. (18,698 అ.) |
జలాశయం | |
సృష్టించేది | కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయం |
మొత్తం సామర్థ్యం | 3.875 TMC |
చరిత్ర
మార్చు2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలంలోని మల్లవరం వద్ద గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టును 165.22 కోట్ల ఖర్చుతో నిర్మాణము చేపట్టడానికి ఆమోదము తెలియజేసినది. ఈ ప్రాజెక్టు 6 మండలాల పరిధిలోని 43 గ్రామాలలో 80,060 ఎకరాల భూమికి సాగునీటిని అందివ్వగలదని ఆశిస్తున్నారు. అంతేకాక జిల్లా ముఖ్యపట్టణం ఒంగోలుతో సహా 43 గ్రామాలలోని 23.56 లక్షల మంది ప్రజలకు మంచినీటిని సమకూర్చుతుందని ఆశిస్తున్నారు. మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, కొరిశపాడు, ఇంకొల్లు, జే.పంగులూరు, చినగంజాం, ఒంగోలు మండలాల పరిధిలోని 80,060 ఎకరాల ఆయకట్టును కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనికొరకు 5,444.60 ఎకరాలు జలాశయం, ఎడమ,కుడి కాలవల నిర్మాణానికి సేకరించాలని తలపెట్టారు. జలాశయం నిర్మాణానికి 165.22 కోట్లు,2004 లో నీటికాలువల నిర్మాణానికి 100 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.[1]
జలాశయం కట్టడంతో మల్లవరం, ఘడియపూడి, గార్లపాడు, తమ్మవరం పూర్తిగా జలాశయం నీటితో మునిగిపోతాయి. ఈ గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించగా గ్రామాలు ఖాళీ అయ్యాయి. ఈ పునరావస కల్పనలో అవకతవకల కారణంగా చాలా మంది నిర్వాసితులయ్యారు, వారి జీవనశైలి దెబ్బతిన్నది.[2][3] ఇవేగాక పాత కొటికలపూడి, ధేనువకొండ, మణికేశ్వరం, తిమ్మారెడ్డిపాలెం,అనమనమూరు, యర్రపాలెం, అన్నంగి పాక్షికంగా ప్రభావితమవుతాయి. ఈ గ్రామాలను గూడా పూర్తిగా మునిగిపోయేవిగా పరిగణించి పునరావాస కల్పించాలని ఆదేశించారు.[4]
పునరావాసకాలనీలు మద్దిపాడు దగ్గర ఘడియపూడి కాలనీ, ధేనువకొండ వాసులకు దక్షిణ ధేనువకొండ, కొంగపాడు, వేలమూరిపాడు, మేదరమెట్ల దగ్గర కేటాయించారు. పాత కొటికలపూడి కొరకు వేణుగోపాలపురంలో కేటాయించారు. మణికేశ్వరం గ్రామానికి సమీపంలో మొదటి ఫేజ్ లో నిర్వాసితులైన వారికి పునరావసకాలనీ కేటాయించి ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మాణాలు పూర్తయ్యాయి. కాని నిర్వాసితులు మారలేదు. తిమ్మారెడ్డిపాలెంకు కూడా సమీపంలో పునరావాసకాలనీ కేటాయించగా, వసతులు కల్పించకపోవటంతో నిర్వాసితులు మారలేదు. 2019 లో కూడా పునరావాసం పూర్తి కాకపోవడంతో కొంతమంది ముంపు గ్రామాలలోనే నివసిస్తున్నారు.[5]
2008లో 3.875 టీఎంసీల సామర్థ్యం గల జలాశయం నిర్మించారు. ప్రాజెక్టు ఎడమ కాలువ కింద 27.9 కిలోమీటర్ల పొడవునా 50 వేల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కుడి కాలువ కింద 27.3 కి.మీ పొడవునా 28 వేల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2008 నవంబరులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు నుంచి కాలువలకు నీరు లాంఛనంగా విడుదల చేశారు. అయితే కాలువల నిర్మాణం భూసేకరణ సమస్యలతో పూర్తి కాలేదా కావున ప్రాజెక్టు పూర్తి వినియోగంలోకి రాలేదు.[6] 2018 లో ప్రారంభించాలని అనుకున్నా, పనులు పూర్తి కాలేదు.[7]
2019 డిసెంబరుకు, ఈ ప్రాజెక్టు పూర్తి చేయవలసివుంది. సామాజిక ఆర్థిక సర్వే 2018-19 ప్రకారం, 753.83 కోట్ల ఖర్చు ప్రణాళిక కాగా, 627.85 కోట్ల ఖర్చుచేసి 98% పని (68977ఎకరాల ఆయకట్టు) పూర్తిచేశారు.[8]
మూలాలు
మార్చు- ↑ "Gundlakamma project gets green signal". BusinessLine. 2004-08-19. Archived from the original on 2019-09-07.
- ↑ K.Koteswararao (2018). "Resettlement and Rehabilitation Policy and its Implementation". In B.V.Sharma, N.Sudhakar Rao (ed.). Land and Identity Issues in Tribal Areas (PDF). Vol. 2. Tribal Welfare, Gov of AP, CIPS, Univ of Hyderbad. p. 108. Archived from the original (PDF) on 2019-09-08.
- ↑ K, Koteswara rao (2018-07-14). "Developmental Rhetoric, Uprooted Lives: Gundlakamma Reservoir Project". EPW. 53 (28).
- ↑ "G.O.Rt.No.423 Land Acquisition - K.O.R.Gundlakamma Reservoir Project - Declaring (7) Villages as fully submerged villages under K.O.R.Gundlakamma Reservoir Project and for payment of compensation - Order -Issued". 2008-05-19. Retrieved 2019-09-08.
- ↑ "గుండ్లకమ్మ'.. ముంపు గ్రామాలు గట్టెక్కేదెప్పుడో..?". ఆంధ్రజ్యోతి. 2019-02-08. Archived from the original on 2019-09-07.
- ↑ "Inauguration of Gundlakamma project delayed". The Hindu. 2008-01-29.
- ↑ "ప్రకాశం ప్రాజెక్టులపై శ్రద్ధ ఏదీ?". ప్రజాశక్తి. 2018-10-28. Archived from the original on 2019-09-08. Retrieved 2019-09-08.
- ↑ "Economic Infrastructure". SOCIO ECONOMIC SURVEY 2018-19 (PDF). Planning Department,Govt of AP. 2019-07-11. p. 108. Archived from the original (PDF) on 2019-07-15.