పెళ్లి కూతురు (1970 సినిమా)

పెళ్లి కూతురు వి. రామచంద్రరావు దర్శకత్వంలో శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.బాబ్జీ నిర్మించిన తెలుగు సినిమా. 1970లో విడుదలైన ఈ సినిమాలో కృష్ణ, షావుకారు జానకి ప్రధాన పాత్రలను పోషించారు.

పెళ్లి కూతురు
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. రామచంద్రరావు
తారాగణం కృష్ణ,
షావుకారు జానకి
కృష్ణంరాజు
సంగీతం ఎస్.పి.కోదండపాణి
నిర్మాణ సంస్థ శ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

సంక్షిప్త చిత్ర కథ

మార్చు

ఆ పల్లెటూరికి గబ్బిలాల సుబ్బన్న మునసబు. అతడు ఆ ఊరికి తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వాడు. అతడికి ఆడపిల్లలంటే మోజు. లక్ష్మిని పెళ్ళి చేసుకుందామనుకున్నాడు. కాని పార్వతికి ససేమిరా ఇష్టం ఉండదు. తల్లిలేని భూషయ్య కొడుకు సూర్యాన్ని పార్వతి చిన్నప్పటి నుండి కన్నతల్లిలా పెంచింది. పార్వతి కూతురు లక్ష్మి అంటే సూర్యానికి తీరని ప్రేమ అభిమానం. లక్ష్మికి మంచి వరుణ్ణి తెచ్చి పెళ్ళి చేస్తానని పార్వతికి మాట ఇస్తాడు. భద్రకాళి తన కొడుకు అంజికి లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంది. భర్త పరమయ్య ఎంత నసుగుతున్నా పుట్టినరోజు పండగకి అందరినీ పిలుస్తుంది. కాంట్రాక్టర్ చలపతిరావు కొడుకు మధు ఆ గ్రామానికి వస్తాడు. వాళ్ళు కూడా దూరపు చుట్టమైన భద్రకాళి ఇంటికి పుట్టినరోజు పండగకి వస్తారు. మోహన్, లక్ష్మి ఒకర్నొకరు ఆకర్షించుకుంటారు. సూర్యం సంతోషిస్తాడు. మారువేషంలో వచ్చిన స్వాములవారిని తన భర్త అని పార్వతి గుర్తుపడుతుంది. రహస్యంగా తన భర్తని పార్వతి ఊరిబయట కలుసుకుంటుంది. ఇది సుబ్బన్న పసిగడతాడు. భద్రకాళి లక్ష్మికి అంజిని ఇవ్వాలన్న కోరిక తీరకపోగా లక్ష్మీ మోహన్‌ల వివాహం నిశ్చయమైంది. సుబ్బన్న భద్రకాళిని కలిసి పార్వతి కుటుంబం మంచిది కాదని చలపతిరావుకి నచ్చచెప్పి నమ్మిస్తారు. చలపతిరావు పీటలమీది పెళ్ళిని ఆపేస్తాడు. సూర్యం పట్నం వెళ్ళి పెళ్ళిళ్ళ పేరయ్య సాయంతో నిత్యానందం అనే లక్షాధికారిని, అతని తల్లిని పెళ్లి చూపులకు తీసుకువస్తాడు. కానీ పెళ్లికొడుకు పచ్చితాగుబోతు అని తెలుసుకుని రాజు వాళ్ళని చావబాదుతాడు. సుబ్బన్న ఆనందంతో వాళ్ళని బండెక్కించి సాగనంపుతాడు. రాజు పెళ్ళిళ్ళు ఆగిపోవడానికి తానే కారణమని పోలీసులకు లొంగిపోయి నిజం చెబుతానంటాడు. పార్వతి రాజుదగ్గర ప్రమాణం తీసుకుంటుంది. సూర్యం మళ్ళీ పట్నంవెళ్లి తన బాల్యస్నేహితుడు కుమార్‌ని కలుసుకుంటాడు. పెళ్ళికి ఒప్పిస్తాడు. తను కుమార్ చెల్లెలు అంధురాలైన కల్యాణిని పెళ్ళి చేసుకుంటానంటాడు. సరిగ్గా తాళి కట్టే సమయానికి కుమార్‌ను పోలీసులు అరెస్టు చేస్తారు. ఇదంతా మోహన్ పెళ్ళి పీటల మీద నుండి లేచిపోవడం వల్ల వచ్చిందనే కోపంతో సూర్యం మోహన్ని చంపివేస్తానంటూ బయలుదేరుతాడు. మోహన్ని ఒప్పిస్తాడు. ఇద్దర్నీ హాల్లో తుపాకీతో ఎదిరిస్తాడు చలపతిరావు. ఇంతలో అక్కడికి వచ్చిన రాజు నిజం బయటపెడతాడు. చలపతిరావు పశ్చాత్తాపపడి మోహన్ పెళ్ళికి అంగీకరిస్తాడు. రాజు కోసం పోలీసులు చుట్టుముడతారు. పారిపోతున్న రాజుని కాలుస్తారు. అద్భుతమైన ధైర్యసాహసాలతో సూర్యం దెబ్బతిన్న రాజును భుజాలపై మోసుకుని ఇంటికి చేరుస్తాడు. మోహన్‌కి లక్ష్మికి పెళ్ళవుతుంది. కొనప్రాణంతో ఉన్న రాజు కూతురిని, అల్లుడ్నీ దీవిస్తాడు. పార్వతి సుమంగళిగా రాజు ఒడిలో మరణిస్తుంది. రాజు ఆమెను అనుసరిస్తాడు.[1]

పాటలు

మార్చు
పాటల వివరాలు
క్ర.సం పాట గాయకులు రచన
1 వెర్రిమొర్రి వెంగళప్ప పుట్టిన రోజంట ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎల్.ఆర్.ఈశ్వరి,
పిఠాపురం
ఆరుద్ర
2 రాముని రూపమె మోహనము శ్రీరాముని రూపమె మోహనము పి.సుశీల దాశరథి
3 చక్కనిపిల్ల పక్కన వుంది గడుసరివని సొగసరివని కన్నువేసేనోయ్ పి.సుశీల సి.నారాయణరెడ్డి
4 మేలిమి బంగరు నెలతల్లారా ఆటలపాటల పేటికలారా పి.సుశీల గురజాడ
5 ఆ రంగనాథుని పూలరథమెల్ల వారిలోనూ ఊరేగింపొస్తుంది ఊరేగింపొస్తుంది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
మాధవపెద్ది
కొసరాజు

6: ఆలకించవా నా మొర మురళీధర , గానం. పి సుశీల .

మూలాలు

మార్చు
  1. గంగాధర్ (1970). పెళ్లి కూతురు పాటలపుస్తకం (1 ed.). p. 8. Retrieved 22 May 2021.