భారతీయ ప్రజా భాషల సర్వే

పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (పిఎల్‌ఎస్‌ఐ) అనేది, భారతదేశంలో మాట్లాడుతున్న భాషల గురించి ఇప్పటికే ఉన్న పరిజ్ఞానాన్ని నవీకరించడానికి 2010 లో ప్రారంభించిన భాషా సర్వే. 2000 మంది భాషా నిపుణులు, సామాజిక చరిత్రకారులు, బరోడా లోని భాషా పరిశోధన ప్రచురణ కేంద్రం సిబ్బందితో సహా మొత్తం 3500 మంది స్వచ్ఛంద కార్యకర్తలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే భారతదేశంలో మొత్తం 780 భాషలను గుర్తించింది. 35,000 పేజీల సర్వే నివేదిక 50 సంపుటాలలో ప్రచురించబడుతోంది. మొదటి ఆరు సంపుటాలు 2012 జనవరి 7 న వడోదరలో జరిగిన భాషా వసుధ గ్లోబల్ లాంగ్వేజెస్ కాన్ఫరెన్స్‌లో విడుదలయ్యాయి. [1] ఈ సర్వే 2012 డిసెంబరులో పూర్తయింది. దాని నివేదికలను ఓరియంట్ బ్లాక్స్వాన్ అనే ప్రచురణ సంస్థ ప్రచురిస్తోంది.

సర్వే అకృతి మార్చు

సర్వే ప్రచురణలలో ఈ క్రింది సమాచారం ఉంది:

 • భాష పేరు.
 • సంక్షిప్త చరిత్ర.
 • భాష మాట్లాడే భౌగోళిక ప్రాంతం.
 • చిన్నపాటి గ్రంథసూచీ.
 • నమూనా మౌఖిక పాటలు, వాటి అనువాదం.
 • నమూనా మౌఖిక కథలు, వాటి అనువాదం.
 • రంగులను సూచించే పదాలు.
 • చుట్టరికాల పదాలు.
 • స్థల కాలాల పదాలు.

షెడ్యూల్డ్ భాషల విషయంలో సర్వే, ఆయా భాషల విస్తృత సాంస్కృతిక అవలోకనాన్ని కూడా అందిస్తుంది.

సంబంధం మార్చు

భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ ఇంగ్లీషును మినహాయించి 22 భాషలను గుర్తించింది. భారత ప్రభుత్వ భాషా విధానాలు, నిధులు ఈ సమాచారంపైన ఆధారపడే నిర్వహించబడతాయి. అయితే, ఈ సమాచారం భారతదేశ భాషా వైవిధ్యాన్ని తగినంతగా చూపించదు. 1961 భారత జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 1652 భాషలు వాడుకలో ఉన్నాయి. అయితే, 1971 జనాభా లెక్కల ప్రకారం 10,000 కంటే తక్కువ మంది మాట్లాడే భాషలను మినహాయించాలని నిర్ణయించారు. దాంతో ఈ భాషల సంఖ్య 108 కి తగ్గింది. [2] వినియోగదారుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని భాషలను సర్వేలో చేర్చాలనే విధానాన్ని పిఎల్‌ఎస్‌ఐ అనుసరించింది. ఉదాహరణకు, ఇది త్రిపురలో చైమల్ అనే భాషను నమోదు చేసింది. ఈ భాషను మాట్లాడేవారు ఐదుగురు మాత్రమే. [3]

PLSI చనిపోతున్న భాషల విషయాన్ని కూడా హైలైట్ చేస్తుంది. "2010 జనవరి 26 న, బో అనే సమాజానికి చెందిన ఒక మహిళ అండమాన్ దీవులలో మరణించింది. ఆమె మాట్లాడే భాష పేరు కూడా "బో"యే. ఆ భాష మాట్లాడిన చిట్టచివరి వ్యక్తి ఆమె. విషాధమేంటంటే, ఆమెతో పాటు 65,000 సంవత్సరాల నిరంతర జ్ఞాన ధార కూడా ఆగిపోయింది." అని భాషా రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ సెంటర్ చైర్‌పర్సన్ జిఎన్ దేవీ అన్నారు. [4] మారుతున్న ఆర్థిక వాస్తవాలకూ భాషల మనుగడకూ మధ్య ఉన్న సంబంధాన్ని గమనిస్తూ, "ఒక భాష మాట్లాడే సమాజపు జీవనోపాధి అవకాశాలు అదృశ్యమైనప్పుడు ఆ భాష కూడా అదృశ్యమవుతుంది" అని దేవీ అంటారు. [5]

సర్వేలో కనుగొన్న కొన్ని విషయాలు మార్చు

పిఎల్‌ఎస్‌ఐ డాక్యుమెంట్ చేసిన భాషల్లో, 480 భాషలు గిరిజనులు, సంచార గిరిజనులు మాట్లాడే భాషలు కాగా, 80 తీరప్రాంత భాషలు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక భాషలున్నాయి. అక్కడ 66 భాషలు మాట్లాడుతున్నాయి, [6] పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 9 లిపులు, 38 భాషలూ ఉన్నాయి. బెంగాల్, ఉర్దూ, నేపాలీలతో పాటు ఓల్ చిక్కీ (సంతల్), కోల్ హో, బరాంగ్ క్షితి, లెప్చా, సద్రి, లింబు లిపులు అక్కడ ఉన్నాయి. [7] మాట్లాడేవారి సంఖ్య పెరుగుతున్న భాషలు - కర్నాటక లోఇ బ్యారి, ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో మాట్లాడే భోజ్ పురి, మేఘాలయ లోని ఖాసి, మిజోరం లోని మిజో, ఉత్తరాఖండ్ లోని కుమౌని, గుజరాత్ కచ్చీ, రాజస్థాన్ లోని మేవాటి. [8] 40 కోట్ల మంది తమ మాతృభాషగా హిందీ మాట్లాడుతారు. ఇదే దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష. ఇంగ్లీషు మాతృభాషగా కలవారి సంఖ్య 1971 లో 1,87,000 ఉండగా అది 2011 నాటికి కోటి మందికి పెరిగింది. [9]

మూలాలు మార్చు

 1. Lalmalsawma, David, ‘India speaks 780 languages, 220 lost in last 50 years’, Reuters.com, September 7, 2013, Accessed on January 5, 2015. http://blogs.reuters.com/india/2013/09/07/india-speaks-780-languages-220-lost-in-last-50-years-survey/ Archived 2016-12-27 at the Wayback Machine
 2. Soman, Sandhya (9 August 2013). "India lost 220 languages in the last 50 years". The Times of India. Retrieved 7 January 2015.
 3. Lalmalsawma, David, ‘India speaks 780 languages, 220 lost in last 50 years’, Reuters.com
 4. Pathak, Maulik, ‘India becoming a graveyard of languages: Ganesh Devy’, Live Mint, February 22, 2013. Accessed on January 5, 2015. http://www.livemint.com/Opinion/vIbx7ZUHxvTQMbwboNYHPI/India-is-becoming-a-graveyard-of-languages.html
 5. Lalmalsawma, David, ‘India speaks 780 languages, 220 lost in last 50 years’, Reuters.com
 6. Singh, Shiv Sahay, ‘Language Survey Reveals Diversity’, The Hindu, July 22, 2013. Accessed on January 5, 2015. http://www.thehindu.com/news/national/language-survey-reveals-diversity/article4938865.ece
 7. Bandopadhyay, Krishnendu, ‘Bengal has highest number of scripts: PLSI’, The Times of India, August 31, 2013. Accessed on January 5, 2013. http://timesofindia.indiatimes.com/india/Bengal-has-highest-number-of-scripts-PLSI/articleshow/22174671.cms
 8. Lalmalsawma, David, ‘India speaks 780 languages’, Reuters.com.
 9. Pathak, Maulik, ‘India becoming a graveyard of languages: Ganesh Devy’, Live Mint.