దీక్షా దివస్ (తెలంగాణ ఉద్యమం)
దీక్షా దివస్ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు.[1] 2009, నవంబరు 29న నిరాహార దీక్ష మొదలుపెట్టిన కేసిఆర్, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తరువాత తన 11 రోజుల దీక్షను విరమించాడు.[2][3]
దీక్షా దివస్ (తెలంగాణ ఉద్యమం) | |
---|---|
జరుపుకొనేవారు | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా |
రకం | రాష్ట్రీయం |
జరుపుకొనే రోజు | నవంబరు 29 |
ఆవృత్తి | వార్షిక |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదే రోజు |
నేపథ్యం
మార్చుఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఉపశమన చర్యలతో కేంద్రం తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చే యత్నాలను తీవ్రతరం చేసింది. అయితే కాలంగడుస్తున్న కొద్దీ మరో ఉద్యమం పురుడుపోసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమతి స్థాపకుడు కేసిఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపాడు. తెలంగాణ వచ్చుడో...కేసిఆర్ సచ్చడో అన్న నినాదంతో 2009, నవంబరు 29వ తేదీన ఆమరణ దీక్షకు పిలుపునిచ్చాడు.[1]
దీక్ష ప్రారంభం
మార్చు2009, నవంబరు 29న కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటుచేసిన దీక్షా స్థలం వద్దకి బయల్దేరిన కేసీఆర్ వాహనంను కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీసు బలగాలు, రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు చుట్టుముట్టారు. వాహనం నుంచి బలవంతంగా దించివేయబడ్డ కేసిఆర్, రోడ్డుమీదే ధర్నా చేస్తుండడంతో ఖమ్మం జైలుకు తరలించారు. ఆ జైలులోనే తన దీక్షను ప్రారంభించాడు.[4]
దీక్ష ప్రభావం
మార్చుడిసెంబరు 1న 'నేను లేకున్నా ఉద్యమం నడవాలి' అని కేసీఆర్ ప్రకటించాడు. డిసెంబరు 2న పార్లమెంట్‌లో అద్వానీ ఈ దీక్షను ప్రస్తావించారు. ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబరు 3న కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. 'తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర' అని నిమ్స్ నుంచే కేసీఆర్ ప్రకటించాడు. 4న రక్తంలో పొటాషియం, సోడియం తగ్గడంతో కేసీఆర్‌ను అత్యవసర వైద్య విభాగానికి తరలించారు. కోమాలోకి పోయే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరించారు. ప్రజలు మెచ్చే ప్రకటన చేసే వరకు తన దీక్ష, తెలంగాణ ప్రజల ఆందోళనలు కొనసాగుతాయని కేసీఆర్ ప్రకటించాడు. 5న వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ఎంపీలు కలిసి దీక్ష విరమించాలని కోరినా కేసీఆర్ నిరాకరించాడు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితేనే విరమిస్తానని చెప్పాడు. దాంతో రాష్ట్ర రాజధాని ఫ్రీజోన్ కాదని అసెంబ్లీలో తీర్మానం పెడతామని, కేసీర్‌పై కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.[1] 6న అసెంబ్లీలో 14ఎఫ్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశారు.
కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న సమాచారంతో తెలంగాణలోని పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి, బంద్ లు జరిగాయి. ఎటు చూసినా జై తెలంగాణ నినాదమే వినిపించింది. వరుస బంద్ లతో బస్సులు, రైళ్లు స్తంభించిపోయాయి. లాయర్లు, ఇంజినీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలా నాలుగున్నర కోట్లమంది ఒక్కటయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన - దీక్ష విరమణ
మార్చుడిసెంబరు 7న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నిపార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. డిసెంబరు 8న కేసీఆర్ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నదని, ప్రొటీన్లు, అల్బుమిన్లు లోపించాయని, ఇక తమ చేతుల్లో ఏమీలేదని వైద్యులు తెలిపారు. తెలంగాణ దిశగా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. దాంతో డిసెంబరు 9న కాంగ్రెస్ కోర్ కమిటీ ఐదుసార్లు సమావేశమైంది. సమావేశం నుంచి చిదంబరం బయటికి వచ్చి ఫోన్‌లో కేసీఆర్, జయశంకర్‌సార్‌తో సంభాషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనపై సమాలోచనలు జరిగాయి. రాష్ట్ర ఏర్పాటు ప్రకటన విషయంలో స్పష్టమైన పదజాలం ఉండాల్సిందేనని చిదంబరానికి స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన చేయాలన్న సోనియా సూచన మేరకు కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం మాట్లాడుతూ... అనేక పరిణామాల అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని, విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని ప్రకటన చేశాడు. ప్రకటన అనంతరం నిమ్స్ నుంచి ‘ఇది తెలంగాణ ప్రజల విజయం’ అని కేసీఆర్ ప్రకటించాడు.[1] 11 రోజుల సుధీర్ఘ దీక్షతో తెలంగాణకు ఏకంచేసిన కేసిఆర్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన తరువాత తన ఆమరణ దీక్షను విరమించాడు.[5]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 telugu, NT News (2024-12-09). "Telangana | కేసీఆర్ దీక్షాఫలం.. కాంగ్రెస్ దగాపర్వం.. నవంబర్ 29 లేకుండా డిసెంబర్ 9 ఉందా?". www.ntnews.com. Archived from the original on 2024-12-09. Retrieved 2024-12-09.
- ↑ వి6 (29 November 2017). "దీక్షా దివస్.. తెలంగాణను నిలబెట్టిన దీక్ష". telugu.v6news.tv. Archived from the original on 13 September 2018. Retrieved 29 November 2017.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10టీవి (29 November 2016). "టీ.ఎస్ దీక్షా దివస్ డే." Archived from the original on 1 December 2016. Retrieved 29 November 2017.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ జూలూరు, గౌరీశంకర్ (2024-11-29). "చరిత్ర గతినే మార్చిన ఆమరణ దీక్ష | Guest Column On The Day Of Nov 29 KCR Diksha Divas In Telangana Movement | Sakshi". www.sakshi.com. Archived from the original on 2024-11-29. Retrieved 2024-11-29.
- ↑ టి.ఆర్.ఎస్. పార్టీ వెబ్సైట్. "నేడు దీక్షా దివస్". trspartyonline.org. Archived from the original on 26 నవంబరు 2020. Retrieved 29 November 2017.