పిల్లలు

(బిడ్డ నుండి దారిమార్పు చెందింది)

ఇంకా యుక్త వయసు రాని అమ్మాయిలను, అబ్బాయిలను పిల్లలు లేదా బిడ్డలు (Children) అంటారు.[1][2] అయితే, తల్లితండ్రులు తమ సంతానాన్ని ఎంతటి వయసు వారైనా పిల్లలు అని అంటారు. మానవ జీవితంలో ఈ దశను బాల్యం (Childhood) అంటారు. యవ్వన లక్షణాలు కొంతమంది పిల్లలలో తొందరగా వస్తాయి.[3][4] ఈ పదం ఒకవిధంగా ఆలోచిస్తే ఏ వయసుకు చెందినవారికైనా వర్తిస్తుంది. ఉదా. పెద్దవాళ్ళు కూడా వారి తల్లిదండ్రులకు పిల్లలే కదా. ఇది పిల్ల మొక్కలకు కూడా వాడవచ్చును. ఒకేసారి పుట్టిన పిల్లలను కవలలు అంటారు.

పాఠశాలలో చదువుతున్న పిల్లలు.
వ్రాస్తూ

చట్టపరమైన నిర్వచనం

మార్చు

వివిధ దేశాలలో పిల్లలను చట్టపరంగా 'మైనర్' అని నిర్వచిస్తారు. The Convention on the Rights of the Child నిర్వచనం ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మానవుల్ని పిల్లలుగా భావిస్తారు.[5]

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో పిల్లలకు సంబంధించిన ప్రయోగాలు ఉన్నాయి.[6] దీని ప్రకారం పిల్లలంటే బిడ్డలు అని కూడా అర్ధం వస్తుంది. వాడుక భాషలో పిల్లకాయ, పిల్లవాడు, పిల్లగాడు, పిల్లడు, పిల్లది, మొదలైన ఉపయోగాలున్నాయి. తల్లిదండ్రుల్ని పిల్లలుగలవారని చెప్పవచ్చును. కొన్ని జంతువుల సంతానాన్ని పిల్లలనే పిలుస్తారు ఉదా: కుక్కపిల్ల, పులిపిల్ల, కోడిపిల్ల, మేకపిల్ల. గర్భం నిండిన తర్వాత బిడ్డల్ని కనడాన్ని పిల్లలువేయు లేదా పిల్లలు పెట్టు అని అంటారు. పరిమాణంలో చిన్నవిగా కొన్నింటికి పిల్ల అని ముందుగా చేరుస్తారు ఉదా: పిల్లపర్వతము, పిల్లగాలి, పిల్లదూలము, పిల్లసంగీతము, పిల్లకాలువ, పిల్లబావి. వేణువును పిల్లగోట్లు. పిల్లంగ్రోవి, పిల్లనగ్రోవి, పిల్లగ్రోవి లేదా పిల్లగ్రోలు అని కూడా అంటారు. మన శరీరంలోని కొన్ని భాగాల్ని కూడా పెద్ద చిన్న భేదంతో చెప్పడానికి పిల్ల శబ్దాన్ని చేరుస్తారు. ఉదా: పిల్లపేగులు లేదా చిన్నపేగులు, పిల్లవ్రేలు లేదా చిటికినవ్రేలు.

బాలుడు-బాలిక

మార్చు
 
బాలిక

5 వ సంవత్సరము నుండి 12 సంవత్సరముల వయసు వరకు అమ్మాయి లను బాలిక అంటారు. బాలిక దశ దాటిన అమ్మాయి యువతిగా పిలవబడుతుంది.

బాలుడు అనగా కౌమార దశలో ఉన్న మగ పిల్లవాడు అని అర్థం.

 
అమెరికన్ స్కౌట్ బాలురు.

ప్రతి సంవత్సరం అక్టోబరు 11అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించబడుతోంది.[7]

పిల్లల్ని చదువుకోనీకుండా పనిలో ఉపయోగించి బాల కార్మికులుగా చేయడం సరైనది కాదు. పేదవారైన తల్లిదండ్రులు దీనిని ప్రోత్సహిస్తున్నా, ఇళ్ళలో, కర్మాగారాలు, హోటల్లు మొదలైన వాటిలో వీరితో పనిచేయించుకోవడం బాల కార్మిక చట్టం ప్రకారం ఇది నేరం.

పిల్లలను కొట్టటంనేరం

మార్చు

పిల్లలను వారి 'మంచి కోసం' శిక్షిస్తే.. దాని నుంచి ఉపాధ్యాయులు, పెద్దలకు భారత శిక్షాస్మృతిలోని 88, 89 విభాగాలు రక్షణ కల్పిస్తున్నాయి.పన్నెండేళ్లలోపు వ్యక్తిపై వారి మంచి కోసం ఉద్దేశించి చేసిందైతే' దానిని నేరంగా పరిగణించరాదని ఈ విభాగాలు పేర్కొంటున్నాయి.'పిల్లలు ఎంతో అమూల్యమైన వారు. దేశానికి భవిష్యత్తు వారే. పిల్లలెవరూ హింసలకు గురి కారాదు. దాని కారణంగా వారు అప్రయోజకులుగా మారటం, వ్యవస్థ నుంచి దూరం కావటం వంటివి తగదు అని పిల్లలను కొట్టటం వంటి భౌతికశిక్షలకు పాల్పడిన అందరినీ శిక్షార్హులుగా చేయాలని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) భావిస్తోంది. ఇందుకోసం భారత శిక్షాస్మృతి (ఐపీసీ) ని సవరించాలని కోరనుంది.

పాలు ఎరుగని పసిబుగ్గలు

మార్చు
 
చలినుండి వివిధరకాలైన దుస్తులతో రక్షించబడిన పసిపాప.

రాష్ట్రంలో 75 శాతం మంది పిల్లలకు పాలు తాగే స్తోమత లేదు.73 శాతం మంది పండ్లు తినేది నెలకో, ఏడాదికో అని ప్రణాళికా సంఘం అధ్యయనంలో చేదునిజాలు వెల్లడయ్యాయి.మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని వారంతా కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తుంటారు. బడి గంట కొట్టగానే బిలబిలమంటూ కంచాలు చేతపట్టి భోజనానికి వరుసలో నిలబడతారు. అన్నం, సాంబారు కలుపుకొని అవురావురుమంటూ తింటారు. రాత్రికి ఇంటిలో మళ్లీ అరకొర భోజనం. ఇంట్లో పాలు, పళ్లు, పప్పు ధాన్యాలు, కూరగాయాలు వంటి పౌష్టికాహారమేదీ అందుబాటులో ఉండదు. ఇటువంటి దయనీయ దుస్థితి ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో మరీ ఎక్కువ. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని భుజిస్తున్న పిల్లలకు వారి ఇళ్లవద్ద ఇంకేమీ పోషకాహారమంటూ లభించటంలేదు.

  • 60.24 శాతం మంది పిల్లలు వ్యవసాయ, ఇతర కార్మికుల కుటుంబాలకు చెందినవారు. వీరి కుటుంబ వార్షికాదాయం దేశ మొత్తం మీద ఇక్కడే అతి తక్కువగా కేవలం రూ.16,672గా ఉంది. దీంతో ఇళ్లల్లో పిల్లలకు పోషకాహారమంటూ ఏదీ లభించటంలేదు.
  • మన రాష్ట్రంలో ఇళ్లల్లో పాలు తాగే ఆర్థిక స్తోమతలేని పిల్లల సంఖ్య ఏకంగా 75.07 శాతం. (దేశ సగటు- 39.98 శాతం). ఇంతటి దుస్థితి మరే ఇతర రాష్ట్రంలోనూ లేదు. రాష్ట్రంలో 16.43 శాతం మంది మాత్రమే రోజూ పాలను తాగుతుంటారు. 7.93 శాతం మంది వారంలో అప్పుడప్పుడు, 0.57 శాతం మంది నెలకో, ఏడాదికో కొన్ని సార్లు తాగుతుంటారు.
  • రాష్ట్రంలో కేవలం 6.52 శాతం మంది మాత్రమే రోజూ పండ్లు తింటారు. 2.83 శాతం వారంలో అప్పుడప్పుడు, 73.09 శాతం మంది నెల, ఏడాదిలో అప్పుడప్పుడు తింటారు. 17.56 శాతం మంది అసలు పండ్లనేవే తినరు. నిత్యం పండ్లు తినేవారి దేశ సగటు 12 శాతం కాగా మన రాష్ట్రంలో మాత్రం అందులో సగమే ఉంది.
  • ఇళ్లల్లో పప్పుల వాడకంలో మన రాష్ట్ర పిల్లల పరిస్థితి అత్యంత దయనీయం. దేశవ్యాప్తంగా సగటున 59.22 శాతం మంది పిల్లలు ప్రతిరోజు పప్పులు తింటుంటే.. రాష్ట్రంలో అది కేవలం 16.43 శాతంగా నమోదయింది. 81.59 శాతం మంది పిల్లలు వారంలో అప్పడప్పుడు మాత్రమే తినగలుగుతున్నారు.
  • దేశంలో సగటున 59.22% మంది తమ ఇళ్లల్లో రోజూ కూరగాయలు తింటుండగా.. అటువంటి వారి సంఖ్య మన రాష్ట్రంలో కేవలం 16.43 శాతమేనని తేలింది.

క్షణికావేశం.... భవిష్యత్తు గురించి ఆలోచన లేని అమాయకత్వం.... అమ్మ తిట్టిందనో! నాన్న కొట్టాడనో... ఇంటి నుంచి పారిపోయే బాలలు ఎందరో. అలా ఇంటినుంచి పారిపోయి వచ్చి నగరంలో అల్లరి మూకల చేతిలో పడితే రౌడీలుగానో, దళారీల మాయలోపడితే బాల కార్మికులుగా, సంఘవిద్రోహక శక్తులుగా మారి దారి తప్పుతున్నవారు అనేకం. అనాథ బాలల కోసమే రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ వద్ద దళారీలు గుంట నక్కల్లా పొంచి ఉంటారు. కనిపించిన తక్షణం మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుంటారు. అనంతరం వెట్టి చాకిరీ కోసం హోటళ్లకు, పరిశ్రమలకు విక్రయిస్తారు. వివిధ కారణాలతో ఇంటి నుంచి పారిపోయి వచ్చే బాలలు సాధారణంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌, మార్కెట్‌ ప్రాంతాల్లో తలదాచుకుంటారు. నెలకు సగటున 25వేల మంది బాలలు ఇళ్ల నుంచి పరారై నగరాలకి వస్తుంటారని అంచనా. వారు వీధుల్లోనే జీవితాల్ని వెళ్లదీయడమో, బాల కార్మికులుగా మారడమో జరుగుతుంది. వీధి బాలల ఆశ్రయ కేంద్రాలకు నిర్వహణ ఖర్చులు కొంత ప్రభుత్వం నుంచి, కొంత దాతృత్వ సంస్థల నుంచి సాయంగా అందుతుంటుంది. పిల్లలు తప్పిపోయిన తల్లిదండ్రులు ఏదేని నెట్‌ సెంటర్‌ నుంచే పిల్లల వివరాల్ని తెలపవచ్చు. ఈ సమాచారం బాస్కో తదితర స్వచ్ఛంద సంస్థలకు అందుతుంది. తప్పిపోయిన పిల్లాడి ఫోటోను కూడా అప్‌లోడ్‌ చేయవచ్చు. ఇందుకు వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.[8]

పాపాయి మీద గేయాలు

మార్చు
నవమాసములు భోజనము నీరమెరుగక, పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో, నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన, ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార లన్నంబుగా తెచ్చుకొన్న యతిధి
బట్ట కట్టడు, బిడియాన బట్టువడడు,ధారుణీ పాఠశాలలో చేరినాడు
వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత కరపి యున్నది వీని కాకలియు నిద్ర
బొటవ్రేల ముల్లోకములు జూచి లోలోన నానందపడు నోరులేని యోగి
తల్లి తండ్రుల తనూ వల్లరీ ద్వయికి వన్నియ పెట్టు తొమ్మిది నెలల పంట
అమృతంబు విషమను వ్యత్యాస మెరుగక ఆస్వాదింప చను వెర్రిబాగులాడు
అనుభవించు కొలంది నినుమడించుచు మరందము జాలువారు చైతన్య ఫలము
భాష రాదు, వట్టి పాలు మాత్రమె త్రాగు, నిద్రపోవు, లేచి నిలువలేడు .. (చిన్ని నాన్న)
ఎవ్వరెరుంగరితని దేదేశమో గాని, మొన్న మొన్న నిలకు మొలిచినాడు
కౌగిట్లో కదలి గారాలు కురుస్తాడు! ఉయ్యేల్లో, ఉల్లంలో ముద్దులు మురిపిస్తాడు
గానమాలింపక కన్నుమూయని రాజు అమ్మ కౌగిటి పంజరంపు చిలక
కొదమ కండలు పేరుకొను పిల్ల వస్తాదు, ఊయేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊ లు నేర్చిన యొక వింత చదువరి, సతిని ముట్టని నాటి సాంబమూర్తి
ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి, తన ఇంటి క్రొత్త పెత్తనపుదారి
ఏమి పనిమీద భూమికి నేగినాడొ, నుడువ నేర్చిన పిమ్మట నడుగవలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొకాని, ఇప్పటికి మాత్ర మేపాప మెరుగడితడు !
ఊయేల తొట్టి ఏముపదేశ మిచ్చునో, కొసరి యొంటరిగ నూ కొట్టుకొనును
అమ్మ తో తనకెంత సంబంధమున్నదో, ఏడ్చి యూడిగము చేయించుకొనును
పరమేశ్వరుండేమి సరసంబులాడునో, బిట్టుగా కేకిసల్ కొట్టుకొనును
మూనాళ్ళలోన ఏప్పుడు నేర్చుకొనియెనో, పొమ్మన్నచో చిన్నబుచ్చుకొనును
ముక్కుపచ్చలారిపోయి ప్రాయము వచ్చి, చదువు సంధ్య నేర్చి బ్రతుకునపుడు
నాదు పసిడికొండ, నా రత్నమని, తల్లి పలుకు పలుకులితడు నిలుపుగాక ! -------గుర్రం జాషువా(పాడింది --ఘంటసాల)
  • పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు
పాపాయి నవ్వినా పండగే వచ్చినా పేదల కన్నుల కన్నీరే..నిరు పేదల కన్నుల కన్నీరే
చల్లని వెన్నెల సోనలు, తెల్లని మల్లెల మాలలు, మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు ...శ్రీశ్రీ
  • పాపాయి కన్నులు కలువ రేకుల్లు పాపాయి జులపాలు పట్టు కుచ్చుల్లు
పాపాయి దంతాలు మంచిముత్యాలు పాపాయి పలుకులు పంచదార చిలకలు --
  • బంగారు పాపాయి బహుమతులు పొందాలి (2)

పాపాయి చదవాలి మా మంచి చదువు (2) పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి కళలన్నిచూపించి ఘనకీర్తి తేవాలి ఘన కీర్తి తేవాలి (2) బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు

మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప ఎవ్వరీ పాప అని ఎల్లరడగాలి పాపాయి చదవాలి మా మంచి చదువు (2) బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు (2)

తెనుగు దేశము నాది తెనుగు పాపను నేను (2) అని పాప జగమంత చాటి వెలిగించాలి మా నోములపుడు మాబాగ ఫలియించాలి (2) బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు --మంచాల జగన్నాధరావు (సంగీతం- సాలూరి హనుమంతరావు, పాడింది:రావు బాల సరస్వతీ దేవి)

బాల్య వివాహాలు

మార్చు

18 ఏళ్ళు నిండని పిల్లలకు వివాహం చేయడాన్ని 'బాల్య వివాహాలు' అంటారు.పది సంవత్సరాలు కూడా నిండని పసిపిల్లలకు పూర్వం పెళ్ళి ల్లు చేసేవారు. పది సంవత్సరాలు నిండని కన్యను నీ చేతుల్లో పెడుతున్నాననే పెళ్ళి మంత్రంతో కన్యాదానం జరుగుతుంది.ఇప్పుడు బాల్య వివాహాలు నేరం.

బాలభటులు

మార్చు

బాలమేధావులు

మార్చు

18 ఏళ్ళ లోపు వయసులోపే ఏదో ఒక రంగంలో తన వయసుకు మించిన మేధస్సు, ప్రతిభ కనబరిచిన వాళ్ళు:

సాహస బాలలు

మార్చు

ప్ర్రాణాలకు తెగించి దైర్యసాహసాలు చూపి ఇతరులను రక్షించిన 6 నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలకు సాహస బాలల అవార్డులు ఇస్తారు:

  1. జాతీయ దైర్యసాహసాల అవార్డు 1957 నుండి
  2. గీతా చోప్రా, సంజయ్ చోప్రా అవార్డులు 1978 నుండి
  3. భారత్ అవార్డు 1987 నుండి
  4. బాపు గయదాని అవార్డు 1988 నుండి

తెలుగు సాహస బాలలు

మార్చు
  • బోయ గీతాంజలి (12) : అనంతపురం. 7 గురు నక్సలైట్లతో పెనుగులాడి ఒక శాసనసభ్యురాలిని కాపాడింది (2004)
  • వి.తేజశాయి : విజయవాడ మున్నేరు నదిలో తన సహచర విద్యార్థులను కాపాడి చనిపోయాడు (2006)
  • సి.వి.యస్. దుర్గ దొండేశ్వర్ : విజయవాడ మున్నేరు నదిలో తన సహచర విద్యార్థులను కాపాడి చనిపోయాడు (2006)
  • రాయపల్లి వంశీ : నాగావళి నదిలోదూకి 5 గురు బాలికలను రక్షించాడు (2007 )
  • కవంపల్లి రాజకుమార్ 2007
  • పింజారి చినిగిసాహెబ్ 2007
  • తోటకూర మహేష్2002
  • జి. క్రాంతికుమార్ 2002
  • బి. శాయి కుశాల్ 2004: అడవి ఎలుగుబంటిపై అదే పనిగా రాళ్ళురువ్వి ఒక ముసలమ్మను కాపాడాడు.
  • చనిగళ్ళ సుశీల 2005: ఆలూరు, చేవెళ్ళ.బాల్య వివాహానికి వ్యతిరేకించి పోరాడింది
  • నాగరాణి వెంకటేశ్వరరావు 2005 :పెడన.

బాలభక్తులు

మార్చు

పండుగలు

మార్చు

సంతానలేమి

మార్చు

మన దేశంలో 20% సంతానానికి నోచుకోని జంటలున్నాయి. దీనిని వంధ్యత్వం లేదా సంతానలేమి అంటారు. ఇలాంటి 60 శాతం బాధితుల్లో వీర్యంలోనే లోపాలున్నాయి. శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవడానికి మానసిక, శారీరక ఒత్తిడి ప్రధాన కారణం. మద్యపానం, ధూమపానం, బిగుతైన లోదుస్తులు, ప్యాంట్లు ధరించడం, ఎక్కువగా వేడి ఉన్న నీటితో స్నానం చేయడం, ఎక్కువ గంటలు కూర్చుని ఉండడం, అధిక బరువు, ల్యాప్‌ టాప్‌లను అధికంగా వినియోగించడం కూడా ప్రముఖంగా చెప్పుకోవాల్సిన కారణాలే .

సంతాన సాఫల్యం

మార్చు

రజస్వల అయిన తర్వాత నుంచీ మహిళల్లో అండాల విడుదల తీరుతెన్నులు... ఆ వ్యక్తి ఏ వయసు వరకూ గర్భం దాల్చవచ్చు అనే అంశాన్ని అంచనా వేసి ముందే చెప్పేయగల విధానాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. స్త్రీలలో అండాల విడుదల ప్రక్రియ వేగాన్ని... ఎప్పటిదాకా ఆ సామర్థ్యం కొనసాగుతుందన్న అంశాన్ని చెప్పేయగల 'ఫ్రెజైల్‌-ఎక్స్‌' అనే జన్యువును పరిశోధకులు కనుగొన్నారు. 18 ఏళ్ల నుంచే ఈ పరీక్షద్వారా ఆ మహిళలో ఎంతకాలం పాటు అండోత్పత్తి చురుగ్గా సాగుతుంది అనే విషయాన్ని ఈ జన్యువు సూచిస్తుంది. దాన్నిబట్టి ఆయా మహిళలు బిడ్డకోసం ప్లాన్‌ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వివాహమైన వెంటనే...లేదంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గర్భం ధరించేలా ఆ అండాలను భద్రపరచుకునేందుకు ఈ ఆవిష్కరణ ఎంతగానో దోహదపడుతుంది. (ఈనాడు7.11.2009)

పిల్లలే మనకు పాఠాలు

మార్చు

మీ ఇంట్లోనే ఓ వ్యక్తిత్వవికాస గురువు ఉన్నాడు. బోసినవ్వులతో కర్తవ్యం బోధిస్తాడు. తీపి మాటలతో అనుగ్రహ భాషణం చేస్తాడు. బుడిబుడి నడకలతో మీ దారెటో చెబుతాడు. ఆ పసివాడి బాల్యమే మీకు సందేశం. ఆ మాటలు, ఆ ఆటలు, ఆ నవ్వులు, ఆ చేష్టలు.. .బాల్యమంతా విజ్ఞాన సర్వస్వమే. బుడిబుడి అడుగులు... పడతారు, లేస్తారు, నడుస్తారు... మళ్లీ పడతారు, మళ్లీ లేస్తారు, మళ్లీ నడుస్తారు. ఎన్నిసార్లు పడతారో, ఎన్నిసార్లు లేస్తారో, ఎన్నిమైళ్లు నడుస్తారో లెక్కేలేదు. నడక వచ్చేదాకా ఆ దెబ్బలు భరిస్తూనే ఉంటారు. ఆ నొప్పులు అనుభవిస్తూనే ఉంటారు. అడుగులేసే దశలో పసివాళ్లు రోజుకు ఆరేడుగంటలు నడక నేర్చుకోడానికే కేటాయిస్తారట. బాగా నడవడం వచ్చేసరికి, ఇరవై తొమ్మిది ఫుట్‌బాల్‌ మైదానాలు చుట్టొచ్చినంత దూరం నడుస్తారట . దాదాపు పదివేల మెట్లు ఎక్కి దిగుతారట. నడక రాగానే...'హమ్మయ్య! సాధించేశాం' అని చంకలు గుద్దుకోరు. విశ్రాంతి తీసుకోరు. పరుగెత్తడం నేర్చుకుంటారు. గెంతడం నేర్చుకుంటారు. ఎక్కడం నేర్చుకుంటారు. జారడం నేర్చుకుంటారు. సైకిలు తొక్కడం నేర్చుకుంటారు. ఈతకొట్టడం నేర్చుకుంటారు. ఆ ప్రయత్నాల్లో చేతులు గీసుకుపోతాయి. మోకాలి చిప్పలు పగిలిపోతాయి. అయినా వెనుకడుగు వేయరు. అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. పెద్దలూ పసిపిల్లలే మీకు పడిలేచే పాఠాలు.

మాటల్లోతప్పులు దొర్లితే, అంతా నవ్వుతారని తెలుసు. అయినా, ధైర్యంగా మాట్లాడతారు. మాటలన్నీ వచ్చేదాకా మాట్లాడుతూనే ఉంటారు. ఇంట్లో ఒక భాష, వీధిలో ఒక భాష, బళ్లో ఒక భాష. తొలిదశలో కాస్త తికమకపడ్డా, తొందర్లోనే అన్నీ ఒంటబట్టించుకుంటారు. పసిపిల్లలు రెండేళ్ల వయసు నుంచి పొద్దున్న నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేలోపు సగటున గంటకో కొత్తపదం నేర్చుకుంటారని అంచనా. పదిహేనేళ్లు వచ్చేసరికి పెద్ద పదకోశమే తయారవుతుంది. ఆ తర్వాత తొంభై ఏళ్లు బతికినా వందేళ్లు బతికినా... ఆ పదకోశంలో చేరేది ఏ వేయిపదాలో రెండు వేల పదాలో!పెద్దయ్యాక కష్టపడి కొత్త భాషలు నేర్చుకున్నా, అంతంత పరిజ్ఞానమే. పసిపిల్లల్లా తమకేమీ తెలియదనుకునేవారే ఏమైనా నేర్చుకోగలరు.

పసివాడికి అమ్మానాన్నల మీదో గురువు మీదో ఉన్న నమ్మకం, భార్యకు భర్తమీదో భర్తకు భార్యమీదో ఉంటే కాపురాల్లో గొడవలుండవు. అనుబంధాల్లో బీటలుండవు. ఆత్మహత్యలుండవు. హత్యలుండవు. ముందు మీరంతా మార్పుచెంది పిల్లల్లాగా అవకపోతే స్వర్గంలో ప్రవేశించలేరు అంటుంది బైబిలు (మత్తయి 18.3). పురాణాల్లోని సనక సనందాదులు కూడా నిత్యబాల్యాన్ని వరంగా పొందారు. పసిపిల్లలంత స్వచ్ఛంగా ఉండేవారే మంచి నాయకులు అవుతారు. బాలల్లోని జిజ్ఞాస, నిజాయతీ, చొరవ... మనకు అనుసరణీయం. (ఈనాడు8.11.2009)

మూలాలు

మార్చు
  1. yourdictionary.com: Child
  2. మూస:Cite webgdscbmvxfvvnñcxtbzfhvdyhczf dt etc&' st,v💘🌅🎀ff😉💝😭
  3. Edwards, Jonathan (2007-05-17). "Helping my son improve his game". allexperts.com. Archived from the original on 2007-10-17. Retrieved 2007-10-16.
  4. Yearbook of the National Society for the Study of Education
  5. "Convention on the Rights of the Child". Office of the United Nations High Commissioner for Human Rights. Ratified by 192 of 194 member countries.
  6. బ్రౌన్ నిఘంటువులో పిల్ల పదంతో భాషా ప్రయోగాలు.[permanent dead link]
  7. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (11 October 2019). "నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం". www.andhrajyothy.com. Archived from the original on 11 October 2020. Retrieved 11 October 2020.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-08-28. Retrieved 2020-01-14.
  9. ఆంధ్రభూమి, మెయిన్ ఫీచర్ (24 May 2018). "మరపురాని చిహ్నాలు!". www.andhrabhoomi.net. కందగట్ల శ్రవణ్‌కుమార్. Archived from the original on 24 మే 2018. Retrieved 26 May 2020.
  10. సాక్షి, ఎడ్యుకేషన్ (22 May 2020). "మే 25 వరల్డ్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే(ప్రపంచ తప్పిపోయిన బాలల దిన్సోవం)". www.sakshieducation.com. Archived from the original on 25 May 2020. Retrieved 26 May 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=పిల్లలు&oldid=4010837" నుండి వెలికితీశారు