భాను ప్రకాష్ (బొల్లంపల్లి భాను ప్రకాష్ రావు) (ఏప్రిల్ 21, 1939 - జూన్ 7, 2009) తెలంగాణ రాష్ట్రం చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు.[1][2]

భాను ప్రకాష్
Bhanu Prakash.JPG
భాను ప్రకాష్
జననంఏప్రిల్ 21, 1939
నల్లగొండ
మరణంజూన్ 7, 2009
ప్రసిద్ధిరంగస్థల నటుడు, దర్శకుడు
భార్య / భర్తసరస్వతి

జననంసవరించు

భాను ప్రకాష్ 1939, ఏప్రిల్ 21న వెంకటహరి, అండాలమ్మ దంపతులకు నల్లగొండలో జన్మించాడు.[1]

వివాహం - ఉద్యోగంసవరించు

సరస్వతితో వివాహం జరిగింది. హెచ్.ఎ.ఎల్.లో ఉద్యోగం చేసేవాడు.

నాటక ప్రస్థానంసవరించు

మేనమామ ధరణి శ్రీనివాసరావు నాటక రచయిత అవ్వడంవల్ల భాను ప్రకాష్ కేశవ్ మెమోరియల్ స్కూల్లో చదువుతున్న సమయంలో 11 ఏళ్ల వయస్సులోనే తొలిసారిగా వార్షికోత్సవాల సందర్భంగా స్టేజీపై తార్‌మార్ నాటకంలో నటించాడు. ప్రిన్సిపాల్ మొమెంటోతో ప్రశంసించడంతో నటనపట్ల తనలోని ఆసక్తిని పెంచుకున్న భాను ప్రకాష్ తమ కాలనీలోని మిత్రులతో కలిసి నాటకాలు రూపొందించి వినాయకచవితి మండపాల్లో ప్రదర్శించేవాడు. హైదరాబాదులో ఎస్.కె. ఆంజనేయులుకు చెందిన నాటక సంస్థ నిర్వహించే ‘విసృతి’ నాట్యమండలి నాటకాలు, రిహార్సల్స్‌ని చూసి తాను కూడా నాటక దర్శకత్వం చేయాలనుకున్నాడు.

ఇంటర్ కాలేజీస్థాయి నాటక పోటీల్లో సైఫాబాద్ సైన్స్ కళాశాల నుండి స్వీయ దర్శకత్వంలో ‘డాక్టర్ యజ్ఞం’ నాటికలో డా. యజ్ఞం పాత్రలో నటించాడు. ఆ పోటీలో బహుమతులు రావడంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ఆ తరువాత ‘గాలివాన’, ‘గుడిగంటలు’, ‘గాలిపటం’, ‘శ్రీమాన్ శ్రీమతి’ వంటి నాటకాలలో నటిస్తూ, దర్శకత్వం వహించాడు. 1964లో ‘యాచకులు’లో భాను ప్రకాష్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ‘కళారాధన’ సంస్థను స్థాపించి ‘వలయం’, ‘ గాలివాన’, ‘ కెరటాలు’ వంటి నాటకాలు ప్రదర్శించాడు. ఈ సంస్థను ‘గ్రేట్ ఈస్ట్రన్ సర్కస్8 కంపెని’ అని పిలిచేవారు. ఈ సంస్థ ద్వారా నటుడు నూతన్ ప్రసాద్ నాటకరంగానికి పరిచయమయ్యాడు.[3]

‘చీకటి కోణాలు’ నాటకంలో భాను ప్రకాష్ నటనను స్థానం నరసింహారావు అభినందించాడు. ‘ఆకాశవాణి’లో కూడా ఆయన ‘ఏ గ్రేడ్’ ఆర్టిస్టుగా చాలా నాటకాల్లో పాల్గొన్నాడు. ఢిల్లీ, మద్రాస్, కలకత్తా, కాన్పూర్‌లలో నాటకాలను ప్రదర్శించాడు. ‘చంద్రగుప్త’, ‘కన్యాశుల్కం’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’, ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి నాటకాలు ఈయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో తన నటన ద్వారాను మంచిపేరు పొందాడు.[4] ప్రధానంగా హైదరాబాదు రాష్ట్రంలో సాంఘిక నాటకానికి నాంది పలికాడు.

సినిమా రంగంసవరించు

భాను ప్రకాష్ నాటకాన్ని చూసిన నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు 1964లో డాక్టర్ చక్రవర్తి సినిమాలో చిన్న పాత్రను ఇచ్చాడు. ఆ తర్వాత పూలరంగడులో ఎలాంటి టెస్టు లేకుండానే పూర్తి నిడివిగల విలనీ పాత్రను ఇచ్చాడు.[1]

నటించినవి

అవార్డులు, పురస్కారాలుసవరించు

50 ఏళ్లకు పైగా రంగస్థల, సినీ రంగాలకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి.[1]

 • ‘సుడిగాలి’, ‘గాలివాన’, ‘కెరటాలు’ నాటకాలకు ఉత్తమ దర్శకుడిగా వరుసగా మూడుసార్లు ఎంపికై ‘రోలింగ్ షీల్డ్’ అందుకున్నాడు.
 • 1972లో మరో రెండు బంగారు పతకాలను, 1974లో ‘బళ్లారి రాఘవ’ అవార్డుతో వెండి కిరీటం పొందాడు.
 • ‘యువ కళావాహిని’ సంస్థ కె. వెంకటేశ్వరరావు అవార్డు, అవార్డు.
 • తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నటుడి అవార్డు.
 • 1992లో ఎ.ఆర్.కృష్ణ స్మారక పురస్కారం.
 • 1998లో ఉగాది పురస్కారం.
 • జూలూరు వీరేశలింగం అవార్డు.
 • కిన్నెర ఉగాది పురస్కారం.
 • నాటక కృషీవలుడు పురస్కారం.
 • రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం (2017)[5]

మరణంసవరించు

చివరి శ్వాస వరకు నాటకం కోసమే జీవించిన భాను ప్రకాష్ 2009, జూన్ 7 న తన 70వ యేట తనువు చాలించారు.[1]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 నవతెలంగాణ (4 June 2016). "బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌". హెచ్‌.రమేష్‌బాబు. Archived from the original on 21 ఏప్రిల్ 2020. Retrieved 21 April 2017. Check date values in: |archivedate= (help)
 2. భానుప్రకాశ్, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.447.
 3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (21 April 2017). "తెలుగు నాటకంపై చెరగని ముద్ర". www.andhrajyothy.com. డాక్టర్‌ జె. విజయ్‌కుమార్జీ. Archived from the original on 21 ఏప్రిల్ 2020. Retrieved 21 April 2020. Check date values in: |archivedate= (help)
 4. భానుప్రకాశ్, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.448.
 5. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.695