పులివర్తి శరభాచారి

పులివర్తి శరభాచారి త్రిభాషాకవి, కవితావధాని, గణితావధాని.

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, కొప్పురావూరు అనే గ్రామంలో 1912లో జన్మించాడు. వడ్డెపాటి నిరంజనశాస్త్రి, కొండపర్తి వీరభద్రాచారి ల వద్ద ఇతడు విద్యను అభ్యసించాడు. బి.ఎ., బి.ఎడ్., పట్టాలను పొందాడు. తరువాత విద్యాశాఖలో చేరి 30 సంవత్సరాలపాటు వివిధ హోదాలలో ఉద్యోగ్యం చేసి చివరికాలంలో గుంటూరు జిల్లా విద్యాధికారిగాను, కడప జిల్లా విద్యాధికారిగాను పనిచేసి 1967లో పదవీ విరమణ చేశాడు. ఇతడు విద్వత్కవి మాత్రమే కాక ఇతనికి గణితం, చిత్రలేఖనం, స్వర్ణశిల్ప విద్యలలో ప్రవేశం ఉంది. ఇతడు గుంటూరులో 1980, సెప్టెంబరు 8న మరణించాడు. [1]

అవధాన విశేషాలు

మార్చు

ఇతడు సుమారు 200 అవధానాలు చేశాడు. ఇతని అవధానాలలో సమస్య, దత్తపది, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం, న్యస్తాక్షరి, వ్యస్తాక్షరి, ఇంగ్లీషు తేదీకి వారము చెప్పుట, యాంత్రిక చిత్రము (9,16,25 గళ్లలో ఎటుకూడిన ఒకే మొత్తము వచ్చుట, Magic Square) వంటి అంశాలు ఉన్నాయి.

ఇతడు ఎడ్లపాడు, చిలకలూరిపేట, పిడుగురాళ్ళ, మోర్జంపాడు, దాచేపల్లి, దుర్గి, జూలకల్లు, రెంటచింతల, తుమురుకోట, పొందుగల, మాచవరం, తక్కిళ్ళపాడు, పిల్లుట్ల, కార్యంపూడి, గురజాల, గుత్తి, పత్తికొండ, రాయదుర్గము, ఎల్లనూరు, తిమ్మంపల్లి, ఉరవకొండ, గుడివాడ, ఆలూరు, కనికల్లు, గుంటూరు మొదలైన చోట్ల అవధానాలను నిర్వహించాడు.

రచనలు

మార్చు

తెలుగు

మార్చు
  1. కల్హారమాల
  2. రత్నగర్భ
  3. కర్మభూమి
  4. క్రీస్తు శతకము
  5. విద్యాలయ గీతాలు

సంస్కృతము

మార్చు
  1. నివేదనమ్‌
  2. మరుత్ సందేశః
  3. యశోధరా
  4. నతిమాలా
  5. సంగీత నాటికా
  6. కలాదర్శః
  7. మాణిక్య జ్యోతిః
  8. శ్రీ రాధాకృష్ణ తేజశ్రీ

ఇంగ్లీషు

మార్చు
  1. Towards Brighter Schools
  2. The Yon Voice
  3. Doctor's War
  4. Stray Leaves and Petals
  5. The Petals of Muse

అవధానాలలో పూరణలు

మార్చు

ఇతడు వివిధ అవధానాలలో పూరించిన పద్యాలు కొన్ని:

  • సమస్య:గోకులాష్టమి నాడు ముక్కోటి యయ్యె

పూరణ:

క్రొత్తగాఁ బెండిలిని చేసికొన్న యొకడు
పాపమర్ధాంగి వలనఁచీవాట్లు దినుట
తప్పదాయెను; అటులె అతనికిఁదిట్లు
గోకులాష్టమి నాడు ముక్కోటియయ్యె

  • సమస్య: కారం బెక్కువయయ్యె పాయసమునన్ కంజాత పత్రేక్షణా!

పూరణ:

ద్వారం బించుకవేసి పండువని, కాంతారత్నమన్నంబుతో
గారెలు బూరెలు కూరలుంచి పతికిన్ కౌతుహలం బిచ్చు
క్షీరాన్నం బిడ, భర్త యిట్టులనె భేష్ నీ వంట, ఇస్సీ, జలా
కారం బెక్కువయయ్యె పాయసమునన్ కంజాత పత్రేక్షణా!

  • దత్తపది: రామ- లక్ష్మణ - భరత - శతృఘ్న అనే పదాలతో భారతార్థములో పద్యం

పూరణ:

సఖుడ! రూపాభిరామ లక్ష్మణుడు, ఘన సు
యోధన సుతుండు శశిరేఖ నుద్వహింప
బ్రణయ సౌరభరతుడయ్యు, రణ జిగీష
నైజ శత్రుఘ్నతయు లేని నాపయయ్యె

మూలాలు

మార్చు
  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (260-265 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి.