గాజుల కిష్టయ్య 1975, అక్టోబర్ 9న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా ద్వారా జరీనా వహాబ్ వెండితెరకు పరిచయమయ్యింది.

గాజుల కిష్టయ్య
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
తారాగణం ఘట్టమనేని కృష్ణ
జరీనా వహాబ్
నిర్మాణ సంస్థ నరేంద్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • నిర్మాతలు: ఆదుర్తి భాస్కర్, ఎం.ఎస్.ప్రసాద్
  • దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
  • కథ, మాటలు: సత్యానంద్
  • పాటలు: ఆత్రేయ
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • గాయనీగాయకులు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమేష్
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.రామకృష్ణ
  • కూర్పు: ఆదుర్తి హరినాథ్
  • కళ: తోట గోపాలకృష్ణ
  • నృత్యం: శ్రీను
  • స్టంట్: ఎం.ఎస్.దాస్

పాటలు

మార్చు
  1. ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు - ఎస్.పి.బాలు, పి.సుశీల
  2. నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా - ఎస్.పి. బాలు
  3. రారయ్యా పోయినవాళ్ళు ఎవరయ్యా ఉండేవాళ్ళు - పి.సుశీల
  4. రేపు ఎంతో తీయనిది నేటికన్న కమ్మనిది - పి.సుశీల, ఎస్.పి. బాలు
  5. వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు ప్రేమించిన హృదయాలను - ఎస్.పి.బాలు
  6. వేసుకో ఈ గాజులు చూసుకో నీ సొగసులు - ఎస్.పి.బాలు, రమేష్

కిష్టయ్య తమ్ముడు రాజిగాడితో కలిసి గాజుల వ్యాపారం చేస్తుంటాడు. వాళ్ళ అమ్మ రంగమ్మ జబ్బు మనిషి. పట్నంలో డాక్టరుకు చూపించి తీసుకువస్తున్న తల్లిని రైల్వేస్టేషన్‌లో అన్నపూర్ణమ్మ చూసింది. వాళ్ళకు ఉన్న పరిచయంతో ఏదో మాట్లాడుకున్నారు. అన్నపూర్ణమ్మతో బాటు ఆమె మేనకోడలు రాధ కూడా ఉన్నది. వాళ్ళ రైలు ముందు రావడంతో కిష్టయ్య వారి సామాను రైలులో ఎక్కిస్తాడు. రాధకు గాజులు బహుమతిగా ఇస్తాడు. రైలు వెళ్ళిపోయింది. కిష్టయ్య ఇచ్చిన గాజులను చూసి అతడిని తలుచుకుంటూ మురిసిపోతుంది రాధ.

అన్నపూర్ణమ్మకు సంతానం కలగకుండానే భర్త మరణిస్తాడు. భర్త పోయిన తరువాత ఆమె తమ్ముడు నరహరి దగ్గర ఉంటుంది. నరహరే ఆమె ఆస్తిపాస్తుల వ్యవహారాలు చూసుకుంటుంటాడు. నరహరి భార్య లక్ష్మి తన ఒక్కగానొక్క కూతురును అన్నపూర్ణమ్మకు దత్తత ఇచ్చి ఆ ఆస్తికి వారసురాలిగా చూసుకోవాలని, తన సవతి కూతురు రాధను తన దూరపు బంధువు భ్రమరాంబ కొడుకు సుందరానికి ఇచ్చి భ్రమరాంబకు కట్నం క్రింద లభించే మొత్తంలో కమీషన్ కొట్టేయాలని చూస్తుంది. అన్నపూర్ణమ్మకు, రాధకు ఆ సంబంధం ఇష్టం లేదు. రాధ కిష్టయ్యపై మోజు పడి పూలమ్మే చుక్కమ్మ సహాయంతో కిష్టయ్య ఇంటికి వెళ్ళి అతని తల్లిని కలుస్తుంది. రాధ అన్నపూర్ణమ్మ మేనకోడలని తెలుసుకున్న రంగమ్మ ముచ్చట పడుతుంది.

రాధ కిష్టయ్యను ప్రేమిస్తుందని తెలిసిన అన్నపూర్ణమ్మ ఆమె ప్రేమను ప్రోత్సహిస్తుంది. చుట్టపు చూపుగా పట్నానికి వచ్చిన సుందరం రాధనూ, కిష్టయ్యనూ చూశాడు. ఆమె చేస్తున్న పని సిగ్గుచేటు అన్నాడు.ఈ విషయం నరహరికి చెప్పాడు. నరహరి తన బంగ్లాకు కిష్టయ్యను రప్పించి చావు దెబ్బలు కొట్టాడు. అడ్డువచ్చిన అన్నపూర్ణమ్మ ఏదో చెప్పబోయి ఆవేశంతో మాటపడిపోయింది. ఆమెను వైద్యానికి బస్తీకి తీసుకువెళ్ళారు. తన మూలంగా పెద్దమ్మగారికి మాట పడిపోయిందని బాధపడుతున్న కిష్టయ్య ఆవిడను చూద్దామని బస్తీకి వచ్చి ఆవిడను కలుసుకున్నాడు. ఇతని రాకపోకలు కనిపెట్టిన నరహరి, సుందరంలు కుట్రపన్ని కిష్టయ్యను జైలుకు పంపుతారు.

కిష్టయ్య జైల్లో ఉండి, అన్నపూర్ణమ్మకు మాటపడిపోవడంతో ఆమెతో బలవంతంగా వీలునామా రాయించాడు నరహరి. సుందరానికి, రాధకు బలవంతంగా పెళ్లి చేయబోతాడు. కిష్టయ్య ఆ పెళ్ళి ఆపుతాడా? సుందరం చేసిన కుట్రను కిష్టయ్య ఎలా నిరూపిస్తాడు? కిష్టయ్య రాధను పెళ్ళి చేసుకుంటాడా? మొదలైన ప్రశ్నలకు సమాధానం పతాకసన్నివేశంలో లభిస్తుంది.[1]

మూలాలు

మార్చు
  1. గంగాధర్. గాజుల కిష్టయ్య పాటలపుస్తకం. p. 12. Retrieved 21 August 2020.

బయటి లింకులు

మార్చు