పువ్వుల సూరిబాబు

(పి.సూరిబాబు నుండి దారిమార్పు చెందింది)

పి.సూరిబాబు లేదా పువ్వుల సూరిబాబు (ఫిబ్రవరి 22, 1915 - ఫిబ్రవరి 12, 1968) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త.

పువ్వుల సూరిబాబు
జననంపువ్వుల సూరిబాబు
ఫిబ్రవరి 22, 1915
గుడివాడ తాలూకా బొమ్మలూరు
మరణంఫిబ్రవరి 12, 1968
ఇతర పేర్లుపువ్వుల సూరిబాబు
ప్రసిద్ధిసుప్రసిద్ధ తెలుగు రంగస్థల , సినిమా నటుడు, గాయకుడు , నాటక ప్రయోక్త

తొలి రోజులు

మార్చు

వీరు ఫిబ్రవరి 22, 1915 సంవత్సరంలో గుడివాడ తాలూకా బొమ్ములూరు గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే మేనమామ హనుమాన్లు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. నాటకాల మీద మోజుతో గద్వాల పారిపోయి, సంస్థానపు నాటక సమాజంలో చేరి పాత్రలు పోషించి తిరిగివచ్చారు.

ఆనాడు గుంటూరులో దంటు వెంకటకృష్ణయ్య "బాలమిత్ర సభ" పేరుతో చిన్నపిల్లల నాటక సమాజాన్ని నడుపుతున్నారు. అందులో కొప్పరపు సుబ్బారావు గారు నాటక ప్రయోక్తగా, సంగీత దర్శకులుగా శిక్షణ ఇస్తున్నారు. సూరిబాబు ఈ సభలో చేరి వివిధ వేషాలు పోషించి అనతికాలంలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుపొందారు. ఆనాటి నాటక సమాజాల వారు సూరిబాబు కోసం పోటీపడేవారు.

నాటక సమాజం

మార్చు

సూరిబాబు 1931 సంవత్సరంలో బాలకృష్ణ నాటక సమాజాన్ని గుడివాడలో స్థాపించి భక్త విజయం, మాయా మధుసూదన నాటకాలను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. నష్టాలతో సమాజం మూతపడింది. 1936లో తెనాలి చేరి సత్యనారాయణ నాట్యమండలి పేరుతో నాటకాలను ప్రదర్శించారు.

1944 సంవత్సరంలో నటీమణి రాజరాజేశ్వరిని వివాహం చేసుకొని ఆమె పేరుమీద రాజరాజేశ్వరి నాట్యమండలిని స్థాపించి కొప్పరపు సుబ్బారావు గారితో "తారా శశాంకం" నాటకాన్ని వ్రాయించి తానే దర్శకత్వం వహించి చనిపోయేవరకు 15 వందలకు పైగా నాటకాలు ఆంధ్రదేశమంతా ప్రదర్శించారు. ఇది కాక భూకైలాస్, కురుక్షేత్రం, విప్రనారాయణ, తులాభారం మొదలైన పౌరాణిక నాటకాలను భారతదేశమంతా ప్రదర్శించి అఖండమైన కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు.

జెమినీ వారి జీవన్ముక్తి సినిమాలో పి.సూరిబాబు పాడిన వెలిగింపుమా నాలో జ్యోతి పాట

వీరు చాలా విభిన్నమైన పాత్రలను పోషించారు. వాటిలో నారదుడు, కంసుడు, ధర్మరాజు, విప్రనారాయణ, బిల్వమంగళుడు, భవానీశంకరుడు, రాజరాజు, సుబుద్ధి, రామదాసు, చినరంగారావు, ధర్మారాయుడు మొదలైనవి ముఖ్యమైనవి. ఎన్ని నాటకాలాడినా, ఆయన గాత్రం కంచు గంటలా మారుమ్రోగేది. మైక్ లేకపోయినా ఒక ఫర్లాంగు దూరం వరకు పద్య పఠనము, వాచిన విధానము క్లియర్ గా వినపడేవి. పద్యాన్ని భావయుక్తంగా విరిచి పాడడంతో ప్రేక్షకులను అవలీలగా ఆకట్టుకొనేవారు.

1946లో మైసూరు మహారాజావారి దర్బారులో వీరి నాటకాలను ప్రదర్శించి సన్మానం పొందారు. 1957లో తెనాలిలో సూరిబాబుకి గజారోహణం, గండపెండేరం మొదలైన సన్మానాలు జరిపి కళావిశారద, గాన గంధర్వ మొదలైన బిరుదులు అందుకున్నారు.

భారతదేశమంతా అపార ఆదరాభిమానాలను సంపాదించిన సూరిబాబు ఫిబ్రవరి 12, 1968 న స్వర్గస్తులైనారు.

సినీ ప్రస్థానం

మార్చు

సూరిబాబు గారు పాడిన కొన్ని పాటలు,పద్యాలు

మార్చు
  • కనకతార - 1937
  • అఙ్ఞనంబున ఆశలు
  • వారే చరితార్దులు ఆత్మను
  • ఏల ఈ పగిది పనికిమాలిన
  • దయారహితమీ దుర్విధి
  • దేవుని మహిమ తెలియగ
  • మాలపిల్ల - 1938
  • మనుజుల విభజన మేలా
  • లేరా లేరా నిదుర మానరా
  • కొల్లాయిగట్టితే యేమి మా గాంధి
  • మాలలు మాత్రం మనుజులు కారా?
  • లేవు పేరునకెన్నియో మతము
  • జైజై మహాదేవా పాపపరిహారా
  • రైతుబిడ్డ (1939)
  • రైతు పైన అనురాగము చూపని
  • కన్నబిడ్డకై కళవళ పడుచును కన్నీరు కార్చును
  • సై సై ఇదేనా భారతీ నీ పేరే (బుర్రకధ)
  • సుక్షేత్రములు దయాసూనులై పీడించు (పద్యం)
  • రైతుకే ఓటివ్వవలెనన్నా నీ కష్టసుఖముల
  • ఇల్లాలు 1940
  • నీ మహిమేమో నేరగలేమె -
  • సరోజినిదళ గతజలబిందువు చపలము సుమ్మి
  • హరిశ్చంద్ర – 1956
  • తన సామ్రాజ్యము పోవనీ పసుల కాంతారత్నమున్ బాయనీ (పద్యం)
  • శిరమెల్లగొరగించుకొనుచు స్వతపక్షీలముల మాని సాటి (పద్యం)
  • మహాకవి కాళిదాసు – 1960
  • అభిఙ్ఞాన శాకుంతలం ( నాటకం)
  • రామపదాభ్య భక్తుడవు రామచరిత్ర శిలాక్షరముగా (పద్యం)
  • రాజనీతిని లోకరక్షగా రూపించ రఘువంశ కావ్యంబు రచనచేసి (పద్యం)
  • శ్రీ కృష్ణరాయబారం – 1960
  • అనికిన్ దోడపడమంచు పోరతగడే ఆచార్యుడు ఈ సూతనందనుడా (పద్యం)
  • కచ్చియమాన్పి కౌరవులకాతు తలంపున సంధి చేయగా (పద్యం)
  • మీరంబోకుము పొల్లుమాటలు అనికిన్ మీరాజు రండంచు (పద్యం)
  • విలయంబోదాంభుధారా విశరమ్మువలెన్ ఉర్వి (పద్యం)
  • శ్రీ వెంకటేశ్వర మహత్యం – 1960
  • అన్యులెదుటన తన నాధుడుడవమచేత సైపజాలునే (పద్యం)
  • ఈశ్రీనివాసుండు ఏడుకొండలపైన కలియుగ దైవమై (పద్యం)
  • ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రముల (పద్యం)
  • ఉషాపరిణయం – 1961
  • ఆతడు విష్ణుమూర్తి పరమాత్ముడు (పద్యం)
  • బాణనందన ఉషాబాల ప్రాణలతో ఆడెడు ( పద్యం )
  • మధుకైటభుల మున్ను (సంవాద పద్యాలు)
  • సరసిజదళ నయనా క్షీరాబ్దిశయనా

మూలాలు

మార్చు
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
  • నటరత్నాలు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, రెండవ ముద్రణ, 2002, పేజీలు: 138-41.

బయటి లింకులు

మార్చు