శాసన మండలి

భారతదేశ రాష్ట్రాల శాసన వ్యవస్థ సభలలోని ఎగువ సభ

భారతదేశ రాష్ట్రాల శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభను శాసనమండలి (విధాన పరిషత్) అంటారు.అధికరణ 169 ప్రకారం రాష్ట్రంలలో శాసనమండలి ఏర్పాటు చేయవచ్చు, రద్దు చేయవచ్చు. శాసనమండలి కావాలి అని కోరుకుంటున్న రాష్ట్రంలోని శాసనసభలో 2/3 మెజారిటీతో ఆమోదించాలి. రాజ్యాంగంలోని 171 అధికరణం ద్వారా ఈ విధాన సభను ప్రారంభించవచ్చు. ప్రస్తుత భారతదేశం లోని 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది.[1] అవి ఉత్తరప్రదేశ్ (100), బీహార్ (75), కర్ణాటక (75), మహారాష్ట్ర (78), ఆంధ్ర ప్రదేశ్ (58), తెలంగాణ (40). రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికౌతారు. ఈ సభలోని సభ్యులను ఎన్నికైన స్థానిక సంస్థలు, అసెంబ్లీ సభ్యులు, గవర్నర్, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు మొదలైనవారు ఎన్నుకుంటారు. ఈ సభ్యులను ఎం.ఎల్.సి అని పిలుస్తారు. ఇది శాశ్వతసభ. అనగా శాసనసభ వలె దీన్ని రద్దు చేయలేం.కాని శాసనమండలి పూర్తిగా లేకుండా చేయవచ్చు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు. ఇది కేంద్ర ప్రభుత్వం లోని రాజ్యసభ వలె ఉంటుంది. శాసనమండలిని మొదటి సారిగా నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు తొలగించారు. కారణం అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు అధికంగా శాసనమండలిలో ఉండడం వల్ల ప్రభుత్వం బిల్లును శాసన మండలి ఆమోదించేది కాదు, దానితో నందమూరి తారక రామారావు అసహనానికి గురై శాసనమండలిని తొలిసారిగా తొలగించారు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు తిరిగి మళ్ళీ శాసనమండలిని ప్రవేశపెట్టాలని శాసనసభలో బిల్లు చేశారు, కానీ అది పట్టాలెక్కలేదు. కానీ 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తిరిగి శాసనమండలిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా, రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనమండలి కొనసాగుతోంది. అసలు మండలి రద్దు అంత తేలిక వ్యవహారం కాదు. ముందుగా శాసనసభలో బిల్లు చేసి దానిని కేంద్రానికి పంపాలి. కేంద్రంలో లోక్‌సభ రాజ్యసభ ఆమోదించిన రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళిన తర్వాత దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే శాసన మండలి రద్దు అవుతుంది. అదేవిధంగా శాసన మండలి ఏర్పాటు చేయాలన్న ఇదే పద్ధతి పాటించాలి. శాసనమండలిని రాజ్యాంగ కర్తలు మేధావులు కోసం ఏర్పాటు చేశారు, కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు దీన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారు.

భారతదేశం

ఈ వ్యాసం భారతదేశ రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగంభారత ప్రభుత్వ పోర్టల్


సభ్యత్వం మార్చు

ప్రతీ శాసన మండలి సభ్యుడు (ఎం.ఎల్.సి) ఆరు సంవత్సరాల పదవీకాలం కలిగి ఉంటాడు. సభలో మూడొంతులలో ఒక వంతు సభ్యుల పదవీ కాలం ప్రతీ రెండు సంవత్సరాలకు పూర్తి అవుతుంది. ఈ అమరిక భారత పార్లమెంటులోని ఎగువ సభ అయిన రాజ్యసభను పోలి ఉంటుంది.

శాసనమండలి సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి. మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. దివాళా తీసి ఉండరాదు. అతడు ఏ రాష్ట్రంలో పోటీ చేస్తే ఆ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. అతడు/ఆమె అదే కాలంలో పార్లమెంటు సభ్యునిగా ఉండరాదు.

శాసన మండలి సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల శాసన సభ్యుల సంఖ్యలో మూడో వంతు కంటే మించరాదు. కానీ సభ్యుల సంఖ్య 40 కి తగ్గరాదు.

ఈ క్రింది పద్ధతిలో ఎం.ఎల్.సిలు నియమితులవుతారు:

 • మూడోవంతు (1/3) మందిని స్థానిక ప్రభుత్వ సంస్థలు అనగా మ్యునిసిపాలిటీలు, గ్రామ సభలు/గ్రామ పంచాయితీలు, పంచాయత్ సమితులు, జిల్లాపరిషత్ లు ఎన్నుకుంటాయి.
 • మూడోవంతు (1/3) మందిని రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు.
 • శాసన మండలి సభ్యులలో ఆరోవంతు (1/6) మంది సభ్యులు గవర్నరు చే నియమించబడతారు. వీరు శాస్త్రం, కళలు, సామాజిక సేవ, ఇతర రంగాలలో రాణించినవారై ఉంటారు.
 • పన్నెండో వంతు (1/12) మందిని ఉన్నత పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఎన్నుకొంటారు.
 • మరో (1/12) మందిని పట్టభద్రులు ఎన్నుకుంటారు.

ప్రతిపాదిత విధాన పరిషత్తులు మార్చు

 • 2010లో భారత పార్లమెంటు ఎనిమిదవ రాష్ట్రం (తమిళనాడు) లో శాసన మండలి పునః స్థాపన కొరకు చట్టం చేసింది. కానీ ఈ చట్టాన్ని అమలు చట్టపరమైన చర్యల మూలంగా పెండింగ్ లో ఉంచబడింది.[2] రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌన్సిల్ పునరుద్దరణకు వ్యతిరేకత వ్యక్తం చేసింది.[3]
 • 2013 నవంబరు 28 న అసోంలో శాసన మండలి ఏర్పరచవలసినదిగా భారత యూనియన్ కెబినెట్ ఆమోదించింది.
 • కర్ణాటక, మహారాష్ట్రలలో అధ్యయనం చేసిన తరువాత ఒడిశా రాష్ట్ర శాసన మండలిని ఏర్పాటు చేయనుంది.[4]
 • మహారాష్ట్ర విధానసభ వివరాలు:ఎన్నికలు 31,స్థానిక సంస్థలు 21,ఉపాధ్యాయులు 7,గ్రాడ్యుయేట్లు 7,నామినేటెడ్ 12.

రద్దు పునరుజ్జీవనం మార్చు

శాసన మండలి ఉనికి రాజకీయంగా వివాదాస్పదంగా ఉంది. కొన్ని రాష్ట్రాలలో కౌన్సిల్ రద్దు చేయబడిన తరువాత దాని పునఃస్థాపనన కొరకు అభ్యర్థించారు. దీనికి విరుద్ధంగా, ఒక రాష్ట్రం కోసం కౌన్సిల్ యొక్క పునఃస్థాపన కోసం ప్రతిపాదనలు కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. రాష్ట్ర శాసన మండలి రద్దుచేయడం లేదా పునఃస్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలు భారత పార్లమెంటు నిర్ధారణకు కావాలి.

2007 ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిని పునఃస్థాపించబడింది. పంజాబ్ లో అకాలీదళ్-బిజెపి విజయం తర్వాత, కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ తాను రాష్ట్రం విధాన పరిషత్‌ను మళ్లీ ఏర్పరుస్తానని ప్రకటించాడు, కానీ స్థాపించలేదు.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

 1. http://www.gktoday.in/blog/legislative-council-in-india/
 2. "The Times of India, 22 February 2011 "SC stays TN council elections"". Archived from the original on 2012-11-04. Retrieved 2018-04-24.
 3. "The Times of India, 25 May 2011 "Fate of TN legislative council sealed by Jayalithaa"". Archived from the original on 2014-01-16. Retrieved 2018-04-24.
 4. "Odisha names members of committee on Vidhan Parishad study". Business Standard. Retrieved 11 July 2015.

వెలుపలి లంకెలు మార్చు