ఆదుర్తి సుబ్బారావు

సినీ దర్శకుడు

ఆదుర్తి సుబ్బారావు (డిసెంబరు 16, 1912 - అక్టోబరు 1, 1975) తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత.

ఆదుర్తి సుబ్బారావు
జననంఆదుర్తి సుబ్బారావు
డిసెంబరు 16, 1912
రాజమండ్రి
మరణంఅక్టోబరు 1, 1975
మద్రాసు
ప్రసిద్ధితెలుగు సినిమా దర్శకులు
నిర్మాత
రచయిత
భార్య / భర్తకామేశ్వరీ బాల

జననం - విద్య

మార్చు

1912 సంవత్సరం డిసెంబరు 16రాజమండ్రిలో తాసీల్దారు సత్తెన్న పంతులు ఇంట జన్మించారు.[1] సినిమాల మీద ఆసక్తితో తండ్రిని ఎదిరించి 1943 లో ముంబాయి లోని సెయింట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరి ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్ మొదలైన విభాగాలలో అనుభవం సంపాదించారు. ఆ సమయంలో తనకు డబ్బు అవసరమొస్తే తండ్రికి రాసే ఉత్తరంలో మనియార్డర్ ఫారంతో బాటు ఓ ప్రామిసరీ నోటు కూడా ఉండేది. "బొంబాయిలో కోర్సుకి అయ్యే ఖర్చుకి తర్వాత కాలంలో నీ తమ్ముళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అగత్యం లేకుండా అప్పుగా తీసుకో" అని సత్తెన్న పంతులు గారి సూచన మేరకే ఆదుర్తి గారు అలా పంపేవారట.

సినీరంగ ప్రవేశం

మార్చు

'వనరాణి', 'మంగళ సూత్రం', 'ఒక రోజు రాజ', 'సర్కస్ రాజు' చిత్రాలకు మాటలు, పాటలు రాసారు. ఆనాడు సంచలనం రేపిన నాట్యాచార్యుడు ఉదయ శంకర్ నాట్యం ప్రధానాశంగా తాను తీస్తున్న 'కల్పన' చిత్రానికి సహాయ దర్శకుడిగా ఆదుర్తి గారిని తీసుకున్నారు.ఆ చిత్ర నిర్మాణం కోసం ఆయన బొంబాయి నుండి మద్రాసుకి చేరారు. ఆ సమయంలోనే మచిలీపట్నానికి చెందిన కామేశ్వరీ బాలతో ఆయనకు వివాహం జరిగింది. అతని సోదరుడు ఆదుర్తి నరసింహమూర్తి ప్రచురించిన 'హారతి' పత్రికకు సంపాదకత్వం వహించారు. అది ఎక్కువకాలం నడవలేదు.

కె.ఎస్. ప్రకాశరావు గారు నిర్మించిన ' దీక్ష ' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసి ప్రకాశరావు గారి ప్రశంసలకు పాత్రులయ్యారు. 'సంక్రాంతి', 'కన్న తల్లి' చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు. ప్రకాశరావు గారి 'బాలానందం' చిత్రానికి రెండవ యూనిట్ దర్శకుడుగా పనిచేశారు. ప్రకాష్ స్టూడియోలో పనిచేసిన డి. బి. నారాయణ, ఎస్. భావనారాయణ ప్రోత్సాహంతో వారితో కలిసి సాహిణీ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి 'అమరసందేశ ' అనే చిత్రాన్ని తన దర్శకత్వంలో నిర్మించారు. 1954 లో విడుదలైన ఆ చిత్రమే ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం. ఆ చిత్రంలో ఆయన చూపించిన ప్రతిభ అన్నపూర్ణ పిక్చర్స్ లో ఆయన ప్రవేశానికి నాంది అయింది. ఆ సంస్థకు తొమ్మిది తెలుగు చిత్రాలు, మూడు తమిళ చిత్రాలు రూపొందించారు. తమిళ నిర్మాత సి. సుందరంతో కలిసి బాబూ మూవీస్ సంస్థను స్థాపించి 'మంచి మనసులు', 'మూగమనసులు', 'తేనెమనసులు', 'కన్నె మనసులు' చిత్రాలు నిర్మించారు. 'తేనె మనసులు' తెలుగులో మొదటి సాంఘిక రంగుల చిత్రం. అంతే కాదు అందరూ కొత్త నటీనటులతో తీసిన మొదటి చిత్రమని కూడా చెప్పవచ్చు. సూపర్ స్టార్ కృష్ణకు హీరోగా మొదటి చిత్రం. మొదట ఆరు రీళ్ళు నలుపు తెలుపులో తీసి నచ్చక మళ్ళీ రంగుల్లో తీసారు. ఆ చిత్రం సంచలనం సృష్టించింది.

ఆయన హిందీలో 'మిలన్' (మూగమనసులు), 'డోలీ' (తేనెమనసులు), 'జ్వార్ భలా' (దాగుడు మూతలు), ' మన్ కా మీత్ ' లాంటి సుమారు పది చిత్రాలకు దర్శకత్వం వహించారు. 'దర్పణ్', 'జీత్' (పూలరంగడు) చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

ఆయన అన్నపూర్ణా సంస్థకు నిర్మించిన ' డా.చక్రవర్తి ' చిత్రానికి నంది బహుమతి వచ్చింది. ఆ బహుమతిగా వచ్చిన నగదు పెట్టుబడిగా అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి చక్రవర్తి చిత్ర సంస్థను స్థాపించి ప్రయోజనాత్మక చిత్రాలు 'సుడి గుండాలు', ' మరో ప్రపంచం' నిర్మించారు. అవి ఆర్థికంగా విజయం సాధించాక పోయినా తనకు సంతృప్తినిచ్చిన చిత్రాలుగా ఆయన చెప్పేవారు.

ఆదుర్తి సుబ్బారావు గారు పరిచయం చేసిన రచయితలు - ముళ్ళపూడి వెంకటరమణ (దాగుడు మూతలు), ఎన్. ఆర్. నంది (కన్నె మనసులు), డా. కొర్రపాటి గంగాధర రావు (ఇద్దరు మిత్రులు), మోదుకూరి జాన్సన్ (మరో ప్రపంచం), సత్యానంద్ (మాయదారి మల్లిగాడు)

ఆయన శిష్యరికంలో ఎదిగిన దర్శకులు - శ్రీయుతులు కె. విశ్వనాథ్, వి. మధుసూదన రావు, టి. కృష్ణ (ఖైదీ బాబాయ్ ఫేం), పెండ్యాల నాగాంజనేయులు (బుల్లెమ్మ ఫేం), టి. మాధవరావు ( తాళి బొట్టు ఫేం ), ఫై. చంద్ర శేఖర రెడ్డి, ఎం. మల్లిఖార్జున రావు ( గూఢాచారి 116 ఫేం ), ఎం. నందన కుమార్ ( ఇదేనా న్యాయం ఫేం )

తన ఏకైక పుత్రుడు సాయి భాస్కర్ నిర్మాతగా రవి కళా మందిర్ స్థాపించి 'మాయదారి మల్లిగాడు', 'గాజుల కిష్టయ్య' చిత్రాలు నిర్మించారు. తర్వాత 'మహాకవి క్షేత్రయ్య' చిత్రానికి దర్శకత్వం వహిస్తూ షూటింగ్ ప్రారంభించిన తొలి రోజుల్లోనే తీవ్ర అనారోగ్యానికి గురై గాజుల కిష్టయ్య చిత్రం విడుదలకాకుండానే 1975 అక్టోబరు 1 వ తేదీన స్వర్గస్తులయ్యారు.

ఆయన కుమారుడు సాయి భాస్కర్ తర్వాత 'సిరిమల్లె నవ్వింది' చిత్రం నిర్మించారు. మరోవిశేషం... భాస్కర్ కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి దగ్గర 'సప్తపది' చిత్రానికి సహకార దర్శకుడిగా పనిచేశారు.

తరువాత ఇతడు చిత్ర రంగంలో ప్రవేశించి పూలరంగడు, గాజుల కిష్టయ్య మొదలైన 26 చిత్రాలు, 9 తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇతని చిత్రాలు నిర్మాతలకు విశేష లాభాలు ఆర్జించి పెట్టినాయి.

చిత్ర సమాహారం

మార్చు

దర్శకులుగా

మార్చు

రచయిత

మార్చు

నిర్మాతగా

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-02. Retrieved 2010-07-02.