ఆనంద్ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, సినీ నిర్మాత
(వి. ఆనంద ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)

వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్ ఒక ప్రముఖ వ్యాపారవేత్త, సినీనిర్మాత.[1] భ‌వ్య క్రియేష‌న్స్‌ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలు నిర్మిస్తుంటాడు. భవ్య సిమెంట్స్ ఆయన స్థాపించిన వ్యాపార సంస్థ. శౌర్యం, వాంటెడ్, లౌక్యం ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు.

ఆనంద్ ప్రసాద్
జననం
వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్

వృత్తివ్యాపారవేత్త, సినీ నిర్మాత
జీవిత భాగస్వామికృష్ణ కుమారి
పిల్లలుశ్రీనిఖిల, ఆదిత్య

వ్యక్తిగత జీవితం మార్చు

ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లాలో గంధంపల్లికు దగ్గర్లోని కొత్తపేట అనే గ్రామం. తండ్రి వ్యవసాయం చేసేవాడు. ఆనంద్ ప్రసాద్ తో సహా నలుగురు పిల్లలు. ఆనంద్ ప్రసాద్ చిన్నప్పటి నుంచి మెరిట్ విద్యార్థిగా ఉండేవాడు. అతన్ని ఐఏఎస్ అధికారిగా చూడాలన్నది తండ్రి కల. అతనికి పదిహేనేళ్ళ వయసులో ఉండగా తండ్రి మరణించాడు. పదో తరగతి తరువాత కొత్తగూడెం వచ్చి పారిశ్రామిక శిక్షణా సంస్థలో డ్రాఫ్ట్స్ మాన్ గా శిక్షణ తీసుకున్నాడు. పని చేస్తూనే ఐటీఐ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాదుకు వచ్చాడు.

ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. హైదరాబాదులోని కూకట్ పల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాడు.

వ్యాపార రంగం మార్చు

ఎర్రగడ్డ లోని గాజు పరిశ్రమలో ట్రైనీ డ్రాఫ్ట్స్ మెన్ గా చేరాడు. చదువుపై మమకారంతో అక్కడ పని చేస్తూనే మాసబ్ ట్యాంకు లోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి నాలుగేళ్ళ పాటు రాత్రి తరగతులకు హాజరై డిప్లోమా పూర్తి చేశాడు. డిప్లోమా పూర్తయిన తర్వాత ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి కరెస్పాండెన్సు కోర్సు ద్వారా బీ.ఏ పూర్తి చేశాడు. తర్వాత దూరవిద్య ద్వారా బీ.టెక్ కూడా పూర్తి చేశాడు.

ఏడేళ్ళ పాటు పని చేసిన గాజు పరిశ్రమ నుంచి మారి సాగర్ సిమెంట్స్ లో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరాడు. ఎనిమిదేళ్ళు అక్కడ పని చేసి మేనేజర్ హోదాలో అక్కడ రాజీనామా చేశాడు. ఒడిషాలో ఉద్యోగం కోసం సాగర్ సిమెంట్స్ కు రాజీనామా చేశాడు కానీ అక్కడికి వెళ్ళడం ఆరు నెలలు ఆలస్యమైంది. ఈ సమయంలో ఆయనకు సొంతంగా సిమెంటు పరిశ్రమ ప్రారంభించాలనే కోరిక కలిగింది. అలా గుంటూరు జిల్లా, దాచేపల్లి సమీపంలో రోజుకు నాలుగు వేల టన్నుల సామర్థ్యంతో సిమెంటు పరిశ్రమను ప్రారంభించాడు.

సినీ నిర్మాతగా మార్చు

నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈయనకు మంచి స్నేహితుడు. ఆయన హీరోగా అమ్మాయే నవ్వితే, ఆకాష్ హీరోగా మనసుతో అనే సినిమాలు తీశాడు. కానీ అవి సరిగా ఆడలేదు. సినీ రంగంనుంచి దృష్టిని మళ్ళించి భవన నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. సుమారు అరవై భారీ ప్రాజెక్టులు పూర్తి చేశాడు. తరువాత మళ్ళీ కొద్ది రోజులకు గోపీచంద్ హీరోగా భ‌వ్య క్రియేష‌న్స్ పతాకం పై శౌర్యం సినిమా తీశాడు. అది మంచి విజయం సాధించింది. తరువాత గోపీచంద్ తోనే వాంటెడ్ సినిమా తీశాడు. అది కూడా బాగా ఆడింది. తర్వాత తేజ దర్శకత్వంలో నీకూ నాకూ డ్యాష్ డ్యాష్, రవిబాబు దర్శకత్వంలో అమరావతి, లౌక్యం లాంటి సినిమాలు నిర్మించాడు.

విద్యారంగం మార్చు

ఆయన సిమెంటు పరిశ్రమ ఏర్పాటు చేసిన ప్రాంతానికి సమీపంలోని తంగెడ గ్రామంలో డీఏవీ స్కూల్ ఏర్పాటు చేసి అక్కడి గ్రామీణ పిల్లల ఫీజులో యాభై శాతం ఆయనే భరిస్తున్నాడు.

మూలాలు మార్చు

  1. "ఈనాడు ఆదివారం: అప్పుడు కథ మరోలా ఉండేది". telugucinemacharitra.com. ఈనాడు. Retrieved 15 November 2016.