రైతుబిడ్డ (1939 సినిమా)

1971 లో వచ్చిన ఇదేపేరుగల మరొక సినిమా వివరాలకోసం రైతుబిడ్డ (1971 సినిమా) చూడండి.

'రైతుబిడ్డ' సందేశాత్మక తెలుగు చలన చిత్రం . సారధి స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రంను గూడవల్లి రామబ్రహ్మం, చల్లపల్లి రాజా, నిర్మించారు.1939 ఆగస్టు 27 న విడుదలైన ఈ చిత్రంలో బళ్ళారి రాఘవ, కొమ్మూరి పద్మావతిదేవీ, ఎస్.వరలక్ష్మి, గిడుగు వెంకట సీతాపతి ముఖ్యతారాగణంతో గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం భీమవరపు నరసింహారావు అందించారు.

రైతుబిడ్డ
(1939 తెలుగు సినిమా)

అప్పటి సినిమాపోస్టరు [1]
దర్శకత్వం గూడవల్లి రామబ్రహ్మం
నిర్మాణం గూడవల్లి రామబ్రహ్మం,
చల్లపల్లి రాజా
కథ గూడవల్లి రామబ్రహ్మం
తారాగణం బళ్లారి రాఘవ,
గిడుగు వెంకట సీతాపతి,
టంగుటూరి సూర్యకుమారి,
నెల్లూరు నాగరాజారావు,
భీమవరపు నరసింహారావు,
కొమ్మూరి పద్మావతీదేవి,
సుందరమ్మ,
వంగర,
పి. సూరిబాబు,
కొసరాజు,
వేదాంతం రాఘవయ్య
సంగీతం భీమవరపు నరసింహారావు
గీతరచన బసవరాజు అప్పారావు,
కొసరాజు,
నెల్లూరు వెంకట్రామ నాయుడు,
తాపీ ధర్మారావు,
తుమ్మల సీతారామమూర్తి
సంభాషణలు త్రిపురనేని గోపీచంద్,
మల్లాది విశ్వనాధ కవిరాజు
ఛాయాగ్రహణం శైలేన్ బోస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తెలుగు సినిమా చరిత్రలోసినిమాకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. నిషేధింపబడిన మొదటి తెలుగు సినిమా ఇది.

మాలపిల్ల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతుబిడ్డ తీసి రామబ్రహ్మం తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నాడు. 1925 లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఛత్రం క్రింద జాగృతులైన సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం రైతుబిడ్డను నిర్మించాడు.

ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా త్రిపురనేని గోపీచంద్ మాటలు వ్రాశాడు. కొసరాజు పాటలు వ్రాయగా, జమీన్ రైతు ఉద్యమంలో నెల్లూరు వెంకట్రామనాయుడు వ్రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. సంగీత దర్శకుడు బి.నరసింహారావు. చిత్రానికి నృత్య దర్శకుడు వేదాంతం రాఘవయ్య. నట వర్గం: బళ్ళారి రాఘవాచార్య, గిడుగు, పి. సూరిబాబు, నెల్లూరు నగరాజారావు, టంగుటూరి సూర్యకుమారి, శ్. వరలక్ష్మి ఎత్చ్. '39 లో చిత్రం విడుదల గావటనికి ముందు చాలా అవాంతరాలు కలిగించపడ్డాయి. పేర్కొనదగ్గ విషయమేమంటే "సారధి" సంస్థ యజమాని యార్లగడ్డ శివరామప్రసాద్ (చల్లపల్లి జమిందారు). జమిందారీ విధానం మీద, పెత్తనాల మీదా ఒక జమిందారే చిత్రం నిర్మించడం గొప్ప విషయం.

ఈ సినిమాకు వ్యతిరేకత సనాతన వర్గాలకంటే బలంగా జమీందార్ల నుంచి ఎదురైంది. మాలపిల్లను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందార్లు రైతుబిడ్డ సిన్మాను ప్రభుత్వం చేత నిషేధింపజేయగలిగారు. ఇంకో విచిత్రమేమిటంటే జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ సినిమాను నిర్మించినది ఒక జమీందారు. ఈ చిత్ర నిర్మాత అయిన చల్లపల్లి రాజా జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు. పార్టీ లో ఆయన ప్రత్యర్థి వర్గానికి నాయకుడైన మీర్జాపురం రాజా ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తిరోగమన ధోరణిలో అనేక జానపద, పౌరాణిక చిత్రాలను నిర్మించాడు.

రైతుబిడ్డ చిత్రాన్ని జమీందార్ల ఒత్తిడిపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినా ఆ చిత్రం ప్రతిబింబించిన స్ఫూర్తి కాలక్రమంలో విజయం సాధించింది. 1955లో విడుదలై ఘనవిజయం సాధించిన రోజులు మారాయి చిత్రాన్ని రైతుబిడ్డకు కొనసాగింపు అనుకోవచ్చు. కులవ్యవస్థ నిర్మూలన సందేశం ఇవ్వడం కోసం కూడా రామబ్రహ్మం నడుం కట్టాడు. పల్నాటి బ్రహ్మనాయుడు పాత్ర ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడానికి పల్నాటి యుద్ధం సినిమా తీశాడు. 1939 అక్టోబర్లో టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు అసెంబ్లీలో ప్రవేశబెట్టబోయే "ప్రకాశం బిల్లు"కు ప్రచారంగా ఈ చిత్రం తోడ్పడింది. అలాగే జరగబోయే జిల్లాబోర్డు ఎన్నికల్లో జమీందారులకు వ్యతిరేక ప్రచారంలో కూడా ఉపయోగపడింది.

విడుదలకు సిధ్ధంగా వున్న చిత్రాన్ని నిషేధించటనికి వెంకటగిరి, బొబ్బిలి జమీందారులు నోటీసులు ఇచ్చారు. విడుదల రోజునే (ఆగస్టు 27, 1939) వాళ్ల లాయర్లు నెల్లూరు వచ్చి, చిత్రాన్ని చూసి నోట్సు వ్రాసుకొని వెళ్ళారు. అలాగే నిర్మాతలకు రిజిష్టర్డ్ నోటీసులు పంపటం, వారి ఎస్టేటులలో ప్రదర్శిస్తే - సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకొంటామని బెదరించటం జరిగింది. చివరకు నెల్లూరు జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా వెంకటగిరి పట్టణం లోనే కాదు, తాలూకా లోనే కాదు పూర్తి గూడూరు డివిసిఒన్ లోనే చిత్రాన్ని నిషేధించ గలిగారు. సెన్సారుబోర్డు సంఫుర్ణంగా నిషేధించలేదు కాబట్టి వారిపై కూడా ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది. కాని అక్కడ జమీందారుల ఆటలు కొనసాగలేదు. మేజిస్ట్రేట్ చర్య న్యాయ బధ్ధం కానప్పటికి మద్రాసు ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు ప్రవర్తించటం గమనార్హం. ఇలా జమీందార్ల అక్రమాలకు వంతపాడటం ప్రజలకు ఆగ్రహాన్ని కలిగించింది. విడుదలకు తరువాత నిషేధించాలన్న ప్రయత్నాల్లు మరింత తీవ్రమయ్యాయి. కొన్ని చోట్ల ఫిల్మ్ ప్రింటులు దగ్ధం చేయాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. చిత్రంలోని కొన్ని పాత్రలు తమ వ్యక్తిత్వం మీద దెబ్బతీసే పధ్ధతిలో వున్నాయని బొబ్బిలి, వెంకటగిరి రాజాలు చిత్ర నిర్మాతల మీద దావా తెచ్చారు. మొత్తానికి కొంతకాలం కొన్ని జిల్లాలలో నిషేధించబడింది (నిర్మించిన చల్లపల్లి రాజాగారి కృష్ణా జిల్లాలో కూడా).

సినిమాలు ప్రజలమీద ఒత్తిడి తీసుకురాగలవన్న నమ్మకం మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాలతోనే ఆరంభమైంది. ఎంత సంచలనం రేపగలిగినా అనేక అవాంతరాలవల్ల "మాలపిల్ల" లాగా ఆర్ధికవిజయం సాధించలేకపోయింది. నిషేధాలు, కోర్టులు, బెదిరింపులు, ఆర్ధికనష్టంవంటివన్నీ రావటంతో ఎంత సాంఘిక చైతన్యంగల మనిషయినా రామబ్రహంగారు మరల అలాంటి ప్రయత్నం చెయ్యలేక పోయారు.

చిత్రకథ

మార్చు

శావల్యాపురం అనే వూళ్ళో ఎన్నికల హడావిడి జరుగుతున్నది. జమీందారు అభ్యర్థి వెంకయ్య; అతని పోటీగా రైతు ప్రతినిధి రామిరెడ్డి నిలబడ్డారు. ఆ వూరికి దగ్గరగా వున్న నాగాపురం అనే వూళ్ళో కూడా రెండు పార్టీలున్నాయి. ఒకటి మునసబు పార్టీ, రెండోది కరణం పార్టీ. ఆ వూళ్ళోనే నర్సిరెడ్డి అనే రైతు ఉన్నాడు. భార్యాపుత్రులతో అతను తనకున్న పది ఎకరాల కొండ్రనూ సేద్యం చేసుకుంటూ జీవయాత్ర సాగిస్తున్నాడు. అతనంటే తక్కిన రైతులకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయి. అయితే నర్సిరెడ్డి ఆ గ్రామానికి చెందిన షావుకారు కనకయ్యకు కొంత బాకీ వున్నాడు. ఆ మిషతో షావుకారు, కరణం కలిసి శావల్యాపురం జమీందారు పక్షానికి ఓటెయ్యాలని నర్సిరెడ్డిని నిర్భంధించారు. నర్సిరెడ్డి ఒప్పుకోలేదు. "నేను రైతును. కాబట్టి రైతుపక్షానికే ఓటువేస్తాను" అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటకు షావుకారు కనకయ్య, కరణం కలిసి మండిపడ్డారు. "మా మాటనే ధిక్కరించాడని" షావుకారు, "మామాటను కాదన్నాడని" కరణం భావించుకున్నారు. అతని నిర్లక్ష్యానికి ఇద్దరూ రెచ్చిపోయారు. ఇద్దరూ కలిసి దొంగ పద్దులు రాసి నర్సిరెడ్డి ఖాతా పెంచారు. ఆ బాకీ కింద అతని భూమిని తాకట్టు పెట్టమని నర్సిరెడ్డిని బలవంతం చెయ్యసాగారు. భూమి తాకట్టు మాట వినేసరికి నర్సిరెడ్డి పాములా కస్సుమని లేచాడు. "సొంత భూమినీ, కన్న తల్లినీ ఇతరులకు వప్పగించడమా" ఆని ఉరిమాడు. దాంతో కరణం, షావుకారు మరింత రెచ్చిపోయి అతనిపై జమీందారుకు చాడీలు చెప్పారు. దాంతో జమీందారు ఆగ్రహించి, తన్ ఉద్యోగులను పంపి నర్సిరెడ్డి పశువులను దౌర్జన్యంగా తోలించాడు. అప్పటికీ నర్సిరెడ్డి తన పట్టు వదలక పోవడం చూసి, జమీందారు ఉద్యోగులు మరింత ఉగ్రులైనారు. నర్సిరెడ్డి తన కుమార్తెకు వివాహం నిశ్చయించున్నాడు. అందుచేత కాబోయే వియ్యంకుడి దగ్గరకెళ్ళి అతనిద్వారా అడిగించారు. నర్సిరెడ్డి ఆడిన మాట తప్పనన్నాడు. "ఐతే నీ కూతురూ, నీ సంబంధం నాకు అక్కర్లేదు" అని కాబోయే వియ్యంకుడు వెళ్ళిపోయాడు. నర్సిరెడ్డి బాధపడ్డాడు. "మన కష్టాలు గట్టెక్కేవరకూ నాకు పెళ్ళి ప్రయత్నమే చెయ్యవద్దు" అని కూతురు సీతమ్మ తండ్రిని బతిమాలింది. నర్సిరెడ్డి సరేనని, పసుపు కుంకుమలు తీసుకుని, గడప గడపకూ వెళ్ళి రైతు సంఘాల తరఫున ప్రచారం చెయ్యమని భార్యాబిడ్డలతో చెప్పాడు. నర్సిరెడ్డి కుటుంబం రైతుసేవలో లీనమైంది. ఇది చూసి షావుకారు, కరణాలు మరింత రెచ్చిపోయారు. ఇక లాభం లేదని తనకు రావలసిన బాకీని వెంటనే చెల్లించమని షావుకారు నర్సిరెడ్డిని నిలదీశాడు. నర్సిరెడ్డి పదిరోజులు గడువు అడిగాడు. వెంటనే ఇస్తేనేకాని వీల్లేదని, షావుకారు అనరాని మాటలు అన్నాడు.రైతు భార్య లక్ష్మి ఆ మాటలు భరించలేక మంగళసూత్రంతో సహా తన దగ్గర వున్న నగలను తీసుకెళ్ళి షావుకారు చేతిలో పెట్టింది. "నీకు సిగ్గుఎగ్గులు లేకపోయినా నీ భార్యకు వున్నాయి" అని షావుకారు నర్సిరెడ్డిని తూలనాడి వెళ్ళిపోయాడు.

ఎన్నికల రోజులు దగ్గరకొస్తున్నాయి. నాగాపురంలో జమీందారు పక్షానికి ఒక్క ఓటు కూడా వచ్చేలా కనిపించడం లేదు. అందుకని ఒక వ్యూహం పన్ని నాగాపురం జమీందారు ఆవరణలో కూచిపూడి భాగవతం ఏర్పాటు చేశారు. రైతులందరూ ఆ భాగవతం చూస్తూ తన్మయులై వుండగా వారందర్నీ లోపల పెట్టి తలుపులు తాళాలు వేశారు. ఈ విషయం విన్న రైతు అభ్యర్థి రామిరెడ్డి, తొందరగా వెళ్ళి ప్రహరీగోద దూకి జమీందారు చేస్తున్న అక్రమాలను చాటాడు. రైతులందరూ కోపంతో రగిలిపోయారు. "జమీందార్లు వస్తారు; పోతారు. రైతు సంఘం మాత్రం శాశ్వతంగా వుంటుంది" అని నర్సిరెడ్డి తలుపులు బద్దలుకొట్టమని ఆదేశించాడు. రైతులు బ్రద్దలు చేసుకుని ప్రవాహంలా బయటపడ్డాడు. నాగాపురంలో ఆబాలగోపాలం కదిలింది. జమీందారుకు వ్యతిరేకంగా వాడవాడలా ప్రచారం జరిగింది. రైతు అభ్యర్థికి అఖండ విజయం చేకూర్చింది.

ఎన్నికలలో తాను ఘోర పరాజయం పొందినందుకు జమీందారు కుమిలిపోయాడు. ఆ దుర్భరావమానంతో ఎవర్నీ దగ్గరకు రానివ్వకుండా ఒంటరిగా ఉండసాగాడు. జమీందారు నమ్మినబంటు సుబ్బన్న ఎలాగైనా జమీందారు కోపాన్ని శాంతింప జెయ్యాలని, తన చెల్లెలు రాజరత్నాన్ని జమీందారుకు దాఖలు చేసి, తాను పగ సాధిస్తానని నాగపురం వెళ్ళాడు. నాగాపురంలో సుబ్బన్న షావుకారు ఇంట్లో మకాంపెట్టి రైతులనూ, స్త్రీలనూ బాధించడం మొదలుపెట్టాడు. నర్సిరెడ్డి కుమారుడు మరణావస్థలో వున్న సమయంలో షావుకారు నర్సిరెడ్డి కుమారుడిని పడగొట్టాడు. దాంతో అతను మరణించాడు. నర్సిరెడ్డి కుటుంబం విచారసాగరంలో మునిగిపోయింది. ప్రకృతి ఫర్జించింది. భయంకరమైన తుఫాను చెలరేగింది. వరదలలో ఆ ప్రాంతం అంతా తేలిపోయింది. వరదలు గొప్పవారినీ, బీదవారినీ ఏకం చేశాయి. కరణం ఆ వరదలలో కొట్టుకుపోతూ ఉంటే, మునసబు రక్షించాడు. షావుకారును బందిపోటు దొంగలు దోచుకున్నారు.

శావల్యాపురంలో జమీందారు తమ్ముడు, తన అన్న తర్వాత జమీందారీకి తానే వారసుడు కావాలనే దురుద్దేశంతో జమీందారు పుత్రుని సంగ్రహించి, ఆ నేరం నర్సిరెడ్డి మీదికి నెట్టాడు. తినడానికి తిండి, ఉండడానికి కొంపాలేక నాగాపురంలో అందరూ అవస్థలు పడసాగారు. షావుకారు, కరణం తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి రైతులతో కలిశారు. అందరూ కలిసి తమ కనీసపు కోర్కెలను తీర్చవలసిందిగా జమీందారుకు విజ్ఞాప్తులు పంపుకున్నారు. జమీందారు నర్సిరెడ్డిని పిలిపించడం, తన తమ్ముడు చేసిన కుట్ర బయటపడడం, కుమారుడు దొరకడం, జమీందారుకు పరివర్తన కలగడం జరిగి కథ సుఖాంతమవుతుంది.[1]

పాటలు

మార్చు
  1. నిద్ర మేలుకోర తమ్ముడా గాఢనిద్ర , రచన :కొసరాజు రాఘవయ్య చౌదరి , గానం . పి.సూరిబాబు
  2. మంగళమమ్మా మా పూజలు గైకొనుమమ్మా , రచన:కొసరాజు, గానం. టంగుటూరి సూర్యకుమారి, కొమ్మూరి పద్మావతీ దేవి
  3. రైతు పైన అనురాగము చూపని , రచన :కొసరాజు, గానం.పి.సూరిబాబు
  4. వాయించుమా మురళి వాయించు కృష్ణా , రచన : బసవరాజు అప్పారావు , గానం . సుందరమ్మ
  5. కన్నబిడ్డకై కళవళ పడుచును కన్నీరు కార్చును , రచన : తాపీ ధర్మారావు, గానం. పి. సూరిబాబు
  6. రావోయి వనమాలి బిరబిర రావోయి , రచన :రత్నాకరుడు, గానం.టంగుటూరి సూర్యకుమారి, పద్మావతీ దేవి, సుబ్బరాజు , పి.సూరిబాబు, ఎస్. వరలక్ష్మి
  7. సై సై ఇదేనా భారతీ నీ పేరే (బుర్రకథ) , రచన :కొసరాజు, పి. సూరిబాబు బృందం
  8. సుక్షేత్రములు దయాసూనులై పీడించు (పద్యం) , రచన : తుమ్మల సీతారామ మూర్తి , గానం. పి.సూరిబాబు
  9. రైతుకే ఓటివ్వవలెనన్నా నీ కష్టసుఖముల , గానం.పి.సూరిబాబు.టంగుటూరి సూర్యకుమారి బృందం,
  10. దశావతారములు (వీధి నాటకము ) - బృందం
  11. జే జే బంగారు ముద్దుల తండ్రి జే జే మోహనమూర్తి, గానం.పార్వతీభాయి
  12. విశ్వప్రేమయే శుభము విశ్వప్రేమేయే సుఖము,
  13. ఏరా తగదురా తెలియదా దయలేదా పతితుల, గానం.పి.సూరిబాబు
  14. ఇన్నాళ్ళవలె కాడమ్మా మువ్వగోపాలుడు ఎన్ని నేర్చినాడమ్మా ,
  15. కన్నబిడ్డ నే నీచత్వంబున గాసిలచేయని లేమి, గానం.ఎస్.వరలక్ష్మి
  16. రాబోకు రాబోకురా చందమామ , రచన:బసవరాజు అప్పారావు, గానం.టంగుటూరి సూర్యకుమారి
  17. ముద్దుల ఎద్దుకు ముత్యాల సరుల రంగుల, రచన: గూడవల్లి రామబ్రహ్మం, గానం.టంగుటూరి సూర్యకుమారి
  18. హృదయము పొంగెనుగా మన యూహాలు పండెనుగా, గానం.టంగుటూరి సూర్యకుమారి.

మూలాలు

మార్చు
  1. సంపాదకుడు (1 October 1971). "నాటి చిత్రాల కథలు రైతుబిడ్డ". విజయచిత్ర. 6 (4): 9–10.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లింకులు

మార్చు