కొపనాతి కృష్ణమ్మ

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భక్తురాలు

అంతర్వేది, శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం నిర్మింపజేసింది. కొపనాతి కృష్ణమ్మ జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా, అల్లవరం మండలం బెండమూర్లంక శివారు ఓడలరేవు లో జన్మించారు. అగ్నికులక్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు.

పూర్వీకులు

మార్చు

ఓడల నిర్మాణంలో, ఓడల వ్యాపారంలో పేరుపొంది సార్థకనామం పొందింది ఓడలరేవు గ్రామం. అగ్నికులక్షత్రియులు సాహసంతో తెరచాప ఓడలను సముద్రములో నడుపుచూ విదేశములతో వ్యాపారము సాగించుచున్న రోజులవి. అట్టి వంశీయులలో అగ్రగణ్యులు కొపనాతివారు. వారియందు సత్యరాజు, మంగమాంబ దంపతులు సత్యవాక్య పరిపాలకులై కీర్తివహించిరి. ఆ పుణ్యదంపతులకు రామనాఖ్యుడు సుపుత్రుడై జన్మించి భక్తవర్యుడని పెంపువహించెను. ఆయనకు అలివేలుమంగమ్మ అర్థాంగియై అమరినది. వీరికి సత్యరాజు, ఆదినారాయణ, శేషయ్య అను పుత్రత్రయము కలిగి పూజ్యులై కీర్తి వహించిరి. ఇందు మద్యముడైన ఆదినారాయణగ యుక్తవయస్కులు కాగానే పొన్నమండ నరసింహస్వామి వారి పుత్రికయైన మహాలక్ష్మిని పెళ్ళియాడిరి. ఆదినారాయణ అనేక ధర్మకార్యములు ఆచరించిన మహామహులు. వీరికి ఏడుగురు కుమారులు కలిగిరి. వారు వరుసగా సుబ్బారాయుడు, చినసుబ్బారాయుడు, రామస్వామి, నారాయణస్వామి, కృష్ణమ్మ, వేంకటరెడ్డి, రంగనాయకులు.

అంతర్వేది ఆలయ నిర్మాణం

మార్చు

దూరప్రదేశమునుండి అంతర్వేది క్షేత్రమును దర్శింపవచ్చిన బ్రాహ్మణోత్తముడు ఒకరు స్వామివారిని దర్శించి జీర్ణాలయమును గాంచి, అనుభవజ్ఞులద్వారా ఆ వృత్తాంతమును తెలిసికొని ఈ ప్రదేశము గొప్ప దివ్యక్షేత్రముగా వెలయగలదని భావించి స్వామివారికి ఆలయమంటపాదులు ఏర్పరచగల సమర్థుడు, భక్తవర్యుడు, త్యాగపురుషుడు ఎవరాయని గ్రామగ్రామాలు తిరుగుచుండెను. ఎవ్వరును బ్రాహ్మణుని మాటలు వినిపించుకొనలేదు.

వైనతేయసాగరసంగమ పుణ్యస్థలము, నౌకావ్యాపారానికి కేంద్రమై ఓడలరేవుగా సార్థకనామమునందిన గ్రామసీమ. బంగారులంక (బెండమూర్లంక) దీని సమీపగ్రామం. అగ్నికులక్షత్రియులు ఓడల వ్యాపారము చేయుచు లక్ష్మీసంపన్నులై ఉన్న రోజులవి. ఇందు కొపనాతివారు గొప్ప ఉదారులైన భక్తవర్యులని పేరుపొందిరి.బ్రాహ్మణోత్తముడు ఓడలరేవు గ్రామం విచ్చేసి భక్తవర్యులైన కొపనాతి ఆదినారాయణగారిని దర్శించుకొనిరి. బ్రాహ్మణుని బహువిధముల సత్కరించి ఆదినారాయణగారు విషయమును తెలిసికొని నిస్పృహ చెంది అంతటి ఆలయనిర్మాణము తమవలన కాదని సమాధానము చెప్పి పంపివేసిరి.నాటిరాత్రి ఆదినారాయణగారికి నల్లనిరూపువాడు, నామాలు ధరించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కలలో కనిపించి "భక్తా! నీవు అసమర్థుడవు కావు. ఆలయనిర్మాణమునకు పూనుకొనుము. అశ్రద్ధ చూపుచున్నావేమి? లెమ్ము" అని వీపుపై చేతితో ఒక్క చరుపు చరిచి అదృశ్యులైరి. ఆదినారాయణగారు తుళ్ళిపడి లేచి చూచుకొనగా తమ వీపుపై ఐదువేళ్ళు ఆనవాళ్ళు కనిపించగా ఆశ్చర్యపడి అపచారమును మన్నించమని కోరుకొని ఆలయనిర్మాణ కార్యక్రమము చేపట్టుదునని సంకల్పించుకొనిరి.

భగవానుని ఆదేశానుసారము అంతర్వేది వెళ్ళి ఆదినారాయణ ఒక సుముహూర్తమున ఆలయ శంకుస్థాపన గావించిరి. “ఇసుక తప్ప ఏ రాయియు దొరకని ఈ దూరసముద్ర ప్రాంతమునకు మహా ఆలయ నిర్మాణమునకు కావలసిన శిలాస్తంభములును, రాళ్లనుగొనిరాబడుట గొప్పవి.పరమభక్తులగు కొపనాతి ఆదినారాయణ శ్రీలక్ష్మీనృసింహ స్వామివారి ఆలయ బేడామంటపాదులను నిర్మించుట మొదలుపెట్టి నల్లరాళ్ళు తెప్పించి దేవాలయము చుట్టు, కోవెల, బేడామంటపం పని ప్రారంభించి కొంత పనియైన పిమ్మట 'కాలోయందురతిక్రమః' అన్నట్లు కాలమాసన్నమైనందున తమ కుమారులకు ఆ దేవాలయ నిర్మాణమును పూర్తిచేయ నియోగించి తాము విష్ణుసాయుజ్యము పొందెను.

కొపనాతి కృష్ణమ్మ

మార్చు

ఆదినారాయణ, మహాలక్ష్మీ దంపతుల పుణ్యఫలంబుగా అవతరించిన కృష్ణమ్మగారు భక్తవరేణుల్యైయుండిరి. ఈయన చిన్ననాటినుండే భక్తిభావమును గ్రహించెను. అతిథి అభ్యాగతులను పూజించెడివారు. బ్రహ్మజ్ఞానుల బోధనలు విని అందలి అంతరార్థమును గ్రహించెడివారు. చిన్నతనమున ఒకరోజు స్నేహితులతో కలిసి స్వగ్రామమగు ఓడలరేవు లోని సముద్రతీరమునకు వెడలి రేవుకు చేరుచున్న ఓడలను గమనించుచుండిరి. ఆ సమయమున ఒక క్రొత్తవ్యక్తి కృష్ణమ్మగారిని పిలువగా ఆయన ఆ వ్యక్తిని అనుసరించెను. చెట్లమధ్యకు తీసికొని వెళ్ళి ఆ వ్యక్తి జీవితలక్ష్యమును బోధించి తారకనామమును ఉపదేశించి అదృశ్యుడయ్యెను. కృష్ణమ్మగారిని వెదుకుకొనుచు వచ్చిన స్నేహితులు కృష్ణమ్మగారు ఏమైనారా అని దిగులుచెందిరి. ఉపదేశము పొందిన కృష్ణమ్మగారు కొంతసేపటికి ఇల్లు చేరుకొనిరి. మరునాటినుండి కృష్ణమ్మగారు స్నేహితులను జీవితపరమార్థములను గూర్చి బోధించుచుండిరి. కృష్ణమ్మగారి కుటుంబసభ్యులు ఐకమత్యముతో అలరారుచుండిరి. వీరి అగ్రజులు ఓడలపై సబురు చేయుచుండిరి. గొప్ప సిరిసంపదలతో తులతూగుచుండిరి. అవసానకాలమున ఆదినారాయణగారు ఆదేశించిన ప్రకారము అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి ఆలయ నిర్మాణము కొనసాగించుటకు పూనుకొంటిరి. వీరి సోదరులైన రంగనాయకులు గారు వీరికి చేదోడువాదోడుగా ఉండి ఆలయనిర్మాణమునకు అధిక ప్రోత్సాహమొసంగిరి.

ఒకప్పుడు కోస్తారేవులకు సబురులు వెళ్ళిన ఓడలు ఎంతకాలమునకు తిరిగిరావయ్యె. వాటి వర్తమానము ఏమి తెలియదయ్యెను. ఓడలు రేవుకు చేరగలను ఆశ సన్నగిల్లెను. ఈ సమయంలో కృష్ణమ్మగారు ఒకనాటి రాత్రి ఇట్లు ధ్యానింపజొచ్చిరి. “తండ్రీ! పరాత్పరా! నీ దేవళము తలపెట్టి యింతకాలమైనది. ఇంకను పూర్తిచేయలేకుంటిని. ఈయెడ ఇల్లు జేరిన వెంటనే ఎటులనో నీ కార్యము కొనసాగింప నిశ్చయించుకొంటినే. నా మనసు నిరాశనొందుచున్నది. ఏమి చేయుదును? ఇంతవరకు ఓడ దరిచేరలేదు. మరియొక చోట ఉన్నట్లు వార్తయైనను లేదు. ఇంకేమియాశ, దానికిని కాలమాసన్నమైనట్లున్నది. ఏమి చేయుదును? నా ప్రాణతుల్యమగు ఈ మహత్కార్యము కొనసాగించుట ఎటుల? నీవే నీ కార్యమును కొనసాగింపనిది నీ పాదరజముకైన సాటిరాని ఈ దీనుడేమి చేయగలడు? ఇంకను జూచెదగాక!” యని ధ్యానించి ధ్యానించి బడలికచెంది నిదురించెను.

ఆరాత్రి ఓడలు రేవుకు చేరినట్లును కప్తాను ధనపుసంచులతోవచ్చి తనను లేపినట్లును అనుభవమయ్యెను. కృష్ణమ్మగారు లేచి బైటకు వచ్చి నిలబడియుండిరి. నిజముగా కప్తాను ఓడలు రేవుకు చేరిన సమాచారము అందజేసి, ఆనందసాగరమున నోలలాడించెను. “నాయనా! మీ రాకను భగవానుడు ముందుగానే నా కెరింగించెను. తెచ్చిన ధనము నెల్ల గదిలో వేసి తాళము వేయుము. ఆ ధనమంతా స్వామివారికి ధారపోసితిని. అందు కాసైనను ముట్టవీలులేదు" అని కప్తానును ఆదేశించి కృష్ణమ్మగారు ఆ విధముగనే ధనమును వినియోగించిరి. ఆగిపోయిన ఆలయనిర్మాణమును పునఃప్రారంభించి ఓడలరేవునుండి కావుళ్ళతో ధనమును రప్పించి కార్యక్రమములను కొనసాగించిరి.

ఆలయ నిర్మాణం

మార్చు

కృష్ణమ్మగారు కొంత ద్రవ్యము చేబూని కొన్ని వందల పడవలను తీసికొని రాజమండ్రి చేరి అందున్న రాళ్ళన్నియు పడవలపై ఎగుమతి చేయించి అంతర్వేది రేవునకు చేర్చమని చెప్పి ఇంటికి మరలివచ్చెను. ఎగుమతి పూర్తయిన తరువాత ధవళేశ్వరము దొరవారు ఆ పడవలను ఆపుచేయించి పడవ నడుపు పనివారను చెల్లాచెదురుగా పారద్రోలించెను. అంతనారాత్రి నరసింహదేవుడు పట్టివర్థనములు దరించి వెండిబెత్తము చేబూని దొరవారి స్వప్నమునగాన్పించి బెత్తముచే వీపుపై తట్టి లేపి నా పడవలను ఏల ఆపుజేసియుంటివి? నేనెవ్వరననుకొంటివి? అని తన వృత్తాంతమునంతయు అతనికి చెప్పి అదృశ్యుడయ్యెను. తక్షణమే పడవలన్నియు నరసింహదేవుని మహత్తుచే తెల్లవారు సరికి అంతర్వేది రేవునకు జేరియుండెను. ఈ విషయము దొరవారు తెలిసికొని నరసింహదేవునకు నమస్కరించి అపరాధమును క్షమింపుమని ప్రార్థించి ఆ దేవదేవుని మహత్తునంతయు సర్వజనులకు విశదమొనర్చెను.
ఆలయనిర్మాణము నిమిత్తము రంగనాయకులుగారు అంతర్వేదిలో ఉండి పనులను చక్కబెట్టుచుండిరి. కృష్ణమ్మగారు ఎప్పటికప్పుడు ఓడలరేవునుండి పల్లకీపై అంతర్వేది వచ్చి పనులను పురమాయించి తిరిగి స్వగ్రామంనకు చేరుచుండిరి. అప్పటి దినభత్యము కూలీలకు రెండణాలు (12పైసలు) ఇచ్చుచుండిరి. దేవాలయ జమాఖర్చులను వ్రాయుచున్న కరణమును కనుగొని కృష్ణమ్మగారిట్లు మందలించిరి. “నీవు లెక్కలుకట్టిన మనము పనులు చేయజాలము. ఈ సంపాదన నాదని నీవు భావించుచుంటివా! ఇదియంతయు దేవుడే సంపాదించుకొనినాడు. దేవునిసొమ్ముతో చేయు దేవకార్యమునకు జమాఖర్చులా? ఇప్పటినుండి ఆపుచేయుము” అని ఆదేశించిరి.
పేరుపొందిన శిల్పులను దూరప్రదేశములనుండి రప్పించి ఓడలపై శిలలను తెప్పించి ఉత్సాహముతో పనులను సాగించుచుండెను. ఓడలరేవునుండి కావుళ్ళతో ధనమును మోయించుకొని వచ్చి లెక్కలేకుండా వెచ్చించుచుండెను.
పని ముమ్మరముగా సాగుచున్న సమయమున ఒక పనివానిపై రాయి పడి మరణించెను. ఈ సంగతి కృష్ణమ్మగారికి చెప్పగా ఆయన ఆ ప్రదేశానికి వచ్చి పడియున్న పనివానిని పరిశీలించి పనిచేయుచున్న వారితో ఇట్లనిరి, “మీరందరు పనిని కట్టిబెట్టుడు స్వామి కార్యము చేయుచున్న ఈ భక్తుడు బ్రతికినగాని నిర్మాణము చేయవలదు” అని పనిఆపుజేయించి స్థిరసంకల్పముతో అచ్చటనే కూర్చొని ఉపవాసముతో దైవధ్యానపరాయణులై ప్రాయోపవేశమునకు గడింగిరి. భగవానుని లీలలు అత్యద్భుతముకదా! నిద్రనుండి మేల్కొంచినవానివలె ఆ పనివాడు లేచికూర్చుండెను. అచ్చటివారు ఈ అద్భుతమునకు మిక్కిలి సంతసించిరి. కాని కృష్ణమ్మగారు ఇది శ్రీలక్ష్మీనృసింహస్వామివారి మాహాత్మ్యమేకాని తమ ప్రభావము కాదని ప్రేక్షకులను హెచ్చరించిరి.

గర్భాలయము దానిజేరి బలమైన మంటపములు కుడిప్రకక్కను రామాలయము, ఎడమవైపున కల్యాణమండపము, దీనికి చుట్టును నాల్గువైపుల మంటపములు, గోపురములు, చుట్టును రాజలక్ష్మీ తాయారు, వేంకటేశ్వరస్వామి, భూదేవితాయారు, శ్రీరంగనాయక స్వామి, సంతానగోపాలస్వామి, కేశవస్వామి, పన్నిద్దరాళ్యావరులు, ఆంజనేయస్వామి, శ్రీరాములవారు, గోపాలస్వామి వార్ల పది ఆలయములును (వీరిని సన్నిధి దేవతలందురు). మంటపములమీద విమానములు కొన్ని గుండ్రముగాను, కొన్ని కూచిగాను చెక్కబడినవి. ఇట్టి అత్యద్భుత నిర్మాణములను కావించి యే స్థానమున ఏ నిర్మాణము కావలయునో అట్టి కట్టడములను నిర్మించి తీర్చిదిద్దిరి.
దైవకార్యకలాపములు సాగించుచుండగా కృష్ణమ్మగారికి అనేక అవాంతరములు కలిగెను. అన్ని కార్యములలోను సహకారిగానున్న సోదరులు రంగనాథుడు స్వర్గస్థుడయ్యెను. గోరుచుట్టపై రోకటిపోటు అన్నట్లు కృష్ణమ్మగారి సతీమణి కూడా దివంగతురాలయ్యెను. వాటినన్నిటిని ఓర్పుతో భరించి, స్వామివారు తమను పరీక్షించుచున్నట్లు భావించి ఆలయ నిర్మాణమును కొనసాగించుచుండిరి.

అంతర్వేది యాత్రకై వచ్చిన బ్రాహ్మణోత్తముడు ఆలయములను పరిశీలించి నిర్మాణములో ఏదో ఒక వాస్తు లోపముగలదనియు దానిని తీర్చుటకు మంగళగిరి పండితుడు తప్ప ఎవ్వరును పనిచేయరనియు కృష్ణమ్మగారితో చెప్పి వెడలిపోయెను. కృష్ణమ్మగారు వెంటనే అంతర్వేదినుండి బయలుదేరి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మంగళగిరి చేరెను. కాని ఆస్థాప్రవేశము వీలుకాలేదు. ప్రహరీగోడ ప్రక్కన అంగవస్త్రముతో అహోరాత్రములు పడియుండవలసివచ్చెను. నాటిరాత్రి మంగళగిరి రాజావారి కలలో స్వామివారు కనిపించి ఒక్క దెబ్బకొట్టి తన భక్తునకు అపరాధం జరుగుచున్నదని హెచ్చరించెను. వెంటనే ఆందోళన పడి లేచి చూడగా రాజావారి వీపుపై దద్దురులు చూచుకొని ఆశ్చర్యపడి పరివారమును పిలిచి విషయమేమని యడుగగా, ద్వారపాలకులు "ఎవరో తమ దర్శనమునకు వచ్చి గోడప్రక్కనే వేచియున్నార”ని తెలియచెప్పిరి. పల్లకి పంపించి కృష్ణమ్మగారిని లోనికి రప్పించి ఉచితాసనము ఇచ్చి విషయమునడిగిరి. రాజావారు తమ ఆస్థాన పండితుని దూరప్రదేశమైన అంతర్వేది పంపుటకిష్టపడరైరి. కృష్ణమ్మగారు ఆ పండితునకు సంబంధించిన సమస్త రక్షణ పోషణాదులకు తాము స్వయముగా బాధ్యత వహింతుమని లిఖితపూర్వకముగా వ్రాసియిచ్చి ఒప్పించి పండితుని తీసికొనివచ్చిరి. మంగళగిరి పండితుడు ఆలయనిర్మాణమును పరిశీలించి స్తంభఖాతశూల వచ్చినదనియు, దానిని శాంతిజేయుటకు ధ్వజస్తంభము ప్రక్క మరియొక ద్వజస్తంభమునెత్తించి సరిజేసెను. అంతటితో ఆలయ కార్యక్రమములు పూర్తి అయ్యెను. భార్య లేనివారు ఆలయ ప్రతిష్ఠ కావించుటకు అనర్హులు కావున కృష్ణమ్మగారు వివాహము చేసికొని వైవాహిక కంకణమును, ఆలయ ప్రతిష్ఠ సంప్రోక్షణాదులు నిర్వహించుటకు సంప్రోక్షణ కంకణమును, ఉదారశీలురై దానకంకణమును వహించి- త్రికంకణధారులై ఒక సుముహూర్తమున శ్రీ లక్ష్మీనృసింహ స్వాములవారి ప్రతిష్ఠ గావించిరి. వందలకొలది యాత్రికులు, భక్తులు, యాచకులు, భూసురులు, విచ్చేసి ఈ వేడుకలు కళ్ళారచూచి తరించిరి. కృష్ణమ్మగారు దోసిళ్ళకొలది ధనమును బ్రాహ్మణులకు, పేదలకు, యాచకులకు పంచిపెట్టి కలియుగ దానకర్ణుడని పేరుపొందిరి. అన్నసంతర్పణలు గావించి అన్ని జీవులకు తృప్తిని కలిగించి కీర్తి వహించిరి.

మూలాలు

మార్చు

(ఇతి " పల్లవరత్న"శ్రీ రేకాడి సముద్రరావు విరచిత "అగ్నికులక్షత్రియులు పుట్టుపూర్వోత్తరాలు" గ్రంథాంతర్భాగస్యః).