పాతాళ భైరవి (సినిమా)

1951 సినిమా

పాతాళ భైరవి 1951 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్ర రాజము. యన్.టి.ఆర్ యుక్తవయస్సు, ప్రతిభ, నేపాళ మాంత్రికునిగా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము, కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు దీనిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకొన్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది.

పాతాళభైరవి
సినిమా విడుదల పోస్టర్
దర్శకత్వంకె.వి.రెడ్డి
స్క్రీన్ ప్లేకె.వి.రెడ్డి
కమలాకర కామేశ్వరరావు
కథపింగళి నాగేంద్రరావు
నిర్మాతనాగి రెడ్డి &
చక్రపాణి
తారాగణంనందమూరి తారక రామారావు ,
ఎస్వీ రంగారావు ,
కె.మాలతి
ఛాయాగ్రహణంమార్కస్ బార్ట్లీ
కూర్పుసి. పి. జంబిలింగం
ఎం. ఎస్. మణి
సంగీతంఘంటసాల
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
15 మార్చి 1951 (1951-03-15)
సినిమా నిడివి
195 ని
భాషలుతెలుగు
తమిళం

మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కథలులోని ఒక కథ, అల్లాఉద్దీన్ అద్భుత దీప కథ, బాల నాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందిన కథల ఆధారంగా ఈ సినిమాకి కథను అల్లుకున్నారు.

 
మాంత్రికునిగా ఎస్.వి.రంగారావు, ప్రక్కన ఎన్.టి.ఆర్.

ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు తోటరాముడు (ఎన్.టి.ఆర్). సాహస కార్యాలంటే ఆసక్తి ఉన్న యువకుడు. అతని సహాయకుడు అంజిగాడు. రాజకుమార్తె ఇందు అప్పుడప్పుడూ ఆ ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటుంది. తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతిని చూసి ప్రేమలో పడతాడు. రాణిగారి తమ్ముడి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదిరించడం, ఆమెను ఒకసారి పాము బారి నుంచి కాపాడటం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసుపడుతుంది. రాజ కుమారి జాతకం చూసిన జ్యోతిష్కులు ఆమెకు బంధు వియోగం ఉందని చెబుతారు. దాంతో రాజు ఆమెను అంతఃపురం విడిచి వెళ్ళవద్దని చెబుతాడు. తోటరాముడు ఆమెను చూడటానికి రహస్యంగా కోటలోకి ప్రవేశించి రాజకుమారిని కలుస్తాడు. ఇంకెప్పుడూ అలాంటి సాహసం చేయవద్దని ఆమె అతన్ని మందలిస్తుంది. తిరిగి వెళ్ళేటపుడు అతన్ని రాజభటులు బంధిస్తారు. రాజు ఆగ్రహంతో అతన్ని ఆ రాత్రికి బంధించి మరునాడే ఉరితీయమని ఆజ్ఞాపిస్తాడు. కానీ ఆ రాత్రి అతన్ని చూడటానికి రాజకుమారి దొంగతనంగా వెళుతుంది. రాజు ఆమెను వెంబడించి వెళ్ళి తోటరాముడిని అతని అంతస్తు గురించి గుర్తు చేసి బుద్ధిగా నడుచుకోమని విడిచిపెట్టేస్తాడు. రాజకుమార్తెను పెళ్లాడాలంటే మహారాజు కోరిన విధంగా సర్వ సంపదలు సాధించడానికి నేపాళ మాంత్రికుని ఆశ్రయిస్తాడు. నేపాళ మాంత్రికుడు కూడా సర్వ లోకాధిపత్యం కోసం ఒక సాహస యువకుడిని పాతాళ భైరవి అనే శక్తికి బలి ఇవ్వడం కోసం వెతుకుతుంటాడు. ఆ మాంత్రికుడు రాముడిని తన బలిపశువుగా ఎన్నుకుంటాడు. రాముడు ఆ మాంత్రికుని సూచనల మేరకు పలు సాహసాలు చేస్తాడు. మాంత్రికుడు అసలు ఆలోచన తెలుసుకొన్న తోటరాముడు అదునుచూసుకొని మాంత్రికుడిని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందుతాడు. తన వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు.

రాజు రాముడి ప్రయోజకత్వానికి సంతోషించి కూతుర్నిచ్చి పెళ్ళి చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. రాముడి పెళ్ళి పిలుపులు విన్న మాంత్రికుని శిష్యుడు సదాజప ఆశ్చర్యపోయి, తన గురువును మాయా దర్పణం ద్వారా పాతాళభైరవి గుహలో విగత జీవుడై పడిఉండటం గమనిస్తాడు. వెంటనే వెళ్ళి సంజీవని మూలికల సహాయంతో తన గురువుగారిని బ్రతికించుకొంటాడు. ఇంతలో ఉజ్జయినిలో రాజుగారి బావమరది తన మేనకోడలితో తనకు పెళ్ళి కావడం లేదని బాధతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మాంత్రికుడు అతన్ని ఆపి, తాను చెప్పినట్లు చేస్తే రాకుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తానని మాట ఇస్తాడు. మాంత్రికుడు చెప్పినట్లు రాముడి పూజా మందిరంలో ఉన్న పాతాళభైరవి శక్తిని తీసుకువచ్చి మాంత్రికునికి అందజేస్తాడు. మాంత్రికుని మాయవలన ఒక్కమారుగా తోటరాముని సంపద మాయమైపోతుంది. పెళ్ళి పీటలపైనున్న రాకుమారిని మాయం చేసి తనతో తీసుకెళ్ళి పోతాడు. మళ్ళీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవడానికి స్నేహితుడు అంజితో కలిసి మాంత్రికుని వెతుక్కుంటూ వెళతాడు. మాంత్రికుడు రాజకుమార్తెను బెదిరించి పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆమె మాత్రం తోటరాముడిని తప్ప మరెవ్వరినీ పెళ్ళి చేసుకోనని చెబుతుంది. దాంతో మాంత్రికుడు తన మంత్రశక్తితో రాముడిని బంధించి తీసుకువచ్చి ఆమె తనను పెళ్ళి చేసుకోకపోతే అతన్ని దేవికి బలి ఇస్తానని బెదిరిస్తాడు. మాయమైపోయిన మిత్రుడి కోసం వెతుకుతున్న అంజికి ఇద్దరు రాక్షసులు ఒక మాయ శాలువ, పాదరక్షలు గురించి పోట్లాడుకోవడం గమనించి తెలివిగా వారి దగ్గర నుంచి వాటిని కాజేస్తాడు. వాటి సహాయంతో రాముడు బంధించి ఉన్న గుహను చేరుకుంటాడు. అక్కడ శాలువాతో అదృశ్య రూపంలో వచ్చి రాముడిని విడిపిస్తాడు. తన దగ్గరున్న శాలువా, పాదరక్షలను రాముడికి ఇస్తాడు. మాంత్రికుడి బారి నుంచి ఎలా బయట పడాలో తెలియక వజ్రపుటుంగరాన్ని నూరి దాన్ని తాగి ఆత్మహత్య చేసుకోబోతున్న ఇందును కాపాడతాడు. అంజి సదాజపకు స్పృహ తప్పించి అతని వేషంలో మాంత్రికుడి దగ్గరకు వెళతాడు. అంజి తెలివిగా మంత్రశక్తులున్న మాంత్రికుడి గడ్డాన్ని తొలగింప జేయిస్తాడు. తర్వాత రాముడు రాకుమార్తె లాగా నటించి అతని దగ్గర్నుంచి పాతాళ భైరవిని కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే సదాజపుడు వచ్చి అడ్డుపడతాడు. అప్పటికే మంత్ర శక్తులు కోల్పోయిన మాంత్రికుడితో రాముడు పోరాడుతుండగా అంజి పాతాళ భైరవి సహాయంతో అందరినీ మహలు తో సహా ఉజ్జయినికి చేర్చమంటాడు. మాంత్రికుడి పీడ దారి మధ్యలోనే వదిలించుకుని అందరూ రాజ్యం చేరుకుంటారు.

తారాగణం

మార్చు

విశేషాలు

మార్చు
  • తోట రాముడు పాత్రకు అక్కినేని నాగేశ్వరరావును, మాంత్రికుడు పాత్రకు ముక్కామలను కె.వి.రెడ్డి తీసుకుందామని అనుకున్నాడు. నాగిరెడ్డి-చక్రపాణిల సూచనను మన్నించి కె.వి. ఓసారి ఎన్.టి.రామారావును పరిశీలించడం అతను చూడడానికి వచ్చినప్పుడే టెన్నిస్ మ్యాచ్ అడుతున్న రామారావు రెండు పాయింట్లు కోల్పోవడంతో కోపగించి బ్యాటును బలంగా పట్టుకుని బంతి విసిరికొట్టడంతో ఓ విధమైన జానపద నాయక లక్షణం కనిపించడంతో అతన్నే హీరోగా తీసుకున్నాడు కె.వి.రెడ్డి. హీరోగా పెద్ద ఇమేజీ లేని నటుడిని తీసుకోవడంతో ప్రతినాయకుడు కూడా ప్రఖ్యాతుడైన ముక్కామల కాకుండా కొత్తవాడు అయివుండాలని ఎస్.వి.రంగారావును తీసుకున్నారు.[2]
  • 1952 జనవరిలో భారతదేశంలోని గోవాలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం పాతాళ భైరవే.
  • తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా చిత్రం ఇదే. తెలుగులో 1951 మార్చి 15న విడుదలైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది.
  • 1980లలో హీరో కృష్ణ సారథ్యంలోని పద్మాలయా సంస్థ జితేంద్ర హీరోగా ఇదే సినిమాను మళ్ళీ హిందీలో, కలర్ లో తీశారు.[3]
  • ఈ సినిమా ఆధారంగా పాతాళ భైరవి (నాటకం) రూపొందింది.

ముఖ్యమైన డైలాగులు

మార్చు
  • సాహసము సేయరా ఢింభకా రాజ కుమారి లభించునురా
  • మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా
  • జనం అడిగింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?
  • జై పాతాళ భైరవి
  • సాష్తాంగ నమస్కారం సెయరా

పాటలు

మార్చు

ఈ సినిమాకు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించగా పింగళి నాగేంద్రరావు పాటలు రాశాడు.[4]

పాట రచయిత సంగీతం గాయకులు
తియ్యని ఊహలు హాయిని గొలిపే పింగళి నాగేంద్రరావు ఘంటసాల పి.లీల
ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షణమో పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.లీల
కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖినీ పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల
కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.లీల
ప్రణయ జీవులకు దేవి వరాలే కానుకలివియే ప్రియురాల హాయిగా మనకింక స్వేచ్ఛగా పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.లీల
ఇతిహాసం వినరా పింగళి నాగేంద్రరావు ఘంటసాల కమలా చంద్రబాబు
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు పింగళి నాగేంద్రరావు ఘంటసాల వి.జె. వర్మ
వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు పింగళి నాగేంద్రరావు ఘంటసాల జిక్కి
తాళలేనే నే తాళలేనే పింగళి నాగేంద్రరావు ఘంటసాల రేలంగి
హాయిగా మనమింకా స్వేచ్ఛగా పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.లీల
రానంటే రానే రాను పింగళి నాగేంద్రరావు ఘంటసాల పిఠాపురం నాగేశ్వరరావు, టి.కె. సావిత్రి
వినవే బాలా నా ప్రేమ గోలా పింగళి నాగేంద్రరావు ఘంటసాల రేలంగి

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
  2. ఎం.ఎల్., నరసింహం (13 April 2013). "పాతాళభైరవి (1951)". ద హిందూ. Retrieved 3 February 2019.
  3. రెంటాల జయదేవ ఇష్టపది సినిమా బ్లాగు
  4. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య