కర్నూలు నవాబులు

కర్నూలు నవాబులు 19వ శతాబ్ది తొలి అర్థభాగంలో కర్నూలును కేంద్రంగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించిన అర్థస్వతంత్రుడైన పరిపాలకులు. నైజాం నవాబు ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ వారికి దత్తపరచిన కాలంలో వీరి పాలన కొన్నాళ్ళు సాగింది. 1839లో నవాబు వారసుడిని రాజద్రోహ నేరానికి గాను బ్రిటీషర్లు పదవీచ్యుతుని చేశారు. 1733 నుంచి 1839 వరకు వందేళ్ళకు పైగా కర్నూలు ప్రాంతాన్ని పరిపాలించినా కర్నూలు నవాబులు యుద్ధనిపుణులు కాకపోవడంతో ఎదురైన ప్రతి యుద్ధంలోనూ ఓటమి పాలయ్యారు. స్వతంతంగా సైన్యశక్తి, యుద్ధనిపుణత లేకపోవడంతో వీరు 1740లో మరాఠాల చేతిలోనూ, 1750-52లో ఫ్రెంచి వారి చేతిలో, 1755లో మైసూర్ సైనికనేతగా ఉన్న హైదర్ అలీచే ఘోరపరాజయాలు చవిచూశారు. మొఘలులు, మరాఠాలు, మైసూర్ రాజ్యం, నిజాం నవాబు, ఈస్టిండియా కంపెనీలకు వివిధ కాలాల్లో సామంతులుగా ఉంటూ, అర్థస్వతంత్రతతోనే రాజ్యాన్ని నిలుపుకుంటూవచ్చారు. తుదకు బ్రిటీష్ వారిపై ఓ గొప్ప సైనిక కుట్రను చేపట్టడంతో నడిపించలేక రాజద్రోహనేరానికి రాజ్యాన్ని పూర్తిగా కోల్పోయారు. వీరి అస్వతంత్రత కారణంగా తాము సామంతులమైన రాజ్యాలకు కట్టాల్సిన కప్పం, వారి యుద్ధాలకు చేయాల్సిన సహకారంతో ఆర్థికంగా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వీరి పరిపాలనలో ప్రజలు ఆర్థికంగా, సైనికపరంగా కూడా తీవ్రమైన పీడనలకు గురికావాల్సి వచ్చింది.

చారిత్రిక నేపథ్యం

మార్చు

16వ శతాబ్ది నాటికి కర్నూలు విజయనగరం సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. 1565లో జరిగిన రాక్షసతంగడి/తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓటమి పాలై, పరిపాలకుడు అళియ రామరాయలు మరణించడంతో విజేతలైన సుల్తానులు విజయనగర రాజ్యభాగాలను పంచుకున్నారు. కర్నూలు మండలంలోని తూర్పుభాగాలు గోల్కొండ సుల్తాన్ వాటాకు, పడమటి భాగాలు బీజాపూర్ సుల్తాన్ వాటాకు వచ్చాయి. అయితే సుల్తానులు తమ మధ్య చేసుకున్న ఒప్పంద భాగాలను నెరవేేర్చుకునేందుకు, వాటిని స్వాధీనం చేసుకునేందుకు గాను చాలా యుద్ధాలే చేయాల్సివచ్చింది. ముఖ్యంగా గోల్కొండ సుల్తానుకు కంభం, కొండవీడు వంటి ప్రాంతాలు లొంగలేదు. శిరివెళ్ళ, చెన్నూరు, నంద్యాల, ముసలిమడుగు తదితర గ్రామాలు ఆయనకు లోబడ్డాయి. వీటికి అంతం పలుకుతూ బీజీపూర్ రాజ్యంలో సామంతుడైన అబ్దుల్ వాహబుఖాన్ కర్నూలు మీద దండయాత్ర చేసి రామరాయల మనవడైన ఆరవీటి గోపాలరాజును ఓడించి బీజాపూరు వారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఈ విజయానికి పురస్కారంగా బీజాపూరు సుల్తాను వాహబ్ ఖాన్‌ను కర్నూలు సుల్తానుగా ప్రకటించాడు.[1]

1674లో కర్నూలు బీజాపూరు రాజ్యంలో భాగంగా ఉన్నప్పుడు, ఛత్రపతి శివాజీ దక్షిణాదిపై దండయాత్రకు వెళుతూ, నివృత్తి సంగం వద్ద కృష్ణానదిని దాటి, ఈ ప్రాంతంపై దాడిచేసి కర్నూలు దేశముఖి అయిన ఆనందరావు నుండి మూడు లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఆ తర్వాత సైన్యాన్ని అనంతపురం వైపు పంపి, తను శ్రీశైలం దర్శించుకున్నాడు.[2] మొగల్ చక్రవర్తి షాజహాన్ సైన్యాలు దండెత్తి వచ్చి బీజాపూర్ రాజ్యభాగాలను కొన్నింటిని ఆక్రమించుకున్నాయి. ఆ క్రమంలోనే 1687లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండతోపాటుగా దక్షిణాన ఉన్న రాజ్యాలు మరికొన్ని గెలిచారు. ఆ సమయంలో ఔరంగజేబు సేనాని గయాజుద్దీన్ కర్నూలును గెలిచారు. ఆ సమయంలో ఈ మండలాన్ని తన సేనానియైన దావూద్ ఖాన్‌ పన్నీకి జాగీరుగా ఇచ్చారు.

నవాబుల రాజరికం

మార్చు

ఔరంగజేబు చక్రవర్తి ద్వారా ఈ ప్రాంతాన్ని జాగీరుగా పొందిన దావూద్‌ఖాన్ బహదూర్ తర్వాత 1733లో జాగీర్దారైన హిమాయత్‌ ఖాన్ నవాబుగా గుర్తింపు పొంది కర్నూలు నవాబుల రాజరికానికి మూలబీజం వేశారు. కర్ణాటక నవాబుల వారసత్వ వివాదంలో హిమాయత్‌ఖాన్ ఇంగ్లీష్ వారికీ, ఫ్రెంచి వారికీ కాకుండా అటూఇటూ రెండువైపులా ఒక్కోమారు ఒక్కొక్కరి పక్షాన చేరుతూండడంతో తుదకు ఫ్రెంచివారికి ప్రత్యక్షశత్రువైనాడు. దాంతో సలాబత్‌జంగ్, ఫ్రెంచి సేనాని బుస్సీ 1750 మార్చిలో కర్నూలును పట్టుకున్నారు. 1752 నాటికి ఈ ముట్టడి ఫలితంగా హిమాయత్‌ఖాన్ తమ్ముడు మునవర్‌ఖాన్ నవాబు అయ్యారు.[3]

మైసూర్ రాజ్య సామంతులుగా

మార్చు

మునవర్‌ఖాన్ పాలనాకాలంలోనే 1755లో మైసూరు పాలకుడు హైదర్ అలీ కర్నూలు రాజ్యంపై దాడిచేసి కప్పం తీసుకున్నారు. మునవర్‌ఖాన్ మరణానంతరం 1792లో అతని మూడవ కుమారుడు అలూఫ్‌ఖాన్ నవాబు అయ్యారు. 1799లో హైదర్ అలీ కుమారుడు టిప్పుసుల్తాన్ ప్రఖ్యాత కర్ణాటక యుద్ధాలలో భాగంగా బ్రిటీష్ సైన్యానికి ఓడిపోయారు.[3]

నిజాం సామంతులుగా

మార్చు
 
జనరల్ కారన్ వాలీస్, టిప్పుసుల్తాన్ మధ్య శ్రీరంగపట్నం ఒప్పందానికి సంబంధించిన పెయింటింగ్, రాబర్ట్ హోం వేసిన చిత్రం, సా.శ.1793 (దీని కారణంగానే కర్నూలు నిజాం పాలుకు వచ్చింది.

మైసూరు రాజ్యాన్ని బ్రిటీష్ పక్షం గెలవడంతో ఆ రాజ్యపు సామంతులైన కర్నూలు నవాబులు ఆ యుద్ధంలో పాల్గొన్న ఈస్టిండియా కంపెనీ, నిజాం నవాబుల వాటాల్లో భాగంగా నిజాం నవాబు వాటా క్రిందకు వచ్చింది. ఐతే ఈ మార్పు కొద్ది కాలం పాటు మాత్రమే సాగింది.[3]

దత్తమండలం

మార్చు

నిజాం ఈస్టిండియా కంపెనీ వారికి సైనిక ఖర్చుల క్రింద ఇవ్వవలసిన సొమ్ము కింద బళ్ళారి, కడప జిల్లాలను పూర్తిగానూ, కర్నూలు జిల్లాలోని కంభం, మార్కాపురం, కోయిలకుంట్ల, పత్తికొండ అనే తాలూకాలను సా.శ.1800లో ఇచ్చారు. ఇలా వారికి ధారాదత్తం చేయడంతో దత్తమండలాలుగా పేరువచ్చింది ఈ ప్రాంతానికి (ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని సినీ పరిభాషలో సీడెడ్ అని వ్యవహరిస్తున్నారు). ఈ ప్రాంతాన్ని పరిపాలించేందుకు థామస్ మన్రోని నియమించారు. అయితే జిల్లాలోని పాలెగాళ్ళు కంపెనీ అధికారాలకు లోబడక పోరాటాలు సాగించారు. 1803లో ఆంగ్లేయులకు, మరాఠీ వారికి యుద్ధం జరిగింది. అప్పటి కర్నూలు నవాబు అయిన అలూఫ్ ఖాన్ తన తమ్ముడిని ససైన్యంగా ఆంగ్లేయుల సహాయానికి పంపారు.[3]

వారసత్వ వ్యవహారాలు

మార్చు

అలూఫ్ ఖాన్ తన ఆరుగురు కొడుకుల్లో చివరవాడైన గులాంరసూల్‌ఖాన్ మీద ఉన్న ప్రేమ వల్ల తన బదులుగా అతడిని నవాబును చేసేందుకు అంగీకరించమని గవర్నర్ మింటోను ప్రార్థించారు. నవాబు తమకు చేసిన సహాయాలు, అతని విశ్వాసం పరిగణించి ఆ ప్రకారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో గులాం రసూల్‌ఖాన్ కర్నూలు నవాబు అయ్యారు. మళ్ళీ అతనికి మారుగా కొంతకాలం మునవర్‌ఖాన్, ఆపైన ముజఫర్‌ఖాన్ నవాబులు అయ్యారు. సా.శ.1815లో అలూఫ్‌ఖాన్ మరణించడంతో కంపెనీ ప్రభుత్వాధికారులు ముజఫర్ ఖాన్‌ని తొలగించి మునవర్ ఖాన్‌నే నవాబు చేశారు. 1823 సంవత్సరంలో గులాం రసూల్‌ఖాన్ నవాబు అయ్యారు.[3]

బ్రిటీష్ పాలనపై కుట్ర

మార్చు

గులాంరసూల్ ఖాన్ పరిపాలన కాలంలో ఈస్టిండియా కంపెనీకి ఆఫ్ఘనిస్తాన్ చక్రవర్తికి యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ సుల్తాను విజయం సాధిస్తారని, అలా బలహీనపడివున్న సమయంలోనే ఉపఖండంలో కూడా ఈస్టిండియా కంపెనీపై తిరుగుబాటు చేసి పోరాడితే కంపెనీ పాలన అంతరించి తాము స్వతంత్ర పాలకులమవుతామని కొందరు ముస్లిం పరిపాలకులు భావించారు. వారిలో నిజాం తమ్ముడు, కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ కూడా ఉన్నారు. పైగా దేశంలో చాలా ప్రాంతాల్లో విస్తరించిన ఈ కుట్రకు ప్రధాన కేంద్రంగా కర్నూలును ఎంచుకుని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ రహస్యం చిత్రంగా బయటపడింది. 1839 వేసవి కాలంలో హైదరాబాదు నగరంలో ఒక బీద ముస్లిం స్త్రీ మరణించడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో ఒక వ్యక్తికి తానొక రహస్యం చెప్పదలిచాననీ, తనకొక పనిచేసిపెట్టాలనీ కోరింది. ఆ పెద్దమనిషి అందుకంగీకరించగా ఒక రక్షరేకు (తాయెత్తు) చేతికిచ్చి మూసీనదిలో పారవెయ్యమన్నది. దీనిలో ఏదో రహస్యం వుందని అనుమానించి బ్రిటీష్ వారైన పై అధికారులకు తీసుకువెళ్లి ఇచ్చారు. దాన్ని వారు పరిశీలించి నిజాం నవాబు సోదరుడు కర్నూలు నవాబుకు రాసిన ఉత్తరమనీ, రక్షరేకుల్లో ఉన్న మతపరమైన విషయాల ద్వారా భారీ తిరుగుబాటుకు ప్రయత్నాలు పంపుకుంటున్నారని తెలుసుకున్నారు. ఆపైన కర్నూలు నవాబు వద్దకు వెళ్ళి అతని వద్ద ఉండకూడని భారీ ఆయుధాగారం ఉందన్న అనుమానం మీద సోదా చేశారు. అన్ని విధాలుగానూ, ధైర్యంగా నవాబు సహకరించారు. మొదట ఎంత సోదా చేసినా పెద్దసంఖ్యలోని ఆయుధాలేవీ దొరకలేదు. ఇంగ్లీష్ అధికారులు పట్టువదలక సోదా చేస్తే జనానాలోని మైదానం వద్ద కోట గోడల్లో బోలుగా తయారుచేసి లోపల గొప్ప ఆయుధాగారాన్ని సిద్ధం చేసినట్టు బయటపడింది.

పదవీచ్యుతి

మార్చు

నవాబు తలపెట్టిన కుట్ర 1839లో భగ్నమయ్యాకా అతని రాజ్యాన్ని తాము లాక్కుని, రాజకీయ ఖైదీగా తరలించి విచారణ ప్రారంబించారు. రాజకీయఖైదీగా తిరుచునాపల్లి జైలులో ఉండగా ఆయన ఇస్లాం నుంచి క్రైస్తవానికి ఆకర్షితులయ్యారు. అతను క్రమంతప్పకుండా చర్చికి వెళ్తూ క్రైస్తవాభిమాని కావడం సహించలేని ఓ మహమ్మదీయుడు ఫకీరు వేషంలో వచ్చి 1840లో పొడిచి చంపాడు.

బ్రిటీష్ ఇండియాలో విలీనం

మార్చు

1839లో నవాబును పదవీచ్యుతుణ్ణి చేస్తూనే బ్రిటీష్ వారు రాజ్యాన్ని అతని వారసులకు అప్పగించడం, మరో నవాబును నియమించడం వంటివి చేయకుండా తమ రాజ్యంలో కలుపుకున్నారు. ఆ సమయంలోనే అతను తన సర్దార్లకు, జాగీర్దార్లకు, బంధువులకు గతంలో ఇచ్చిన జాగీర్లు రద్దు చేసి తామే తీసుకున్నారు. నవాబు కుటుంబానికి మాత్రం సంవత్సరానికి రెండు లక్షల రూపాయలకు పైగా పింఛను ఏర్పాటుచేశారు. పింఛనుదార్లు మరణించాకా వారి వారసులకు హక్కు బదలాయించకుండా రద్దుచేశారు.

నవాబు పాలించిన ప్రాంతానికి ఒక బ్రిటీషర్‌ని ఏజెంటు పేరిట నియమించి భూమిని రైత్వారీ పద్ధతుల్లో ఏర్పాటుచేశారు. 1858లో ఈస్టిండియా కంపెనీ వారి చేతుల్లో ఉన్న భారతదేశంతోపాటుగా కర్నూలు ప్రాంతం కూడా ప్రత్యక్షంగా బ్రిటీష్ కిరీటం పాలన కిందకు వచ్చింది. ఆ క్రమంలోనే 1858లో కర్నూలు నవాబు పరిపాలన భూమికి తక్కిన నాలుగు తాలూకాలు కలిపి దాదాపుగా ప్రస్తుతం ఉన్న కర్నూలు జిల్లాను కలెక్టర్ పాలన కింద నిర్మించారు.

నవాబుల జాబితా

మార్చు

కర్నూలును పాలించిన పఠాన్ నవాబుల జాబితా[4]

నవాబు పాలనాకాలం
ప్రారంభం అంతం
ఖిజ్ర్ ఖాన్ పన్నీ 1674 1677
దావూద్ ఖాన్ పన్నీ 1690 ?
ఇబ్రహీం ఖాన్ పన్నీ ? 1724
అలీఫ్ ఖాన్ I 1724 1733
హిమాయత్ బహదూర్ ఖాన్ 1733 1751
మునావర్ ఖాన్ 1751 1792
అలీఫ్ ఖాన్ II 1792 1815
ముజఫ్ఫర్ ఖాన్ 1815 1816
మునావర్ ఖాన్ 1816 1823
ఘులాం రసూల్ ఖాన్ 1824 1839

పరిపాలన విధానాలు

మార్చు

ఆఖరి నవాబైన రసూం ఖాన్‌కు ముందున్న నవాబుల్లో కొందరు చాలా న్యాయంగా, శాంతినెలకొనేలా పరిపాలించారు. దేశం సుభిక్షంగా ఉండేది. మతపక్షపాతాన్ని చూపకుండా ఈ ప్రాంతంలో విస్తరించిన హిందూపుణ్యక్షేత్రాలకు కూడా ఇనాములిచ్చి పోషించారు.[3] అయితే ధన విషయంగా మాత్రం వీరు ప్రజలకు చాలా ఇక్కట్లు కలిగించేవారు. కొద్దికాలం పాటు అయితే ఏకంగా గ్రామాధికారులే తమ గ్రామాల్లో పన్నులు నిర్ధారించి తీసుకునే స్థితికి పరిపాలన దిగజారిపోయింది.

పుణ్యక్షేత్రాలు

మార్చు

కర్నూలు నవాబుల్లో చివరి వాడైన గులాం రసూల్ ఖాన్ మాత్రం ప్రజాకంటకమైన పరిపాలన చేశారు. ఇతని కాలంలోనే కాశీయాత్రలో భాగంగా రసూల్ ఖాన్ నవాబు కింద ఉన్న గ్రామాలు, పట్టణాలు, పుణ్యక్షేత్రాల్లో విడిసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అతని పరిపాలన గురించి తన కాశీయాత్రచరిత్రలో భాగంగా సవివరంగా వ్రాసుకున్నారు.
రసూల్ ఖాన్ కాలంలో తన పరిపాలనలో ఉన్న అహోబిలం, శ్రీశైలం వంటి హిందూ పుణ్యక్షేత్రాల నుంచి భారీగా డబ్బు రాబట్టుకుని కనీస సౌకర్యాల కల్పనలో కూడా శ్రద్ధ వహించేవారు కాదు. శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.3 ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది. అహోబిలంలో ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. వీటన్నిటికీ పరాకాష్ఠగా శ్రీశైల మల్లికార్జునుడికి, భ్రమరాంభాదేవికీ ఎవరైనా ఆభరణాలు, వస్త్రాలు సమర్పిస్తే వాటి ఖరీదుకు తగ్గ హాశ్శీలు తీసుకోవడమే కాక కొన్ని రోజులు గడిచాకా వాటిని తాను అపహరిస్తున్నాడన్న విషయం వ్రాసుకున్నారు.[5]

గ్రామపరిపాలన

మార్చు

గ్రామ పరిపాలన గురించి వ్రాస్తూ తిరుపతి మొదలు ఆ యూరి వరకు (హైదరాబాదు రాజ్య సరిహద్దుయైన సంగమేశ్వరం) ప్రతి గ్రామమునకున్ను ఒక రెడ్డిన్నీ, ఒక కరణమున్ను ఉన్నారు. ఆ కరణాలు కొందరు నందవరీకులు, కొందరు ప్రథమ శాఖలు, కొందరు నియోగులు. ఈ రీతిగా బ్రాహ్మణులు ఆ యుద్యోగమును చూచుచున్నారు. కట్టుబడి బంట్రాతులని జీతానికి బదులుగా భూమిని అనుభవంపుచు కావలి కాచుకొని గ్రామాదుల సకల పని పాటలున్ను చూచుచున్నారు. పరువు కలిగిన ముసాఫరులకు కావలసిన సరంజామా సహాయసంపత్తు ఆ రెడ్డి కరణాలగుండా కావలసినది. ఆ యుద్యోగస్థుల నిద్దరినిన్ని నయభయములచేత స్వాధీనపరచుకొంటేగాని మార్గవశముగా వచ్చే పరువుగల వారికి పనులు సాగవు. పరువు గలిగిన ముసాఫర్లు అధికారపు చిన్నెకొంత వహించితేనే బాగు. నిండా సాత్వికగుణము పనికిరాదు. మార్గము చూపించడమునకున్ను, దిగిన తావున కావలసిన సామానులు తెప్పించి యివ్వడమునకున్ను రెడ్డి కరణాల యొక్క ఉత్తరువు ప్రకారము ఆ కట్టుబడి బంట్రౌతులు పనికివచ్చుచున్నారు. అన్నారు. అలాగే ‘‘తాలూకా నాలుగు మేటీలుగా పంచి ఒక్కొక్క మేటీకి ఒక్కొక్క అమలుదారుని ఏర్పరిచాడు. ఈ అములుదారులందరిపైన అక్బరునవీసు అనే అధికారిని నియమించాడు. నవుకర్లకు జీతానికి జాగీరు లిచ్చాడు. కుంఫినీవారికి సాలుకు లక్షరూపాయిలు కప్పం కడతాడు. అతని రాజ్యము బళ్ళారి జిల్లా కలెక్టరు ఆజ్ఞకు లోబడినది. కలెక్టరు తరఫున ఒక వకీలు కందనూరులో కాపుర మున్నాడు. నవాబు కాజీకోర్టు పెట్టి న్యాయవిచారణ చేస్తాడు. కుంఫినీ కోర్టులకు నిమిత్తంలేదు. నవుకర్లకు జీతాలు స్వల్పము-సరిగా ఇవ్వడం లేదని వాడుక’’ అని వ్రాశారు.[5]

ఆర్థిక వ్యవహారాలు

మార్చు

కర్నూలు నవాబుల కాలంలో దక్షిణ భారతదేశ రాజకీయాలు కల్లోలితమై ఉండేవి. మొదట మరాఠాలు, ఆపై ఆంగ్లేయులు, ఫ్రెంచివారు, హైదరాలీ తదితరులు తమ అధికార పరిధి విస్తరించేందుకు వివిధ యుద్ధాలను చేశారు. ఈ సమయంలో కర్నూలు నవాబులు నిజాంకు, ఈస్టిండియా కంపెనీకి కట్టవలసిన పేష్కషు కాకుండా యుద్ధ సమయాల్లో ధనాన్నీ, సైన్యాన్నీ అందించి తోడ్పడవలసివచ్చింది. శివాజీ సైన్యాలు, హైదరాలీ సైన్యాలు వచ్చిపడి బాధిస్తూండడంతో అమితమైన ధనవ్యయం జరుగుతూండేది. అంతటి ధనవ్యవయాన్ని సమర్థించుకునేందుకు నవాబులు ప్రజలను పీడించి రకరకాల పద్ధతుల్లో సొమ్ము రాబట్టుకునేవారు. పన్నుల వసూలులో క్రమపద్ధతి లోపించింది. నవాబులు నిర్దేశించిన పన్నులు గ్రామాధికారులు వసూలుచేసి యిచ్చే స్థితి నుంచి గ్రామాధికారులే తమకు తోచిన పన్నులు వేసి వసూలుచేయడం వరకూ వచ్చింది. గ్రామాధికారులకు గ్రామాలను గుత్తకు యిచ్చి ఇంతకు తక్కువ వసూలుచేయరాదన్న నియమాలు విధించడంతో వారు ఇచ్ఛకు వచ్చిన పన్నులు వేసి, పీడించడం ప్రారంభమైంది. శిస్తువసూలుకు గ్రామస్థులు కాక గ్రామాధికారులే జవాబుదారులైనందువల్ల వారు నిరంకశులై అక్రమాలు చేయడం మొదలుపెట్టారు. పంటలు పండకపోయినా గ్రామాధికారులు పూర్తిస్థాయిలో పన్నువసూళ్ళు చేసుకునేవారు. పంటలు బాగా పండితే నవాబు సైన్యాలు వచ్చిపడి ఆ ధాన్యాన్ని బలవంతంగా ఎత్తుకుపోయేవి. పండితే సైన్యం పెట్టే బాధలు పడలేక నంద్యాల ప్రాంతంలో రైతులు ఏకంగా మూడేళ్ళు వ్యవసాయమే మానుకున్నారంటే పరిస్థితి ఊహించవచ్చు.[3]

మూలాలు

మార్చు
  1. "Wahab Khan tomb in Kurnool to get a facelift". The Hindu. No. July 2, 2013. Retrieved 4 December 2014.
  2. Narahari, Gopalakristnamah Chetty (January 1, 1886). A manual of the Kurnool district in the presidency of Madras. p. 29.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం) (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140.
  4. Michell, George; Zebrowski, Mark (10 June 1999). Architecture and Art of the Deccan Sultanates (in ఇంగ్లీష్). Cambridge University Press. ISBN 978-0-521-56321-5.
  5. 5.0 5.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు.