చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

(చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి నుండి దారిమార్పు చెందింది)

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి (ఆగష్టు 8, 1870 - 1950) తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకడు. దివాకర్ల తిరుపతిశాస్త్రితో జంటగానూ, అతని మరణానంతరం విడిగానూ ఎన్నో పద్యనాటకాలు, కావ్యాలు, వచన రచనలు రచించాడు. చెళ్లపిళ్ల తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశాడు. అతని వద్ద శిష్యులుగా చదువుకున్నవారు చాలామంది ఆ తర్వాతి కాలంలో తెలుగు సాహిత్యరంగంలోను, భాషాశాస్త్రంలోనూ కవులుగా, పండితులుగా ప్రఖ్యాతి పొందారు.[1]

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
పుట్టిన తేదీ, స్థలంచెళ్లపిళ్ల వెంకటాచలము
ఆగష్టు 8, 1870
కడియం
మరణం1950 (వయస్సు: 80)
వృత్తికవి
భాషతెలుగు
జాతీయతభారతీయుడు
సాహిత్య ఉద్యమంఅవధాన కవిత్వం
గుర్తింపునిచ్చిన రచనలుపాండవోద్యోగ విజయాలు, కథలు గాథలు

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రికి కుటుంబ పరంగా కొంతవరకు కవి, పండిత నేపథ్యం ఉంది. కడియద్దలో చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద వ్యాకరణం, ఆపైన కాశీలో పలువురు పండితుల వద్ద వ్యాకరణ, తర్క శాస్త్రాలు, వేద భాగం, సంస్కృత కావ్యాలు, బ్రహ్మసూత్ర భాష్యం వంటివి అధ్యయనం చేశాడు. కాశీ నుంచి తిరిగి చర్ల బ్రహ్మయ్యశాస్త్రి శిష్యరికానికి వచ్చిన తర్వాత చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అవధానాలు చేయడానికి సంకల్పించాడు. బ్రహ్మయ్యశాస్త్రికి తన శిష్యుల్లో మరొకడైన దివాకర్ల తిరుపతిశాస్త్రిని జోడీగా స్వీకరించమని వేంకటశాస్త్రికి సూచించడంతో 1891లో కాకినాడలో జంటగా వారిద్దరి తొలి శతావధానం జరిగింది. తిరుపతి వేంకట కవులన్న పేరుతో చేసిన ఆ శతావధానంలో ప్రతిభ, పాండిత్యాలను ప్రదర్శించడంతో పాటు, యుక్తితో ఉద్ధండులైన పండితులను గెలిచి విజయవంతంగా అవధానం ముగించారు. జంటకవుల్లో ఒకనిగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి విజయపరంపర ప్రారంభమైంది.

తిరుపతి వేంకటకవులుగా వీరు చేసిన అవధానాలు క్రమేపీ తెలుగునాట అష్టావధానాలు, శతావధానాలకు ప్రజాదరణ, రాజాదరణ సంపాదించి పెట్టడంలో ముఖ్యపాత్ర పోషించాయి. జంటగా వీరు మహాభారతం ఆధారంగా రాసిన పద్యనాటకాల్లో పాండవోద్యోగ విజయాలు ఊరూరా ప్రాచుర్యం పొందాయి. తిరుపతి వేంకటేశ్వరులన్న పేరు మీద కావ్య రచన, వివాద సాహిత్యాన్ని వెలువరించారు. దివాకర్ల తిరుపతిశాస్త్రి 1920లో మరణించాకా ఒంటరిగా వచన రచనలు, పద్య రచనలు చేసిన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి వాటిలో చాలావరకూ తిరుపతి వేంకటీయం అన్న జంట పేరు మీదే ప్రచురించాడు.

కుటుంబ నేపథ్యం

మార్చు
 
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జన్మస్థలం కడియంలో జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ముందు వేంకటశాస్త్రి విగ్రహం

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ప్రమోదూత సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి సోమవారం అనగా 1870 ఆగస్టు 8న తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించాడు. వేంకటశాస్త్రిది ఆరామ ద్రావిడ అంతశ్శాఖకు చెందిన పేద బ్రాహ్మణ కుటుంబం. తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్య. ఇతని ముత్తాత తమ్ముడు వేంకటేశ్వర విలాసము, యామినీ పూర్ణతిలక విలాసము అనే గ్రంథాలు రచించిన కవి. అతను సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకటశాస్త్రికి అందుబాటులో ఉండేవి. తరువాత వారు కడియం నుంచి యానాంకు మకాం మార్చారు. వేంకటశాస్త్రి తన 19వ యేట (1889లో) రామడుగు వేంకటాచలం కుమార్తెను గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి ఆధ్వర్యంలో వివాహం చేసుకున్నాడు.[2]

విద్యాభ్యాసం

మార్చు

యానాంలో వేంకటశాస్త్రి తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషలు అధ్యయనం చేశాడు. అనంతరం అతను సర్వాత్మనా గురువుగా స్వీకరించిన చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వద్ద వ్యాకరణాన్ని నేర్చుకునేందుకు తాడేపల్లిగూడెం సమీపంలోని కడియద్ద గ్రామానికి వెళ్లాడు. వ్యాకరణాన్ని సాంగోపాంగంగా నేర్చుకుంటున్న వేంకటశాస్త్రికి కాశీకి వెళ్ళి చదువుకోవాలన్న సంకల్పం కలిగింది. అయితే అనుకోని విధంగా అతని వివాహం జరగడంతో కొన్ని నెలల పాటు ఈ ప్రయాణం వాయిదాపడింది. వివాహం అనంతరం తన సహాధ్యాయి కృష్ణశాస్త్రితో[a] కలిసి సాహసించి వారణాసి బయలుదేరాడు. వారణాసికి వెళ్ళేందుకు చేతిలో డబ్బు లేకున్నా వేంకటశాస్త్రి, కృష్ణశాస్త్రి విద్యాప్రదర్శనలు, కవిత్వ సభల ద్వారానే డబ్బు సంపాదించుకుని కాశీ చేరుకున్నారు. వారణాసిలో ప్రధానంగా వ్యాకరణం నేర్చుకునేందుకే వెళ్ళినా అది రాణించేందుకు అవసరమయ్యే తతిమ్మా విద్యలను కూడా చెప్పుకున్నాడు.[b] అప్పటివరకూ బ్రహ్మయ్యశాస్త్రి వద్ద నేర్చుకున్న వ్యాకరణభాగానికి తరువాయి భాగాన్ని నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద నేర్చుకోవటం మొదలుబెట్టాడు. ఈ నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి స్వయానా తన గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రికీ గురువే. వారణాశిలో స్థిరపడ్డ తెలుగు పండితుడు శోభనాద్రి శాస్త్రికి వేంకటశాస్త్రి మీద అభిమానం ఏర్పడింది. ఆ వాత్సల్యం చేత బలవంతపెట్టి మరీ తర్కసంగ్రహాన్ని సిద్ధాంత చంద్రోదయమనే వ్యాఖ్యానంతో పాటు ఉపదేశించాడు. మరికొన్నాళ్ళకు తల్లిదండ్రులు ఉత్తరం రాసి, డబ్బు పంపి కాశీ నుంచి తిరిగి రమ్మని మరీమరీ కోరడంతో సావకాశంగా తిరిగివచ్చాడు వేంకటశాస్త్రి.

వేంకటశాస్త్రి ప్రధానంగా బ్రహ్మయ్యశాస్త్రి శిష్యునిగానే ప్రఖ్యాతుడైనా చాలామంది గురువుల వద్ద శిష్యరికం చేశాడు. పైన ప్రస్తావనకు వచ్చినవారు కాక, కానుకుర్తి భుజంగరావు రఘువంశాన్ని, గోరుగంతు రామావధాన్లు వేదం కొంత భాగాన్ని, రామడుగుల వేంకట సుబ్బరాయావధాన్లు పరాయతనపు పన్నాలు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి కుమారసంభవం, రేగిళ్ళ కామశాస్త్రులు మేఘసందేశం, అనంతాచార్యులు భారవి [c], జంధ్యాల గౌరీనాథశాస్త్రి బ్రహ్మసూత్ర భాష్యం బోధించారు.[2]

తిరుపతి వేంకట కవులు

మార్చు

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తనతోపాటుగా చదువుకున్న దివాకర్ల తిరుపతిశాస్త్రితో కలిసి తిరుపతి వేంకట కవులుగా ఆంధ్రదేశమంతటా ప్రాచుర్యం పొందాడు. అష్టావధానాలు, కవిత్వ రచనకు పేరుప్రఖ్యాతులు, ప్రతిపక్షులతో స్పర్థ, రాజాస్థానాల్లో గౌరవాలు వంటివన్నీ ఇద్దరూ కలిసే పొందారు. కాశీకి వెళ్ళకముందు తిరుపతిశాస్త్రికి, వేంకటశాస్త్రికీ సతీర్థ్య భావమే వుండేది.[d] కాశీ వెళ్ళి పలు శాస్త్రాలను చదువుకుని తిరిగి వచ్చాకా వేంకటశాస్త్రి, పెద్దవాడైన తిరుపతిశాస్త్రికి సహాధ్యాయి అయ్యాడు. మొదట్లో వారిద్దరికీ అంతగా స్నేహం లేకున్నా అనంతర కాలంలో స్నేహం వృద్ధి అయ్యింది. కానీ మధ్య మధ్యలో పోట్లాడుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా, గురువు తలపెట్టిన గణపతి ఉత్సవానికి డబ్బు సేకరించడం కోసం వారిద్దరు గ్రామాలు తిరుగుతున్నప్పుడు వేంకటశాస్త్రికే ఆదరణ ఎక్కువగా ఉండేది. తిరుపతిశాస్త్రి పద్యపఠనం చేసేటప్పుడు శ్రోతలు అతనిని ఆపమని వేంకటశాస్త్రిని చదవమనడం తిరుపతి శాస్త్రికి కష్టంగా ఉండేది. అందుకని వేంకటశాస్త్రి చెప్పిన ఒక పద్యంలో ఉపమానం సరైనది కాదని తిరుపతి శాస్త్రి మడత పేచీకి దిగాడు. అది ముదిరి ఇద్దరూ కొట్టుకున్నారు.[2]

ఇలా సాగుతుండగా, వేంకటశాస్త్రి కాశీ నుంచి తిరిగిరావడానికి తోవఖర్చుల కోసం తల్లిదండ్రులు అప్పుచేసి పంపించిన ముప్పై రూపాయలు తీర్చుకోవలసి వచ్చింది. అందుకోసం అవధానాలు చేయడానికి బయలుదేరినప్పుడు గురువు బ్రహ్మయ్యశాస్త్రి "అబ్బాయీ, నీకు యితడు కూడా వుంటే చాలా శోభగా వుంటుందని" చెప్పేసరికి కాదనలేక ఇద్దరూ కలిసి అవధానాలు చేయడం ప్రారంభించారు. 1891లో జరిగిన కాకినాడ శతావధానం తిరుపతి వేంకట కవుల తొలి ప్రదర్శన. అలా ప్రారంభమయిన అనుబంధం తిరుపతిశాస్త్రి మరణం తర్వాత కూడా ముగిసిపోలేదు.[2] తిరుపతిశాస్త్రి మరణానంతరం వేంకటశాస్త్రి విడిగా రాసిన గ్రంథాలు చాలావాటిని తిరుపతి వేంకటీయం, తిరుపతి వేంకట కవులు పేరుతో ప్రకటించాడు.

సాహిత్యరంగం

మార్చు

"కవనార్థం బుదయించి"నట్లు చెప్పుకున్న చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జీవితం చాలావరకూ కావ్యరచన, ఆశుకవిత్వం చెప్పడం, నాటకాలు రచించడం, పలువురు సంస్థానాధీశుల సందర్శనాలు, వారి సముఖంలో అవధాన ప్రదర్శనలు, సాహిత్య స్పర్థలు, వివాదాలు వంటి వాటితోనే గడిచింది. శత్రువులను, మిత్రులను, శిష్యులను సంపాదించుకున్నా, ఏనుగునెక్కిన గౌరవం వరించినా, కోర్టు మెట్లెక్కాల్సిన చికాకులు ఎదురైనా అన్నిటికీ సాహిత్యరంగమే మూలం.

అవధానాలు

మార్చు

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ఆంధ్రదేశంలో అవధాన విద్యకు విస్తృతమైన ప్రాచుర్యం తీసుకువచ్చి, దానికి ఒక రూపురేఖలు ఏర్పరచడంలో కీలకమైన కృషిచేసిన తిరుపతి వేంకట కవుల్లో ఒకడు. షట్‌దర్శనీవేది [e] అయిన చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద అభ్యసించడమే కాక అతని ఆజ్ఞ మేరకే తిరుపతి శాస్త్రితో జంటగా అవధానాలు ప్రారంభించడం విశేషం. వీరు ప్రారంభించిన మార్గంలో ఎందరో అవధానులు తయారయ్యారు. వీరి అవధానశక్తి అత్యంత విలక్షణం. ధారాశుద్ధితో[f] కూడిన ధారణాశక్తి[g], ఆశుధారాపటిమ [h] ఆశ్చర్యపరుస్తుంది. పలు సంస్థానాలు, ప్రదేశాల్లో దిగ్విజయ యాత్ర తరహాలో తిరిగి ప్రతీచోటా అవధాన ప్రతిభను చాటుకుని విజయవంతులయ్యారు.

తిరుపతి వేంకట కవుల కన్నా ముందు అవధాన ప్రక్రియ కాస్తో కూస్తో వ్యాప్తిలో ఉంది. శ్రీనాథుడు, చరిగొండ ధర్మన్న, భట్టుమూర్తి అవధానాలు చేశారని ప్రతీతి. 64 కళల్లోని కావ్య సమస్యాపూరణం అవధానానికి ప్రాచీన రూపం. పూర్వం నుంచీ సమస్యాపూరణం అనే విద్య రాజస్థానాల్లోనూ, ప్రజాబాహుళ్యంలోనూ ప్రచారంలో ఉండడం చాటువులు చెప్తాయి. తిరుపతి వేంకట కవులకు పూర్వం గుంటూరుకు చెందిన మాడభూషి వేంకటాచార్యులు, పిఠాపుర ఆస్థానకవులు దేవులపల్లి సోదరులు, విజయనగరంలో హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు అష్టావధానాలు చేశారు. అయితే ఆ విద్యని ఒక క్రీడగా భావించి చేసిన ప్రదర్శనలే కానీ అవధానాలను ఉద్యమస్థాయిలో ప్రాచుర్యం తీసుకువచ్చిన వారు తిరుపతి వేంకట కవులు. అష్టావధానాలకూ, శతావధానాలకూ స్ఫుటమైన రూపాన్ని సంతరించిపెట్టారు. అవధానం అంటే ఇలా ఉండాలి, ఈ అంశాలను ప్రదర్శించాలి, ధారణ సమయం ఇది అంటూ నిర్దుష్టంగా ప్రదర్శించి ప్రక్రియాపరమైన ఆకారాన్ని కల్పించిన వారు మాత్రం తిరుపతి వేంకట కవులే.[1]
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి అష్టావధాన ప్రక్రియను మాడభూషి వేంకటాచార్యులు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో అష్టావధానం చేస్తున్నప్పుడు చూశాడు. ఆ అష్టావధాన్ని చూసి, ఆ పద్ధతి గ్రహించి[5] సా.శ.1889లో కాశీకి వెళ్ళేందుకు ధనార్జన కోసం చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తన సహాధ్యాయి కందుకూరి కృష్ణశాస్త్రితో కలిసి శనివారప్పేట గ్రామంలో (నేడు ఏలూరు నగరంలో భాగమైపోయింది) తొలి శతావధానం చేశాడు. అనంతరం కాశీ నుంచి తిరిగివచ్చాక గంగా సంతర్పణ కోసం ధనార్జన యత్నాల్లో భాగంగా నిడమర్రు, ముమ్మిడివరం, అయినాపురం గ్రామాల్లో ఒంటరిగా అష్టావధానాలు చేశాడు.[2]
అనంతర కాలంలో గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి ఆదేశంతో దివాకర్ల తిరుపతిశాస్త్రితో కలిసి అవధానాలు ప్రారంభించాడు. 1891లో కాకినాడలో చేసిన శతావధానమే తిరుపతి వేంకటకవులుగా వీరి తొలి ప్రదర్శన. అందులో వారు చెప్పిన పద్యాల్లో వ్యాకరణ దోషాలున్నాయని పెద్ద పండితులు శంకించారు. తిరుపతి వేంకట కవులు కూడా నోరు మెదపకుండా అవి నిజంగా తప్పులే అని అందరికీ అనుమానం వచ్చేటట్టుగా ప్రవర్తించారు. అలా శతావధానమంతా అయిపోనిచ్చి, శతావధానం చివరిలో ప్రధానసభకు ముందు జరిగిన ఉపసభలో ఆయా శంకలు అన్నీ వరుసగా చెప్తూ పూర్వ మహాకావ్యాల ప్రయోగాలు ఉదహరించి, పండితుల సందేహాలను ఎగరగొట్టారు. ఆ హఠాత్పరిణామాన్ని ముందుగా ఊహించకపోవడంతో సభ్యులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. పైగా నిండా 20ఏళ్ళు నిండని కుర్రవాళ్లు దిగ్గజాల్లాంటి మహా పండితులను ఓడించడంతో నాటి నుంచి వారి ప్రభ వెలిగిపోవడం మొదలుపెట్టింది.[2] ఆపైన అప్రతిహతమైన వారి శతావధానాల జైత్రయాత్ర తిరుపతి వేంకట కవులకే కాక తెలుగునాట అవధాన ప్రక్రియకే గొప్ప ప్రాచుర్యానికి నాంది అయింది.
ఆపై వారి అవధాన పరంపరలో భాగంగా కొప్పరపు సోదర కవులు, వేంకట పార్వతీశ్వర కవులతో వివాదాలు జరిగి పోటాపోటీగా అవధానాలు చేసి పేరు సంపాదించారు.

అవధానాల్లో పద్ధతులు

మార్చు

తిరుపతి వేంకట కవుల అవధాన పరంపర, విజయాలు చూసినవారు ఇది కాళికా ఉపాసన ఫలితమని భావించారు. కాళికా దేవిపై భక్తి ఉన్నమాట నిజమే అయినా తమకు ప్రత్యేకించి ఏ ఉపాసనా లేదని ఖచ్చితంగా చెప్పేవారు. ఉన్నమాట చెప్తే నమ్మకపోవడంతో చివరికి వాళ్ళని సంతోషపెట్టడానికి ఉపాసనా బలమేనని చెప్పాల్సి వచ్చేదని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి రాసుకున్నాడు.[6] "దైవకృప అన్నిటికిని గావలయును. అన్నిటితోబాటు దీనికిని ఉండనిండు. కేవలము దైవకృప మాత్రము పనిచేయదు" అని శతావధాన సారములో తమ అవధాన విద్య ప్రతిభ, శ్రమతో సంపాదించినదని తేల్చారు.[7][8] అవధానాల్లో పృచ్ఛకులు వేసిన ప్రశ్న ఏమిటో, దానికి తామిచ్చిన సమాధానం ఏమిటో గుర్తుంచుకుని శతావధానమైతే వందమందికీ తాము చెప్పిన వంద పద్యాలు గుర్తుచేసుకుని చెప్పాల్సివుంటుంది. దీనినే ధారణ అంటారు. ఈ ధారణ కోసం తిరుపతి వేంకట కవులు ప్రశ్న వేసిన పృచ్ఛకుడి ముఖానికి మిగిలిన వివరాలు అనుబంధించుకుని, గుర్తుంచుకునే పద్ధతులు అనుసరించేవారు.[9]

అవధాన కవిత్వం

మార్చు

అవధానాల్లో భాగంగా ఎన్నో మంచి పద్యాలను ఆశువుగా రచించారు. అవధానాల్లో ప్రధాన అంశాలైన సమస్యాపూరణం, దత్తపది, ఆశువు, నిషిద్ధాక్షరి వంటి అంశాల్లో రాసిన పద్యాలు తర్వాతి కాలంలో పలు గ్రంథాల్లో ప్రచురితమయ్యాయి.

రాజాస్థానాల సందర్శనం

మార్చు
 
సన్మానితునిగా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి

తిరుపతి వేంకటకవులు ఆంధ్రదేశంలోని పలువురు సంస్థానాధీశులను, జమీందార్లను సందర్శించి వారి సంస్థానంలో కొన్ని నెలలు ఉండి అష్టావధానాలు చేసేవారు. ఆయా సందర్భాల్లో కొందరు సంస్థానాధీశుల పట్టాభిషేకాల గురించి, వైభవం గురించి కావ్యాలు రచించారు. తాము విడిగా రాసిన కావ్యాలను కూడా వారికి అంకితమిచ్చారు. కొన్ని లిఖితబద్ధమైన కవిత్వం కావ్యాల రూపంగా చెప్పినా ప్రధానంగా వాటిని అవధాన కవిత్వంలోని చిన్న భాగమైన ఆశుకవిత్వంగానే చూడాలి. అయితే చాలా సంస్థానాల్లో రాజదర్శనం అంత సులభంగా సాధ్యపడింది కాదు. చుట్టూ ఉన్న మత్సర గ్రస్తులైన కవులు ఈ జంటకవులకు రాజదర్శనం కాకుండా శతవిధాల అడ్డుపడేవారు. తమ ఆశుకవితా శక్తితోనూ, పాండిత్యపటిమతోనూ, లౌక్యప్రజ్ఞతోనూ ఆ అడ్డంకులు నెట్టుకువచ్చి జమీందారు దర్శనం, ఆతిథ్యం, సత్కారం పొందేవారు. ఈ అన్ని సందర్భాల్లోనూ రసవంతమూ, ఆశుకవితా సంప్రదాయ ఫలితమూ ఐన పద్యాలను ఎన్నిటినో చెప్పారు. దర్శనమిమ్మని చెప్పినవీ, దర్శనం లభించక కొంత కినుకతో చెప్పినవీ, ఆపై రాజసముఖంలో చెప్పినవీ, రాజాస్థానంలో వివిధ సందర్భాల్లో చెప్పినవీ, చివరకు రాజా వార్లను ఇంటికి వెళ్ళేందుకు అనుమతి ఇమ్మని చెప్పినవీ ఇలా పలురకాలైన పద్యాలను కలిపి నానారాజా సందర్శనం అనే గ్రంథంగా వెలువరించారు.[1]

రాజాస్థానాలకు సంబంధించిన కొన్ని పద్యాలు
మార్చు
  • ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా) సంస్థానం నుండి తిరిగి వెళ్లడానికి సెలవిమ్మని కోరుతూ రాజా వారితో చెప్పిన పద్యం ఇది:[10]

వేసవి దగ్గరాయె, మిము వీడుటకున్ మనసొగ్గదాయె, మా
వాసము దూరమాయె, బరవాసమొనర్చుట భారమాయె, మా
కోసము తల్లిదండ్రు లిదిగో నడిగోనని చూచుటాయె, వి
శ్వాస మొలర్పవే సెలవొసంగిన బోయెదమయ్య భూవరా!

  • ఆంధ్రప్రదేశ్ వైశ్యసంస్థానాల్లో పెద్దది పశ్చిమగోదావరి జిల్లా లోని గూటాల. ఈ సంస్థాన సంపాదకులు మన్యం సత్యలింగం. కాలక్రమంలో సత్యలింగం తమ్ముడు వేంకటరత్నం మనవడు చినకనకయ్య జమీందారు అయ్యారు. అతని మరణంతో భార్య మహాలక్ష్మమ్మ 1878లో సంస్థానపాలన చేపట్టారు. సత్యలింగం కాలంనాటి నుంచీ ఫ్రెంచివారితో ఉన్న స్నేహం కొద్దీ వారు యానాంలో స్థిరనివాసం కలిగివుండేవారు. మహాలక్ష్మమ్మచే సన్మానింపబడని పండితుడు కానీ, కళాకారుడు కానీ లేరని చెప్పుకునేవారు. వేంకటశాస్త్రి ఆ దానశీలిపై చెప్పిన పద్యం ఇది:[11]

గోచీ పెట్టినదాది నిన్నెరుగుదున్, గోమట్లనే కాదు నీ
యాచారమ్మును దాతృతాగరిమ సత్యాసక్తి నిర్గర్వతా
ప్రాచుర్యమ్మును దీనపోషణము నెప్పట్లన్ గనంబోలదే
లా చెప్పన్ వలె నిన్ను జెప్పియు మహాలక్ష్మ్యంబ వేఱొక్కరిన్!

  • విశాఖపట్టణం లోని గోడే గజపతిరావును దర్శించపోయినప్పుడు ఎంతకాలానికీ సముఖానికి రమ్మని సెలవు రాలేదు. అప్పుడు విసుగుతో చెప్పిన పద్యం ఇది:

సంగరశక్తి లేదు, వ్యవసాయము సేయుట సున్న, సంతలో
నంగడివేసి యమ్ముటది యంతకుమున్నె హుళక్కి, ముష్టికిన్
బొంగు భుజాన వైచుకుని పోయెద మెక్కడికేని ముష్టిచెం
బుం గొనిపెట్టు యమోఘమిదే కద! దంతిరాణ్నృపా!

  • విజయనగరంలో కూడా ఆనందగజపతి దర్శనం గగనం అయింది. 4,5 నెలలు వేచి ఉన్నారు. వారి దివాన్ బీజాపురపు కోదండరావును ఉద్దేశించి రాజు దర్శనం ఇప్పించమని కోరుతూ పెట్టుకున్న పద్యమయ అర్జీలోని పద్యాలు ఈ రెండు:

"రాజతిపండితుండట బరాబరియౌనట మంత్రి రాజుతో
ధీజవ మొప్పునట్టి కవి ధీరులు తిర్పతి వేంకటేశులా
రాజును జూడ బోయిరట రాజును దర్శనమీయ లేదటౌ
రా! జగ" మంచు లోకులును నా యపకీర్తికి దాళజెల్లునో?

అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యన్ గల్గు దేశమ్మునన్
జటుల స్ఫూర్తి శతావధానములు మెచ్చన్ జేసియున్నట్టి మా
కిట రా జీయకయున్న దర్శనము నింకెవ్వానికీ రాజొసం
గుట చెప్పం గదవయ్య, పాలితబుధా! కోదండరామాభిధా!

పద్యనాటకాలు

మార్చు

తిరుపతి వేంకటకవులు పద్యనాటకాల ద్వారా ప్రఖ్యాతి పొందారు. పండిత రాజము, ఎడ్వర్డ్ పట్టాభిషేకము వంటి నాటకాలను రచించినా వారు భారతంలోని కథాంశాలను వస్తువులుగా చేసుకుని రాసిన పలు పద్యనాటకాలు ఊరూరా ప్రదర్శింపబడి విజయవంతమయ్యాయి. పాండవ జననము, పాండవ ప్రవాసము, పాండవరాజసూయము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధము అనే నాటకాలుగా రచించారు. అందులో అత్యంత ప్రజాదారణ పొందిన నాటకాలు పాండవోద్యోగం, పాండవ విజయం. ఆ రెండు నాటకాలను రెండు రోజులు ప్రదర్శించే వారు. కాలక్రమంలో ఆ రెండు నాటకాలను సంకలనం చేసి కురుక్షేత్రము అనే నాటకంగా ప్రదర్శించేవారు. పాండవ ఉద్యోగ విజయాలు, కురుక్షేత్రం నాటకాలు బాగా ప్రఖ్యాతి పొందాయి.[12]
పాండవోద్యోగ విజయాలు నాటకాన్ని ఊరూరా ప్రదర్శించేవారు. అత్యంత విస్తృతంగా తెలుగు నాట అంతటా ప్రాచుర్యం పొందిన అత్యంత అరుదైన నాటకాల కోవలోనివి ఇవి.[1]

పాండవోద్యోగ విజయాలు నాటకం నుంచి కొన్ని పద్యాలు

మార్చు

చెల్లియొ చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచిరందరున్
తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ
పిల్లలు పాపలుం బ్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో
యెల్లి రణంబు గూర్చెదవొ యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా!

అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే
యలిగిననాడు సాగరము లన్నియు నేకము గాకపోవు క
ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్.

జెండాపై కపిరాజు ముందు సితవాజిశ్రేణియున్ గూర్చి నే
దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకన్ జెండుచున్నప్పుడొ
క్కండు న్నీమొరనాలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్.

సంతోషంబుల సంధిచేయుదురె వస్త్రంబూడ్చుచో ద్రౌపదీ
కాంతం జూచిననాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ
పొంత న్నీ సహజన్ము రొమ్ము రుధిరమ్మున్ త్రావునాడైన ని
శ్చింతం దద్గదయుం ద్వదూరుయుగమున్ ఛేదించునా డేనియున్.

కావ్యరచన

మార్చు

తిరుపతి వేంకట కవులు ఎన్నో కావ్యాలను రచించారు. ప్రధానంగా శ్రవణానందము, పాణిగృహీత వంటి కావ్యాలు ప్రాచుర్యం పొందాయి. వారి కావ్యరచన బహుముఖీనంగా సాగింది. సంస్థానాధీశులు, చక్రవర్తుల పట్టాభిషేకాలను (బొబ్బిలి జమీందారుగా శ్వేతాచలపతిరావు, ఇంగ్లాండుకు ఐదవ జార్జి), వివిధ దేవతా స్తుతులు, స్తవాలు, జానపద గాథలు (ఆవు-పులి సంభాషణ, ఒక స్త్రీకి పాముతో జరిగిన వివాహం వంటివి), వ్యక్తిగత జీవితంలోని బాధలు (చెళ్లపిళ్ల భార్య, ఆప్తమిత్రుడు దివాకర్ల, ఆదరించిన పోలవరం రాజా వంటివారి మరణసమయాల్లో), తన మిత్రుల సుఖదుఃఖాల గురించి (ఈదర వేంకట్రావుపంతులు సుఖజీవనం, పోలవరం రాజా శని మహాదశలో ఇక్కట్లు), పురాణాల గాథల్ని (లక్షణ, కృష్ణుల వివాహగాథ, హరిశ్చంద్ర జీవితం, తదితరాలు), ఏలా నది గురించి, చివరకు తన జాతకంలోని అనుకూల ప్రతికూలాలను కూడా వస్తువులుగా స్వీకరించి కావ్యాలు రాశాడు.

వచన రచన

మార్చు

తన మలిజీవితంలో చెళ్లపిళ్ల ప్రధానంగా వచన రచనలు చేశాడు. దాదాపుగా ఈ వచన రచనలన్నీ దివాకర్లతో కాక విడిగానే చేశాడు. అందుకు ముఖ్యకారణం కూడా చెళ్లపిళ్ల అభిరుచి వచనం వైపుకు తిరిగేలోగానే దివాకర్ల వారు మరణించడమే కావచ్చు. అతను తన వచన ఖండిక (వ్యాసాలు)లలో ఎన్నో అంశాలను గూర్చి రుచ్యంగా, సవివరంగా రాశారు. మొదట వచనంలో కూడా గ్రాంథికాన్ని అవలంబించిన వేంకటశాస్త్రి పోనుపోను సరళ వ్యావహారికంలోకి దిగాడు. పద్యరచనలో ఎంతటి ఆశుధార ఉందో వచనరచనలోనూ అంతటి అనర్గళ వాగ్ధార ఉందంటూ విమర్శకుడు డి.చంద్రశేఖరరెడ్డి అతని వ్యాసాల గురించి ప్రస్తావించారు. వేంకటశాస్త్రి ఎన్నెన్నో అంశాల గురించి వందలాది వ్యాసాలను రచించారు.
ఆనాటి సంస్థానాధీశులు, వారి చుట్టూ వాతావరణం, వారి దాతృత్వం, సద్గుణాలు, దుర్గుణాలు, అప్పటి మహాపండితులు, వారి పాండితీపటిమ, సహృదయత, ఈర్ష్యాసూయలు, ఆ కాలంలోని ఆచారాలు, వ్యవహారాలు, చెళ్ళపిళ్ల చిన్ననాటి ముచ్చట్లు, కాశీయాత్రకు వెళ్ళిన పూర్వాపరాలు, తన జాతకంలోని శుభయోగాలు, దుర్యోగాలు, నాటి తమ విద్యాభ్యాసం వంటివి ఈ వ్యాసాల్లో కనిపిస్తాయి. ఇక వ్యక్తిగతమూ,సాహిత్యపరమూ అయిన పలు వివాదాలకు సంబంధించిన వ్యాసాలూ పుష్కలంగా రాశారు.[11] ఒక విషయంలోంచి మరో విషయంలోకి, అందులోంచి మరింకొక దానిలోకి చివరికి మళ్ళీ ఎత్తుకున్న విషయంలోనికి మారుతూ ఎన్నో అంశాలను ప్రస్తావించడం వంటివి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కథలు గాథలు(వేంకటశాస్త్రి వచన రచనల సంకలనం) "ఒక అర్థశతాబ్దిలో తెలుగు సాంస్కృతిక చరిత్ర" అంటూ పుస్తకం వెనుక అట్టపై ప్రచురణకర్తలు ప్రశంసించారు.

వివాద సాహిత్యం

మార్చు

తిరుపతి వేంకట కవులకు, మరీముఖ్యంగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రికి సాహిత్యపరంగా ఎన్నో వివాదాలు, శత్రుత్వాలు ఉన్నాయి. కారణమేమైనా ఎందరో చిన్నా పెద్దా సాహిత్యవేత్తలు, కవులు, పండితులు వీరితో వివాదాలు, జగడాలు, వాదప్రతివాదాలు జరిపారు. ఆయా వివాదాలన్నీ సాహిత్యరూపం తీసుకున్నాయి. గద్యంలోనూ, పద్యంలోనూ ఖండన మండన గ్రంథాలు వారి కర్తృత్వంలో వచ్చాయి. ముఖ్యంగా కొప్పరపు సోదరకవులతో జరిగిన వివాదాలను సవివరంగా గ్రంథరూపంలో పదిలపరిచారు. దాని పేరు "గుంటూరి సీమ". అలాగే ఇతరమైన వాదప్రతివాదాలతో కూడా వందలాది పుటల సాహిత్యం విస్తరించింది.

రచనల సరళి

మార్చు

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తొలినాళ్లలో సంస్కృత భూయిష్టమైన సమాసాలతో తెలుగు పద్యాలు లేక నేరుగా సంస్కృత శ్లోకాలు రచించేవారు. అతను గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి సాన్నిధ్యానికి వెళ్ళేలోగా విశేషించి చెప్పిన కవిత్వం పద్యకవిత్వమేనని వేంకటశాస్త్రి రాసుకున్నారు. అతను రాసిన పద్యకవితంలో మొట్టమొదటిది ఈ పద్యం:

శ్రీమదఖండవైభవము చే జెలువారెడి వేంకటాద్రిపై
సామజయాన శ్రీరమణి చక్కగ బాదము లొత్త నారదుం
'డో మహనీయ సేవిత గుణోజ్జ్వల' యంచు భజింపుచుండ ని
న్నే మది నమ్మినాడ దయ నేలుమి శ్రీకర వేంకటేశ్వరా!

ఆ పద్యంలోని ఒక ప్రయోగాన్ని మెట్రిక్ విద్యార్థి ప్రశ్నించి పిడివాదం చేయబూనగా, వేంకటశాస్త్రికి వ్యాకరణం చదవాలనే పట్టుదల ఉదయించింది. ఆ పట్టుదల వల్ల సామర్లకోటలో లఘుకౌముది ప్రారంభించాడు. వ్యాకరణం చదవడం పూర్తి అయ్యేదాకా కవిత్వం చెప్తే ఎవరైనా వ్యాకరణపరంగా తన కవిత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోవాల్సి వస్తుందని రచన ఆపుచేశారు. తొలినాళ్ళలోని తన పద్యాలకు యతిప్రాసల కోసం ఔచిత్యలోపం చేసినట్టుగా చెప్పుకున్నారు. ఆ రోజుల్లో పద్యకవిత్వం కన్నా పదకవిత్వమే ఎక్కువగా వ్రాసేవారు. ఆపై బ్రహ్మయ్యశాస్త్రి వద్ద శిష్యరికం చేసే రోజుల్లో "వేంకటశాస్త్రి తెలుగులో కవిత్వం చెప్తాడు" అని ఎవరైనా సంపన్న గృహస్థులకు గురువు పరిచయం చేస్తే ఆనాడు సంస్కృత పండితుల్లో తెలుగు పట్ల ఉన్న అనాదరం చేత వేంకటశాస్త్రి దాన్ని అవమానకరంగా భావించేవారు. దానివల్ల సంస్కృతంలోనే కవిత్వం చేయాలని సంకల్పించి కొన్నాళ్లపాటు శ్లోకాలు రచించేవారు. అయితే కాకినాడ, ఏలూరు, రాజమండ్రి నగరాలకు అనధ్యయనాల్లో సంపాదించేందుకు వెళ్ళినపుడు తెలుగులోనే కవిత్వం చెప్పేవారు (ఆ సంపన్నులకు, షావుకార్లకు సంస్కృతం రాకపోవచ్చును కనుక). పెద్దషావుకారు ఒకబేడ ఇస్తే "ఈ మేడే మీ బేడేమి" అంటూ పద్యం చెప్పడం ప్రారంభించేసరికల్లా గల్లున రూపాయి చేతిలో పడిందట. అలాంటి రోజుల్లోనే అవతలివారిని మెప్పించి, ఆశ్చర్యపరిచేందుకు బంధకవిత్వం చెప్పేవారు. వీటి వల్ల సంపాదన సంగతి ఎలా ఉన్నా కవిత్వం మాత్రం వృద్ధి పొందింది.[13]
1893లో ఇనుగంటి పదంపై (కిర్లంపూడి జమీందారు ఇంటిపేరు) చెప్పిన యమకం పద్యం సరిగా నడవకపోగా 1899 నాటికి రాసిన పద్యం అవలీలగా నడిచిన వైనాన్ని ఆయనే వివరించుకున్నారు. అలాగే తొలినాళ్లలో పాషాణపాకాలుగా, కఠిన సమాస భూయిష్టమైన పద్యాలు చెప్పిన వేంకటశాస్త్రి కాలం గడిచే కొద్దీ సరళాతి సరళమైన ద్రాక్షాపాకాల వంటి పద్యాలు రాయడం ప్రారంభించారు. పలువురు పండితులు ఆ సరళమైన శైలిని బిగువులేని పద్యాలుగా తృణీకరించారు. అయితే సాధారణమైన రసజ్ఞులు, శ్రోతలు ఈ శైలికి, చమత్కార వచోధోరణికి అభిమానులైనారు. ఆపైన శ్రవణానందం వంటి కావ్యాలను, పాండవోద్యోగ విజయాలు వంటి నాటకాలను, శరపరంపరగా చేసిన అవధానాలైనా సుబోధకమైన, అత్యంత సరళమైన పద్యాల్లోనే వ్రాశారు. అయితే దీనంతటికీ కారణం పదాలు, జానపద సాహిత్యం వంటి సంప్రదాయాలను పద్యాల్లో ప్రవేశపెట్టడమే కారణంగా సాహిత్యవేత్త వెల్చేరు నారాయణరావు విశ్లేషించాడు. తిరుపతి వేంకట కవుల రచనా ధోరణిని ఆశుకవిత్వ ధోరణులుగా అతను భావించారు.[14]
1930 ల నుంచీ వేంకటశాస్త్రి పద్యరచనలతో పాటుగా వచనరచనలు చేయడం కూడా ప్రారంభించాడు. అలా రాసినవే అనంతర కాలంలో కథలు గాథలు గా, కాశీయాత్రగా ప్రచురితమయ్యాయి. వచనం కూడా గ్రాంథిక భాషలో ప్రారంభించి, తర్వాతి కాలంలో సరళ వ్యావహారికంలో రాయడం ప్రారంభించాడు. మొత్తంగా సుదీర్ఘమైన రచనాజీవితంలో తన శైలిని ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ మెరుగుపెడుతూనే సాగాడు వేంకటశాస్త్రి.


రచనల జాబితా

మార్చు

తెలుగులో స్వతంత్ర కవితా రచనలు

మార్చు
  1. శ్రవణానందము (1893-1897; 1897-1898)
  2. పాణిగృహీత
  3. లక్షణా పరిణయము (1897-1901): లక్షణతో శ్రీకృష్ణుని వివాహాన్ని గురించిన భాగవత గాథ.
  4. ఏలా మహాత్మ్యము (1898-1900): ఏలా నది గురించి.
  5. జాతక చర్య (1899-1930), ఇటీవలి చర్య (1930-1950): తన జీవిత విశెషాలను జ్యోతిష పరంగా వర్ణించిన వేంకట శాస్త్రి విశిష్ట రచనలు.
  6. దివాకరాస్తమయము (1920): తన సహచరుడు దివాకరశాస్త్రి దివంగతుడైనపుడు రచించిన నివాళి.
  7. ఐదవ జార్జి పట్టాభిషేక పద్యాలు (1912): King George V పట్టాభిషేక సందర్భంగా.
  8. బొబ్బిలి పట్టాభిషేకం (కావ్యము) (1929): బొబ్బిలి మహారాజు పట్టాభిషేక సందర్భంగా.
  9. కామేశ్వరీ శతకం (1901)
  10. ఆరోగ్య కామేశ్వరి స్తుతి (1922)
  11. ఆరోగ్య భాస్కర స్తవము (1929-1930)
  12. మృత్యుంజయ స్తవము
  13. సౌభాగ్య కామేశ్వరీ స్తవము (1938-1941)
  14. సీతా స్తవము
  15. శివ భక్తి
  16. గో దేవి: ఆవుకు, పులికి మధ్య జరిగిన సంభాషణ.
  17. పతివ్రత: ఒక పడతికి ఒక పాముతో పెళ్ళి జరిగిన జానపద కథ ఆధారంగా.
  18. సుశీల
  19. పూర్వ హరిశ్చంద్ర చరిత్రము: పురాణ గాథ.
  20. దైవ తంత్రము
  21. సతీ స్మృతి తన భార్య మరణానంతరం వేంకటశాస్త్రి రచించిన విషాద రచన.
  22. కృష్ణ నిర్యాణము (1918) పోలవరం రాజా మరణం తరువాత నివాళి.
  23. పోలవరం రాజా గారి శని మహాదశ (1918) తనకు ఆప్తుడు, పోషకుడు ఐన పోలవరం రాజా ఇబ్బందుల గురించి .
  24. సుఖ జీవి ఈదర వెంకట్రావు పంతులు సుగుణాల గురించి.

సంస్కృతంలో స్వతంత్ర రచనలు

మార్చు
  1. ధాతు రత్నాకర చంపు (1889-1893) ఇది రామాయణం కథ ఇతివృత్తంగా సాగిన ఒక చంపూ కావ్యము. సంస్కృతంలో పాణిని వ్యాకరణంలోని ధాతువుల క్రియారూపాలు ఇందులో పొందుపరచబడ్డాయి.
  2. శృంగార శృంగాటక (1891)- శృంగారపరంగా సాగిన చిన్న వీధినాటిక.
  3. కాళీ సహస్రం (1891-1894)- లక్ష్మీ సహస్ర్రం లాగా కాళికా మాత నుద్దేశించిన స్తుతి. మూడు వందల శ్లోకాలతో ఇది అసంపూర్ణ రచనగా మిగిలిపోయింది.
  4. మూల స్థానేశ్వర స్తుతి (1893-1894) నెల్లూరు 'మూల స్థానేశ్వర స్వామి'ని స్తుతిస్తూ ఆర్య వృత్తాలలో చేసిన రచన.
  5. అష్టకములు (కాళికాది స్తోత్రాలు), 1889-1890
  6. శుక రంభ సంవాదము (1893-1894) - శుకునికి, రంభకు మధ్య సాగిన వాదము. ఆనందమంటే వేదాంతజ్ఞానమని శుకుడూ, కాదు శృంగారానుభవమని రంభా వాదిస్తారు.
  7. నమశ్శివాయ స్తోత్రం (1914-1915) భక్తి స్తోత్రం.
  8. క్షమాపణం (1914-1915)
  9. పిష్టపేషణం (1914-1915)
  10. శలభ లభణం (1914-1915)

సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం

మార్చు
  1. దేవీ భాగవతం, 1896
  2. శివలీలలు, 1896
  3. పురాణ గాథలు, 1896
  4. వ్రతకథలు, 1896[15]
  5. శ్రీనివాస విలాసము, 1896-1897
  6. రసికానందము, 1893-1894
  7. శుక రంభ సంవాదము (1893-1894) - తిరుపతి వేంకట కవుల సంస్కృత రచనకు వాళ్ళే చేసిన తెలుగు అనువాదము.
  8. బుద్ధ చరిత్రము, 1899-1900
  9. అప్పయ దీక్షితుల వైరాగ్య శతకము, 1899-1900
  10. రాజశేఖరుని బాల రామాయణము, 1901-1912
  11. విశాఖ దత్తుని ముద్రారాక్షసము, 1901-1912
  12. శూద్రకుని మృచ్ఛకటికము, 1901-1912
  13. బిల్హణుని విక్రమదేవ చరిత్రము, 1901-1912
  14. వీర నంది చంద్రప్రభా చరిత్రము, 1901-1912
  15. బాణుని హర్ష చరిత్రము, 1901-1912

ఆంగ్లం నుండి తెలుగులోకి అనువాదం

మార్చు
  1. రవీంద్రనాధ టాగూరు కథలు

తెలుగు నాటకాలు

మార్చు
  1. పండితరాజము
  2. ఎడ్వర్డ్ పట్టాభిషేక నాటకము
  3. పాండవ జననము (1901-1917)
  4. పాండవ ప్రవాసము
  5. పాండవ రాజసూయము
  6. పాండవ ఉద్యోగము
  7. పాండవ విజయము
  8. పాండవ అశ్వమేధము
  9. అనర్ఘ నారదము
  10. దంభ వామనము
  11. సుకన్య
  12. ప్రభావతీ ప్రద్యుమ్నము (1920-1922)
  13. గజానన విజయము (1901-1912)

స్వతంత్ర తెలుగు వచన రచనలు

మార్చు
  1. కథలు గాథలు
  2. కాశీయాత్ర
  3. భారత వీరులు
  4. విక్రమ చెళ్ళపిళ్ళము
  5. షష్టిపూర్తి
  6. సతీ జాతకము

వృత్తి జీవితం

మార్చు

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి బందరు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు. వేంకటశాస్త్రి వద్ద పాఠశాలలో విద్యను అభ్యసించి, అనంతర కాలంలో సాహిత్య రంగంలో, భాషాశాస్త్రంలో కవులుగా, రచయితలుగా, పండితులుగా లబ్ధప్రతిష్ఠులైన వారు ఎందరో ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ, వేటూరి ప్రభాకరశాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావు, వేలూరి శివరామశాస్త్రి, శ్రీరాముల సచ్చిదానందం (నాటి రోజుల్లో ప్రముఖ నాటక కవి), అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి వంటి మహామహులు చెళ్లపిళ్లను సర్వాత్మనా గురువుగా భావించి గౌరవించారు.
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రికి విజయవాడలో సన్మానం జరిగినప్పుడు విశ్వనాథ ఆయనను పొగడుతూ చెప్పిన పద్యం:
అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదో
హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుఁ డయినా డన్నట్టి దావ్యోమపే
శలచాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళవంశస్వామి కున్నట్లుగన్.
సామాన్యం కాని స్వాదు రసావతారమైన బుద్ధి అనే అహంకారంతో సర్వసంపూర్ణత్వాన్నికలిగి ఉత్సాహంతోకూడి సాక్షాత్ సరస్వతీ స్వరూపమైన నావంటి శిష్యుని కలిగివుండటం వల్ల పొందగలిగే, ఆకాశాన్ని ప్రకాశింపచేస్తున్నచల్లని వెన్నెలవంటి మృదు కీర్తి అనే భోగం మా గురువైన చెళ్ళపిళ స్వామికే కలిగింది కాని ఆనాటి గొప్పకవులైన నన్నయ్యకిగాని తిక్కన కి గాని కలగలేదు అంటూ పొగిడింది ఈ శిష్యులను కలిగివున్న భోగాన్నే.[16]

వివాదాలు

మార్చు

శతావధానాలు, అష్టావధానాలు సామాన్య ప్రజానీకంలో పేరు ప్రతిష్ఠలతో పాటు తిరుపతి వేంకట కవులకు ఎందరో ప్రతికక్షులను సమకూర్చిపెట్టింది. వారి ప్రతిభ, పాండిత్యం వల్లనో, ఆశుకవితా శక్తి వల్లనో, అనుకూలత వల్లనో, ప్రతిపక్షుల బలం వీరితో సరిపోలకపోవడం వల్లనో మొత్తానికి అవమానం కాదగిన ప్రతీ ఘట్టంలోనూ తిరుపతి వేంకట కవులు నెట్టుకువచ్చి, అవుననిపించుకున్నారు. వీరి ప్రతికక్షుల్లో ముఖ్యులు కొప్పరపు సోదర కవులు, వేంకట రామకృష్ణ కవులు. కొప్పరపు సోదర కవులు గుంటూరుకు చెందిన కొప్పరపు వేంకట సుబ్బారావు, కొప్పరపు వేంకట రమణ. వీరిద్దరూ సోదరులు. మరో జంటైన వేంకట రామకృష్ణ కవుల పేర్లు ఓలేటి వెంకట రామశాస్త్రి, వేదుల రామకృష్ణ శాస్త్రి పిఠాపురాస్థాన కవులు. ఈ జంటకవులు బావా బావమరుదులు. తిరుపతి వేంకటకవులకు ఈ రెండు జంటలకు మధ్య చిన్న చిన్న కారణాల వల్ల ప్రారంభమైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారి హోరాహోరీ యుద్ధంగా పరిణమించింది. వాదనలు, ప్రతివాదనలతో పత్రికల్లోనూ, ఖండన మండనలతో గ్రంథాలకు గ్రంథాలు రచించి ప్రకటించారు. కొప్పరపు కవులు, తిరుపతి వేంకట కవుల కలహమయితే నియోగి, వైదీకి ముఠాకలహాల రూపాన్ని తీసుకుని మిగిలిన రంగాలకూ విస్తరించింది. ఈ వివాదాలన్నీ సాహిత్యలోకానికి కావలిసినంత వినోదాన్నీ, సాహిత్యజ్ఞానాన్నీ పంచిపెట్టాయి. వీరి కవిత్వంలోని ప్రయోగాలు పట్టుకుని వారు అసాధువులనడం, వాటిని వారు సమర్థిస్తూ మహాకవి ప్రయోగాలనూ, వ్యాకరణాంశాలను సమగ్రంగా చర్చిస్తూ ప్రతికక్షుల్ని దూషించడం వంటివి పునరావృతమయ్యాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఈ వివాదాల గురించి ప్రస్తావించి వాటి వల్ల ఏళ్ల తరబడి వందలాది గ్రంథాల అధ్యయనం ద్వారా తెలుసుకోవాల్సిన అంశాలు ఒక్కదెబ్బతో సుబోధకంగా అవగాహన అయ్యేవన్నారు.[17]
వీరు కాక ఇంకా ఎందరో ఆనాటి పండితులు, కవులతో గొడవలు పడ్డారు. ఇద్దరిలోనూ వేంకటశాస్త్రి దూకుడైన మనిషి కావడంతో ఆయనకు శత్రువులు అధికం. వేంకటశాస్త్రి చిన్నతనంలో కుమారసంభవ కావ్యాన్ని చెప్పిన గురువు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రితో కూడా గొడవలు పడ్డాడు. అది చిలికి చిలికి గాలివానయి తుదకు కోర్టు కేసుల వరకూ వచ్చింది. తీర్పు వేంకటశాస్త్రికి ప్రతికూలమయ్యే సమయానికి కృష్ణమూర్తి శాస్త్రితో సర్దుబాటు చేసుకుని ఒడుపుగా తప్పించుకున్నాడు.
వేంకట రామకృష్ణ కవులను ఉద్దేశించి "మీకు వేంకటశాస్త్రి చిన్నతనంలో గురువుగా వ్యవహరించారు కనుక ఈ వివాదాలు అనుచిత"మని తిరుపతి వేంకట కవులు తమ శిష్యుడు ఒకరితో బహిరంగలేఖ రాయించారు. దీనికి సమాధానాన్ని వేంకట రామకృష్ణ కవుల శిష్యుడైన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిచే రాయించారు. ఈ నేపథ్యంలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రాజమండ్రి కోటిపల్లి బస్టాండులో ముఖాముఖీ ఎదురయినప్పుడు వాగ్వాదం చెలరేగింది. ఉద్వేగాలు పెంచుకున్న ఆ స్థితిలో ఇద్దరూ చెప్పులు చూపించుకునే స్థితికి వెళ్ళిపోయారు.[17]
అయితే ఇదంతా వయసులోనే. ప్రాయం మళ్లేసరికి వేంకటశాస్త్రి ఎక్కడలేని శాంతం తెచ్చుకున్నాడు. వాదనకు దిగి అపవాచ్యాలు పత్రికాముఖంగా రాసినవారికి కూడా పరమశాంతంగా సమాధానాలిచ్చాడు. ఇంకా విమర్శలు చేస్తూండేవారిని "ఇలా పత్రికాముఖంగా కాదు నాయనా, ఒకసారి ఓపిక చేసుకొని కడియం వచ్చి నాల్గు పూటలు మా యింట ఉండండి. మాట్లాడుకుందాం. అవన్నీ ఎలా ఒప్పులో మీకు వివరంగా తెలియజేస్తాను" అంటూ అనునయపూర్వకంగా మాట్లాడే స్థితికి వచ్చాడు.
వేంకటశాస్త్రి చివరిరోజుల్లో "నాకిప్పటికీ(70ఏళ్ల వయసులో) శత్రుబాధ నివర్తించనే లేదు" అన్నాడు కానీ అతను మరణానంతరం కూడా వివాదాలు అతన్ని వదలనే లేదు. 1971లో నిడదవోలు వేంకటరావు తిరుపతి వేంకటకవులను పొగడుతూ మొదలుపెట్టిన వ్యాసంలో తిరుపతి వేంకట కవులకు విజయనగరంలో శృంగభంగమయిందనీ, అటుపైన విజయనగరం కాదు గదా తుని కూడా దాటి వెళ్లలేదనీ వ్రాశారు. అంతేకాక తిరుపతి వేంకటకవులు గతంలో ఒప్పు అని నిరూపించినవి కూడా తవ్వితీసి తప్పులనడం ప్రారంభించాడు. తిరుపతి వేంకట కవులు ప్రచురించిన కొన్ని గ్రంథాల పేర్లు ఉటంకించి ఇవి అచ్చుపడినట్టు లేదని అనుమానాలు వెలిబుచ్చాడు.[18] వారు రాసినవి అసత్యాలనీ, అర్థసత్యాలని ఖండిస్తూ చిన్న పుస్తకమే ప్రచురించవలసివచ్చింది తిరుపతి వేంకట కవుల అభిమానులకు.

ఆర్థిక స్థితిగతులు

మార్చు

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి పేదకుటుంబంలో జన్మించాడు. తన కవిత్వం ద్వారా ఎంతో ధనం సంపాదించి కుటుంబ ఆర్థిక స్థితిని దోసపాదులా పెంచాడు. అతని కావ్యాల అంకితాలు, గ్రంథ ప్రచురణలు, రాజాస్థానాల్లో సత్కారాలు, సంస్థానాధీశుల నుండి వార్షికాలు, అష్టావధానాల ఏర్పాట్లకు బహుమతులు వంటి ఎన్నో రూపాల్లో ఆర్థికంగా బలపడ్డాడు. అతని కాశీయాత్ర పుస్తకానికి సంపాదకత్వం చేపట్టిన మోదుగుల రవికృష్ణ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ "వేం.శా. [వేంకటశాస్త్రి] గొప్ప చమత్కారి, హాస్యస్ఫూర్తి కలిగిన వారు. తనకు కావలసినది ఇవ్వగలరు అనుకున్నచోట రాబట్టగలరు." అంటాడు. అటువంటి సందర్భాల్లో ఒకటి:
విక్రమదేవ వర్మకు వయసు మీరాక వారసత్వపు దావాలో జయపుర సంస్థానం దఖలు పడింది. ఆయనకు 'కవిభూషణ' బిరుదున్న శెట్టి లక్ష్మీనరసింహం ఆంతరంగిక కార్యదర్శి. నరసింహం తనకు చెళ్లపిళ్ల అంటే ఉన్న అభిమానం కొద్దీ వర్మ సన్నిధిలో శతావధానం చేయించాలనుకున్నాడు. వేంకటశాస్త్రి తనకు ధారణశక్తి లోపించిందని, రాజు అంగీకరిస్తే ఏదో అంశం మీద కాసేపు మాట్లాడతానన్నాడు. ఒకరోజు సాయంత్రం జయపురం వారి విశాఖపట్నం విడిది అయిన హవామహల్లో మధ్యాహ్నం మూడు మొదలు ఎనిమిది గంటలవరకూ ఏకబిగిన కవిత్వం అనే అంశంపై ప్రసంగించారు. వెయిన్నూట పదహార్లు, జోడు శాలువాలతో సత్కరించాలని వర్మ తలంపు. అది నరసింహం ద్వారా వేంకటశాస్త్రికి ముందుగానే తెలుసు. అయిదు గంటల నిరాఘాట ఉపన్యాసంలో ప్రస్తావనవశాత్తూ కడియంలో తనకు రెండుచోట్ల విడివిడిగా మడిచెక్కలు ఉన్నాయన్నారు. ఆ విషయం అక్కడితో వదిలిపెట్టి ప్రధాన అంశంలోకి మళ్లి, కొంతసేపటికి ఆ రెండు మడిచెక్కల మధ్య ఉన్న భూమి చవగ్గా అమ్మకానికి వచ్చిందని, దానిని గనుక కొంటే తన పొలం అంతా ఒకే ఖండంగా ఉంటుందని చెప్పారు. మళ్ళా ప్రసంగంలోకి వెళ్ళి ఒక అరగంట తర్వాత ఆ భూమి కామందు మూడు వేలకు తగ్గనంటున్నాడని ముక్తాయించారు. అలా తన కోరిక నేరుగా కాకుండా చతురంగా వెలుబుచ్చడంతో, మొత్తానికి మూడు వేల రూపాయలు విక్రమదేవ వర్మ వేంకటశాస్త్రికి బహూకరించారు. ఆ సంఘటనకు ప్రత్యక్షసాక్షి శ్రీశ్రీ.[19] ఇది జరిగింది 1935 డిసెంబరు 25. అప్పటికి శ్రీశ్రీకి పాతికేళ్లు. వేంకటశాస్త్రికి అరవైఐదు సంవత్సరాలు.
బొబ్బిలి జమీందారు పట్టాబిషేకోత్సవాన్ని కావ్యంగా రాసి పట్టాభిషేకం పూర్తయిన రెండు, మూడేళ్లకు శిష్యులతో బొబ్బిలి వెళ్ళి వారంరోజుల పాటు ఆ కావ్యాన్ని వ్యాఖ్యాన సహితంగా జమీందారుకు వినిపించాడు. ఆ కావ్యానికి, వేంకటశాస్త్రి పద్యపఠన ధోరణికి ఆనంద పరవశుడైన బొబ్బిలి జమీందారు వేంకటశాస్త్రి జీవించి ఉన్నన్నినాళ్లూ వంద రూపాయలు ప్రతిసంవత్సరం వార్షికం లాగా అందజేసే ఏర్పాటుచేశాడు.
ఇవే కాక తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాండవోద్యోగ విజయాల ప్రచురణలు, అవధాన ప్రదర్శనలు వంటి వాటి ద్వారా కూడా ఎంతో సంపాదించుకున్నాడు.

వ్యక్తిత్వం

మార్చు

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిది ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. అతనంటే సమకాలికులు చాలామందికి ఇష్టం. మాటలలో దొర్లించే చమత్కారానికి, పాడే విధానానికి ఆయనను విడిచిపెట్టలేకపోయేవారు. తిరుపతిశాస్త్రితో పోలిస్తే వేంకటశాస్త్రి గొప్ప పట్టుదల గల మనిషి. తిరుపతిశాస్త్రి లేవదీసిన తగాదాలలో తిరుపతిశాస్త్రే చల్లబడిపోయినా వేంకటశాస్త్రి మాత్రం అంతు తేల్చుకునేంతవరకూ వెనుదిరిగేవాడు కాదు. మాటపట్టింపు వస్తే శతవిధాల తన మాటే నెగ్గాలని అతను అనుకునేవాడు. ఐతే చిన్నవయసులో ఎంత పట్టుదలతో, ఆవేశంతో ఉండేవాడో వయసు మీదపడ్డాకా అంతకు అంతా శాంతచిత్తునిగా మారిపోయాడు. వేంకటశాస్త్రి కోపం వెనుక వెన్నలాంటి సహృదయత కూడా ఉందని ఆయనను నేరుగా ఎరిగినవారు రాసి ఉన్నారు. ఆ మెత్తనిదనం గురించి అతని శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ రాసిన పద్యం:[20]

చ. తన యెదయెల్ల మెత్తన కృతప్రతిపద్యము అంతకంటె మె
    త్తన తన శిష్యులన్న యెడదం గల ప్రేముడి చెప్పలేని మె
    త్తన యయి శత్రుపర్వతశతారము సత్కవి చెళ్ళపిళ్ళ వేం
    కన గురువంచు చెప్పికొనగా నది గొప్ప తెలుంగునాడునన్‌

అతను ఉపాధ్యాయునిగా పనిచేసిన రోజుల్లో ప్రజాప్రతినిధుల ప్రాబల్యం లేకపోవడంతో జిల్లా విద్యాధికారుల మాటలకు చెల్లుబాటు బాగా ఎక్కువ. అలాంటి స్థితిగతుల్లో కూడా ఒక ముస్లిం మతస్థుడైన డ్రాయింగ్ మాస్టరును "పేదవాడు. అతనికి ఐదుగురు పిల్లలు" అనే కారణంతో అతని ఉద్యోగం తీయించకుండా వేంకటశాస్త్రి జిల్లా అధికారిని ఎదిరించి నిలబడ్డాడు. వీటన్నిటినీ స్కూలు విద్యార్థిగా చూసిన విశ్వనాథ సత్యనారాయణ ఈ విషయాన్ని గురించి ఇలా రాసుకున్నాడు, "చివరకు జిల్లా అధికారి యిద్దరిని(వేంకటశాస్త్రి, అతను ఆశ్రితుడైన సహోద్యోగి) గుఱించి చెడామడా వ్రాసిపోయెనట. ప్రతి సంవత్సరము ప్రతి జిల్లా యాధికారియు, 'వీరీ యుద్యోగానికి తగరు తీసివేయవలయును' అనీయే వ్రాయుచుండెడివాడట. పాఠశాల యొక్క అధికారిక సంఘము వారి నెప్పుడును తీసివేయలేదు. వారు మా గురువుగారిని తమ పాఠశాల కది గౌరవమని ఏరికోరి తెచ్చుకొనిరి. మా గురువుగారా పాఠశాలలో పాతికేండ్లు పనిచేసిరి. వారిమీద నీ జిల్లా యాధికారుల వ్రాతలేమియు పనిచేయలేదు. గురువుగారి మూలముగ డ్రాయింగు మాస్టారి ఉద్యోగము కూడ పోలేదు. ఆయనను తీసివేసినచో తానీయన లేచిపోవుదుననును." ఇక అతను తొలినాళ్లలో కొప్పరపు కవులతో పెద్ద తగాదా లేవదీసి, విమర్శలు, ఖండనలు చేసినవాడే ఐనా 1943లో కొప్పరపు కవుల పుత్రులైన సీతారామ ప్రసాదరావు, మల్లికార్జునరావులు అష్టావధానం చేస్తూండగా ఎంతో ఆదరణ కనబరిచారు. విజయవాడ త్రిలింగ విద్యాపీఠంలో సంక్రాంతి నాడు జరిగిన కుమార సోదర కవుల అవధానంలో మూడు పద్యాలతో సంభావించి, అధ్యక్షత వహించి వారిని అవధానంలోకి విడిచిపెట్టి అత్యంతాదరంగా వారి అవధానాన్ని ఆస్వాదించారు. అతను సమకాలికులు వేంకటశాస్త్రి గురించి రాసిన మాటలివి:

  • శాస్త్రిగారు సామాన్యం ఎత్తు, చామనచాయ, బహుచురుకైన మొహం. కంచుగంటలాంటి గొంతుక, పూర్వకాలపు కత్తు కాబట్టి పిల్లజుట్టు. పండిత శాలువను పైన వేసుకొని పంచను ధరించేవారు. చేతనున్న బంగారు కడియం కవితా దిగ్విజయాన్ని సూచిస్తుంది. కవులు సాధారణంగా వాచాలురుగా ఉంటారు. వారికి వ్రాయడమెంత సహజమో సంభాషించడం కూడా అంతే. దీనికి భిన్నంగా ఉండేవారు సకృత్తు. అయితే సంభాషించడం వేరు, ఉపన్యసించడం వేరు. శాస్త్రిగారు అమితభాషి. ఆయన మాట్లాడుతున్నంతసేపూ వినాలనే ఉంటుంది. లోకవ్యవహారాన్ని, పూర్వానుభవాలను, పూర్వ కవిత్వ, నవీన కవిత్వాలను జోడించి సరసంగా మాట్లాడుతారు. లౌక్యులలో లౌక్యుడు, ఎదిరిని ఏ పద్ధతినైనా చిత్తు చేయాలనే వ్యక్తి. పట్టుదల సందర్భాలలో మృగరాజు ధైర్యం, నక్కజిత్తులను కూడా అవలంబిస్తారు. కవితా ధోరణికి తిరుపతి శాస్త్రిగారు, లౌక్య ప్రజ్ఞకు వేంకటశాస్త్రిగారు అని తెలిసినవారు చెప్పుతారు - టేకుమళ్ల కామేశ్వరరావు[21]
  • చెళ్లపిళ్ల శాస్త్రిగారు చాలా సౌమ్యుడు. జ్ఞానపిపాస అత్యధికం. కాలేజీకి వచ్చి రేడియో, ఎక్స్ రే మొదలైన ప్రయోగాలను చేయించి తెలుసుకునేవారు. ఈ సభలోనైనా ఆయన తప్పు చెప్పితే దానిని దిద్దుకోక దానినే సమర్థించేవారు. దిద్దుకుంటే గౌరవభంగం అనేవారు. కవులకు అంటగట్టే శృంగారం ఆయన గురించి అనడానికి లేదు. - విస్సా అప్పారావు (విస్సా అప్పారావు, వేంకటశాస్త్రి ప్రాణస్నేహితులు. విస్సా వారు రాజమహేంద్రవరంలో ఉన్నన్నినాళ్లూ వేంకటశాస్త్రి రాజమండ్రి వచ్చినపుడల్లా విస్సా వారింట్లోనే మకాం వేసేవారు)
  • శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారిని నేనెఱుగ లేకపోతిని. వారు మాకు తెలుగు చెప్పుటకు రానారంభించిరి. బక్కపలుచని వాడు, పొట్టివాడు, చామనచాయ యనుటకు మించిన నల్లని మేనివాడు. కాళ్ళకు పావుకోళ్లు, ధోవతి, లోన తెల్లని చొక్కా, పైన నొక కోటు. అవి మాయనివి కాదు. మాసినవి కావు. ఒక తలగుడ్డ. మొగమున విభూతియు గంధమును నొసట పెద్ద కుంకుమ బొట్టు. ....మొదటి గంటలో నరగంటయైన తరువాత శాస్త్రి గారు వచ్చుట జరిగినచో పిల్లల యదృష్టము. దినదినమింతే. దాని కవధి లేదు. ఏ యితరోపాధ్యాయుడు నట్లు వచ్చుటకు వీలు లేదు. ప్రధానోపాధ్యాయుడు మందలించును. కఠినముగా చెప్పును. చివరకుద్యోగము నిలుచుటయు కూడా కష్టము. అతను మా గురువు గారి యందు నిస్సహాయుడు. -విశ్వనాథ సత్యనారాయణ, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి శిష్యుడు, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవి, రచయిత.[22]

ప్రాచుర్యం

మార్చు

తిరుపతి వేంకట కవులు అవధాన పరంపరలు, పద్యనాటక ప్రదర్శనలు, ఆశుకవిత్వం వంటివాటి వల్ల ఎనలేని ప్రాచుర్యాన్ని పొందారు. ఎనలేని గౌరవమర్యాదల్నీ, సన్మానాలను, డబ్బునూ, ప్రఖ్యాతిని పొందారు. తమ కవితా దిగ్విజయం గురించి తామే చెప్పుకున్న పద్యం ఇది:

ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము స
న్మానములందినాము బహుమానములే గ్రహియించినార మె
వ్వానిని లెక్కపెట్ట కనివారణ దిగ్విజయం బొనర్చి ప్ర
జ్ఞా నిధులంచు బేరు గనినారము నీ వలనన్ సరస్వతీ !

తిరుపతి వేంకటకవులు కలిసి చేసిన తొలి శతావధానం మొదలుకొని ఎన్నో అవధానాల్లో గడ్డు స్థితిగతులను ఎదుర్కొన్నారు. ఐనా కారణాంతరాల వల్ల వాటిని నెట్టుకొచ్చి విజయాలు పొందారు. సంస్థానాధీశుల దర్శనాలు సంపాదించి ఒక్కమారు వారి ఎదుట అవధానమంటూ చేయడమే జరిగితే ఆ జమీందారులు తి.వేం.కవులను వదలలేకపోయేవారు. జంటకవుల చమత్కార ధోరణి, ప్రసంగ ధార చూసి సంస్థానాధీశులు తమ వద్దే నెలల పాటు ఉంచేవారు. గద్వాల వెళ్ళినపుడు ఆరునెలలు, ఆత్మకూరులో మూడునెలలు, నూజివీడులో ఏడు నెలలు, విజయనగరంలో మూడు నెలలు ఉండిపోయారు.
తి.వేం.కవులు రాసిన పాండవోద్యోగ విజయాలు నాటకాన్ని ఊరూరా అసంఖ్యాకమైన ప్రదర్శనలు చేశారు. సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ ఈ నాటకాల విజయాన్ని గురించి చెప్తూ "పాండవోద్యోగ విజయాల ప్రదర్శన జరగని ఊరు ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కాదని" పేర్కొన్నారు. వాటిలో వారు రాసిన పద్యాలు జాతీయాలుగా నిలిచిపోయాయి. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో "అయినను పోయి రావలె హస్తినకు" వంటివి ప్రముఖ ప్రయోగాలుగా, నిలిచిపోయాయి.
చెళ్ళపిళ్ళ వారి షష్టిపూర్తి ఉత్సవం అతను అభిమానులు, శిష్యప్రశిష్యుల నడుమ వైభవంగా జరిగింది. 1949లో ఆయనను మద్రాసు ప్రభుత్వం తొలి ఆస్థానకవిగా నియమించి గౌరవించింది. అనంతరకాలంలో గొప్ప కవి, రచయితలుగా, మహాపండితులుగా పేరొందిన విశ్వనాథ సత్యనారాయణ, వేటూరి ప్రభాకరశాస్త్రి, వేలూరి, పింగళి-కాటూరి మొదలైన శిష్యులు ఆయనకు తమ రచనలను అంకితమిచ్చీ, అతని సౌజన్యం గురించి మరపురాని పద్యాలు అల్లీ గౌరవించుకున్నారు. నిజానికి ఆనాటి సాహిత్యలోకంలో చెళ్లపిళ్ల గురువని చెప్పుకోవడం గొప్ప గౌరవంగా ఉండేది.[23] చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రి కవిత్వరచన ద్వారా సాధించుకున్న పేరుప్రతిష్ఠలు అతని ఉపాధ్యాయ వృత్తికి కూడా ఉపయోగపడ్డాయి. బందరులో అతను పనిచేసిన విద్యాసంస్థ వారు వేంకటశాస్త్రి వంటి ప్రఖ్యాత కవి తమ పాఠశాలలో ఉండడం గౌరవంగా ఎంచి తీసుకువచ్చారు. ఈ కారణంగానే జిల్లా స్థాయి అధికారులు ఎంతగా ఆయనను వ్యతిరేకించి, ఉద్యోగం తీసేయమని సిఫార్సులు చేసినా వారి ఉద్యోగం స్థిరంగా నిలిచి ఉండేది.[22]

నోట్స్

మార్చు
  1. ఒకే గురువు వద్ద ఒకే సమయంలో ఒకే పాఠం చెప్పుకుంటూ చదివిన సహాధ్యాయులు. క్లాస్‌మేట్ల వంటివారు
  2. వైదిక విద్యలు మౌఖికం. గురుముఖత: వాటిని నేర్చుకునేవారు. కాబట్టి విద్యలు చెప్పుకోవడం అని వ్యవహారం
  3. కిరాతార్జునీయమనే సంస్కృత కావ్యాన్ని రచయిత భారవి పేరుమీదుగా వ్యవహరిస్తూంటారు
  4. ఒకే గురువు వద్ద ఒకే పాఠాన్ని ఒక సమయంలో చదువుకున్నవారు సహాధ్యాయులు కాగా ఒకే గురువు వద్ద వేర్వేరు సమయాల్లో లేదా ఒకే సమయంలో వేర్వేరు స్థాయి పాఠాలు చెప్పుకుంటున్నవారు సతీర్థ్యులు. అంటే సహాధ్యాయులు క్లాస్‌మేట్స్ వంటివారైతే, సతీర్థ్యులు స్కూల్ మేట్స్ అని పోల్చవచ్చు.
  5. గౌతముడి న్యాయ శాస్త్రం, కణాదుడి వైశేషికం, కపిలుడి సాంఖ్యం, పతంజలి యోగం, జైమిని పూర్వ విూమాంస, వ్యాసుడి ఉత్తర విూమాంస దర్శనాలు - ఆరూ కలిపి షట్‌దర్శనాలు.[3] ఇవి భారతీయ తాత్త్వికతలో కీలకమైన ప్రతిపాదనలు. వీటన్నటిలో కృషిచేసి వేతృత్వం సంపాదించినవారిని షట్‌దర్శినీవేది అని గౌరవిస్తారు. పాండిత్యానికి సూచిక.
  6. పద్యం ఒక నడకలో సాఫీగా సాగడం, తద్వారా ప్రేక్షకులకు మరపురాని విధంగా గుర్తిండిపోవడం ధార ద్వారా సాధించవచ్చు. ఈ ధారాశుద్ధి ప్రత్యేక సాహిత్య విలువగా నిలబెట్టింది శ్రీనాథుడు కాగా విస్తృత ప్రాచుర్యం తెచ్చింది తిరుపతి వేంకట కవులనీ విశ్వనాథ సత్యనారాయణ భావించాడు.
  7. ధారణ అంటే జ్ఞాపకశక్తి.[4] ప్రాచుర్యం పొందిన అష్టావధాన, శతావధాన ప్రక్రియల్లో ధారణాశక్తి చాలా కీలకం. శతావధానంలో ఆఖరి రోజు ఎవరు ఏం అడిగారో, వారికి ఏ పద్యాలు చెప్పామో అవధానులు గుర్తుంచుకుని తప్పురాకుండా చెప్పాల్సివస్తుంది.
  8. తలచిన వెనువెంటనే ధారాళంగా, వేగంగా చెప్పే కవిత్వం ఆశుకవిత్వం[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 కాశీయాత్ర పుస్తకానికి ముందుమాట:మోదుగుల రవికృష్ణ:మిత్రమండలి ప్రచురణ:2012
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 కాశీయాత్ర:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి:సంపాదకత్వం.మోదుగుల రవికృష్ణ: మిత్రమండలి ప్రచురణలు:2012
  3. పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
  4. 4.0 4.1 తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
  5. సి.వి.సుబ్బన్న శతావధాని 2012, p. 108.
  6. సి.వి.సుబ్బన్న శతావధాని 2012, p. 69.
  7. సి.వి.సుబ్బన్న శతావధాని 2012, p. 70.
  8. సి.వి.సుబ్బన్న శతావధాని 2012, p. 71.
  9. సి.వి.సుబ్బన్న శతావధాని 2012, p. 58.
  10. నానారాజసందర్శనం:తిరుపతి వేంకటకవులు
  11. 11.0 11.1 కథలూ గాథలు: చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఎమెస్కో ప్రచురణ
  12. "పద్య నాటకానికి పట్టాభిషేకము...(వ్యాసం):[[చాట్ల శ్రీరాములు]], కందిమళ్ళ సాంబశివరావు:ఆంధ్రభూమి:ఆగస్టు 26, 2010". Archived from the original on 2015-03-18. Retrieved 2014-08-04.
  13. మా విద్యార్థి దశ - నాటి కవిత్వం(వ్యాసం):చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
  14. తిరుపతివేంకట కవులు:మొదలుకాని విప్లవం అధ్యాయం, తెలుగులో కవితా విప్లవాల స్వరూపం: వెల్చేరు నారాయణరావు
  15. భారత డిజిటల్ లైబ్రరీలో 1952లో ముద్రించబడిన వ్రత కథలు పుస్తకం.
  16. "పద్యకర్త-విశ్వనాథ సత్యనారాయణ, ఉదహరింపు-కల్పవృక్షపు స్త్రీలు-1:గబ్బిట ప్రసాద్". Archived from the original on 2015-04-26. Retrieved 2014-02-04.
  17. 17.0 17.1 అనుభవాలూ-జ్ఞాపకాలూనూ: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
  18. ఆంధ్రసాహిత్యంలో శ్రీ తిరుపతి వేంకట కవుల యుగం:నిడదవోలు వేంకటరావు, 1971 ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక
  19. అనంతం - శ్రీశ్రీ ఆత్మకథ - శ్రీశ్రీ ప్రచురణలు, మే, 2000, పుట. 139
  20. విరావి. "గురుశిష్య బాంధవ్యం". ఈమాట. Archived from the original on 30 అక్టోబరు 2017. Retrieved 22 February 2019.
  21. నా వాఙ్మయ మిత్రులు:టేకుమళ్ల కామేశ్వరరావు
  22. 22.0 22.1 ఆత్మకథ: విశ్వనాథ సత్యనారాయణ(శ్రీ విశ్వనాథ ప్రచురణలు)
  23. "ఆంధ్ర రచయితలు ప్రథమ భాగము(తిరుపతి వేంకటకవులు వ్యాసం):మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి:అద్దేపల్లి అండ్ కో ప్రచురణ". Archived from the original on 2015-03-24. Retrieved 2014-08-04.

ఆధార గ్రంథాలు

మార్చు

సి.వి.సుబ్బన్న శతావధాని (2012), అవధానవిద్య, హైదరాబాద్: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం