యాబలూరు సుందర రాంబాబు, తెలుగు సాహిత్యానికి రామతీర్థగానే పరిచయం.ఇతను ఓ కవి, చదువరి, విమర్శకుడు, అనువాదకుడు. తెలుగుతోపాటు హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఒరియా, ఇంగ్లీష్‌ భాషల సాహిత్యాన్ని అధ్యయనం చేశారు.

రామతీర్థ
జననంయాబలూరు సుందర రాంబాబు
1960
పలాస
మరణం2019
విశాఖపట్నం
ఇతర పేర్లువై.ఎస్.రాంబాబు
ప్రసిద్ధికవి, విమర్శకుడు
భార్య / భర్తకామేశ్వరి

జననం మార్చు

రామతీర్థ 1960 జూలై 17 న పలాస ప్రాంతంలో పుట్టారు. ఇతని తండ్రి ఓ రైల్వే ఉద్యోగి. ఖుర్దారోడ్‌లో కొంతకాలం ఉన్నాక, రామతీర్థ విశాఖపట్నం వచ్చాడు. వంగ, కళింగ భాషల్ని జన్మతహా అబ్బించుకున్నాడు. ఒడియా కవి ఫకీర్ మోహన్ సేనాపతి అంటే ఇతనికి అమితమైన ప్రేమ. విశాఖ పోర్ట్ ట్రస్టులో కంట్రోలర్ ఆఫ్ డాక్ సేఫ్టీ ఉద్యోగం చేస్తూ మూడేళ్లు సర్వీసు ఉండగా రామతీర్థ విఆర్‌ఎస్‌ తీసుకున్నాడు

‘కవిత సాహితీ సాంస్కృతిక వేదిక’ ఇతని తొలి కవిత్వ పాఠశాల. 1993లో రాసిన ‘తెల్ల మిరియం’ కవితాసంపుటికి ఆరుద్ర ‘‘బోణీ’’ అనే పేరుతో ముందు మాట రాశారు. ‘నిర్భయ జ్యోతి’, ‘హుదూద్‌’ లాంటి సంగ్రహణాత్మక దీర్ఘ కవితలను రాశాడు. ‘‘హీరోగి’’, ‘‘శనిమా’’, ‘‘రేప్‌ క్లాక్‌’’, ‘‘మృగాడు’’ ఇలా అనేక పదాలు ఇతని సొంత తయారీ. ఇతను రాసిన కన్యాశుల్క కవితోత్సవం గురించి చెప్పాలంటే బహుశా ఇలాంటి ప్రయత్నం వేరే ఎవ్వరూ చేయలేదు. ఒక నాటకానికి నివాళులు అర్పించడానికి 52 కవితలు రాశారు.[1] అలాగే కన్యాశుల్కం 1887 మొదటి ప్రతిని సేకరించి డిజిటల్ రూపంలో భద్రపరిచారు. కాలగర్భంలో కలిసిపోయిన కందుకూరి ఆంగ్ల ప్రసంగాన్ని వెలికితీసి సాహిత్య లోకానికి పరిచయం చేశారు. చెన్నై తెలుగు సంస్థ, చెన్నై తెలుగు ప్రకాశంతో కలిసి క్రాంతదర్శి కందుకూరి శతవర్ధంతి సంచిక ప్రచురణలో భాగస్వామిగా పనిచేశాడు. కన్యాశుల్కంలో గురజాడ అందించిన విలువలు ప్రజలలోకి చొచ్చుకువెళ్లాలని అహర్నిశలు కృషి చేశాడు రామతీర్థ.

2003 వరకు రామతీర్థ కవి, ప్రాసంగికుడు మాత్రమే. 2003లో సాహితీ బాంధవిగా జగద్ధాత్రితో కలిసి మొజాయిక్‌ సాహితీ సంస్థని స్థాపించాడు. ఒకే లాంటి సాహితీ అభిరుచి వారిద్దరి సహజీవనానికి కారణమయింది. ఎన్నో విమర్శలకి గురి అయినా వారి సాహిత్య అనురాగాల ముందు అవి పటాపంచలయ్యాయి. కవిత్వం, కథా రచన, అనువాదమూ, గేయ రచన, రేడియో రూపక రచన, నిర్మాణం, నాటికలు, సాహిత్య విమర్శ, పరిశోధన, పత్రికా సంపాదకత్వం, సమకాలీన జాతీయ / ప్రపంచ సాహిత్య విషయంగా శక్తివంతమైన ప్రసంగాలు, తెలుగు ఇంకా ఇంగ్లీష్ భాషల్లో వ్యాసరచన, సమాంతరంగా ప్రాచీన ఆధునిక ధోరణుల్లో సామాజిక నిష్ట, భాషా చరిత్రలో పరిపూర్ణ సదవగాహన... వెరసి రామతీర్థ. జగద్ధాత్రి, రామతీర్థలు ఇరువురూ ‘‘మండే మొజాయిక్’’ పేరున ప్రతీ సోమవారం సాయంత్రం విశాఖ పౌర గ్రంథాలయంలో సాహితీసభలు నిర్వహించేవారు. ఆకాశవాణి విశాఖపట్నంలో రామతీర్థ, జగద్ధాత్రి కలిసి ‘సాహితీ సమీరాలు’ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాముఖ్యతని సైతం తెలియజేసేవారు[2]

మొజాయిక్ సాహిత్య సురభి, రిత్విక్ ఫౌండేషన్లతో కలిసి ‘‘అక్షర గోదావరి’’ పురస్కారాలను కథకు కవిత్వానికి, విమర్శకు ప్రతీ ఏడాది అందించేవారు. రామతీర్థ వ్యాసాలు హన్స్ ఇండియా, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, తెలుగు వెలుగు, లీడర్ మొదలైన పత్రికలలో ప్రచురితమయ్యాయి. 2019 మే 30 న రామతీర్థ విశాఖపట్నంలో గుండెపోటుతో మరణించాడు. అతను మరణించిన కొద్ది నెలలకు సహచరి జగద్ధాత్రి కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

రచనలు మార్చు

 • తెల్లమిరియం
 • నిర్భయజ్యోతి
 • హుదూద్
 • కన్యాశుల్క కవితోత్సవం
 • పోస్టాఫీసు (రవీంద్రనాథ్ టాగూర్ రచనకు అనువాదం)
 • జోన్ (అంతర్జాతీయ కవిత్వం)
 • నూరేళ్ల జనగణమన
 • కెన్ సారో వివా స్మృతికి పదేళ్ళు సంపుటి
 • శతాబ్ది శ్రీశ్రీ
 • వృధాత్రి
 • నజ్రుల్ ఇస్లాం బిద్రోహి కవిత్వం (బెంగాలీ నుండి తెలుగులోకి అనువాదం)
 • అన్నపూర్ణాక్షరం (రాచకొండ నరసింహ శర్మ ఆంగ్ల కవితలకు తెలుగు అనువాదం)

పురస్కారాలు మార్చు

 • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుండి గిడుగు రామ్మూర్తి పురస్కారం
 • రంజని కుందుర్తి పురస్కారం
 • శ్రీశ్రీ వచన కవిత్వ పురస్కారం
 • ఒడిస్సా వారి ఉత్కల్ సాంస్కృతిక సమ్మాన్
 • గురజాడ పురస్కారం
 • లైన్స్‌క్లబ్ విశాఖ అవార్డు
 • రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ వారి ద్వారా రావిశాస్త్రి పురస్కారం
 • చాసో స్ఫూర్తి ట్రస్ట్ వారి ద్వారా చాసో పురస్కారం
 • మునిపల్లి రాజు స్మారక పురస్కారం [3]

రచనల నుండి మచ్చుతునక మార్చు

భయం వరం
గోడల మీద డైనొసార్లు తిరుగుతున్నాయి
మహా సముద్రాలు పెరటి కొలనులయ్యాయి
గ్రహ గృహాల కిటికీలు తెరిస్తే
పక్క గ్రహాల ఇళ్ల వాకిళ్ళలో
ఆకు పచ్చ ముగ్గుల్లా హరితారణ్యాలు కన్పిస్తున్నాయి
మధ్యలో మందార చిచ్చులా అగ్గి కనుమలు
ప్రతీ తారా విద్యుత్తు అమ్ముకుంటోంది
ప్రతీ గ్రహమూ రోదసీ ట్రాన్స్ ఫార్మర్ కు దగ్గరగా
తన విద్యుత్ స్తంభాల్ని నిలబెట్టుకుంటుంది
గ్రహాంతర దూరాల్ని
ఇరుగు పొరుగు ఇళ్ల మధ్య దూరంగా
ఈ స్టోన్ హౌస్ పేటలో
ఆవలీలగా దాటిపోతున్నారు
గ్రహులందరూ
ఆ గ్రహులు, ఈ గ్రహులు
అందరూ నిగ్రహులు, ఆజాను బాహూ విగ్రహులు
ఏనుగులు ఎలకలైన ఇళ్ళలో
బాత్ రూముల్లో
నాయాగారా జలపాతాలు ధారపోతున్నాయి
అంగారక వారి అప్పారావుకీ
భూమి వారి శ్యామలకీ
శని గ్రహం షామియానాలో పెళ్లి –
పాల పుంత పథం మీద అది వాహనాల బారా –
కాదది
కదులుతున్న ఎవరెస్టుల కిల్మంజారోల కాన్వాయీ
చక్రవాహన విశ్వ ఘోష
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, తాజ్ మహల్ లు
తెచ్చారు భూమి నుంచి
మగ పెళ్లి వారు అంగారక వారి ఇంటికి –
గడ్డ కట్టిన అంగారక బంగారు నది –
ఎక్కుపెట్టిన బాణపు మొన పై గుచ్చుకున్న తిమింగలం
తెచ్చారు భూమి వారి శ్యామలమ్మకు
అనంత పౌరుషాల అప్పారావు శక్తికి ధీటుగా
పాలపుంత కొనలలో ఒక సూర్య చితి మండుతోంది
వేల సూర్యులు జీవన ప్రభాతం లో యవ్వన ప్రాదుర్భావులై
ఉదయిస్తున్నారు
లక్షల చంద్రులు ఆకాశ కర్మాగారాలలో
అసెంబ్లీ లైను మీద తయారై, ప్రతి షిఫ్టులో
గ్రహ గృహాల ఇళ్ల దీపాలవుతున్నారు
రెండు తాళ ప్రమాణాల చుట్ట కాలుస్తూ
చెప్తున్నాడు ప్రాక్సిమా సెంటారీ నుంచొచ్చిన పెదనాన్న
కోట్ల మైళ్ళ నుంచోచ్చిన వార్తను
సుదూరాల నక్షత్ర గుచ్ఛమొకటి కాలి బూడిదైపోయిందట
అక్కడినుంచి పుట్టిందట జీవం –
పాపం ఇప్పుడు జీవనికి పుట్టినిల్లు లేదు
గ్రహాలన్నీ ఎక్కే దిగే గుమ్మాలే
ఉబ్బిపోయిందట లోకం –
ఎందుకిలా అడిగాడొక బలహీనుడు
వాడు నిండా ఆరడుగులు లేడు
మన గ్రహ గృహాలలోని చీమ కన్నా చిన్న వాడు
ఎగేసి తన్నిందట ప్రకృతి ఒకసారి
ఏదో ఒక నాడు వాడి దేవుడి పుట్టినరోజున
అడవులు, ఆకాశ నైరూప్య నిశారణ్యాలు
పట్టిపోయాడు దాంతో –
వాడూ మన పూర్వీకుడేనట –
ఎందుకిలా —
ఎవడీ అల్పిష్టి అక్కు పక్షి –
మన గ్రహాంతర వివాహ వేళ –
ఏమో ఎరగం మనం
ఏదో తెలియం మనం
అయినా ఈదుకుంటూ వచ్చాడట రోదసి నదిలో
మన మహా పారదర్శక ప్రవాహంలో
ఈ మానవ కణాన్ని జాగ్రత్తగా పంట నొక్కి పెట్టి
తెచ్చాయి రెండు సొర కాంతలు –
ఆకలేస్తే గ్రహాల దొంతర్లని తినేయగలవవి
అయినా మనిషి వలె వున్నాడని
మనిషిలో వెయ్యో వంతుగా వున్నాడని
తెచ్చాయట ఈ పెళ్ళికి –
జల గాలక్సీల కానుకగా –
వాడే అంటున్నాడు మనం ఉబ్బి పోయామని
మనకి సౌందర్య శాస్త్రం తెలీదని –
కొత్త గ్రహాల గృహాలకై పాతబడి కూలిన గృహ భస్మాల్ని
వాడుకునే మనం
ఎక్కడ వెదక గలం ఎప్పుడు బూడిద బూడిదయి
ఎన్ని సార్లు బూడిదయ్యిందో
వీడు చెప్పే భూమనే గ్రహం?
అయినా విందాం, వీడి మాట ఏమిటో ?
అంగారక అప్పారావు , భూమి శ్యామలల పెళ్ళికి
వీడే కదా ఒక అపురూప కానుక
వీడి మంటల స్థాయి , మన ఇంట సూది పడినట్టయినా లేదు –
విందాం శబ్దోల్బణ యంత్రాలతో –
అలనాడు మనం ఎరుగని గ్రహాన –
ఆసియా మైనర్ లో ఎగిరిందట వీడి బతుకు జెండా –
మన మానవ బహు గ్రహ భాషా ప్రొసెసర్
మారుస్తోంది వీడి పలుకులు – మన గాలి ఊసుగా –
ఉబ్బిపోయాం మనం
అదీ వాడి తెలివి తక్కువ వల్లేనట
ఎవరూ ఏ వరమూ అడగని వేలుపు
వుండే వాడట ఒకడు
అలనాటి ఆ తొలి భూమి దేవరలతో ఒకడిగా –
అట్టి వరమేవరూ అడగని వామనుడ్ని
అడిగాడీ మానవుడు –
ఒకసారి నీ వామనత్వం నుంచి
త్రివిక్రమత దిశగా ఎదిగిన
అనుభవాన్ని తనకిమ్మని –
ఎవరమూ వైయుక్తికం కాదు – అది లౌకికం అవుతుంది
అన్నాడట వీడిలో సగముండే
ఆ మూడడుగుల వాడు – గడుసుగా –
రక్త పాతం లేకుండా
రాజ్యాధికారాన్ని మార్చిన చతుర మందహాసంతో
తన చిన్ని పాదాలు పరిశీలించుకుంటూ –
లౌకికమే అయినా సమ్మతమే –
కావాలా త్రివిక్రమత తాలూకు అనుభవం-
అడుగుతున్నదొక ఋషి
భరించలేని కోరిక, సహించలేని వరం ఇది
ఇదే కావాలా అన్నాడట ఆ వడుగు –
అవశ్యం కోరాడీ ఋషి –
అయితే కోటి సూర్యుల, శతకోటి చంద్రుల
కాలం నాది –
నా ప్రతి వేకువలో నాలుగు వేల యుగాల కాలపు కొమ్మ
ఒకటి కూలిపోతుంది
అనంత కాలం ఈ కోరిక సాగరాదు
అయినా సాగుతుంది పన్నెండు గంటల పాటు
పన్నెండు గంటల వామన కాలంగా –
త్రివిక్రమాకార ఊహాతీత ప్రవాహంగా
ఇది నీవు వరమనుకుని కోరి
పొందుతున్న శాపం –
లోకం ఎంత పెరుగుతుందో –
ఇంతేగా వుండిపోతావు నువ్వు
ఈ పన్నెండు గంటల కాలమూ
ఆహా ఎంత బావుందీ కథ –
వీడట మన పూర్వీకుల పూర్వీకుల ముందు వాడట –
మన సొర కాంత కసక్కన నమిలి ఉంటే –
ఈ పాటికే చరిత్ర హీనుడయేవాడు –
అయినా వీడి నేత్రాలలో
ఆ తొలి సూర్యుడి జ్వాలలున్నాయి
ఆ ఒక్క సూర్యుడి ఒక్క భూమికి ఒక్క
సజీవ వారసుడా _
అయితే – ఆ వామనుడెవరయి వుంటాడు –:
ఏమో –
భూమి శ్యామలకి బరువు గుండెలకెక్కింది
భృకుటి బంగాళాఖాతం ముడుచుకున్నట్టు
ముడి వడింది –
అది చూసి లేచాడు అంగారక అప్పారావు
మా పెళ్లి వేళ మంచి ముచ్చట ఇది –
అయినా ఎవరు నువ్వు –
చెప్పి పుణ్యం కట్టుకో –
లేదా ఈ పెళ్లి వేళ విల్లు తీసి –
తిమింగలాస్త్రం ప్రయోగిస్తా –
అది వేల అణుబాంబుల పెట్టు –
చాలు నీ ఒక్క ప్రాణానికి –
పెళ్లి కొడుకు పౌరుషం చూసి మురిసారందరూ
ఆరడుగుల వాడు –
మరెప్పుడో , మరెక్కడో , వేరే కొలువులో, వేరే స్థలం లో
ఆజానుబాహుడు , అరవింద దళాయతాక్షుడు –
బాణం ముందు నిల్చున్నాడు
అంగారక ఇంటివారు
భూమి శ్యామల వంశజులూ ముచ్చట చూస్తుండగా
అంగారక అప్పారావు
అవసరం లేక పోయినా విల్లెక్కు పెట్టాడు –
నిర్వికారంగా ఉన్నాడు
నీలి మేఘపు ఛాయ వాడు –
ఉబ్బిపోయిన లోకాలన్నీమరో అణువిస్ఫోటనానికి సిద్ధమయ్యాయి
రగిలే గ్రహ భస్మరాశులు
పర్వతాల ప్రమాణపు లారీల కెత్తి –
రోదసి రోడ్డు పై కొత్త గ్రహాల తయారీకి
సిద్ధమయ్యారు శాస్త్రులు , మేస్త్రులు, తాపీ పని వారు
ఒకానొక ప్రాణ జన్య యంత్రాలే వారంతా –
అంగారక అప్పారావు తల పెట్టిన
అస్త్ర ప్రయోగం –
అబ్బుర పాటే భూమి శ్యామలకు
చూడాలని – కాబోయే వాడి శౌర్య గరిమ
వరమాల ఎలానూ చేతిలోనే ఉంది
బాణం వదలడమేమిటి , దండ వేయడమేమిటి
ఎప్పుడెప్పుడా ఉవ్విళ్లూరుతోంది
భూమి శ్యామల
అంతా ఒక ప్రళయ కాల నిశ్శబ్దం
అంతా ఒక విలయ కాల ఉలికిపాటు
నవ్వుతున్నది అంగారక అప్పరావొక్కడే
అకారణంగా అయినా ఆయుధ ప్రయోగం చేసేవాడి
అహంకార అందం తో నారి సంధించాడు
తిమింగలాన్ని సంధించాడు –
వేయి అడుగుల విల్లు మీద
ఆరడుగుల వాడు అందులో శతాంశం లేడు
అయినా నిలుచున్నాడు
ఒకానొక ప్రాచీన సూర్యరశ్మి స్వర్ణ భస్మపు పోత లాగ
అఖండ కాలపు అనంతాకృతి లాగ
అంగారక అప్పా రావు ఎక్కు పెట్టిన విల్లు మీది
తిమింగలాస్త్రం మీద కూర్చున్న శతాంశం లో సగం వాడొకడు
అన్నాడు – ఆగాగు తొందర పడకు –
కాలాలు వేరైన మనం
ఏక కాలస్థులం కావడమే వింతల్లోకెల్లా వింత –
నడుస్తున్నదింకా పన్నెండు గంటల కాలం
ఇది వామనుడి కాలం – ఇది నాకు సంబంధించి సత్యమైన కాలం
ఇది ఈ త్రివిక్రముడి పన్నెండు గంటల కాలం
నీ బాణం భావిష్యత్తులోకి వెళ్లదు
ఇదింకా వామనావతార వేళ –
రాముడింకా పుట్టనూ లేదు – రామాయణం జరగనూ లేదు
ఇది నాకు సంబంధించిన నిజమైన కాలం
ఇక ఆ ఆరడుగుల వాడా –
వాడి జీవితంలో సీతా వియోగ వేళ కోరుకుంటాడొక
వరం – తన అవశాన దశలో –
వామనుడ్ని –
సరయూ నదిలో ఉబ్బిన రాముడి దేహం లో జరుగుతున్న కథ ఇది –
ఆ సరయూ భూమికి చెందదు
ఆ రాముడు భూమికి చెందడు
అంగారక అప్పారావు – అహంకరించిన పాదం చూడు
పాదం చూశావా – విశ్వం కన్నా పెద్దది
బాణాలు, అణు క్షిపణులు, సూర్య మండల సహస్రాలు
ఆగవు –
అర చేత విల్లు విరిచి , ఒళ్ళు మరిచి వేషాలేం
వెయ్యక్కర్లేదు
అన్నాడు పిడుగుల పాటగా ఆ వడుగు
అప్పారావు అంగారక్ చెవిలో –
తిమింగలం వణికి – కింద పడింది
అతి కష్టం మీద నిలబడ్డాడు అంగారక అప్పారావు
తాను కింద పడితే భూమి శ్యామల పెళ్లాడదని –
ఎవరిదీ కాలం – రాముడిదా – అంగారక అప్పారావుదా,
వామనుడిదా – ఎవరిది , ఎవరిది , ఎవరిది ,
ఇదొక కలగాపులగపు విలయావర్త బలవత్ ఝరవత్ పరివర్తన
ఆ పరివర్తన లో కాలింగ్ బెల్ మోగింది –
తలుపు తీసుకు లోనికొచ్చిన అతిధి గాలి –
కాళ్ళు లేని అతిధికి ఏ కుర్చీ వేయనూ –
మెలుకువొచ్చింది – కాఫీ కప్పుతో వచ్చింది జగతి
“జగతి పై రామయ్య జన్మించినాడూ” పాట పాడుతూ
(వాల్మీకికి , పోతనకి , శ్రీశ్రీ , ఎమిలీ డికిన్సన్ కి క్షమాపణలతో ) * సారంగలో ప్రచురణ[permanent dead link]

మూలాలు మార్చు

యితర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=రామతీర్థ&oldid=4030745" నుండి వెలికితీశారు