రావు బాలసరస్వతీ దేవి

గాయని, నటి
(రావు బాలసరస్వతి నుండి దారిమార్పు చెందింది)

రావు బాలసరస్వతీ దేవి (జననం: ఆగష్టు 29, 1928) పాతతరం తెలుగు చలనచిత్ర నటి, నేపథ్యగాయని. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికి సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకొంటూనే ఉంది.[1]

రావు బాలసరస్వతీ దేవి
రావు బాలసరస్వతీ దేవి
జననం
సరస్వతి

(1928-07-29) 1928 జూలై 29 (వయసు 96)
వృత్తినటి, నేపథ్యగాయని
పురస్కారాలురామినేని పౌండేషన్ అవార్డు

నేపథ్యము

మార్చు

రావు బాలసరస్వతీ దేవి జన్మస్థలం మద్రాసు.[2] అక్కడ పార్థసారథి, విశాలాక్షి దంపతులకు 1928, ఆగస్టు 29 న జన్మించింది . వీరి తాతగారు మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తి చేసేవారు. ఈవిడ ఎక్కువ చదువుకోలేదు. గుంటూరులో వీరికి రత్న మహల్‌ అని సినిమా థియేటర్‌ ఉండేది. దాంతో వీరి తాతగారు తప్ప 1934లో వీరి కుటుంబం గుంటూరు తరలి వచ్చింది.

విశేషాలు

మార్చు

ఈమె గుంటూరు. అలత్తూర్ సుబ్బయ్య వద్ద శాస్త్రీయ కర్ణాటక సంగీతం మూడు సంవత్సరాలు అభ్యసించింది. ఖేల్కర్, వసంత దేశాయ్ ల వద్ద హిందుస్తానీ సంగీతం నేర్చుకుంది. కె.పిచ్చుమణి వద్ద వీణ, డానియల్ వద్ద పియానో వాయిద్యాలలో తర్ఫీదు పొందింది. ఆరవ యేటనే ఈమె హెచ్.ఎం.వి. కంపెనీ ద్వారా "నమస్తే నా ప్రాణనాథ", "ఆకలి సహింపగజాల", "పరమపురుష పరంధామ" మొదలైన పాటలతో సోలో రికార్డు ఇచ్చింది. ఈమె అసలు పేరు సరస్వతీదేవి. ఆరవ యేటనే అతి పిన్నవయసులో పాటలు పాడటం మూలాన కె. సుబ్రహ్మణ్యం అనే ప్రముఖ వ్యక్తి ఈమెను "బాల" సరస్వతి అని పిలిచేవాడు. అప్పటి నుండి ఈమె పేరు బాలసరస్వతిగా స్థిరపడింది. ఈమె సి.పుల్లయ్య దర్శకత్వంలో సతీఅనసూయ ధ్రువవిజయం అనే చిన్నపిల్లలు నటించిన సినిమాలో గంగ పాత్ర ధరించడం ద్వారా సినీరంగంలో ప్రవేశించింది.[3] 1944లో కోలంక జమీందారీకి చెందిన రాజా రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్‌ను పెళ్ళిచేసుకొని సినిమాలలో నటించడం తగ్గించిన బాలసరస్వతి 1950 దశకం మధ్యవరకు నేపథ్యగాయనిగా మాత్రం కొనసాగింది.[4]

సంగీత అభ్యాసం

మార్చు

వీరి ఇంటి వాతావరణ ప్రభావంవల్ల పసితనం నుండే సంగీతంలో మెళకువలు తెలుసుకునేది. బాల్యం నుండి సంగీతమే ఈమె చదువు. ఒక ఆంగ్లో ఇండియన్‌ లేడీ ఈమె ట్యూటర్‌. ఆమె దగ్గరే ఈవిడ చదువంతా. ఆవిడే లోకజ్ఞానం నేర్పుతూ ఉండేది. కొంతకాలం కర్ణాటక సంగీతం నేర్చుకున్నది. నాన్నగారు ఎంతోశ్రద్ధగా బొంబాయి తీసుకెళ్ళి వసంత దేశాయ్‌ దగ్గర హిందూస్థానీ సంగీతం నేర్పించారు. ఆ విధంగా 1940 నాటికి సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. అదే సమయంలో గూడవల్లిగారి చిత్రంలో నటించింది.

నాన్న కల

మార్చు

మంచి గాయనిగా ఈవిడ పేరు సంపాదించుకోవాలన్నది వీరి నాన్నగారి కల. పైగా ఆయన కర్నాటక సంగీతంలో దిట్ట. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవారు. పట్టుదలగా, ఆరేళ్ళ వయసు నుండే ఈవిడకు సంగీతం నేర్పించేవారు. కానీ ఈవిడకు చదువుమీద ఆసక్తి ఎక్కువ.[2]

హెచ్‌ఎంవి లో పాటల రికార్డింగ్‌

మార్చు

గుంటూరులో వీరి సినిమా థియేటర్‌ను 1936లో నాటకరంగ స్థలంగా మార్చేశారు. అక్కడే వీళ్ళు ఎన్నో నాటకాలు ప్రదర్శించేవారు. ఆ నాటకాల్లో పాటల సన్నివేశాలు వచ్చినప్పుడు ఈవిడ నేపథ్యగానం అందించేది. అలా ఈవిడ పాటలు పాడుతున్నప్పుడు హెచ్‌.ఎం.వి. గ్రాంఫోన్‌ రికార్డ్స్‌ కంపెనీవారు విని, ఈమెకు తెలియకుండానే ఈమె వాయిస్‌ రికార్డ్‌ చేసుకెళ్ళారు. హెచ్‌.ఎం.వి. రిప్రజెంటేటివ్‌ కొప్పరపు సుబ్బారావుగారు వచ్చి ఈమె పాటలు రికార్డింగ్‌కి నాన్నగారితో ఒప్పందం చేసుకున్నారు. అలా మొదటిసారి ‘‘పరమ పురుషా పరంధామా......’’ అనే పాట, ‘‘దొరికె దొరికె నీ దర్శనము...’’ మరోపాట, రెండు సోలో సాంగ్స్‌ పాడటం జరిగింది. ఈమెకు మంచి పేరు వచ్చింది. ప్రఖ్యాత సంగీత విద్యాంసులు బాలమురళీకృష్ణగారు తన పదవయేట సంగీతంలో ప్రవేశిస్తే, ఈవిడ తన ఆరవ యేటనే సంగీత ప్రావీణ్యం సంపాదించుకున్నది.[2]

తొలి పాట, నటనకు 200 పారితోషికం

మార్చు

హెచ్‌.ఎం.వి. ద్వారా ఈవిడ పాటలన్నీ విని సి.పుల్లయ్యగారు ‘సతీ అనసూయ’ చిత్రంలో అవకాశమిచ్చారు. అప్పుడు ఈవిడ వయసు ఏడేళ్ళు. ఆ విధంగా ఈవిడ 80 యేళ్ళ క్రితం తన మొదటి చిత్రంలో నటించింది. 200 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఈ చిత్రంలో గంగ పాత్రలో పాడుతూ నటించింది. కవి బలిజేపల్లి లక్ష్మీకాంతంగారి ‘‘ఏది దారి నాకిచట ఈ కలుష భూతములపాలైతిని....’’ అనేది ఈ సినిమాలో ఈవిడ పాడిన పాట. ఆకుల నరసింహారావుగారు సంగీతం. చిన్న వయసులో సినిమా పాటపాడి గాయనిగా, నటిగా అందరి ప్రశంసలు అందుకున్నది. 1936 లో విడుదలైన ఈ చిత్రంలో 60 మంది చిన్నపిల్లలు నటించడమే ఒక ప్రత్యేకత! ప్రేక్షకులు బాగా ఆదరించారు.[2]

భక్త కుచేల, బాలయోగిని

మార్చు

మద్రాసులో సౌకర్యాలు లేని రోజుల్లో (1934-40) తమిళ, తెలుగు చిత్రాల నిర్మాణం ఎక్కువ బొంబాయి, కలకత్తాల్లోనే. అలా కె.సుబ్రహ్మణ్యంగారి దర్శకత్వంలో కలకత్తా ఈస్ట్‌ ఇండియా స్టూడియోలో ‘భక్త కుచేల’ తమిళ చిత్ర నిర్మాణం మూడు నెలల్లో పూర్తి చేశారు. కృష్ణస్వామి ప్రొడ్యూస్‌ చేశారు. లిరిక్‌ రైటర్‌ పాపనాశం శివన్‌ కుచేలుడుగా, భార్యగా యస్‌.డి.సుబ్బలక్ష్మి నటించారు. కృష్ణుడి పాత్ర కూడా ఆవిడదే. ఇందులో ఈవిడది బాలకృష్ణుడి పాత్ర. ఈవిడ పాటకు, నటనకు 500 పారితోషికం ఇచ్చారు. ఇది కూడా 1936లో విడుదలై విజయవంతమైంది. ‘బాలయోగిని’ తమిళ చిత్రంలో ఈవిడది టైటిల్‌ పాత్ర. ఈ చిత్రంతోనే ఈవిడ పేరు ముందు బాల అని చేర్చి బాలసరస్వతీదేవిగా మార్చారు. ఇక అప్పటి నుంచీ ఆ పేరే ఈవిడకు స్థిరపడిపోయింది. మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తిచేసి 1937 లో విడుదల చేశారు. విజయవంతంగా ఆడింది. కె.ఆర్‌.చేలమ్‌, బేబిసరోజ, సి.వి.వి. పంతులు, కె.బి.వత్సల తదితరులు నటించారు. ఈవిడకు 1500 పారితోషికం ఇచ్చారు.[2]

గూడవల్లిగారి ‘ఇల్లాలు’

మార్చు

గూడవల్లి రామబ్రహ్మంగారి ‘ఇల్లాలు’ చిత్రంలో ఈవిద నటించింది. ఆ రోజుల్లో అద్భుతమైన వసూళ్ళతో విజయఢంకా మోగించింది. తమిళ చిత్రాల్లో నటించడం వల్ల అందరూ ఈవిడను తమిళ అమ్మాయి అనుకునేవారు. అరవ అమ్మాయి తెలుగుపాటలు పాడగలదా? అని అనుమానం వ్యక్తం చేసేవారు. ఈమె తెలుగు అమ్మాయినని, చక్కటి పాటలు పాడగలననీ తెలిశాక, సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుగారు పిలిచి పాటలు పాడించారు. ఈ చిత్రంలో ఆయన, ఈవిడ ఎవరిపాట వారు పాడుకుని జతగా నటించారు. ఆయనతో నటించడం తల్చుకుంటే నిజంగా ఎంతో సంతోషం కలుగుతుంది. బసవరాజు అప్పారావుగారు పాటలు రాశారు. ఇందులో ఉమామహేశ్వరరావు, కాంచనమాల హీరోహీరోయిన్లు.[2]

ద్విభాషాచిత్రం భక్తతుకారాం

మార్చు

కోయంబత్తూరు సెంట్రల్‌ స్టూడియోస్‌ వారు తెలుగు, తమిళభాషల్లో 'భక్తతుకారాం' నిర్మించారు. ఈ చిత్రానికి ఆరుగురు దర్శకులు! ఒకరితరువాత ఒకరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆరో ఆయన పూర్తిచేశారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్‌ తమిళంలోనూ, సిఎ్‌సఆర్‌ ఆంజనేయులు గారు తెలుగులోనూ తుకారాం పాత్రలు ధరించారు. జిజియాబాయి పాత్రలో సురభి కమలాబాయి, ఈవిడ తుకారాం కూతురుగా చేశారు. రెండు భాషల్లోనూ 1941-42లో ఒకేసారి విడుదలై విజయవంతంగా ఆడాయి. ఈవిడ ఈ రెండు చిత్రాల్లో పాటలు పాడింది.[2]

డాన్సింగ్‌ గర్ల్‌

మార్చు

ఇంగ్లీష్‌ టైటిల్‌ ఉన్న తమిళ భక్తి ప్రధాన చిత్రం! ఎల్లిస్సార్‌ డంకన్‌ దర్శకత్వంలో ‘డాన్సింగ్‌ గర్ల్‌’ బొంబాయిలో నిర్మించారు. ఈవిడ హీరోయిన్‌. దాసి పిల్ల పాత్ర. ఎస్‌.రాజేశ్వరరావుగారి సంగీత దర్శ కత్వంలో పాటలన్నీ ఈవిడే పాడింది. ఎం.జి.రామచంద్రన్‌ శివుడు. 1940-43లో మూడేళ్ళపాటు నిర్మించారు.[2]

కోలంక రాజా వారితో వివాహం

మార్చు

1944 నాటికి వీరు తిరిగి మద్రాసు చేరుకున్నాం. ఒకసారి వీరి అత్తయ్య, మావయ్యలతో మద్రాసు గిండిలో గుర్రపు రేసులు చూడ్డానికి వెళ్ళింది. అప్పటికి ఈవిడ వయసు 15 సంవత్సరాలు. వెంకటగిరి మహారాజాగారి నాలుగవ కుమారుడు ప్రద్యుమ్న, కృష్ణ, సూర్యారావు కూడా అక్కడికి వచ్చారు. ఆయన కోలంక రాజావారు. వారి గుర్రాలు కూడా ఈ రేసుల్లో ఉండేవి. అక్కడ ఈవిడను చూసి, ఈవిడ పాటలు బాగా పాడుతుందనీ, సినిమాల్లో నటిస్తుందని తెలుసుకున్నారు. కొన్నాళ్ళకు వాళ్ళందరూ మద్రాసు వచ్చారు. ‘మీ పాటలు వినాలని వచ్చాం, వినిపిస్తారా?’ అన్నారు. వాళ్ళు వచ్చింది పెళ్ళిచూపులకే అని నాన్నగారికి అర్థమైంది. మీ అమ్మాయి నచ్చింది, చేసుకుంటాం అన్నారు. నాన్నగారు ఈవిడనే అడగమన్నారు. రాజావారు అడిగినప్పుడు కాదనలేకపోయింది. ఆయనకు ఈవిడకూ దాదాపు 19 సంవత్సరాలు తేడా! కానీ ఆ రోజుల్లో అలాంటివి పట్టించుకునేవారు కాదు. అలా 1944లో కోలంక రాజావారితో ఈవిడ వివాహం జరిగింది.[2]

రాజావారికి తెలియకుండా సినిమాల్లో పాడింది

మార్చు

ఈవిడ జీవితంలో మరువలేని సంఘటన వీరి శ్రీవారికి తెలియకుండా సినిమాల్లో ఎన్నో పాటలు పాడింది. కారణం ఏమిటంటే, ఈమె సినీ జీవితం యధాతథంగా సాగుతుందని వివాహానికి ముందు ఈవిడకు వీరి శ్రీవారు మాట ఇచ్చారు. కానీ ఒకరోజు పత్రికల్లో ఈవిడ హిట్‌ సాంగ్స్‌, నటన గురించి ఫోటోతో సహా రాశారు. పత్రికల్లో భార్య గురించి రావడం రాజావారికి నచ్చలేదు. ఈవిడను పాడటం, నటించడం మానేయమన్నారు. అలా అభ్యంతరం పెట్టకుండా ఉంటే ఈమె జీవితం మరో మలుపు తిరిగి ఉండేది. కానీ ఈమె పుట్టింటికి వచ్చినప్పుడల్లా, ఇండస్ర్టీ బాధపడకూడదని, వారు నష్టపోకూడదనీ, వారిని సంతోషపరచడమే తన విధిగా భావించి చాలా పాటలు వీరి శ్రీవారికి తెలియకుండా పాడింది. తన కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో రెండువేల పాటలు పాడింది. ఎన్నో చిత్రాల్లో నటించింది. స్వప్నసుందరి, పిచ్చిపుల్లయ్య, పెళ్ళిసందడి, శాంతి, షావుకారు, దేవదాసు, లైలామజ్ను, భాగ్యలక్ష్మి, మంచిమనసుకు మంచిరోజులు.. చిత్రాల్లో ఘంటసాల, ఏ.ఎం.రాజా, సౌందర్‌రాజన్‌, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్‌.రాజేశ్వరరావు, జిక్కి, ఏ.పి.కోమల, వైదేహి, ఎం.ఎ్‌స.రాజేశ్వరి లాంటి వారితో కలిసి పాడింది. ఈవిడ పాడిన ఆఖరి పాట ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో, ‘పోయిరావమ్మ అత్తవారింటికి అపరంజిబొమ్మ....’[2]

రేడియోలో పాటలు

మార్చు

1944లో మద్రాసు ఆకాశవాణి రేడియో కేంద్రంలో, 1948లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం కూడా ఈవిడ లలిత సంగీత కార్యక్రమంతోనే ప్రారంభమయ్యాయి. ఇందుకు ఈవిద ఎంతో గర్వపడుతుంది. ప్రసిద్ధ సంగీత దర్శకులు ఎస్‌.రాజేశ్వరరావుగారితో కలిసి 1940-50 మధ్య కాలంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, ఆరుద్ర, ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావులు రచించిన ఎన్నో గేయాలు రేడియోలో పాడింది. అప్పట్లో ఈవిడ ‘రాధామాధవం’ సీడీ శ్రోతలను అలరించింది.[2]

నిజంగా తాగి నటిస్తున్నారేమో!

మార్చు

ఇప్పటి చిత్రాల గురించి ఈవిడ అభిప్రాయం ఈ క్రింది విధముగా ఉంది......

ఇప్పటి చిత్రాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా పేర్లే డబుల్‌ మీనింగ్స్‌తో వస్తున్నాయి. భాష కూడా అంతే! డైలాగ్స్‌ సంగతి సరేసరి. ‘ఓవర్‌ యాక్షన్‌’ ఎక్కువైంది. హాస్యం అపహాస్యం పాలవుతోంది. వేషధారణ దిగజారింది. హింసనే ఎక్స్‌పోజ్‌ చేస్తున్న ఈ చిత్రాల వల్ల లేతవయసు పిల్లలు చెడిపోతున్నారు. అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు. మద్యం తాగే సన్నివేశాల్లో నిజంగా తాగి నటిస్తున్నారేమో? అనిపిస్తోంది. కనుక తీవ్రమైన మార్పులు రావాలి. యువతకు, పిల్లలకు తోడ్పడే చిత్రాలు నిర్మించాలి. నటులు కూడా కథ చూసుకుని నటించాలి.[2]

చిత్రసమాహారం

మార్చు

నేపథ్యగాయనిగా

మార్చు

ఈమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ,సింహళీసు బాషలలో 2000కు పైగా పాటలు పాడింది. ఈమె నేపథ్య సంగీతం అందించిన తెలుగు సినిమాల జాబితా:

నటిగా

మార్చు

లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. టాలీవుడ్ ప్రొఫైల్స్ లోని వ్యాసం[permanent dead link]
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 "ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు". ఆంధ్రజ్యోతి. 2016-07-18. Archived from the original on 2016-07-21. Retrieved 2016-07-18.
  3. ఆంధ్రపత్రిక దినపత్రిక 25, నవంబర్, 1990 ఆదివారం అనుబంధం పేజీ 7[permanent dead link]
  4. "R Balasaraswathi (b. 1928)". Archived from the original on 2016-03-05. Retrieved 2013-07-21.