జయమాల
జయమాల ఒక కన్నడ సినిమానటి. ఈమె జన్మించింది దక్షిణ కన్నడ జిల్లా అయినా పెరిగింది చిక్కమగళూరు జిల్లాలో. ఈమె "కాస్ దాయె కండన" అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె కొన్ని కన్నడ చిత్రాలను కూడా నిర్మించింది. ఈమె కన్నడ చిత్రాలతో పాటు కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.
జయమాల | |
---|---|
జననం | జయమాల 1959 ఫిబ్రవరి 28 |
వృత్తి | నటి, నిర్మాత, సినీ కళాకారిణి, రైతు |
క్రియాశీల సంవత్సరాలు | 1973–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రామచంద్ర హెచ్.ఎమ్ |
వ్యక్తిగత జీవితం
మార్చుఈమె 1959, ఫిబ్రవరి 28న దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించింది. ఈమె తండ్రి ఓమయ్య ఒక సాధారణ రైతు. తల్లి కమలమ్మ గృహిణి. ఈమెకు 6గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. బ్రతుకుతెరువు కోసం ఈమె కుటుంబం 1963లో చిక్కమగళూరు జిల్లాకు వలసవెళ్ళింది. జయమాల మొదట కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్‌ను వివాహం చేసుకుంది. తరువాత అతనికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామాన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్ళి చేసుకుంది. ఈమె కుమార్తె సౌందర్య కూడా కన్నడ, తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నది. ఈమె కర్ణాటకలోని గ్రామీణ స్త్రీల పునరావాసము అనే అంశంపై పరిశోధనలు చేసి సిద్ధాంతవ్యాసం వ్రాసి బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి 2008లో ఎ.పి.జె.అబ్దుల్ కలాం చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను తీసుకుంది. ఆ విధంగా భారతీయ సినీ పరిశ్రమలో థీసిస్ వ్రాసి డాక్టరేట్‌ను స్వీకరించిన ఏకైక నటిగా పేరుగడించింది.
సినిమా రంగం
మార్చుఈమె 1980వ దశకంలో అనేక కన్నడ, తుళు, తమిళ, తెలుగు, హిందీ భాషల సినిమాలలో నటించింది. ఈమె రాజకుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, లోకేష్, శంకర్ నాగ్, అనంతనాగ్, శివరాజకుమార్, రాఘవేంద్ర రాజకుమార్, టైగర్ ప్రభాకర్ వంటి సుప్రసిద్ధ కన్నడ హీరోల సరసన నటించింది. ఈమె నిర్మించిన తాయి సాహిబా అనే కన్నడ సినిమాకు జాతీయ చలనచిత్ర పురస్కారం- స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఈమె నిర్మించిన మరొక కన్నడ చిత్రం తుత్తూరి అనే బాలల చిత్రానికి కూడా జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. ఈమె కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC)కి కోశాధికారిణిగా, అధ్యక్షురాలిగా పనిచేసింది.
నటించిన తెలుగు సినిమాలు
మార్చు- అర్జున గర్వభంగం (1979)
- చండీరాణి (1983)
- భామా రుక్మిణి (1983)
- రాక్షసుడు (1986)