మీగడ రామలింగస్వామి ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు.[1] ఆయన బహుముఖమైన ప్రజ్ఞతో పౌరాణిక రంగస్థలిపై జేజేలు అందుకుంటున్నారు. నటుడిగా, పద్యరచనా శిల్పిగా, రాగయుక్తంగా అలరించే సంగీతజ్ఞుడిగా తెలుగు పద్యనాటక యవనికపై ప్రత్యేకత చాటుకుంటున్నారు ఆయన. ఆయన రిటైర్డ్ ప్రిన్సిపాల్.

జీవిత విశేషాలుసవరించు

ఆయన జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా లోని రాజాం పట్టణం. ఆయన తల్లి అప్పలనరసమ్మ. ఆయన తండ్రి దాలియ్యలింగం సంగీతం, నాటకం, తూర్పు భాగవతం, భరత శాస్త్రం, వేదం, వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల్లో నిష్ణాతులు. తన తండ్రి ప్రభావం తనపై పడటంతో ఆయన తొమ్మిదో తరగతి నుంచే నాటకరంగ ప్రవేశం చేసాడు. చిన్నప్పుడే అభిమన్యుడు, నారదుడు, బాలకృష్ణుడు వంటి పాత్రలు పోషించాడు. ఈ క్రమంలోనే హార్మోనియం వాయించడంలో పట్టు సాధించాడు. నాటకాల పిచ్చిలో పడి, నాలుగేళ్లపాటు చదువు కూడా మానేశాడు. చదువుపై దృష్టి పెట్టకపోవడంతో ఆయన తండ్రి గట్టిగా మందలించారు. దానితో 'బాగా చదువుకుంటూ నాటకాలు వేస్తాను' అని నాన్నగారికి మాటిచ్చి, తిరిగి చదువు కొనసాగించారు. అప్పటి రాజాం హైస్కూలులో సంస్కృత పండితుడిగా పనిచేస్తోన్న ముట్నూరు అనంతశర్మ ప్రభావంతో తెలుగు, సంస్కృత భాషలపై ఆయనకు మక్కువ ఏర్పడింది. 1975లో విజయనగరం మహరాజా సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణలో చేరాడు. అక్కడ చదువుతూ అప్పటి ప్రముఖ రంగస్థల నటులు పీసపాటి నరసింహారావు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, షణ్ముఖ ఆంజనేయరాజు, సంపత్‌ లక్షణరావు, డివి.సుబ్బారావు వంటి గొప్ప నటులకు గ్రూపుగా హార్మోనియం సహకారం అందించాడు. భాషా ప్రవీణలో కాలేజీకి ఫస్ట్‌గా నిలిచాడు. 1981లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎం.ఎ తెలుగులో ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే 1983లో ఎం.ఫిల్‌, తిరుపతి వెంకటకవులు రచనలు పాండవ నాటకాలపై పరిశోధనలు చేసి, 1993 పిహెచ్‌డి పట్టా అందుకున్నాడు. 1985లో బుల్లయ్య కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరాను. అక్కడి నుంచి 1987లో కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాడేరు, విశాఖ ఉమెన్స్‌ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌గా, కృష్ణా డిగ్రీ కాలేజీలో తిరిగి రీడర్‌గా, 2010 నుంచి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టి, 2013లో పదవీ విరమణ చేశాడు.[2]

రంగస్థల కళాకారునిగాసవరించు

శ్రీమీరా కళాజ్యోత్స్న నాటక సమాజాన్ని1982లో ఏర్పాటు చేశాడు. స్వీయరచన చేసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం, అశ్వత్ధామ, గుణనిధి, కుంతీ కరణ, యామునాచార్య, ఉత్తర రామాయణం, భక్త ప్రహ్లాద వంటి నాటకాలు దేశ, విదేశాల్లోనూ పలు ప్రదర్శనలు చేశారు. వీటితోపాటు హరిశ్చంద్ర, నక్షత్రక, శ్రీరామ, ఆంజనేయ వంటి ప్రధానపాత్రలు పోషించాడు. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, టీవీ సీరియల్స్‌, ఏకపాత్రాభినయాలు, పరిశోధనా గ్రంథాలు, ప్రబంధ నాటికలు, నృత్య రూపకాలు ఇలా ప్రక్రియల్లో వందకుపైగా రచనలు చేశాడు. వీటితో పాటు ఈ టీవీ తెలుగు వెలుగు కార్యక్రమంలో, ఎస్‌విబిసి పద్యవైభవం శీర్షికలో పద్య బోధనలు, అలాగే రేడియోలో రంగస్థలి శీర్షికన పౌరాణిక పద్యగానం, నాయక రాజుల సంగీత పోషణ, దువ్వూరి రామిరెడ్డి పానశాల, తిరుపతి వెంకట కవుల పాండవద్యోగం నాటకాలపై రేడియో ప్రసంగాలు చేశాడు.

1995లో అమెరికా మొదటి తానా సభల్లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు సమక్షంలో స్వీయ రచనైన అల్లసాని పెద్దన ఏకపాత్రాభినయం చేశాడు. అక్కడ నుంచి అమెరికాలోని 18 రాష్ట్రాల్లో వరుస ప్రదర్శనలు చేశాడు. తిరిగి 2015లో న్యూజెర్సీలో తెలుగు సంఘం 30వ వార్షికోత్సవ వేదికపై శ్రీకృష్ణ పాత్ర ప్రదర్శించాడు.

పురస్కారాలుసవరించు

 • వ్యక్తిగతంగా, ప్రదర్శనపరంగా పలు విభాగాలకుగాను 24 నంది బహుమతులు.[3]
 • అలాగే స్వర్ణ కిరీటం, స్వర్ణ పుష్పాభిషేకం, స్వర్ణ మకర కుండళాలు, స్వర్ణ కంకణం వంటి ఘన సన్మానాలు.
 • మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు
 • హైదరాబాద్‌ తెలుగు యూనివర్సిటీ ఉత్తమ నాటక రచన అవార్డు
 • రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
 • రాష్ట్ర ప్రభుత్వ కందుకూరి విశిష్ట పురస్కారం
 • 2018 లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారం[4]

సంగీతావధానిగాసవరించు

తెలుగు పద్యాలకు సంగీతాన్ని జోడిస్తే బాగుంటుందనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఇలా సంగీతం, సాహిత్యం, మన సంస్కృతి, మానవ విలువలను ప్రచారం జరగాలనే తలంపుతో 'సంగీత నవావధానము' అనే నూతన ప్రక్రియను ప్రారంభించాడు. ఈ విధానంలో 42 మంది కవులు రాసిన 140 పద్య శ్లోకాలను తీసుకొని 2800 విధాలుగా 20 రాగాల్లో పృచ్ఛకులు కోరిన విధంగా ఆలపించాలి. 2006 నుంచి నాటకంతో పాటు సంగీత నవావధానాన్నీ ప్రదర్శిస్తున్నాడు.

మూలాలుసవరించు

 1. "మీగడ రామలింగస్వామికి లోక్‌నాయక్‌ పురస్కారం -". www.andhrajyothy.com. Retrieved 2018-01-21.
 2. Stories, Prajasakti News. "తెలుగు ప‌ద్యా‌నికి అద్ది‌న పాల మీగ‌డ‌". Prajasakti. Retrieved 2018-01-21.
 3. Rao, P. Surya (2016-06-16). "Meegada Ramalingaswamy's novel avadhanam". The Hindu (ఆంగ్లం లో). ISSN 0971-751X. Retrieved 2018-01-21.
 4. "Lok Nayak Award for Meegada Ramalinga Swami". The Hindu (ఆంగ్లం లో). Special Correspondent. 2018-01-20. ISSN 0971-751X. Retrieved 2018-01-21.CS1 maint: others (link)

ఇతర లింకులుసవరించు