మెంటే పద్మనాభం
మెంటే పద్మనాభం రాజ్యసభ మాజీ సభ్యులు, కొల్లేరు సరస్సు పరిరక్షణ సమితి నాయకులు, రైతు కార్యాచరణ సమితి అధికార ప్రతినిధి. అతను భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి. అతను రాజకీయాలను శాసించి గండిపేట మేధావిగా తనదైన శైలిలో ఎన్‌టి రామారావుకు ఎన్నో సలహాలు, సూచనలను ఇచ్చేవాడు. [1]
జీవిత విశేషాలు
మార్చుఅతను ఆంధ్రా యూనివర్సిటీలో పట్టభద్రుడై, మద్రాస్ యూనివర్సిటీలో లా పూర్తి చేసాడు. అతని లోని సేవాభావమే ఆయనను రాజకీయాల్లోకి దించింది. విద్యార్థి దశలో సోషలిస్టుభావాలతో ప్రభావితుడై రాజకీయాల్లోకి ప్రవేశించాడు. మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు తండ్రి పూసపాటి విజయరామ గజపతి రాజు ప్రధాన అనుచరుడిగా పనిచేశాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా నందమూరి తారకరామారావు పిలుపు మేరకు పార్టీలో చేరాడు. ఎన్టీఆర్, చంద్రబాబుల నాయకత్వంలో రాష్ట్రం, జాతీయ స్థాయిలో పలు పదవులు నిర్వహించాడు.[2] 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నాడు. నేషనల్‌ఫ్రంట్ హయాంలో కీలకపాత్ర పోషించారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు అందుకున్నాడు. తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో పేదలకు అనుకూలమైన ముఖ్యమైన విధానాల రూపకల్పనలో పొలిట్ బ్యూరో సభ్యుడుగా అతను కీలక పాత్ర పోషించాడు. కిలో రెండు రూపాయల బియ్యం, పంచె, ధోవతి వంటి పథకాల రూపకల్పనలో ముఖ్యపాత్ర వహించాడు[3].
నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పుడు, దానికి నిరసనగా రాష్ట్రంలోనే ప్రధమంగా తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించాడు. అత్యంత కీలకమైన సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. రాజీవ్ గాంధీపై బోఫోర్స్ కుంభకోణం, నేషనల్ ఫ్రంట్ ఆవిర్బావం, ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించడం, వి.పి. సింగ్ ప్రధాని కావడం, రాజీవ్ హత్య, పి.వి. నరసింహారావు ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం మొదలైన కీలకమైన ఘట్టాల్లో ఆయన దేశ రాజకీయాల్లో విశిష్టమైన పాత్ర పోషించాడు.
నేషనల్ ఫ్రంట్ కార్యనిర్వాహక వర్గం కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. ఢిల్లీలో మెరిడియన్ హోటల్ ప్రక్కన ఉన్న ఆయన ఇల్లు ప్రత్యామ్నాయ రాజకీయాలకు కేంద్రంగా ఉండేది. అతను దేశ రాజకీయాల్లో ఒక ప్రముఖ పాత్ర పోషించి 1994లో పదవీవిరమణ చేశారు.
భీమవరం విద్యా సంస్థను స్థాపించి విద్యారంగంలో అభ్యున్నతికి పాటుపడ్డారు. అదే సమయంలో రైతుల సమస్యలపై ఆయన పోరాడడం మానలేదు. కొల్లేరు పరిరక్షణకు పోరాడాడు. గోదావరి జిల్లాల అస్తిత్వం నిలబెట్టడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. గోదావరి జిల్లాలకు ప్రత్యేక యూనివర్సిటీ కావాలని పోరాడాడు. వయసు మించిపోయినప్పటికీ ప్రజాసమస్యలకోసం ఆయన తపించడం ఆపలేదు.
మరణం
మార్చుఅతను అనారోగ్యముతో 2017 జనవరి 1 న మరణించాడు. [4]
మూలాలు
మార్చు- ↑ "అలుపెరగని రాజకీయ నాయకుడు మెంటే : పురంధేశ్వరి".[permanent dead link]
- ↑ "టీడీపీ మేనిఫెస్టో, స్కీంల తయారీలో కీలక పాత్ర పోషించిన పద్మనాభం".[permanent dead link]
- ↑ "ఎన్టీఆర్‌కు కుడిభుజంగా ఉన్న పద్మనాభం ఇకలేరు". Archived from the original on 2017-01-03. Retrieved 2018-05-23.
- ↑ "భీమవరం, మాజీ MP మెంటే పద్మనాభం ఇక లేరు."[permanent dead link]