మధుర కృష్ణమూర్తిశాస్త్రి

జ్యోతిష, వాస్తు పండితుడు.

మధుర కృష్ణమూర్తిశాస్త్రి ప్రముఖ జ్యోతిష, వాస్తు పండితుడు. జ్యోతిష, వాస్తు శాస్త్రాలపై దేశ, విదేశాలలో ఎన్నో ఉపన్యాసాలను ఇచ్చిన పండితుడు. ఆయన మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.[1]

మధుర కృష్ణమూర్తిశాస్త్రి

జీవిత విశేషాలు మార్చు

ఈయన పశ్చిమ గోదావరి తణుకు సమీపంలోని ముక్కామల గ్రామంలో వెంకయ్య, శచీదేవమ్మ దంపతులకు 1928 ఫిబ్రవరి 28 వ తేదీన జన్మించాడు. ఆంగ్ల చదువులు 8వ తరగతి వరకు చదివిన మధుర భారతీయ శాస్త్రగ్రంథాలను ఉద్దండుల వద్ద అధ్యయనం చేశారు. పిఠాపురానికి చెందిన పీశుపాటి విశ్వేశ్వర శాస్త్రి వద్ద పంచకావ్యాలు, వ్యాకరణంలో కౌముది వరకు, వాజపేయాజుల వెంకట సుబ్రహ్మణ్య సోమయాజుల వద్ద రుగ్వేద స్మార్తం, సంస్కృత నాటకాలంకారాది సాహిత్యం, జాతక, ముహూర్త, వాస్తుశాస్త్రాలను అధ్యయనం చేశారు. శ్రీపాద వెంకట రమణ దైవజ్ఞశర్మ వద్ద జ్యోతిషరంగంలో సిద్ధాంత భాగం, పంచాంగ రచన, ధర్మశాస్త్రాల అధ్యయనం కొనసాగించారు. తన మేనమామ, పీసపాటి పాలశంకరం, కుమార్తె మహాలక్ష్మితో వివాహం మేనమామల యింట ముక్కామల, తణుకు తాలూకా, పశ్చిమ గోదావరిజిల్లాలో జరిగింది. చాలాకాలం నుంచి జ్యోతిష విజ్ఞాన పత్రిక అనే త్రైమాసిక పత్రికను నడుపుతూ, జ్యోతిష, వాస్తు శాస్త్రాలకు విస్తృతప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన రెండవ కుమారుడు ఈ పత్రిక సంపాదక బాధ్యతను నిర్వహిస్తున్నాడు.[2]

రచనలు మార్చు

ఆయన 1960 ప్రాంతాల్లో రాజమహేంద్రవరానికి తరలివచ్చి వాస్తు, జ్యోతిష, ధర్మశాస్త్రాలపై సుమారు 20 వరకు ప్రామాణిక గ్రంథాలను రచించారు. జ్యోతిష విజ్ఞాన పత్రిక అనే త్రైమాసిక పత్రికను నిర్వహిస్తున్నారు. 1989లో విశ్వవిజ్ఞాన ప్రతిష్ఠానం అనే సంస్థను స్థాపించి శాస్త్ర, విజ్ఞాన రంగాలకు చెందిన పరిశోధనలను ప్రోత్సహించేవారు. రూ.లక్షల వ్యయంతో దేశవిదేశాల నుంచి అనేక శాస్త్రగ్రంథాలను కొనుగోలు చేసి, పదిలపరిచారు. ఈ గ్రంథాలనన్నిటినీ రాజమహేంద్రవరం లోని ఒక గ్రంథాలయానికి బహూకరించి, వాటి నిర్వహణ నిమిత్తం సుమారు ఇరవై లక్షల రూపాయలను కూడా యిచ్చిన వదాన్యుడీయన.

పురస్కారాలు, సన్మానాలు మార్చు

  • 1968లో వరంగల్ పురపాలక సంఘం సన్మానం
  • 1981లో తణుకు నన్నయ భట్టారక పీఠం జ్యోతిష విజ్ఞాన భాస్కర బిరుదు
  • 1985లో నాటి బీహారు గవర్నర్ పెండేకంటి వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా హైదరాబాద్‌లో కనకాభిషేకం.
  • 1992లో రాజమహేంద్ర పురపాలక సంఘం ఆధ్వర్యంలో సన్మానం
  • 1997లో ఆంధ్రీప్రతిభా ప్రతిష్ఠాన్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా ప్రతిభా వైజయంతిక పురస్కారం.
  • 1998లో మద్రాసు తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాన్ని
  • 2000లో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వాచస్పతి బిరుదుతో ఆయనను సత్కరించింది.
  • రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారిచే మహామహోపాధ్యాయ బిరుదు
  • సంస్కృత భాషలో శాస్త్రాలను అధ్యయనం చేసి, ప్రావీణ్యతను గడించినందుకు 2004లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సత్కారం.

వాస్తు సలహాదారునిగా మార్చు

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ-ధర్మాదాయ శాఖలో 1970-80 మధ్య కాలంలో వాస్తు విభాగ సలహా సభ్యునిగా వ్యవహరించిన కృష్ణమూర్తి శాస్త్రి గారు 1982-85లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రాలజీ సంస్థకు 3ఏళ్ళు అధ్యక్షులుగా ఉన్నారు. 1983నుంచి రాజమండ్రి వేద శాస్త్ర పరిషత్ జ్యోతిశ్శాస్త్ర పరీక్షాధికారిగా వ్యవహరించారు.

విదేశీ పర్యటన మార్చు

1995-97మధ్య 'మహర్షి మహేష్ యోగి' వేద విజ్ఞాన పీఠంలో జ్యోతిశ్శాస్త్ర శాఖాధ్యక్షునిగా ఉండడమే కాక, హాలెండ్, జర్మనీ పర్యటించి, 'మహర్షి మహేష్ యోగి' యూనివర్సిటీలో జ్యోతిష - వాస్తు శాస్త్రాలపై ఉపన్యాసాలు (వీడియో లెక్చర్స్) ఇచ్చారు.

నమ్మిన సిద్ధాంతం మార్చు

జ్యోతిష శాస్త్రంలో సూర్య సిద్ధాంతం ప్రకారం దృగ్గణిత (దృక్తుల్య) పంచాగం రూపొందిస్తూ, గురుపరంపరలో నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారంచేస్తూ, జ్యోతిష విజ్ఞాన పత్రికను నిర్వహిస్తూ, విశ్వ విజ్ఞాన ప్రతిష్ఠానమ్ సంస్థ ద్వారా సంస్కృత భాషాభివృద్ధికి-జ్యోతిష వాస్తు తదితర శాస్త్రాల అభివృద్ధికి కృషిసాగిస్తూ, శ్రీ మధుర కృష్ణమూర్తిశాస్త్రిగారు ఎన్నో పంచాంగాలు రావడం-జనం తికమక పడడం నేపథ్యంలో ఆరోజుల్లోనే ఒకే పంచాంగం వుండాలని తపించి, ఆదిశగా చివరివరకూ కృషి సాగించడం విశేషం.

వ్యక్తిగత వివరాలు మార్చు

వీరికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. ఈయన రాజమహేంద్రవరంలో స్థిర నివాసం ఏర్పరచుకొని, జ్యోతిష, వాస్తు శాస్త్ర విజ్ఞాన వ్యాప్తికి పాటు పడుతున్నాడు.

మరణం మార్చు

ఏప్రిల్ 6, 2016 న తన 88వ యేట ఈయన రాజమహేంద్రవరంలో కన్నుమూశాడు. ఫ్రముఖ జ్యోతిర్విదుడైన శ్రీపాద వెంకటరమణ దైవజ్ఞశర్మ (ఈయన ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు) వద్ద శిష్యరికం చేసి, పంచాంగ గణనంలో అద్భుత ప్రావీణ్యం సంపాదించి, ప్రతి సంవత్సరం పంచాంగాన్ని వెలువరిస్తున్నారు.

మూలాలు మార్చు

  1. నేలకొరిగిన జ్యోతిష శిఖరం
  2. "జ్యోతిష విజ్ఞాన భాస్కర మధుర కృష్ణమూర్తి శాస్త్రి అస్తమయం". Archived from the original on 2017-03-28. Retrieved 2016-04-17.

ఇతర లింకులు మార్చు