కమ్మనాడు కమ్మరాష్ట్రం అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది. కమ్మరాష్ట్రంనకు తూర్పున బంగాళాఖాతం, దక్షిణము నెల్లూరు, పడమర శ్రీశైలం, ఉత్తరం ఖమ్మం హద్దులుగా ఉండేవి. చారిత్రకముగా కమ్మనాడు ప్రస్తావన క్రీస్తు శకము మూడవ శతాబ్ది నుండి 1428 తక్కెళ్ళపాడు శాసనములవరకు మనకు కనపడును. కమ్మనాడు అను పదము కర్మరాష్ట్రము (సంస్కృతము) లేక కమ్మరాట్టము (పాళి) నుండి పరిణామము చెందినది. ఈ ప్రాంతములో బౌద్ధమతము క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్ది నుండి పరిఢవిల్లుచున్నది. తేరవాద బౌద్ధ కర్మ (కమ్మ) సిద్ధాంతము నుండి ఈ పదము ప్రాంతమునకు అన్వయించబడింది.

కర్మరాష్ట్రములోని భట్టిప్రోలు, ధరణికోట, విజయపురి శాతవాహనులకు, ఇక్ష్వాకులకు పట్టుకొమ్మలు. ఇచ్చటి బౌద్ధ స్తూపములు, చిత్రకళ, శిల్పము ప్రపంచ ఖ్యాతి గాంచినవి.

శాసనములు మార్చు

1. కర్మరాష్ట్రము అను పదము మొదట ఇక్ష్వాకు రాజు మాధారిపుత్ర పురుషదత్తుని బేతవోలు (జగ్గయ్యపేట) శానములో గలదు (3వ శతాబ్దము).

2. అటుపిమ్మట పల్లవ రాజు రెండవ కుమార విష్ణుని చెందులూరు గ్రామశాసనములో దొరికినది.

3. మూడవ ఆధారము తూర్పు చాళుక్య రాజు మంగి యువరాజ (627-696) శాసనము:

శ్రీసర్వలొకాశ్రయ మహరాజః కమ్మరాష్ట్రె చెందలూరి గ్రామే

4. మూడవ శతాబ్దమునుండి పదకొండవ శతాబ్దము వరకు శాసనములలో కమ్మరాష్ట్రము, కమ్మరట్టము, కమ్మకరాటము, కర్మరాష్ట్రము, కర్మకరాటము, కర్మకరాష్ట్రము, కమ్మకరాష్ట్రము పర్యాయపదములుగా వాడబడినవి.

5. రాజరాజనరేంద్రుని సమకాలీకుడగు పావులూరి మల్లన (1022-1063) ఈ విధముగా వ్రాసెను:

ఇల కమ్మనాటి లోపల విలసిల్లిన పావులూరి విభుడన్

6. తెలుగు చోడుల, కాకతీయుల శాసనములలో కమ్మనాడు (కొణిదెన శాసనము-త్రిభువనమల్ల – 1146). కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలములో బొప్పన కామయ్య కమ్మనాటిని కాట్యదొన (కొణిదెన) రాజధానిగా పాలించుచుండెను.

కాకతీయుల, ముసునూరి వారి పతనముతో కమ్మనాడు అను పదము వాడుకలోనుండి మరుగు పడినది. కాని కమ్మ అను పదము మాత్రము ఒక సామాజిక వర్గము (కులము) నకు పేరుగా మిగిలిపోయింది.

వనరులు మార్చు

  • Burgess, J. 1886, Buddhist Stupas of Amaravathi and Jaggayyapeta, Madras Presidency, Archaeological Survey of India, p. 110.
  • K. R. Subramanian, K. R. 1932, Buddhist remains in Āndhra and the history of Āndhra between 224 & 610 A.D. Asian Educational ervices, New Delhi, ISBN 81-206-0444-X, p. 149.
  • Epigraphica Indica, Vol VIII, pp. 233–236 (Chandaluru copper plate inscription of Kumara Vishnu)
  • Epigraphica Indica, Vol XV, pp. 249–252 (Ongole copper plate inscription of Pallava king Vijaya Skandavarma)
  • Epigraphica Indica, Vol XXIV, pp. 137–143 (Chura inscription of Vishnugopa)
  • Epigraphica Indica, Vol XVIII, p. 250 (Kopparapu copper plate inscription of Pulakesi II, 7th century CE)
  • Epigraphica Indica, Vol XVIII, p. 27 (Aluru inscription of Chalukya king Vikramaditya V, 1011 CE).
  • South Indian Inscriptions, Volume 6, Inscriptions 124, 128, 129, 132, 139, 147, and 179 (http://www.whatisindia.com/inscriptions/)
  • ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి - శ్రీ ఖండవల్లి లక్ష్మీనిరంజన రావు
  • కమ్మవారి చరిత్ర - శ్రీ కె. బావయ్య చౌదరి
"https://te.wikipedia.org/w/index.php?title=కమ్మనాడు&oldid=3624509" నుండి వెలికితీశారు