వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 19వ వారం

సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందలకు పైగా చిత్రాలలో అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తా లో ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ ఉత్తమ నటుడు బహుమతి పొందాడు. ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.

ఎస్వీ రంగారావు కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన జన్మించాడు. మచిలీపట్నము హిందూ కాలేజిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.

వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవాడు. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. .....పూర్తివ్యాసం: పాతవి