మొదలి నాగభూషణశర్మ

(మొదలి నాగభూషణ శర్మ నుండి దారిమార్పు చెందింది)

మొదలి నాగభూషణ శర్మ (జూలై 24, 1935 - జనవరి 15, 2019) రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు.[1]

మొదలి నాగభూషణశర్మ
మొదలి నాగభూషణశర్మ
జననంజూలై 24, 1935
ధూళిపూడి గ్రామం, గుంటూరు జిల్లా
మరణంజనవరి 15, 2019
తెనాలి, ఆంధ్ర ప్రదేశ్
ప్రసిద్ధినటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు
భార్య / భర్తసరస్వతి
తండ్రిసుబ్రహ్మణ్యశర్మ
తల్లికామేశ్వరమ్మ

నాగభూషణ శర్మ 1935, జూలై 24 తేదీన గుంటూరు జిల్లా, ధూళిపూడి గ్రామంలో జన్మించాడు.[2] ఇతని తల్లి కామేశ్వరమ్మ. తండ్రి సుబ్రహ్మణ్యశర్మ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.

రంగస్థల ప్రస్థానం

మార్చు

ఇతని తండ్రి కూడా స్వయంగా నాటక రచయిత, ప్రయోక్త, కథా రచయిత. అతని స్ఫూర్తి వల్లనే నాగభూషణ శర్మ నాటకరంగంలోకి వచ్చాడు. తండ్రి నేతృత్వంలో ఎనిమిదవ ఏటనే రంగస్థలంపై తొలిపాఠాలు నేర్చిన శర్మ కాలేజీ రోజుల్లో బందరులో కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రను ధరించి పేరుపొందాడు. కళాశాలలో చదువుతుండగానే ఆయన తొలి రచన అన్వేషణ 1954లో భారతిలో ప్రచురితమైంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ఆంగ్ల సాహిత్య పట్టభద్రుడై నాగభూషణ శర్మ, అమెరికా లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో నాటకదర్శకత్వంలో ఎం.ఎఫ్.ఏ పట్టా పొందాడు. నాటకమే ప్రధానాశంగా పరిశోధన చేసి డాక్టరేటు అందుకున్నాడు. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు శాఖ లోను, నాటక శాఖ లోను ఆచార్యుడిగా పనిచేశాడు.

విదేశాలలో పర్యటించి, వివిధ నాటక ప్రయోగ రీతుల్ని అధ్యయనం చేసి శిక్షణ పొందాడు. నవల, నాటక సాహిత్యానికి చెందిన అనేక పరిశోధనాత్మక వ్యాసాలు పత్రికల్లో ప్రకటించాడు.

ది విజిట్, కింగ్ ఈడిపస్, హయవదన, తుగ్లక్, మృచ్ఛకటిక, వెయిటింగ్ ఫర్ గోడో వంటి గ్రీకు, సంస్కృత, ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించి హైదరాబాదు డ్రమటిక్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రదర్శించాడు. అడ్డదారి, పెళ్ళికి పది నిమిషాల ముందు, మదనకామరాజు కథ, ప్రజానాయకుడు ప్రకాశం వంటి స్వతంత్ర నాటకాలను, యాంటిగని, మాక్‌బెత్, డాల్స్‌హౌస్, ఎనిమీ ఆఫ్‌ది పీపుల్, ఎంపరర్‌జోన్స్, వెయిటింగ్ ఫర్ గోడో, కాయితం పులి, హయవదన, సాంబశివ ప్రహసనం వంటి గొప్ప పాశ్చాత్య, భారతీయ నాటకాలను స్వేచ్ఛానువాదం చేశాడు. ప్రజా నాయకుడు ప్రకాశం నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించాడు.

విషాదాంతం, జంట పక్షులు, సంభవామి, నరజాతి చరిత్ర, మన్మధుడు మళ్లీ పుట్టాడు, రాజా ఈడిపస్ (అనువాదం), ప్రజానాయకుడు ప్రకాశం మొదలైన నాటకాలను, అన్వేషణ, అడ్డదారి, ఆగస్టు 15, జననీ జన్మభూమి, రాజదండం మొదలైన నాటికలను రచించాడు. ఈయన దాదాపు 70 నాటకాలు, నాటికలు, రేడియో నాటికలు వ్రాశాడు. స్వతంత్ర నాటకాలే కాక అనేక అనువాద నాటకాలు కూడా వ్రాశాడు. ఈయన దర్శకత్వంలో ఇరవైకి పైగా ఆంగ్ల నాటకాలు, అరవైకి పైగా తెలుగు నాటకాలు ఈయన దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి.

తెలుగు సాహిత్యం- గాంధీజీ ప్రభావం, నూరేళ్ళ తెలుగునాటకరంగం (సంపాదకులు), లోచన (వ్యాస సంపుటి) వీరి ఇతర రచనలు. 'ప్రకాశం' నాటకానికి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం లభించింది. నాటక, కళారంగాల్లో విశేష కృషి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారానికి 2013 లో ఈయన ఎంపికయ్యాడు.[3] 2019, జనవరి 6న తెనాలిలో అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పురస్కారం అందుకున్నాడు.[1]

పురస్కారాలు

మార్చు
  1. రసమయి రంగస్థల పురస్కారం (2017)[4]

నాగభూషణశర్మ 2019, జనవరి 15న తెనాలిలో మరణించాడు.[2][5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 సాక్షి, ఆంధ్రప్రదేశ్ (గుంటూరు) (17 January 2019). "నాటక దిగ్గజం మొదలి అస్తమయం". Archived from the original on 17 January 2019. Retrieved 17 January 2019.
  2. 2.0 2.1 ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు (17 January 2019). "ఒరిగిన సాహితీ శిఖరం". Archived from the original on 17 జనవరి 2019. Retrieved 17 January 2019.
  3. http://archive.andhrabhoomi.net/content/s-1838[permanent dead link]
  4. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు. "ఘనంగా రంగస్థల పురస్కారాల ప్రదానం". Archived from the original on 26 April 2019. Retrieved 26 April 2019.
  5. ఈనాడు, న్యూస్‌టుడే (17 January 2019). "రంగస్థల ప్రముఖుడు శర్మ కన్నుమూత". Archived from the original on 17 January 2019. Retrieved 17 January 2019.