మాగంటి అన్నపూర్ణాదేవి

స్వాతంత్ర్య సమరయోధురాలు

మాగంటి అన్నపూర్ణాదేవి (1900 - 1927) స్వాతంత్ర్య సమర యోధురాలు, సమాజ సేవిక, రచయిత్రి. తన 27వ యేటనే మరణించిన ఈమె అప్పటికే భారత స్వాతంత్ర పోరాటంలో ప్రముఖమైన పాత్ర నిర్వహించి మహాత్మా గాంధీ మన్ననలు పొందింది. ఈమె భర్త మాగంటి బాపినీడు దక్షిణాదిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులలో ఒకడు.

మాగంటి అన్నపూర్ణాదేవి
స్వాతంత్ర సమర యోధురాలు, సమాజ సేవిక, రచయిత్రి
జననం1900
మరణం1927 నవంబర్ 9
మతంహిందువు
భార్య / భర్తమాగంటి బాపినీడు
తల్లిదండ్రులుకలగర రామస్వామి, పిచ్చమ్మ

జననం, విద్య మార్చు

అన్నపూర్ణాదేవి 1900 సంవత్సరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో కలగర రామస్వామి, పిచ్చమ్మ దంపతులకు జన్మించింది.[1] చిన్నతనంనుండి తన ప్రతిభను కనపరచింది. ఏలూరుకు చెందిన రాలి శేషగిరిరావు ఆమెకు గురువు, మార్గదర్శి. ఆదిపూడి సోమనాధరావు అనే కవి, సంఘసంస్కర్త కూడా ఆమెపై ప్రభావం చూపాడు. మొదట్లో ఆమె ఇంటివద్దనే చదువుకొన్నది. తరువాత గుంటూరు మిషన్ స్కూలులో చదువుకొంది. తరువాత కలకత్తాలో బ్రహ్మ సమాజం బాలికల పాఠశాలలో చదివింది. ఆర్థికంగా బలహీనులైన ఆమె తల్లిదండ్రులు ఎంతో శ్రమించి ఆమె విద్యాభ్యాసానికి అవుసరమైన ఖర్చులు భరించారు. కలకత్తాలో శ్రీమతి శకుంతలాదేవి, హేమచంద్ర సిర్కార్ వంటి విద్యావేత్తలు ఆమె చదువు, జీవితం రూపుదిద్దుకోవడంలో సహాయపడ్డారు. ఆమె క్రమశిక్షణా జీవనం అందరినీ ఆశ్చర్యపరిచేది. పాఠశాల విద్యలతోపాటు బెంగాలీ భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. బెంగాలీ నుండి తెలుగులోకి పెక్కు అనువాదాలు చేసింది. స్వాతంత్ర్య పోరాటంలో అరవింద్ ఘోష్ రాసిన ఉత్తరాలను తెలుగులోకి అనువదించింది.

ఐదేళ్ళ చదువు తరువాత ఆ వత్తిడి ఆమెపై ప్రభావం చూపింది. ఏలూరుకు తిరిగి వచ్చింది. ఒక సంవత్సరం తరువాత మద్రాసు విశ్వవిద్యాలయం మెట్రిక్యులేషన్ పరీక్షకు కూర్చొంది. తన చదువుకు కావలిసిన ధనం సంపాదించుకోవడం కోసం 1917లో (తన 17వ యేట) "సీతారామ" అనే పుస్తకాన్ని ప్రచురించింది. అది తరువాత ఉన్నత పాఠశాల చదువులకు పాఠ్యపుస్తకంగా వాడారు. తరువాత ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. ఒక సంవత్సరం పాటు వైద్యం నిమిత్తం 1919లో మదనపల్లె వెళ్ళింది. 1920లో ఆమె వివాహం మాగంటి బాపినీడుతో జరిగింది. అతను అప్పుడు కలకత్తా సిటీ కాలేజిలో చదువుతున్నాడు. వారి వివాహానికి తెలుగులోనే మంత్రాలు చదివారు. ఉమేష్ చంద్ర విద్యార్థి, ఆదిపూడి సోమనాథరావు వంటి సంస్కర్తలు ఆ వివాహానికి అతిధులుగా ఉన్నారు.

స్వాతంత్ర పోరాటం మార్చు

వివాహం తరువాత బాపినీడు ఉన్నత చదువులకు అమెరికా వెళ్ళాడు. అతనితోపాటు అన్నపూర్ణ కూడా వెళ్ళాల్సి ఉంది కాని పొసగలేదు. భారతదేశంలో ఉన్న అన్నపూర్ణాదేవి మహాత్మా గాంధీ సందేశంతో ప్రభావితయై భారత స్వాతంత్ర్య పోరాటం క్రీయాశీల కార్యకర్తగా పనిచేసారు. 1921 లో గాంధీజీ ఆంధ్రా పర్యటనలో తన చేతి గాజులు, మెడలో పెద్ద గొలుసు వారికి ఇచ్చి గాంధీజీకి అభిమానపాత్రురాలుగా మారింది. అదే సమయంలో ఆమె డబ్బుకోసం చాలా ఇబ్బందులు పడింది. అయినా గాని 1200 రూపాయల ఖరీదైన చీరలన్నీ (అమెరికా ప్రయాణం కోసం కొనుక్కున్నవి) తగులబెట్టేసింది. ఏలూరులో మోహన్‌దాస్ ఖద్దర్ పరిశ్రమ స్థాపించింది. ఆంధ్ర దేశం అంతటా పర్యటించి స్వదేశీ ఉద్యమానికి ఊపిరిలూదింది.

1923లో బాపినీడు తిరిగివచ్చాడు. బొంబాయిలో అతను స్టీమర్ దిగిన వెంటనే ఆమె తను తెచ్చిన ఖద్దరు బట్టలు అతనికిచ్చి అతని విదేశీ వస్త్రాలను సముద్రంలో పారవేయమంది. అతను మారుమాటాడకుండా అలానే చేశాడు. గాంధీ ఆమె గురించి she had already ‘acquired a gentle but commanding influence over her husband, by her purity and single-minded devotion.’ అని వ్రాశాడు.

అన్నపూర్ణమ్మ అనేక ప్రాంతాలు పర్యటించి సభలలో ప్రసంగించింది. తన కార్యదీక్ష, సత్ప్రవర్తనల ద్వారా అందరి మన్ననలూ పొందింది.

మరణం మార్చు

1924లో ఆమె ఆరోగ్యం మళ్ళీ క్షీణించసాగింది. భర్తతో కలిసి అనేక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళింది. ఈ సమయంలోనే రామకృష్ణ పరమహంస బోధనలను తెలుగులోకి అనువదించింది. భారతదేశం భవిష్యత్తులో మహిళల పరిస్థితి గురించి "నారి" అనే పుస్తకం వ్రాసింది. అతి పిన్న వయస్సులో 1927 నవంబరు 9న ఆమె మరణించింది.

అన్నపూర్ణమ్మ మరణం తరువాత ఆమె వ్యక్తిత్వం గురించి మహాత్మా గాంధీ ఇలా వ్రాశాడు.

"1921 బెజవాడ మహిళా సమావేశంలో ఖద్దరు వస్త్రాలు ధరించిన ఒక అమ్మాయి అన్నీ తానై అందరినీ అదుపుచేస్తూ సమావేశం నిర్వహించింది. ఆమె అంతకు ముందు ధరించిన విలువైన ఆభరణాలు నాకు గుర్తున్నాయి. ఆమె మరణం వల్ల నేను కోల్పోయింది కేవలం ఒక సహాయకురాలు మాత్రమే కాదు. భారత దేశంలో నా స్వంత కూతురులా మెలగిన ఒక వనిత మనకు దూరమైంది. ఆమె విశ్వాసంలోను, పనిలోను ఎన్నడూ చలించలేదు. ఆమె కార్యదీక్ష అందరికీ ఆదర్శప్రాయమైనది."

ఈమె మరణానంతరం మాగంటి బాపినీడు 1933లో అన్నపూర్ణాదేవి లేఖలు ఒక పుస్తకంగా ప్రచురించాడు. ఈ పుస్తకానికి పరిచయవాక్యాలు ఉన్నవ లక్ష్మీనారాయణ వ్రాశాడు.[1]

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు