బుద్ధిమంతుడు (సినిమా)

బుద్ధిమంతుడు , 1969లో విడుదలైన తెలుగు సినిమా. తరాల అంతరాలు కారణంగా విభిన్న మనస్తత్వాలు కలిగిన అన్నదమ్ముల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలను సున్నితంగా ఈ సినిమాలో చిత్రీకరించారు. అదే సమయంలో ఊరిలో జరిగే కుతంత్రాలు కూడా కథలో కలిసిపోతాయి. చాలా సినిమాలలో ఉండే సామాన్యమైన కథాంశమే ఇది. అయితే సాక్షాత్తు భగవంతుడు ఒక సామాన్యమైన వ్యక్తి వలే ఒకరికి కనిపిస్తూ మాట్లాడుతూ, అతను నివేదన చేసిన భోజనం స్వీకరిస్తూ, ఇతరులకు తెలియకుండా, చాలా సహజంగా మరొక పాత్రలాగా ఈ కథలో ఇమిడిపోవడం వలన ఈ సినిమా కథ స్వరూపమే మారిపోయింది. దేవుడిని నమ్ముకున్న అమాయకుడైన అన్న, దేవుని మీద నమ్మకం లేని గడుసు తమ్ముడు, దేవుడిని అడ్డుపెడ్డకొని పబ్బం గడుపుకునే ప్రతినాయకుడు మొదలైన పాత్రలతో రూపొందినదీ చిత్రం.

బుద్ధిమంతుడు
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం ఎన్.ఎస్. మూర్తి
కథ ముళ్ళపూడి వెంకటరమణ
చిత్రానువాదం ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు (మాధవయ్య, గోపాలం),
శోభన్ బాబు (శ్రీకృష్ణుడు),
విజయనిర్మల (రాధ),
నాగభూషణం (శేషయ్య),
అల్లు రామలింగయ్య,
జి. వరలక్ష్మి,
సూర్యకాంతం ,
కృష్ణంరాజు (కృష్ణ),
పద్మనాభం,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
భాను ప్రకాష్
సంగీతం కె.వి.మహదేవన్
(సహాయకుడు: పుహళేంది)
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
నిర్మాణ సంస్థ చిత్ర కల్పన
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అక్కినేని, బాపు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం. అక్కినేని ద్విపాత్రాభినయం ఆస్తికునిగా (భక్తునిగా), నాస్తికునిగా చిత్ర ఆకర్షణ. పౌరాణిక పాత్ర శ్రీ కృష్ణుడు భక్తునితో మాట్లాడటం, కనపడటం ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. తర్వాత బాపు చిత్రం ముత్యాలముగ్గు లో ఇదే పంథా నడుస్తుంది. (దాసరి దేవుడే దిగివస్తే, రాజాచంద్ర మా ఊళ్ళో మహాశివుడు దీనికి కొనసాగింపు)

చిత్రకథ

మార్చు

మాధవాచార్యులు శ్రీకృష్ణాలయ అర్చకుడు. ఆయనకు శ్రీకృష్ణుడు సాక్షాత్కరిస్తూ ఉంటాడు. భార్య మరణించింది. తల్లి, పదేళ్ల కుమారుడు, తమ్ముడు గోపలాచార్యులుతో కలిసి నివసిస్తూ ఉంటాడు. తమ్ముడు గోపాలుడు నాస్తికుడు, చెడు సావాసాలు, చెడు అలవాట్ల బారిన పడతాడు. తమ్ముడు దారి తప్పి తిరుగుతున్నాడని అన్న గారి బాధ. తన వేదనని శ్రీకృష్ణుడికి నివేదించుకుంటాడు. శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకుంటాడు. ఆ గుడి ధర్మకర్త అన్న శేషాద్రి. చెల్లెలి గారి పొలాలను, గుడి మాన్యాన్ని సాగు చేసి దిగుబడి బాగున్నా, దిగుబడి లేదంటూ వాటి మీద వచ్చే ఆదాయాన్ని, బడి గ్రాంట్ ని దిగమింగుతూ ఉంటాడు. మాధవకు శేషాద్రి దేవ సమానుడు. శేషాద్రి పనులు గోపికి నచ్చవు. బడి పంతులుకు జీతం ఇవ్వలేదని శేషాద్రి పంటతో వెళ్తున్న బండిని ఆపి, ధాన్యం బస్తాను దింపిస్తాడు. అన్న గారికి ఫిర్యాదు చేస్తాడు శేషాద్రి. గోపీకి ఫార్మసీ చదివించి ఉద్యోగం చూపిస్తానంటాడు. గోపీ అన్నగారితో తగువులాడి వేరు పడతాడు. గోపి, శేషాద్రి చెల్లెలు కూతురు రాధప్రేమించుకుంటారు. మేనకోడలిని తన కుమారుడుకిచ్చి పెళ్లిచేసి ఆ ఆస్తినంతా తన పరం చేసుకోవాలని శేషాద్రి కోరిక. శేషాద్రి కొడుకు బడిపంతులు కూతురుని లోబరచుకుంటాడు. ప్రేమలో పడ్డ తర్వాత గోపి వ్యసనాలకు దూరం గా ఉంటాడు కానీ శేషాద్రి ని ఎదిరిస్తూ ఉంటాడు. స్నేహితుల ప్రోద్బలం మీద తోటలో పార్టీకి వెళ్లి తాగి పడిపోతాడు గోపి. శేషాద్రి దాన్ని రాధకు చూపి ప్రేమికులను విడదీస్తాడు. అన్నకి, తమ్ముడికి మధ్య అంతరం పెరుగుతుంది. గుడికి, బడికి రిఫెండ్రం పెడతారు. ప్రచారం మొదలవుతుంది. గాలిగోపురం కలశాన్ని గాలిలో ఎగరేసి దేవుని మహిమ చూపమని మాధవని ఆదేశిస్తాడు. మాధవకి దైవదర్శనం కాదు. దైవం తన మాట వినకపోతే తల శిలకేసి కొట్టుకుంటానని మాధవ తలుపు వేసుకొని కూర్చొంటాడు. అన్న గారి పంతాన్ని విన్న గోపి ఆలయం ఎక్కి కలశాన్ని గాలిలో ఎగర వేస్తాడు. అందరూ జయజయధ్వానాలు చేస్తారు. మాధవుడు లోనుంచి వస్తాడు. దిగుతున్న తమ్ముడు కనబడతాడు. తమ్ముడి మీద కోపగించుకుంటాడు. తమ్ముడు అన్నతో నీ అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని శేషాద్రి లాంటి దుర్మార్గులు ఆటలాడుతూ ఉంటే దేవుడు ఎందుకు మహిమ చూపాలి అని వాదులాడతాడు. శేషాద్రి దుర్మార్గం అందరికీ తెలుస్తుంది. గోపీ, రాధ లమధ్య అపార్దాలు తొలగి పోతాయి. శేషాద్రిని పోలీసులు అరెస్ట్ చేయడంతో సినిమా ముగుస్తుంది.

చిత్ర విశేషాలు

మార్చు

ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయనం చేసారు. మాధవాచార్యులు,గోపాలాచార్యుల పాత్రలను ఆయన పోషించారు. సాక్షి, బంగారుపిచ్చుక చిత్రాలను చూసి చిత్రీకరణ విధానాన్ని మెచ్చుకొని నాగేశ్వరరావు గారే బాపు ముళ్లపూడి కి కాల్షీట్లు ఇచ్చేరని చెప్పుకుంటారు.

పాటలు

మార్చు

అన్ని పాటలకు కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చారు.

పాట రచయిత గాయకులు
గుట్టమీద గువ్వ కూసింది - కట్టమీద కౌజు పలికింది ఆరుద్ర ఘంటసాల పి.సుశీల
టాటా వీడుకోలూ గుడ్ బై ఇంక శెలవు - తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా ఆరుద్ర ఘంటసాల
నను పాలింపగ నడచీ వచ్చితివా, మొర లాలింపగ తరలీ వచ్చితివా గోపాలా దాశరథి కృష్ణమాచార్య ఘంటసాల
భూమ్మీద సుఖపడితె తప్పులేదురా, బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా ఆరుద్ర ఘంటసాల
పచ్చి మిరప కాయలాంటి పడుచుపిల్లరో దాని పరువానికి గర్వానికి పగ్గమేయరో ఆరుద్ర ఘంటసాల
తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా గడసరి తుమ్మెదా సి.నారాయణరెడ్డి పి.సుశీల
గుడిలో ఏముంది అంతా బడిలోనే ఉంది ఆరుద్ర ఘంటసాల

కస్తూరి తిలకం (శ్లోకం) ఘంటసాల

అల్లరి పెడతారే పిల్లా , కొసరాజు , పిఠాపురం, స్వర్ణలత

నమామి నారాయణ పాద పంకజం,(పద్యం) గీతగోవిందం , ఘంటసాల.

విశేషాలు

మార్చు

ఒక (?) ఇంగ్లీషు చిత్రం ఆధారంగా ముళ్ళపూడి, బాపులు ఈ చిత్రకథ మూలం తయారుచేసుకున్నారు. సాక్షి చిత్రం చూసి బాపు రమణ పట్ల ఆసక్తితో అక్కినేని ఈ చిత్రంలో నటించారు. గోపాలం పాత్రకు దుస్తులు, జగపతి సంస్థ లో అంతకు ముందు అక్కినేని వాడిన దుస్తుల్ని కొద్ది మార్పులతో ఉపయోగించారు.

మూలాలు

మార్చు
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.