దశావతారం (2008 సినిమా)
దశావతారం 2008 లో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో విడుదలైన తమిళ అనువాద చిత్రం. ఈ సినిమాలో కమల్ హాసన్ పది రకాల విభిన్నమయిన వేషాలు ధరించి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చి సినిమాలో ప్రధాన భూమిక పోషించాడు. ఆసిన్, జయప్రద నాయికలుగా నటించారు.
దశావతారం | |
---|---|
దర్శకత్వం | కె. ఎస్. రవికుమార్ |
రచన | కమల్ హాసన్ |
నిర్మాత | కె.రవిచంద్రన్ |
తారాగణం | కమల్ హాసన్, ఆసిన్, జయప్రద, నెపోలియన్ |
ఛాయాగ్రహణం | రవివర్మన్ |
కూర్పు | తనికాచలం |
సంగీతం | హిమేశ్ రేషమ్మియా |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జూన్ 13, 2008 |
భాష | తమిళం |
సంక్షిప్త చిత్ర కథ
మార్చుగోవింద్ (కమల్ హాసన్ 1) అనే సైంటిస్ట్ చెన్నైలో ఓ బహిరంగ సభలో దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడడంతో కథ ప్రారంభం అవుతుంది. ఇదే సభకి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ (కమల్ హాసన్ 2) హాజరవుతాడు. జీవితంలో జరిగే ప్రతీ సంఘటన వెనుకా తెలీని ఒక సంబంధం ఉంటుందనీ, ఎక్కడో చైనాలో సీతాకోక చిలుక రెక్కలాడిస్తే అమెరికాలో పెను విపత్తులు రావచ్చు నంటూ కేయాస్ సిద్ధాంతాన్ని చెబుతూ, కథని పన్నెండో శతాబ్దంలో వైష్ణ భక్తుడైన రంగరాజ నంబియార్ (కమల్ హాసన్ 3) తో మొదలు పెడతాడు. శైవ మతస్థుడైన కుళోత్తుంగ చోళుడు (నెపోలియన్) వైష్ణవ మతాన్ని అంతరించే ప్రయత్నంలో చిదంబరంలోని విష్ణు విగ్రహాన్ని పెకలించి సముద్రంలో పారవేయడానికి సైన్యంతో వస్తాడు. దాన్ని ఎదురించే ప్రయత్నంలో రంగరాజ నంబియార్ బందీ అవుతాడు. ఒక్క సారి శివ నామ జపం చేస్తే విడిచిపెడతానని చెప్పినా వినని రంగరాజ నంబియార్ని విష్ణు విగ్రహంతో పాటు సముద్రంలో పారేయిస్తాడు. ఇది తట్టుకోలేక రంగరాజ నంబియార్ భార్య (ఆసిన్) అక్కడున్న విగ్రహానికి తల బాదుకొని మరణిస్తుంది. అలా రంగరాజు పాత్ర ముగుస్తుంది. అంతే హఠాత్తుగా కథ పన్నెండో శతాబ్దం వదిలేసి, ఇరవై ఒకటో శతాబ్దం వైపు పరిగెట్టి అమెరికాలో వాషింగ్టన్ లో తేలుతుంది.
ఇక్కడ గోవింద్ అనే జీవశాస్త్రవేత్త మానవాళిని చిటికెలో అంతం చేసే సింథటిక్ బయో వైరస్ కనిపెడతాడు. అది కాస్తా ఉగ్రవాదుల చేతిలో పడుతోందని తెలుసుకొని, దాన్ని కాపాడే ఉద్దేశంతో ఓ చిన్న పెట్టె లో పెట్టి ఎఫ్.బి.ఐ.కీ చెప్పే తరుణంలో ఫ్లెచర్ (కమల హాసన్ 4) అనే ఉగ్రవాది దృష్టిలో పడతాడు. తన స్నేహితుడింట్లో తలదాచు కుందామనుకునే సరికి ఫ్లెచర్ గోవింద్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ అతని స్నేహితుడూ, స్నేహితుడి జపనీస్ భార్యా ఫ్లెచర్ చేతిలో మరణిస్తారు. ఎలాగో అక్కడనుండి తప్పించుకొని బయట పడినా ఓ నాటకీయ పరిణామంలో ఆ బయో వైరస్ బాక్స్ కాస్తా ఇండియాలో చిదంబరం అనే ఊరికి పార్సిల్ అయ్యిందని తెలుసుకొని అందరికళ్ళూ కప్పి, విమానం కార్గోలో దూరి, భారతదేశం వెళిపోతాడు. గోవిందు వివరాలు తెలుసుకొన్న ఫ్లెచర్ కూడా తన స్నేహితురాలి (మల్లికా షరావత్) సహాయంతో ఇండియా బయల్దేరుతాడు. తన స్నేహితుడి జపనీస్ భార్య మరణం తెలుసుకొన్న ఆమె అన్న కరాటే ఫైటర్ (కమల హాసన్ 5) గోవిందుని హత మార్చాలని ఇండియాకి ప్రయాణం కడతాడు. బయో వైరస్ వెపన్ కోసం గోవిందూ, ఆ రెండింటి కోసం ఫ్లెచరూ, అతని ప్రేయసీ, అతన్ని చంపాలని జపనీస్ ఫైటరూ ఒకరి నొకరు చేజ్ చేసుకోవడంతో కథ పాకాన పడుతుంది.
ఈ లోగా బలరాం నాడార్ (కమల హాసన్ 6) అనే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో చిక్కి, టెర్రరిస్ట్ గా అనుమానింప బడతాడు. అందరి కళ్ళూ కప్పి తప్పించుకుంటాడు గోవింద్. బయో వైరస్ పెట్టె కోసం సరాసరి చిదంబరంలో ఉన్న ఓ వైష్ణవ కుటుంబాన్ని కలవడానికి వెళతాడు. అక్కడే లక్ష్మీ (ఆసిన్) అనే అమ్మాయి పరిచయ మవుతుంది. ఈ లోగా బయో వైరస్ బాక్స్ పార్సిల్ లక్ష్మి బామ్మ (కమల హాసన్ - 7) కృష్ణవేణి చేతిలో పడుతుంది. అది కాస్తా ఊరేగింపులో గోవిందరాజు విగ్రహం లో జార విడుస్తుంది కృష్ణవేణి. అనుకోని హఠాత్పరిణామ క్రమంలో ఆ విగ్రహము, లక్ష్మితో కలసి పారిపోతాడు గోవింద్. అతన్ని ఫ్లెచర్, బలరాం నాడార్ ఇద్దరూ వెంబడిస్తూనే ఉంటారు. బయో వైరస్ టెంపరేచర్ పెరగ కుండా చూడాలని గోవింద రాజు విగ్రహాన్ని ఓ ఊరి చివర శ్మశానం దగ్గర గోతిలో కప్పెడతాడు. అక్కడే ఇసుక స్మగ్లర్స్ తో గొడవపడతాడు గోవింద్. ఈలోగా ఇసుక స్మగ్లర్ బండారాన్ని బయట పెట్టే నిమిత్తమై పుణ్యకోటి (కమల హాసన్ – 8) అనే అతను వస్తాడు. వాళ్ళని తప్పించుకొని వెళుతూ ఓ వాన్ యాక్సిడెంట్ లో పొడుగాటి కరీముల్లా (కమల్ హాసన్ - 9) అనే ముస్లిం కుటుంబాన్ని కలుస్తాడు. గాయపడ్డ కరీముల్లా తల్లిని ఆసుపత్రిలో చేర్చే సమయంలో కేన్సర్ వ్యాధితో ఉన్న అవతార్ సింగ్ (కమల్ హాసన్ – 10) అతని భార్య (జయప్రద) నీ కలుస్తాడు. ఇలా అనేక పాత్రలన్నీ ఒక దాని వెంబడి ఒకటి వస్తాయి. గోవింద్ బయో వైరస్ ని ఎలా రక్షించాడు? ఫ్లెచర్ నుండి ఎలా తప్పించుకున్నాడు ? జపనీస్ ఫైటర్ పగ తీరిందా? బలరాం నాడార్ గోవిందుని టెర్రరిస్ట్ గా పట్టుకున్నాడా? పుణ్యకోటీ, ఇసుక స్మగ్లర్ల గొడవ తీరిందా? కేన్సర్ వ్యాధి గురైన అవతార్ సింగ్ కీ ఈ కథకీ సంబంధం ఏమిటి? ఏభై ఏళ్ళ క్రితం చనిపోయిన బామ్మ కొడుకు పోయిన సంగతి తెలుసుకుందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జవాబు మిగతా కథ! [1]
నటీనటులు
మార్చు- కమల్ హాసన్ పది రకాల పాత్రలలో[2]
- గోవింద్ రామస్వామి (జీవశాస్త్రవేత్త)
- ప్రెసిడెంట్ జార్జి.డబ్ల్యు.బుష్ (అమెరికా అధ్యక్షుడి పాత్ర)
- రంగరాజనంబి (విష్ణుభక్తుడు)
- క్రిస్టియన్ ఫ్లెచర్ (ప్రతినాయకుడు)
- బలరాం నాడార్ (ఇంటెలిజెన్స్ ఆఫీసర్)
- శింజెన్ నరహషి (జపనీస్ యోధుడు)
- కృష్ణవేణి పాటి (ముసలమ్మ)
- విన్సెంట్ పుణ్యకోటి (సామాజిక కార్యకర్త)
- కలీఫుల్లా ఖాన్ (ముస్లిం యువకుడు)
- అవతార్ సింగ్ (గాయకుడు)
- ఆసిన్ (ద్విపాత్రాభినయం[2])
- జయప్రద
- నెపోలియన్
- మల్లికా షెరావత్
- చక్రి తోలేటి
- రేఖ
నిర్మాణం
మార్చుఈ సినిమా కథను తయారు చేసుకున్న కమల్ హాసన్ చాలామంది దర్శకులకు వినిపించాడు. వీరిలో చాలామంది కథను గందరగోళంగా ఉన్నట్లు చెప్పారు. తర్వాత కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం చేయడానికి ఒప్పుకున్నాడు. కమల్ హాసన్ మరో ప్రముఖ దర్శకుడు ముక్తా శ్రీనివాసన్ సలహాలు కూడా తీసుకున్నాడు. ఆయన కమల్ హాసన్ ను కేవలం నటుడిగా కాక పూర్తిగా సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కమ్మని చెప్పాడు. సుజాత, మదన్, రమేష్ అరవింద్, క్రేజీ మోహన్ తదితరులు ఈ కథను సినిమా స్క్రిప్టుగా మార్చడంలో సహాయపడ్డారు.[3]
సాంకేతిక నిపుణులు
మార్చు- దర్శకుడు: కె. ఎస్. రవికుమార్[2]
- నిర్మాత: కె. రవిచంద్రన్
- సహ నిర్మాత: డి. రమేష్ బాబు
- చాయగ్రహకత్వం: రవివర్మన్
- ఎడిటర్: తనికాచలం
- పాటలు: వాలి, వైరముత్తు
- కళ: తోట తరణి, సమీర్ చందా, ఎం. ప్రభాకరన్
- రూపశిల్పులు: మైఖేల్ వెస్ట్ మూర్
- పోరాటాలు: పి. త్యాగరాజన్, జూప్ కటాన, కనల్ కన్నన్
- సంగీతం: హిమేశ్ రేషమ్మియా
- నేపథ్య సంగీతం: దేవి శ్రీప్రసాద్[2]
- సౌండ్ ఇంజనీర్: హెచ్. శ్రీధర్
విశేషాలు
మార్చు- ప్రపంచ సినిమా చరిత్రలోనే మొదటి సారిగా ఒకే వ్యక్తి 10 భిన్నమయిన పాత్రలు (అందులో ఒకటి ముసలి స్త్రీ వేషం) పోషించటం మొదటిసారి.
- 2008 వరకు ఈ సినిమాయే భారత దేశములో నిర్మించబడ్డ అత్యంత ఖరీదు అయినది.
పాటలు
మార్చు- ముకుందా ముకుందా , సాధనా సర్గం, కమల్ హాసన్, రచన: వేటూరి సుందర రామమూర్తి.
- హో హో సనమ్ , మహాలక్ష్మి అయ్యర్, కమల్ హాసన్, రచన: చంద్ర బోస్
- లోకనాయకుడా , వినీత్ , రచన: వెన్నెలకంటి రాజేశ్వర రావు.
- దశావతారం , సాధనా సర్గాం, కమల్ హాసన్, రచన: వేటూరి సుందర రామమూర్తి.
- రామ నీ మంత్రం కంటే , హరిహరణ్, కమల్ హాసన్, రచన: వెన్నెలకంటి రాజేశ్వర రావు.
మూలాలు
మార్చు- ↑ 2.0 2.1 2.2 2.3 దశావతారం సినిమా అధికారిక వెబ్సైట్ నుండి దశావతారం నట సాంకేతిక వర్గం Archived 2008-06-26 at the Wayback Machineజూన్ 16, 2008న సేకరించబడినది.
- ↑ "Kamal Hassan: దశావతారం తెరకెక్కిందిలా..! - story behind the success of dasavathaaram". www.eenadu.net. Retrieved 2021-06-14.