దుశర్ల సత్యనారాయణ

తెలంగాణ రాష్ట్రానికి చెందిన నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడ

దుశర్ల సత్యనారాయణ (జననం. 1954 మార్చి 12) తెలంగాణ రాష్ట్రానికి చెందిన నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయడం ద్వారా తెలంగాణలోని నల్గొండ జిల్లాకు సాగునీటి, తాగునీటిని సరఫరా చేయించడం కోసం దశాబ్దాల నుండి పోరాడుతున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చాడు.[1] సువిధ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.[2]

దుశర్ల సత్యనారాయణ
జననం (1954-03-12) 1954 మార్చి 12 (వయసు 70)
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నీటి హక్కుల కార్యకర్త

జీవిత విశేషాలు

మార్చు

దుశర్ల సత్యనారాయణ 1954, మార్చి 12న తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, మోతే మండలంలోని రాఘవపూర్ గ్రామంలో జన్మించాడు.[3] హైదరాబాదులోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయశాస్త్రంలో బి.ఎస్.సి. పూర్తిచేశాడు.

వృత్తిజీవితం

మార్చు

1977లో కడపలోని ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగంలో చేరిన దుశర్ల సత్యనారాయణ, అందులో కొంతకాలం వ్యవసాయ సహాయకుడిగా పనిచేశాడు. ఆ తరువాత కొంతకాలం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రామీణాభివృద్ధి అధికారిగా పనిచేశాడు. చిన్న, సన్నకారు రైతుల దుస్థితిని చూసిన సత్యనారాయణ 1980లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, సామాజిక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించాడు.

జల సాధన సమితి

మార్చు

సాగు, తాగునీటి కేటాయింపు విషయంలో నల్గొండ జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై, కలుషిత నీటి ఫలితంగా వ్యాపిస్తున్న ఫ్లోరోసిస్ వ్యాప్తిపై పోరాడటానికి దుశర్ల సత్యనారాయణ 1980లో జల సాధన సమితిని స్థాపించాడు.[4] నీటి సాధనతోపాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కూడా వాకథాన్‌లు నిర్వహించాడు.[5]

 1. నల్లగొండ ప్రాంత ప్రజల నీటి కష్టాలను, ముఖ్యంగా జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితుల గురించి అనేకమందికి తెలియడంకోసం 1992లో 200 మందితో నల్గొండ నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేశాడు.
 2. నల్లగొండ నుండి హైదరాబాదు వరకు పాదయాత్ర చేసి, శానసభను ముట్టడించాడు.
 3. నల్లగొండ నుండి యాదగిరి గుట్ట వరకు పాదయాత్ర చేసాడు.
 4. 1996లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి 682 మందితో నామినేషన్లు దాఖలు చేయించాడు. దాంతో బ్యాలెట్ పేపరును సిద్ధం చేయడంకోసం ఎన్నికల సంఘం, నల్గొండ స్థానానికి ఎన్నికను నెలరోజలకు వాయిదా వేసింది.
 5. ఫ్లోరైడ్ బాధితులతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 17సార్లు నిరసన కార్యక్రమాలు చేశాడు.
 6. 2003 మార్చి 12 న మునుగోడు ప్రాంతానికి చెందిన ఫ్లోరైడ్ బాధితులు అంశుల స్వామి, కొత్తపల్లి నర్సింహను పార్లమెంటులోని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఛాంబర్ లోని టేబులుపై పడుకోబెట్టి, వాజపేయికి ఫ్లోరైడ్ సమస్య గురించి వివరించాడు. అది చూసిన వాజపేయి వెంటనే పైప్ లైన్ ప్రారంభించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు.[6]

70 ఎకరాల అడవి

మార్చు

తనకున్న 70 ఎకరాల విస్తీర్ణంలో సత్యనారాయణ కృత్రిమ అడవిని సృష్టించాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుంచి విత్తనాలు తీసుకొచ్చి పొలంలో నాటి, వాటిని జాగ్రత్తగా కాపాడేవాడు. ఆ విధంగా పెంచిన మొక్కలు నేడు మహా వృక్షాలయ్యాయి. నెమళ్ళను, కుందేళ్లను తీసుకొచ్చి అడవిలో వదిలాడు. కోతులకోసం దుంపలు, సజ్జలు పెంచారు. తామర పువ్వులను పెంచడంకోసం ఏడు కుంటలను తవ్వించాడు. మోదుగ, తుమ్మ, బిరిచచెన, జిగినిక, మోవుంచి, మేడి, వేప, బలుసు వంటి కొన్ని వందల చెట్లు ఈ అడవిలో పెరుగుతున్నాయి. లకుముకి పిట్టలు, గిజిగాళ్లు, కోకిలలు, రామచిలుకలు, గద్దలు, వడ్రంగి పిట్టలు, బుడుబుంగలు, నీటి కోళ్ళు, ఎత్రింతలు, వంగపండు పిట్టలు, గుడ్డి కొంగలు, గువ్వలు, గోరింకలు, కముజు పిట్టలు వంటి పక్షులు, ముంగిసలు, అడవిపందులు, కోతులు, పాములు, ముళ్లపందులు, ఉడుతలు ఈ అడవిలో ఉన్నాయి.[7]

పురస్కారాలు

మార్చు

హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో 2022 ఫిబ్రవరి 27న జరిగిన నదుల పునరుజ్జీవ జాతీయ సదస్సులో నీటి సంరక్షణకు పాటుపడుతున్న దుశ్చర్ల సత్యనారాయణకు నీటి సంరక్షకులకు అవార్డును రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అందజేశాడు.[8]

మూలాలు

మార్చు
 1. "‘Separate Telangana holds the key to all problems’". The Hindu (in Indian English). 2009-12-30. ISSN 0971-751X. Retrieved 2020-09-27.
 2. Pradeep, B. (2017-07-29). "Water from these ancient wells can 'dissolve' kidney stones". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-09-27.
 3. "Fluorosis drives them to seek divine assistance". The Hindu (in Indian English). 2008-01-25. ISSN 0971-751X. Retrieved 2020-09-27.
 4. Correspondent (2012-07-09). "CPI(M) wants separate pipelines, tanks in fluoride-hit villages". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-09-27.
 5. "Archive News". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2020-09-27.
 6. నీళ్ళకోసమే నిత్యం కొట్లాట, ఈనాడు, సూర్యాపేట, 24 మార్చి 2019, పుట.8.
 7. ఈనాడు, వారెవ్వా (31 December 2018). "అతడు అడవిని సృష్టించాడు". www.eenadu.net. వాల్తెల్లి ప్రదీప్‌. Archived from the original on 27 September 2020. Retrieved 27 September 2020.
 8. Namasthe Telangana (27 February 2022). "ఫలితమిస్తున్న కాకతీయ". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.