పురుషోత్తమ దాస్ టాండన్

భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు
(పురుషోత్తం దాస్ టాండన్ నుండి దారిమార్పు చెందింది)

పురుషోత్తమ దాస్ టాండన్ (पुरुशोत्तम दास टंडन) (ఆగష్టు 1, 1882జూలై 1, 1962), ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్యసమరయోధుడు. ఈయన హిందీకి భారతదేశ అధికార భాషా స్థాయిని సాధించేందుకు విశేషకృషి చేశాడు[1]. ఈయనకు రాజర్షి అన్న బిరుదు ఉంది.

రాజర్షి

పురుషోత్తం దాస్ టాండన్
జననం(1882-08-01)1882 ఆగస్టు 1
మరణం1962 జూలై 1(1962-07-01) (వయసు 79)
వృత్తిరాజకీయ నాయకుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెసు
పురస్కారాలుభారత రత్న (1961)

తొలి జీవితం

మార్చు

పురుషోత్తమ దాస్ టాండన్, అలహాబాదులోని ఒక ఖత్రీ కుటుంబములో జన్మించాడు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై, చరిత్రలో ఎం.ఏ డిగ్రీని పొంది, 1906లో న్యాయవాదిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. 1908లో తేజ్ బహదూర్ సప్రూకు జూనియర్ న్యాయవాదిగా అలహాబాదు ఉన్నత న్యాయస్థానము యొక్క బార్ లో చేరాడు. 1921లో ప్రజాకార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి న్యాయవాద వృత్తిని త్యజించాడు.

స్వాతంత్ర్యోద్యమం

మార్చు

టాండన్ 1899లో విద్యార్థిరోజుల నుండి భారత జాతీయ కాంగ్రేస్ సభ్యునిగా ఉన్నాడు. 1906లో అఖిల భారత కాంగ్రేసు కమిటీలో అలహాబాదుకు ప్రాతినిధ్యము వహించాడు. టాండన్, 1919లో జలియన్‌వాలా భాగ్ ఉదంతాన్ని అధ్యయనం చేసిన కాంగ్రేసు కమిటీలో పనిచేశాడు. లాలా లజపతి రాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ సొసైటీకి అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.[2] 1920లలో సహాయనిరాకరణోద్యమంలో, 1930లలో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. 1931లో గాంధీ లండన్లో జరిగిన రౌండు టేబుల్ సమావేశము నుండి తిరిగిరాక మునుపే అరెస్టు చేయబడిన వ్యక్తులలో నెహ్రూతో పాటు టాండన్ కూడా ఉన్నాడు. రైతు ఉద్యమంలో ఈయన పోషించిన పాత్రకు గాను చిరస్మరణీయుడు. 1934లో బీహార్ ప్రాంతీయ కిసాన్ సభకు అధ్యక్షునిగా పనిచేశాడు. 1937, జూలై 31 నుండి ఆగష్టు 10, 1950 వరకు 13 సంవత్సరాల పాటు ఉత్తర ప్రదేశ్ శాసనసభ స్పీకరుగా పనిచేశాడు. 1946లో భారత రాజ్యాంగ సభకు ఎన్నికైనాడు[3].

స్వాతంత్ర్యం తర్వాత

మార్చు

1948లో కాంగ్రేసు పార్టీ అధ్యక్ష పదవికై పట్టాభి సీతారామయ్య పై పోటీ చేసి ఓడిపోయాడు. కానీ క్లిష్టమైన 1950 ఎన్నికలలో నాగపూర్ సదస్సుకు నేతృత్వం వహించడానికి ఆచార్య కృపలానీపై గెలుపొందాడు. టాండన్ 1952లో లోక్ సభకు ఆ తర్వాత 1956లో రాజ్యసభకు ఎన్నికైనాడు. ఆ తరువాత క్షీణిస్తున్న ఆరోగ్యము వలన క్రియాశీలక ప్రజాజీవితము నుండి విరమించాడు. 1961లో భారత ప్రభుత్వము టాండన్ ను అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నతో సత్కరించింది[4].

మూలాలు

మార్చు
  1. "Uttar Pradesh Legislative Assembly (UPLA): Prev_Speaker_Purushottam Das Tandon". upvidhansabhaproceedings.gov.in. Archived from the original on 2024-08-31. Retrieved 2024-08-31.
  2. http://www.servantspeople.org/pv.htm[permanent dead link]
  3. "Purushottam Das Tandon | Indian freedom fighter, educationist, social reformer | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). 2024-07-28. Retrieved 2024-08-31.
  4. "Purushottam Das Tandon". Constitution of India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-08-31.

వెలుపలి లంకెలు

మార్చు