రాజా రవివర్మ

(రవి వర్మ నుండి దారిమార్పు చెందింది)

రాజా రవి వర్మ భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతం లోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. 1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఇతను మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికంగా తిరువనంతపురంలోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.[1]

రాజా రవి వర్మ
జననం29, ఏప్రిల్ 1848
భారతదేశం కిలమానూర్, కేరళ, ఇండియా
మరణంఅక్టోబరు 2, 1906
కిలమానూర్, కేరళ, ఇండియా
వృత్తిచిత్రకారుడు
భార్య / భర్తరాణీ భాగీరథీబాయి (కోచు పంగి అమ్మ)
పిల్లలుఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
తండ్రినీలకంఠన్ భట్టాద్రిపాద్
తల్లిఉమాంబ తాంబురాట్టి

బాల్యము

మార్చు
 
కిలమానూరు ప్యాలెస్‌లో రవివర్మ పుట్టిన ఇల్లు (ముందు భాగంలో ఇతని స్టూడియో చూడవచ్చు)

రాజా రవివర్మ ఈనాటి భారతదేశంలోని కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలోని కిలమానూరు ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు 1848 ఏప్రిల్ 29న జన్మించాడు. చిన్నతనంలోనే ఇతను చూపిన ప్రతిభ వలన ఇతనిని, ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్ చేరదీసి ప్రోత్సహించాడు. అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు శిష్యరికం చేశాడు. తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు. పాశ్చాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి.

వృత్తి

మార్చు

1873 వియన్నా చిత్ర ప్రదర్శనలో మొదటి బహుమతి పొందిన తరువాత రవివర్మ బాగా వెలుగులోకి వచ్చాడు.[2] ఆయన తన చిత్రాల ఇతివృత్తాల కోసము భారత దేశమంతటా పర్యటించాడు. తరచుగా ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని అతను భావించేవాడు. ముఖ్యంగా మహాభారతంలోని నలదమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు. రాజా రవివర్మ తరువాత నుండి భారతీయుల ఊహలలో పౌరాణిక పాత్రలన్నీ రవివర్మ చిత్రాలలాగా మారిపోయాయి. రవివర్మ తరచుగా తన చిత్ర శైలిలో ప్రదర్శనాత్మకంగానూ, ఛాందసంగానూ ఉంటాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినా అతని పనితనం భారతదేశంలో ఎంతో ప్రశస్తి పొందింది.

1894 లో లిథోగ్రాఫిక్ యంత్రాలు, చిత్రించడానికి అనువైన రాళ్ళూ, సాంకేతిక నిపుణులను జర్మనీ నుంచి తెప్పించాడు రవివర్మ. దేశంలోనే మొదటి సారిగా అత్యాధునిక ప్రెస్ ను ముంబైలో ప్రారంభించాడు. అయితే అక్కడ స్థలాభావం కారణంగా, భయంకరమైన ప్లేగు వ్యాపించడం వల్ల, కార్మికులు సరిగా లభించకపోవడం వలన నాలుగు సంవత్సరాల తరువాత మహారాష్ట్ర లోనే కొండ కోనల నడుమ ఉన్న మలవాలి అనే గ్రామాన్ని ఎంచుకున్నాడు. ప్రెస్ పక్కనే తన నివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రింటింగ్ పనులు బాగా సాగడంతో కేరళ నుంచి తరచుగా ఈ గ్రామాన్ని సందర్శిస్తుండే వాడు.

రవివర్మ చనిపోవడానికి రెండేళ్ళ ముందు ప్రెస్ ను తన స్నేహితుడైన ఒక జర్మన్ సాంకేతిక నిపుణుడికి విక్రయించాడు. దానితో పాటు వంద చిత్రాలకు కాపీరైట్ కూడా ఇచ్చాడు. అయితే 1972లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రెస్ కు భారీ నష్టం జరిగింది. ఆ తర్వాత మిగిలిన చిత్రాలను, రాళ్ళనూ ప్రెస్ చుట్టు పక్కల నివసించేవారికి పంచి పెట్టేశారు. ఆ తరువాత ముంబై, పుణే ప్రభుత్వాలు కొన్నింటిని మాత్రమే భద్రపరచగలిగాయి.[3]

రవివర్మ బొమ్మల కొలువు

మార్చు

పేరు తెచ్చిన చిత్రాలు

మార్చు
 
స్వర్బత్ వాయించే యువతి ఆభరణాలు

క్రింది చిత్రాలు రాజా రవివర్మకు ఎంతో పేరు తెచ్చినవి:

  • పల్లె పడుచు
  • అలోచనలో మునిగిపోయిన స్త్రీ
  • దమయంతి హంస సంవాదం
  • వాద్యకారుల బృందం
  • సుభద్రార్జునులు
  • లేడీ విత్ ఫ్రూట్స్
  • హార్ట్ బ్రోకెన్
  • స్వర్బత్ ప్లేయర్
  • శకుంతల
  • శ్రీ కృష్ణ రాయబారం
  • రావణ జటాయు వధ
  • ఇంద్రజీత్ విజయం
  • బిక్షకుల కుటుంబం
  • లేడీ ప్లేయింగ్ స్వర్బత్
  • గుడి వద్ద దానాలు ఇస్తున్న స్త్రీ
  • వరుణుని జయించిన రాముడు
  • నాయర్ల స్త్రీ
  • శృంగారంలో మునిగిన జంట
  • కీచకుని కలవటానికి భయపడుతున్న ద్రౌపది
  • శంతనుడు మత్స్యగంధి
  • ప్రేమలేఖ వ్రాస్తున్న శకుంతల
  • కణ్వుని ఆశ్రమములోని బాలిక. (ఋషి కన్య).

తాత్విక దృష్టి

మార్చు

రవివర్మ తాత్విక దృష్టి గురించిన వివరాలు తెలియవు. ముఖ్యంగా పాశ్ఛ్యాత్య చిత్రకళా శైలి మీద అతని అవగాహన గురించి (అందులో అతనికి క్రమమైన ప్రాథమిక శిక్షణ ఉంది అని తెలిసినా) తెలియదు. రవివర్మ చిత్రకళపైన తీక్షణమయిన పరిశోధన చేసే వారికి రవివర్మ వ్రాసిన ఎటువంటి పుస్తకాలూ లేకపోవటము వలన వారి పరిశోధన అసంపూర్తిగా మిగిలి పోతుంది. కాని రవివర్మ తమ్ముడు, సి.రాజరాజవర్మ రాసిన దినచర్య ఎంతో ఉపయోగపడుతుంది.[4] సి.రాజరాజవర్మ స్వతహాగా మంచి పేరున్న చిత్రకారుడు. ఆయన రవివర్మకు చిత్రాలు చిత్రించడంలో సహాయము చేసేవాడు, అతని ఆంతరంగిక సహాయకుడు.[5] రవివర్మ అయ్యావు స్వామికల్ స్వామిని గురువుగా భావిస్తాడు.[6]

రవివర్మపై విమర్శలు

మార్చు

రవివర్మ తనదైన శైలిలో చిత్రించిన చిత్రాలను వివిధ రకాల ఉపయోగాల కోసం విపరీతంగా ముద్రించటం వలన, భారతీయ ఇతిహాసాలను తనదైనశైలిలో చిత్రించటం వలన సాంప్రదాయ భారతీయ చిత్ర కళా శైలి మరుగున పడిపోయిందనే విమర్శను ఎదుర్కొన్నాడు. అతని చిత్రకళను సాంప్రదాయశైలి కోసం విద్యలాగా నేర్చుకోవలసిందే అనే భావనకు ఊతమివ్వడం ద్వారా ఒక్కదెబ్బతో శైలిపరంగా, ఇతివృత్త పరంగా చురుకైంది, గొప్పదైంది అయిన భారతీయ చిత్రకళను బలహీనపరిచాడు అని దాస్ గుప్తా అభిప్రాయం వెలిబుచ్చాడు. అది తప్పు అని చెప్పటానికి సరైన ఉదాహరణలుగా దాస్ గుప్తా మధుబని జానపద చిత్రకళను [7], పశ్చిమ బెంగాల్ లోని దుర్గాదేవి మూర్తులను చూపించాడు.[8] రవివర్మ చిత్రాలలో[9] కచ్చితంగా ఇటువంటి చురుకైన భావవ్యక్తీకరణ లోపించింది.

పౌరాణిక పాత్రల రూపకల్పనలోని పౌరాణిక సూత్రాలను విస్మరించటం (ఉదాహరణకు విష్ణు ధర్మోత్తర పురాణంలోని, చిత్రసూత్ర) ద్వారా రవివర్మ గొప్పవైన పౌరాణిక నాయకులను, సామాన్య మానవుల స్థాయికి దిగజార్చాడు. అవే భావనలు, వివిధ ప్రసార సాధనాలకు (సినిమా, దూరదర్శన్‌లకు) పాకిపోయాయి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే రవివర్మ చిత్రాల వల్ల ప్రభావితమయ్యాడు.

శ్రద్ధాంజలి

మార్చు

రాజా రవివర్మ చిత్రకళకు చేసిన మహోన్నత ఉపకారానికిగానూ కేరళ ప్రభుత్వం అతని పేరిట రాజా రవివర్మ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ పురస్కారం ప్రతి ఏటా కళలు, సంస్కృతి అభ్యున్నతికై, విశేష కృషి సల్పిన వారికి ఇస్తుంది. అవార్డు గ్రహీతలలో

  • కె.జి.సుబ్రహ్మణియన్ (2001)
  • ఎమ్.వి.దేవన్ (2002)
  • ఎ.రామచంద్రన్ (2003)
  • వాసుదేవన్ నాయర్ (2004)
  • కనై కున్హిరామన్ (2005)
  • వి.ఎస్.వల్లిథాన్ (2006)

రాజా రవివర్మ పేరిట కేరళలోని మావలికెరలో ఒక ఫైన్ఆర్ట్స్ కళాశాలను నెలకొల్పారు. రవివర్మపై గల ఆసక్తి వల్ల సినిమా, వీడియోలలో కుడా అతని చిత్రాలను ఉపయోగించుకుంటున్నారు.

సంసార జీవితం

మార్చు

రాజా రవివర్మకు మావలికెర రాజ కుటుంబానికి చెందిన రాణీ భాగీరథీబాయి (కోచు పంగి అమ్మ)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పెద్ద కుమారుడు, రాకుమారుడు రామవర్మ కూడా చిత్రకారుడు. ఇతనికి గౌరీ కుంజమ్మతో వివాహం జరిగింది. ఈమె దీవాన్ పి.జి.ఎన్.ఉన్నిథాన్ చెల్లెలు. రెండవ వాడు రాకుమారుడు రాజరాజవర్మ. పెద్ద కుమార్తె రాకుమారి మహాప్రభ. (ట్రావెన్‌కూర్ రాణీ సేతులక్ష్మీబాయి తల్లి). ఈమె రవివర్మ వేసిన రెండు చిత్రాలలో కన్పిస్తుంది. రెండవ కుమార్తె రాకుమారి ఉమాబాయి. రవివర్మ సంతానము తోటే మావెలికెర రాజ కుటుంబము ఏర్పడింది. ఇంకా అతని మనుమరాండ్రు ఇద్దరు మావలికెర రాజ కుటుంబానికి దాయాదులయిన ట్రావెన్కోర్ రాజ కుటుంబానికి దత్తు పోయారు. వారిలో పైన చెప్పబడిన రాణీ సేతులక్ష్మీబాయి కూడా ఉంది. వారి సంతానమే ఇప్పటి ట్రావెన్‌కూర్ రాజ కుటుంబం.

రవివర్మ గురించిన పుస్తకాలు

మార్చు
 
రాజా రవివర్మ: పోట్రెయిట్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్: ది డైరీ ఆఫ్ సి.రాజరాజవర్మ

ఇంగ్లీషులో

మార్చు
  • రాజా రవివర్మ, ముద్రింపబడిన హిందూ దేవతలు,ఎర్విన్ న్యూ మేయర్,క్రిస్టీన్ స్కెల్బెర్గెర్.న్యూ ఢెల్లి,ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్.2003.
  • రాజా రవివర్మ,ప్రఖ్యాతి గాంచిన భారతీయ చిత్రకారుడు 1848-1906,క్లాసిక్ కలెక్షన్,వాల్యూమ్ 1,2.పర్సు రామ్ మంఘా రామ్,బెంగుళూరు.2005.
  • రాజా రవివర్మ: చిత్రకారుని ముఖచిత్రం,డయిరి ఆఫ్ సి.రాజరాజవర్మ,ఎడిటెడ్ బై ఎర్విన్ న్యూ మేయర్,క్రిస్టీన్ స్కెల్బెర్గెర్.న్యూ ఢెల్లి,ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్.2005.
  • దేవుని చిత్రకళ,ఎన్రికో కాస్టెల్లి,గియోవాన్ని ఏప్రిల్.న్యూ ఢీల్లి.ఇల్ తామ్బురోపార్లాన్టి డాక్యుమెన్టేషన్ సెంటర్,ఎథ్నోగ్రాఫిక్ మ్యూసియమ్.2005.
  • ఫొటోస్ ఆఫ్ గాడ్స్,ది ప్రింటెడ్ ఇమేజ్ అండ్ పొలిటికల్ స్ట్రగుల్ ఇన్ ఇండియా.బై క్రిస్టోఫర్ పిన్నె,లండన్,రీక్షన్ బుక్.

మళయాళంలో

మార్చు
  • రాజా రవివర్మయు, చిత్రకళయు, కిలమానూర్ చంద్రన్, కేరళ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రచురణ.1999.
  • చిత్రమెళుదు కొయితంబురాన్,పి.ఎన్.నారాయణ పిళ్ళై.
  • రాజా రవివర్మ, ఎన్.భాస్కరన్ నాయర్.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-10-01. Retrieved 2007-07-17.
  2. Kilimanoor Chandran, Ravi Varmayum Chitrakalayum(in Malyalam),Department of Culture,Kerala, 1998
  3. రవివర్మ మెచ్చిన పల్లె, ఈనాడు ఆదివారం అనుబంధం 10 నవంబర్ 2013 పే 18
  4. A tour in Upper India, C . Raja Raja Varma was translated and published in a malayalam journal Thilakam edited by G Shankara Kurup, now out of print
  5. "Raja Ravi Varma: Portrait of an Artist" Archived 2007-05-14 at the Wayback Machine. May 05, 2006 Oxford University Press.
  6. Brahmasree Thycaud Ayyavu Swami. Trivandrum, Ayyavu Mission, 1997
  7. Madhubani Paintings[permanent dead link]
  8. "Durga in West Bengal". Archived from the original on 2007-11-29. Retrieved 2007-07-17.
  9. Ravi Varma's approach

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.