జొన్నవాడ రాఘవమ్మ

జొన్నవాడ రాఘవమ్మ మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన కవయిత్రి. 1970 ప్రాంతంలో ఈమె రచించిన అనేక లలిత గీతాలు, దేశభక్తి గేయాలు, జానపద గేయాలు, భక్తి గీతాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యి, విశేష ప్రజాదరణ పొందాయి. వీరు రాసిన అనేక గీతాలను మహా భాష్యం చిత్తరంజన్ గారు స్వరపరిచారు. చిన్ననాటి నుండి భారతం, భాగవతం, రామాయణం వంటి గ్రంథాలను నిత్యపారాయణం చేసేది. ఈ అలవాటే ఆమెను లలిత, భక్తిగీతాల రచయిత్రిగా మార్చివేసింది. ఆమె 1972లో 48 గేయాలతో రాధికాగీతాలు గ్రంథాన్ని వెలువరించారు[1]. వీటికి మరికొన్ని గేయాలను చేర్చి 2006లో ఈ గ్రంథాన్ని పునర్ముద్రించారు. 2014లో భావతరంగాలు పేరుతో ఆమె మరో గ్రంథాన్ని వెలువరించారు. అనేక సాహితీ సంస్థలు వీరి సాహితీ కృషికి పలు సత్కారాలను అందించాయి. 2015 జనవరి 6 వ తేదిన ఆమె మరణించారు. ఆకాశవాణిలో ఈ మాసపుపాట, ఈ పాటను నేర్చుకొందాం వంటి ప్రసార కార్యక్రమాల్లోనూ, తెలుగు విశ్వవిద్యాలయం లలిత సంగీతం డిప్లొమా పాఠ్యాంశాల్లోనూ రాఘవమ్మ గీతాలకు చోటు దక్కింది.

జొన్నవాడ రాఘవమ్మ
జననంజొన్నవాడ రాఘవమ్మ
1928
మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేటమండలం కేశవరాయునిపల్లి గ్రామం
మరణం2015, జనవరి 6
మహబూబ్ నగర్
ప్రసిద్ధిగేయ రచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తవేదాంతాచారి
తండ్రిజినకుంట శ్రీనివాసాచార్యులు
తల్లిరాగమ్మ

కుటుంబ నేపథ్యం

మార్చు

నవాబ్ పేట మండలం, కేశవ రాయునిపల్లి ఈమె స్వస్థలం. 1928లో ఆమె జన్మించింది. జినకుంట శ్రీనివాసాచార్యులు, రాగమ్మలు ఈమె తల్లిదండ్రులు. ఈమె భర్త వేదాంతాచారి. వైష్ణవ సంప్రదాయ కుటుంబం.

సాహిత్య కృషి

మార్చు

చిన్నప్పట్నుంచీ భాగవతాది పురాణాలు జీర్ణించుకొని శ్రీకృష్ణునే ఆరాధ్యదైవంగా భావిస్తూ మధురభక్తిపూరితమైన పాటలు రచించింది. భర్త జొన్నవాడ వేదాంతాచార్యులు ఆమె సాహిత్యాభిరుచికి దోహదం చేశారు. ఆకాశవాణి ద్వారా ప్రసారితమైన ఆమె గేయాలు శ్రోతలను అలరించాయి. మహబూబ్ నగర్ జిల్లా ప్రముఖ గాయకుడు ఎం.వెంకటగోపాలం మధురమైన బాణీలతో వాటికి ప్రచారంతో పాటు గ్రంథరూపంలో ప్రకాశానికి కూడా పాటుపడ్డారు. సంగీతకళలో ప్రవేశం గల ఆమె కుమార్తెలు కూడా వాటిని వ్యాప్తికి తెచ్చారు[2].

రచనలు

మార్చు
  1. రాధికాగీతాలు (1972, (2006)
  2. భావతరంగాలు (2014)
రాధికాగీతాలు
48 రాధికా గీతాల తొలిగ్రంథం ఆవిష్కరణ జ్యోతిర్మయి సాహిత్య సమితి సప్తమ వార్షికోత్సవం (12-11-1972) సందర్భంగా జరిగింది. భవానీ భక్తవత్సలం అధ్యక్షతలో జరిగిన ఈ సభలో జె.బాపురెడ్డి కావ్యావిష్కరణ చేశారు. ఆకాశవాణి సంగీత విద్వాంసులు పాలగుమ్మి విశ్వనాథం, కేశవపంతుల నరసింహశాస్త్రి, శశాంక, ఇరివెంటి కృష్ణమూర్తి, జ్యోతిర్మయి అధ్యక్ష కార్యదర్శులైన ఎస్వీ రామారావు చౌడూరి గోపాలరావు వక్తలుగా ఈ సభలో పాల్గొని గీతాలను ప్రస్తుతించారు. వెంకటగోపాలం నిర్వహణలో గాయనీ గాయకులు గీతాలాపన చేశారు. ఇదే గ్రంథానికి మరో 57 గీతాలను కలిపి 2006, జులై 27న మలి ముద్రణను వెలువరించింది.
ఈ గ్రంథంపై ఎస్.వి.రామారావు వ్యాఖ్యానం

"రాధాగోపికలతో మమేకమై రాగయుక్తంగా వెలువరించిన రాధికాగీతాలు మధురభక్తియుతములై పోతన భాగవత పద్యాలను, గోదాదేవి పాశురాలను తలపుకు తెస్తాయి. సుందర బృందావన అందాలు, గోపాలుని మంజుల మురళీ నాదాలూ వీనిలో ప్రత్యక్షమవుతాయి. నీదు పదములే పావనం, నీదు నామకమే జీవనం అంటూ సంగీతసాహిత్య రసభరితములైన రాధికాగీతాలను కృష్ణునికే అంకితం చేసిన ధన్యురాలు రాఘవమ్మ గారు".

భావతరంగాలు (2014)
రాధికాగీతాల తర్వాత 86 ఏళ్ల వయసులో ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఇందులో నూట పదకొండు గేయాలు ఉన్నాయి. వీటిలో సగభాగం దేశభక్తియుతమైనవి కాగా, మిగతా సగం మధురభక్తి పరమైనవి. ఎం.పద్మినీదేవి, ప్రొఫెసర్ సుదర్శన్‌సింగ్ ఈ సంపుటికి పీఠికలు సమకూర్చారు. దేశభక్తి, దైవస్తుతి, ప్రకృతి సౌందర్యచిత్రణ, సామాజిక దురన్యాయాల నిరసన ఈ సంపుటిలోని రచనలకు వస్తువులు.

కొన్ని లలితగీతాలు

మార్చు

ఎవరు పెంచిన కల్పతరులివి
ఎవరు తీర్చిన సోయగము వివి
ఎచట చూచిన ఊహకందని
అందమే కనువిందు చేసెను, (కల్పతరువులు)

పదవి ఆశకు నిధులు పంచకు
పాలనలో అవినీతి పెంచకు
పల్లెప్రజలను మోసగించకు
పరుల సొమ్ముకు ఆశపడకు, (తెలుగు వాడు)

ఖ్యాతిగాంచిన భారతనారీ
కట్టుబొట్టూ చెరుపుకుని
నగ్నముగ నడీవీధిలో
చిందులేయగ సిద్ధపడినది (భరతమాత కన్నీరు)

మరికొన్ని లలిత గీతాల జాబితా
  1. శ్రీ శేషాచలవాసా
  2. నవ్వకే నెలవంక నవ్వకే
  3. పిల్లనగ్రోవి మెల్లన ఊది
  4. ఎవరు పెంచిన
  5. ఏలరాడే చెలి
  6. ఏదే అల్లరి వనమాలి

పురస్కారాలు

మార్చు

లలితగీతాల వీడియో లంకె

మార్చు

మూలాలు

మార్చు
  1. 'మూగవోయిన పాలమూరు కవనం', ఈనాడు దినపత్రిక, జిల్లా పేజి, పుట- 14, తేది:07.01.2015
  2. ఆచార్య ఎస్వీరామారావు:పాలమూరు విదుషీమణి, నమస్తే తెలంగాణ, తేది:26.01.2015.