పంజాబీ సుబా ఉద్యమం

బహుళ భాషా ప్రాంతమైన తూర్పు పంజాబ్ లో పంజాబీ సంఖ్యాధిక్య సుబా (రాష్ట్రం)ను ఏర్పాటుచేయాలన్న లక్ష్యంతో 1950ల్లో సాగిన ఉద్యమమే పంజాబీ సుబా ఉద్యమం. దీన్ని అకాలీ దళ్ పార్టీ నడిపించింది, ఉద్యమం వెనుక ప్రధానంగా మాస్టర్ తారాసింగ్, ఫతే సింగ్ వంటివారు ఉన్నారు. ఈ ఉద్యమ ఫలితంగా పంజాబీ సంఖ్యాధిక్య పంజాబ్ రాష్ట్రం, హిందీ సంఖ్యాధిక్య హర్యానా రాష్ట్రం, ఛండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పడ్డాయి. పహాడీ భాషల సంఖ్యాధిక్య ప్రాంతాలు, ప్రధానంగా పర్వత మయమైన కొన్ని తూర్పు పంజాబ్ లోని ప్రదేశాలు భాషా ప్రాతిపదికన తూర్పు పంజాబ్ ను విభజించడంతో హిమాచల్ ప్రదేశ్లో చేరిపోయాయి.

పంజాబీ సుబా ఉద్యమం
తేదీ1947 ఆగస్టు 15 (1947-08-15) - 1 నవంబరు 1966 (1966-11-01)
స్థలంతూర్పు పంజాబ్, భారతదేశం
లక్ష్యాలుబహుభాషలు వారున్న తూర్పు పంజాబ్ రాష్ట్రం నుంచి పంజాబీ భాషా వ్యవహర్తల సంఖ్యాధిక్యత కల ప్రాంతాన్ని విడదీసి ప్రత్యేక పంజాబ్ రాష్ట్ర ఏర్పాటు కోసం
పద్ధతులునిరసన యాత్రలు, వీధి ఆందోళనలు, దోపిడీలు, నిరాహార దీక్ష, సాధారణ సమ్మె
ఫలితం11 నవంబరు 1966న భాషా ప్రాతిపదికన పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో పాటుగా ఛండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు. తూర్పు పంజాబ్ లోని పర్వత ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ కు చేర్పు.
పౌర ఘర్షణల్లో పాల్గొన్న పక్షాలు
వ్యతిరేకం:
కాంగ్రెస్
ముఖ్య నాయకులు
మాస్టర్ తారా సింగ్ (అకాలీ దళ్)
ఫతే సింగ్ (అకాలీ దళ్)

నేపథ్యం మార్చు

 
భారత్, పాకిస్తాన్ లలో పంజాబీ మాతృభాషగా కలవారు విస్తరించిన ప్రదేశాలు చూపే పటం

1950ల్లో భారత దేశ వ్యాప్తంగా తెలుగు, మరాఠీ తదితర భాషా సమూహాలు తమ తమ సంఖ్యాధిక్య ప్రాంతాలతో భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటుకు ఉద్యమించాయి. వీటి ఫలితంగా 1953 డిసెంబరులో రాష్ట్రాల పునర్విభజన కమీషనన్ ఏర్పడింది. 1947లో విస్తృతమైన మహా పంజాబ్ మత ప్రాతిపదికన భారతదేశం, పాకిస్తాన్ ల మధ్య విభజనకు గురై, ప్రపంచంలోకెల్లా అత్యంత దారుణమైన మత హింసాకాండను, గత శతాబ్దంలో మానవ సమూహాల అతిపెద్ద వలసను చూసింది. ముస్లింల సంఖ్యాధిక్యత కలిగిన పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్ కు, ముస్లిమేతరులు (హిందువులు, సిక్ఖులు) సంఖ్యాధిక్యత కలిగిన తూర్పు పంజాబ్ భారతదేశానికి విభజించి ఇచ్చారు.

ఆ సమయంలో భారతదేశంలోని తూర్పు పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, కొంతమేరకు హిమాచల్ ప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న చండీగఢ్ ఉండేవి. అత్యధిక సంఖ్యలో సిక్ఖులు హిందూ సంఖ్యాధిక్య తూర్పు పంజాబ్ లో జీవించేవారు.

సిక్ఖుల ఆధిపత్యంలోని రాజకీయ పార్టీ అకాలీదళ్ పంజాబ్ లో చురుకుగా వ్యవహరిస్తూ సిక్ఖు సంఖ్యాధిక్యత వచ్చేలా పంజాబీ సుబా (పంజాబీ ప్రావిన్సు) ఏర్పరిచేందుకు కార్యకలాపాలు చేపట్టేది. పంజాబీ సుబా ఏర్పాటు వెనుక సిక్ఖు మతస్తుల సంఖ్యాధిక్యత కల రాష్ట్రం/ప్రావిన్సు ఏర్పాటు ఉన్నా సిక్ఖు నాయకులైన ఫతే సింగ్ వంటివారు వ్యూహాత్మకంగా మతాన్ని ప్రాతిపదికగా ముందుపెట్టకుండా, దానికన్నా ఆమోదయోగ్యమైన భాషాపరమైన గుర్తింపును ప్రాతిపదికగా చెప్పేవారు.[1]

భారత ప్రభుత్వం ప్రత్యేక పంజాబీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు సముఖంగా ఉండేది కాదు, ఎందుకంటే అలా చేయడమంటే మరోమాటల్లో చెప్పాలంటే పంజాబ్ ను మళ్ళీ మతపరమైన ప్రాతిపదిక మీద 60శాతం సిక్ఖుల ఆధిక్యత ఉండే రాష్ట్రంగా విభజించడమే అవుతుంది.[2] 1947లో మత ప్రాతిపదికన పంజాబ్ ను విభజించడం, తదనంతర పరిణామాల్లో రేగిన మతపరమైన హింస, తీవ్రమైన వలసలు చూసివుండడంతో నిజానికి 1950ల తొలినాళ్ళకు భారత ముఖ్యనేతలు మతం అటుంచి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేయడానికే సుమఖంగా లేరు. క్రమంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేసినా, పంజాబీ భాషను ప్రాతిపదికగా పంజాబ్‌ను విభజించడానికి మాత్రం దానికున్న మత కోణం వల్ల అంగీకరించడానికి సిద్ధంగా లేరు. పైగా మతపరమైన విభజన కారణంగా భారత విభజన కాలంలో తీవ్ర హింసకు గురైన జ్ఞాపకాలతో పంజాబీ హిందువులు సిక్ఖు మతాధిక్య రాష్ట్రంలో జీవించేందుకు సిద్ధంగా లేరు.

భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పడాల్సి వస్తే పంజాబీ సిక్ఖుల ఆధిక్యంలోకి వెళ్ళడానికి సంసిద్ధంగా లేని పంజాబీ హిందువులు, స్వాతంత్ర్యం ఏర్పడ్డాక జరిగిన తొలి రెండు జనగణనల సమయంలో తమ మాతృభాష హిందీగా నమోదు చేయించుకున్నారు. దీనివల్ల పంజాబీ భాష సంఖ్యాధిక్యతకు గండి పడడం, ఒకవేళ భాషా ప్రాతిపదికన విభజిస్తే మరింత స్పష్టమైన మత విభజన జరగడం వంటివి దక్కుతాయని ఆ వ్యూహం అవలంబించారు. జలంధర్ నుంచి వెలువడే హిందూ వార్తాపత్రికలు ఈమేరకు హిందువులు తమ మాతృభాషగా హిందీని నమోదుచేసుకొమ్మని సూచించాయి. ఇది పంజాబీ సుబా అనుకూలురు అవలంబిస్తున్న భాష ముసుగులో మతం అన్న ప్రాతిపదికను బట్టబయలు చేయడానికి, అదే ముసుగులో దెబ్బకొట్టడానికీ ఉపరించింది. ఐతే ఈ సంఘటనలు తర్వాతి కాలంలో హిందువులు, సిక్ఖుల మధ్య దూరం పెరగడానికి ఒక కారణమయ్యాయి.

పంజాబీ సుబా ఏర్పాటు అంశాన్ని రాష్ట్రాల పునర్విభజన కమిషన్ పరిశీలించింది. హిందీ నుంచి వ్యాకరణ రీత్యా విస్పష్టమైన భేదమున్న భాషగా పంజాబీని గుర్తించడానికి నిరాకరిస్తూ పంజాబీ-సంఖ్యాధిక్య రాష్ట్ర డిమాండును కమిషను తోసిపుచ్చింది, కమిషను తన నివేదికలో పేర్కొన్న మరో కారణం - ప్రజల్లో డిమాండు పట్ల మద్దతు లేదన్నది.

ఐతే రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం స్థానిక సంస్థానాలు భారతదేశంలో విలీనమైనప్పుడు ఏర్పరిచిన ప్రావిన్సు పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ (పిఈపిఎస్ యు)ను మాత్రం పంజాబ్ లో విలీనం చేశారు. ఐనప్పటికీ రాష్ట్రం అటు సుస్పష్టమైన పంజాబీ సంఖ్యాధిక్యతను కానీ, సిక్ఖుల సంఖ్యాధిక్యతను కానీ కలిగిలేదు. రాష్ట్రంలో అనేక హిందూ మతస్తుల ప్రాంతాలు, హిందీ భాష మాట్లాడే ప్రదేశాలు ఉండడం ప్రధాన కారణం.

అకాలీ దళ్ ఆందోళన మార్చు

పీఈపీఎస్‌యును పంజాబ్ లో కలిపాక కూడా అకాలీ దళ్ నాయకులు ఆందోళనలు కొనసాగించారు. సిక్ఖులు ఈ ఉద్యమంలో పాల్గొనడంలో అకాలీ తఖ్త్ కీలకమైన పాత్ర వహించింది. పంజాబీ సుబా ఉద్యమంలో భాగంగా 1955లో 12వేల మంది, 1960-61ల్లో 26వేల మందీ, ఆందోళనకారులు అరెస్టయ్యారు.

ఫలితం మార్చు

1966 సెప్టెంబరులో, ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్ ని అంగీకరించింది, పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద విడిపోయింది.[3]

హర్యాన్వీ యాసలో హిందీ మాట్లాడే పంజాబ్ దక్షిణాది ప్రాంతాలతో కొత్త రాష్ట్రమైన హర్యానా ఏర్పడింది, పహాడీ భాషీయుల సంఖ్య అధికంగా ఉన్న పర్వత ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ లో విలీనమయ్యాయి. (అప్పటికి హిమాచల్ ప్రదేశ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండేది). చండీగఢ్ మినహాయించి మిగతా ప్రదేశాలతో పంజాబీ భాషీయుల సంఖ్యాధిక్య రాష్ట్రం ఏర్పడింది, దానికి పంజాబ్ అన్న పేరునే కొనసాగించారు.[4] 1966 వరకూ పంజాబ్ 63.7 శాతంతో హిందూ సంఖ్యాధిక్య రాష్ట్రంగా ఉండేది. కానీ భాషా ప్రాతిపదికన చేసిన ఈ విభజన వల్ల హిందూ సంఖ్యాధిక్య జిల్లాలను రాష్ట్రం నుంచి తీసేశారు.[5]

దేశ విభజనతో అవిభాజ్య పంజాబ్ రాజధాని లాహోర్ పాకిస్తానుకు పోయింది. దాని స్థానంలో ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన చండీగఢ్ తమకే కావాలంటూ హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు వాదించాయి. వివాదం పరిష్కారమయ్యే వరకు, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధానిగా చేసారు. పంజాబీ మాట్లాడే అనేక జిల్లాలు హర్యానాలో చేరడంతో దేశంలో పంజాబీ మాట్లాడే జనాభా అత్యధిక సంఖ్యలో కల రాష్ట్రాల్లో హర్యానా రెండవదిగా నిలుస్తోంది. అనేక జిల్లాల్లో హర్యానా-అల్పసంఖ్యాక వర్గమైన సిక్ఖులు అధిక సంఖ్యలో ఉంటారు. ఈ కారణాల వల్ల పలు సిక్ఖు సంస్థలు పంజాబ్ రాష్ట్ర పునర్విభజన సక్రమంగా జరగలేదని భావిస్తూంటారు.

నాయకులు మార్చు

పంజాబీ సుబా ఉద్యమంలో ప్రధానమైన నాయకులు:

మూలాలు మార్చు

  1. Brass, Paul R. (2005). Language, Religion and Politics in North India. iUniverse. p. 326. ISBN 978-0-595-34394-2.
  2. "Hindu-Sikh relations — I". The Tribune. Chandigarh, India: Tribuneindia.com. 2003-11-03. Retrieved 2010-01-11.
  3. "The Punjab Reorganisation Act, 1966" (PDF). Government of India. 1966-09-18. Retrieved 2011-12-26.
  4. The Sikhs: History, Religion, and Society By W. H. McLeod,Published 1991, Columbia University Press
  5. The Sikhs as a "Minority" in a Sikh Majority State in India, by Paul Wallace, Asian Survey, 1986 University of California Press