కడప కోటిరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.

కడప కోటిరెడ్డి
జననంకడప కోటిరెడ్డి
1886
చిత్తూరు జిల్లా, మదనపల్లె తాలూకాలోని
నారాయణ చెరువు (కోటిరెడ్డిగారి పల్లె)
మరణం1981
వృత్తికాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.,న్యాయవాది
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధుడు, రాజాజీ ప్రభుత్వంలో మంత్రి
రాజకీయ పార్టీకాంగ్రెస్
మతంహిందూ మతము

కోటిరెడ్డి, చిత్తూరు జిల్లా, మదనపల్లె తాలూకాలోని నారాయణ చెరువు (కోటిరెడ్డిగారి పల్లె) లో 1886లో జన్మించాడు. 1911లో ఇంగ్లాండులోని మిడిల్‌ టెంపుల్ నుండి బారిష్టర్ ఎట్ లా పట్టా పుచ్చుకున్న కోటిరెడ్డి న్యాయవాదిగా, రైతుగా కడపలో స్థిరపడ్డాడు. ఈయన గాడిచర్ల హరిసర్వోత్తమరావుతో కలిసి రాయలసీమలో హోమ్ రూల్ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈయన కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులతో సన్నిహితంగా పనిచేసేవాడు. వీరిద్దరూ, ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డికి రాజకీయ గురువులు.

కోటిరెడ్డి 1921లో మహాత్మాగాంధీతో పాటూ రాయలసీమంతా పర్యటించాడు. 1922లో అనగా తన 32వ యేటనే ఇతడు శాసనసభలో ప్రవేశించాడు. ఇతడు మొదట కాంగ్రెస్‌కు అనుకూలమైన ప్రెసిడెన్సీ అసోసియేషన్‌లో గుత్తి కేశవపిళ్లెతో కలిసి పనిచేశాడు.1926లో స్వరాజ్యపార్టీ ఉపనాయకుడిగా ఎన్నుకోబడినాడు. 1929లో స్వతంత్ర సభ్యుడిగా మద్రాసు శాసనసభకు ఎన్నుకోబడినాడు. 1931లో తిరిగి ఏకగ్రీవంగా మద్రాసు శాసనసభకు ఎన్నికయినాడు. కోటిరెడ్డి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించాడు. ఆంధ్ర మహాసభకు రెండు సార్లు అధ్యక్షత వహించిన ఇద్దరు వ్యక్తులలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకరైతే, కోటిరెడ్డి రెండవ వాడు. 1929, 1937లో జరిగిన సమావేశాలకు అధ్యక్షత వహించాడు. అంతేకాకుండా 1931లో మద్రాసులో జరిగిన ప్రత్యేక సమావేశం కూడా ఈయన అధ్యక్షతలోనే జరిగింది. 1940లో ఉప్పు సత్యాగ్రహంలో క్రియాశీలకంగా పాల్గొని జైలుకు వెళ్లాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని రాజాజీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా కోటిరెడ్డి మధుర, తిరునల్వేలి, శ్రీరంగం దేవాలయాలలో హరిజనులకు ప్రవేశం కల్పించాడు.[1]

స్వాతంత్ర్యం తర్వాత 1952లో కడప నియోజకవర్గం నుండి, [2]1955లో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో పనిచేశాడు. 1957లో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు, 1964లో శాసనమండలికి ఎన్నికయ్యాడు. రాయలసీమ కరువు ఉపసంశన సంఘానికి అధ్యక్షుడిగా శ్రీబాగ్‌ ఒడంబడిక రూపుదాల్చుకోవటంలో కీలక పాత్ర పోషించాడు.[3]

ఈయన సతీమణి రామసుబ్బమ్మ కూడా స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నది.

మూలాలు

మార్చు
  1. జానమద్ది, హనుమచ్ఛాస్త్రి (15 March 1980). "రాయలసీమ రాజకీయ కురువృద్ధులు కడప కోటిరెడ్డీ". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 341. Retrieved 22 January 2018.[permanent dead link]
  2. "మద్రాసు శాసనసభ సమీక్ష - 1952-57" (PDF). తమిళనాడు శాసనసభ. p. 82. Archived (PDF) from the original on 2020-10-15. Retrieved 2021-11-03.
  3. Rayalaseema during colonial times: a study in Indian nationalism By P. Yanadi Raju