వారణాసి రామసుబ్బయ్య
వారణాసి రామసుబ్బయ్య (1882 - 1912) సుప్రసిద్ధ గాయకుడు, వాగ్గేయకారుడు.
విశేషాలు
మార్చుఇతడు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా పొన్నూరులో వారణాశి కోటయ్య, లక్ష్మీదేవి దంపతులకు చిత్రభాను నామ సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి తిథిన జన్మించాడు[1]. వీరు భావనారాయణ స్వామి దేవస్థానంలోని స్వస్తి వాచక కుటుంబానికి చెందినవారు. ఇతడు తన తండ్రి వద్ద సరళీస్వరాలు, అలంకారాలు, గీతాలను నేర్చుకున్నాడు. తర్వాత రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి వద్ద కృతులు, వర్ణాలు అభ్యసించాడు. ఇతడు తన 15వ ఏటనే తుమరాడ సంగమేశ్వరశాస్త్రి, నందిగాన వేంకటశాస్త్రులు, పప్పు సూర్యనారాయణ, ఆదిభట్ల నారాయణదాసు, దంపూరి సుబ్బారావు వంటి ప్రముఖుల సమక్షంలో మొట్టమొదటి కచేరీ చేశాడు. తరువాత మద్రాసు, కలకత్తా నగరాలను సందర్శించి అక్కడ సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతడు గాత్రంలో మాత్రమే కాక ఫిడేలు వాయిద్యంలో కూడా మంచి నైపుణ్యాన్ని సంపాదించాడు. రామనాథపురం, సేకూరు, జైపూరు (ఒరిస్సా) వంటి సంస్థానాలలో కచేరీలు చేశాడు. ఇతడు 1912 మలేరియా సోకి మద్రాసు జనరల్ ఆసుపత్రిలో మరణించాడు.
రచనలు
మార్చుఇతడు పొన్నూరు భావనారాయణ స్వామిపై కొన్ని వర్ణనలు, కృతులు, బంధాలు మొదలైన గేయాలు రచించాడు. ఇతని రచనలు:
- శ్రీ మహిళా సామప్రియ - సోమకాసురాంతకా (శ్రీ రాగం)
- నీరజాక్ష నిన్నే కోరితి నేరమెంచకురా (అభోగి రాగం)
- ఆరుద్రప్రియే సదయే గోహణా చలనిలయే (రుద్రప్రియ రాగం)
ప్రశంసలు
మార్చు- 1899లో బందరులో ఇతని పాటవిని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి చెప్పిన ప్రశంసా పద్యం:
మ్రింగునొ, లేక ముక్కుకొన మిక్కిలి
నొక్కునొ లేక మీదికిన్
చెంగున దాటునో యనగు చేష్టలొన
ర్చెడు వారి పాటలే,
రంగుగ నుండునో వినగ రమ్ము కుతూ
హలమబ్బు రామసు
బ్బాంగజు పాట శ్రోత్రముల కక్షులకున్
ముద మూర జేయదే
తెగుబాడిన బైబాడెడి
వగయొద్దికలును ననుంగు వగలపై
నొగిలిన మగువల కళలును
సాగియుంచున్ రామసుబ్బ సూరివరేణ్యా
- ఇతడి మరణానంతరము చల్లా పిచ్చయ్యశాస్త్రి చెప్పిన పద్యం:
వెయ్యేండ్లన్నము నీరులేక యడవిన్
వేండ్రమ్ముకున్, వానకున్
వ్రయ్యల్కాగ, శరీరముత్కట తపో
వ్యాపారముల్ సల్పియున్
వెయ్యూళ్ళం దిరుగాడియున్, ,
వేవేలిచ్చియున్ రామసు
బ్బయ్యన్ బోలినవాని దేగలవె, దౌ
ర్భాగ్యంపు సంగీతమా!
రెంట బాండితిన్ గల్గి కౌగింట జొన్న
దగువపుశ్శోభ నలరి కీర్తిగనజాలు
రామసుబ్బయ్య బోలు సారాస్వతాబ్ధి
తిరిగి యెప్పుడు కనెదొ ధాత్రీమతల్లి
మూలాలు
మార్చు- ఎందరో మహానుభావులు, తనికెళ్ళ భరణి, హాసం ప్రచురణలు, హైదరాబాదు, పేజీలు: 127-9.
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పేజీ: 558.
- ↑ ఎం.ఆర్.శాస్త్రి (1 November 1962). "అర్వాచీన ఆంధ్రగాయక వాచస్పతి శ్రీ వారణాసి సుబ్బరామయ్య". గానకళ సంగీత మాసపత్రిక. 1 (6): 6–10. Retrieved 7 February 2021.[permanent dead link]