గురువాయూర్ దొరై

గురువాయూర్ దొరై ఒక మృదంగ వాద్య కళాకారుడు.[1]

గురువాయూర్ దొరై
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంవైద్యనాథన్
జననం (1935-07-02) 1935 జూలై 2 (వయసు 89)
గురువాయూర్, త్రిస్సూరు జిల్లా, కేరళ, భారతదేశం
వాయిద్యాలుమృదంగం
ఎన్.రవికిరణ్ నవచిత్రవీణ కచేరీలో మృదంగం వాయిస్తున్న గురువాయూర్ దొరై (ఎడం). చిత్రంలో రవి బాలసుబ్రహ్మణ్యం (ఘటం), అక్కరై ఎస్.సుబ్బలక్ష్మి (వయోలిన్) ఉన్నారు.

ప్రారంభ జీవితం

మార్చు

ఇతడు కేరళలో పుణ్యక్షేత్రమైన గురువాయూరులో 1935, జూలై 2వ తేదీన జి.ఎస్.కృష్ణ అయ్యర్, మీనాక్షి దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి పూజారి. తల్లి గృహిణి. ఇతనికి ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు. ఇతని అక్క గురువాయూర్ పొన్నమ్మాళ్ ఆ సమయంలో పేరుగాంచిన గాయని. ఇతని మరొక అక్క మద్రాసులో సంగీతోపాధ్యాయిని. ఇతని అన్న జి.కె.రాజమణి పాలఘాటులో పేరుమోసిన వాయులీన విద్వాంసుడు.

ఇతనికి ఐదవ యేట పోలియో వ్యాధి వచ్చింది. ఇతని తండ్రి ఇతడు గురువాయూరు దాటి బయటకు వెళ్ళి పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయడం కష్టమని భావించాడు. తమ కుటుంబంలో ఒక గాయని, ఒక వయోలిన్ విద్వాంసుడు ఉన్నారు. ఒక మృదంగ విద్వాంసుడు ఉంటే ముగ్గురూ కలిసి కచేరీలు చేసుకోవచ్చని భావించాడు. అదీ కాక పొన్నమ్మాళ్, రాజమణి ఇద్దరూ తమ తమ్ముని బాగోగులు చూసుకోగలరని భావించాడు. దానితో దొరైని మృదంగవిద్వాంసునిగా మలచడానికి నిర్ణయించుకున్నాడు.

దొరై తన ఆరవయేట పాల్గాట్ సుబ్బయ్యర్ వద్ద మృదంగం నేర్చుకున్నాడు. తరువాత ఇ.పి.నారాయణ పిశరోడి వద్ద మృదంగం నేర్చుకున్నాడు. ఆ సమయంలో ఇతని అక్క పొన్నమ్మాళ్ చెంబై వైద్యనాథ భాగవతార్ వద్ద సంగీతం నేర్చుకుంటూ ఉండేది. చెంబై వైద్యనాథ అయ్యర్ ఎప్పుడు గురువాయూర్ వచ్చినా వీరి ఇంటిలోనే బస చేసేవాడు. అతడు దొరై మృదంగ సాధన పట్ల ఆసక్తి కనబరచేవాడు. గురువాయూర్ దొరై ఎనిమిదవ యేట చెంబై వైద్యనాథ భాగవతార్‌‌కు ప్రక్కవాద్యం వాయించడం ద్వారా తన తొలి మృదంగ ప్రదర్శన ఇచ్చాడు.

1949లో ఇతడు చెంబైతో కచేరీ చేయడానికి తొలిసారి చెన్నై వెళ్ళాడు. ఆ సమయంలోనే పొన్నమ్మాళ్‌కు ఒక మలయాళ సినిమాలో పాడటానికి అవకాశం లభించింది. చెన్నైలో ఉంటే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని భావించి దొరై, పొన్నమ్మాళ్, రాజమణి తమ తండ్రితో కలిసి చెన్నైలో ఒక అద్దె ఇంట్లో నివసించసాగారు. మిగిలిన కుటుంబ సభ్యులు గురువాయూరులో ఉండేవారు. చెన్నైలో ఇతడు పళని సుబ్రమణియం పిళ్ళైని కలుసుకున్నాడు. అతని వద్ద 9 సంవత్సరాలు గురుకుల వాసం చేసి పుదుక్కోటై బాణీలో మృదంగ విన్యాసం నేర్చుకున్నాడు.

విశేషాలు

మార్చు

ఇతడు చిన్నవయసు నుండే దాదాపు అందరు కర్ణాటక సంగీత విద్వాంసులకు వాద్య సహకారం అందించారు. వారిలో ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, ఎం.డి.రామనాథన్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, జి.ఎన్.బాలసుబ్రమణియం, ద్వారం వెంకటస్వామి నాయుడు, ఎస్.బాలచందర్, చిట్టిబాబు, టి.ఆర్.మహాలింగం, మైసూరు చౌడయ్య, పాల్గాట్ ఘటం సుందరం, అలంగుడి రామచంద్రన్, జి.హరిశంకర్, వింజమూరి వరదరాజ అయ్యంగార్ మొదలైన వారున్నారు.

ఇంకా ఇతడు టి.ఎన్.రాజరత్నంపిళ్ళై, తిరువేంగడు సుబ్రహ్మణ్యపిళ్ళై, నామగిరిపేటై కృష్ణన్ వంటి నాదస్వర విద్వాంసులకు, కె. జె. ఏసుదాసు, టి.ఎన్.కృష్ణన్, టి.వి.శంకరనారాయణన్, టి.ఎన్.శేషగోపాలన్, నైవేలి సంతానగోపాలన్, ఎన్.రవికిరణ్, శశాంక్ సుబ్రహ్మణ్యం వంటి వర్తమాన కళాకారులకు కూడా మృదంగవాద్య సహకారం అందించాడు.

అవార్డులు

మార్చు
  • 2003లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై వారిచే "సంగీత కళాశిఖామణి"
  • 1996లో సంగీత నాటక అకాడమీ అవార్డు[2]
  • 1990లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ వారిచే కళైమామణి
  • 2011లో "సంగీత నాటక అకాడమీ టాగూర్ రత్న"

మూలాలు

మార్చు
  1. Abram, David; Edwards, Nick (2004). The Rough Guide to South India. Rough Guides. p. 670. ISBN 9781843531036.
  2. "SNA Awardees' List". Sangeet Natak Akademi. 2016. Archived from the original on 30 మే 2015. Retrieved 14 మార్చి 2021.