వెలగా వెంకటప్పయ్య
వెలగా వెంకటప్పయ్య ఆంధ్ర ప్రదేశ్ లో గ్రంథాలయోద్యమానికి సారథి. గ్రంథాలయ పితామహుడు, మానవతావాది, పరిపాలనాదక్షుడు, పత్రికా సంపాదకుడు, సాహితీవేత్తగా పలువురి మన్ననలు పొందారు. తన జీవితమంతయూ గ్రంథాలయోద్యమానికి ధారపోశాడు. గ్రంథాలయ పితామహుడిగా పేరుపొందాడు.[1] గుంటూరు జిల్లా తెనాలి వాస్తవ్యుడు. శాఖా గ్రంథాలయములో చిన్న ఉద్యోగిగా చేరి, స్వయంకృషితో యమ్.ఎ, బాలసాహిత్యంలో పరిశోధన ద్వారా పి.హెచ్.డి పొందాడు. బాల సాహిత్యములో ఎన్నో రచనలు చేశాడు. మరుగున పడిన రచనలు, ముఖ్యముగా పిల్లల సాహిత్యములో ఎందరో మహానుభావుల కృషిని సేకరించి పొందు పరిచాడు. గ్రంథాలయ విజ్ఞానములో వెంకటప్పయ్య తాకని అంశం లేదు. 100కు పైగా పుస్తకాలు, ముఖ్యముగా గ్రంథాలయ విజ్ఞానమునకు సంబంధించి వ్రాసిన గ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. పలు పుస్తకాలు పాఠ్య గ్రంథాలుగా తీసుకొనబడ్డాయి.
వెలగా వెంకటప్పయ్య | |
---|---|
![]() గ్రంథాలయ గాంధీ వెంకటప్పయ్య | |
జననం | వెలగా వెంకటప్పయ్య 1932 జూన్ 12 |
మరణం | 2014 డిసెంబరు 28 | (వయసు 82)
మరణ కారణం | గుండెపోటు |
సమాధి స్థలం | తెనాలి |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | గ్రంథాలయ గాంధీ |
విద్యాసంస్థ | ఉస్మానియా విశ్వవిద్యాలయము ఆంధ్ర విశ్వవిద్యాలయం |
జీవిత భాగస్వామి | నాగేంద్రమ్మ |
పిల్లలు | నలుగురు కుమారులు |
వెంకటప్పయ్య వయోజన విద్య, సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించాడు.
వెంకటప్పయ్య గ్రంథాలయ విజ్ఞానమునకు చేసిన సేవలకు గుర్తుగా "Knowledge Management: Today and Tomorrow" గ్రంథము వెలువడింది[2].
కుటుంబం, నేపథ్యం సవరించు
డాక్టర్ వెలగా వెంకటప్పయ్య 1932లో గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో వెలగా నాగయ్య, వెంకాయమ్మ దంపతులకు జన్మించాడు. ఆయనది ఓ సామాన్య రైతు కుటుంబం. ఉద్యోగ అన్వేషణలో భాగంగా లైబ్రరీస్ అథారిటీస్ వారి శాఖా గ్రంథాలయంలో ఓ చిరు ఉద్యోగిగా చేరి అంచలంచెలుగా ఎదిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుంచి లైబ్రరీ సైన్సులో డిప్లొమా పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు తెలుగులో బాలసాహిత్య వికాసం, ఆంధ్రప్రదేశ్‌లో బాలల గ్రంథాలయాల ప్రగతిపై ఆయన చేసిన పరిశోధనా కృషికి పీహెచ్‌డీ బహుకరించారు. వీరి సతీమణి నాగేంద్రమ్మ, సంతానం నలుగురు కుమారులు ఉన్నారు.
- 1956లో ఆర్థిక పరిస్ధితుల వలన ఉన్నత పాఠశాల చదువుతో విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పి రేపల్లె శాఖాగ్రంథాలయంలో గ్రంథ పాలకునిగా చేరారు. ఆ తర్వాత చదువును కొనసాగించారు.
- 1962లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రంథాలయశాస్త్రంలో డిప్లొమా, 1971లోఎం.ఎ, 1981లో ఏయూ నుంచి పీహెచ్‌డీ పొందారు.
- 2013లో ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల ప్రముఖులకు అందజేసిన ఉగాది పురస్కారాన్ని గ్రంథాలయ రంగం నుంచి డాక్టర్ వెలగా ఒక్కరికే పొందగలిగారు.
కొన్ని రచనలు సవరించు
- సోవియట్ రష్యా ప్రభుత్వ ఆహ్వానంపై మాస్కో పర్యటనకు వెళ్లివచ్చాక ‘లెనిన్ గ్రంథాలయ విధానం’, ‘లైబ్రరీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది యూఎస్‌ఎస్‌ఆర్’ గ్రంథాన్ని వెలువరించి ఆ వ్యవస్థను తెలుగువారికి పరిచయం చేశారు.
- వెలగా రచించిన ఆంధ్ర వాఙ్మయ సంగ్రహ సూచిక, శాస్త్రీయ వాజ్ఞయ సూచిక, గ్రంథసూచికలు వివిధ రంగాలపై ఆయనకు గల విషయ పరిజ్ఞానానికి అద్దం పడతాయి.
- కాకతీయ యూనివర్సిటీకి సర్టిఫికెట్ కోర్సుకు ఆరు పుస్తకాలు, డిగ్రీకి 12 పుస్తకాలు రాశారు.
- పౌర గ్రంథాలయ చట్టాల పత్రాలను తెప్పించి ‘ఇండియన్ లైబ్రరీ లెజిస్లేషన్’ అనే గ్రం థాన్ని రెండు సంపుటాల్లో వెలువరించారు.
- 1990లో ఉద్యోగ విరమణ అనంతరం రచనా వ్యాసంగలోనే నిమగ్నమయ్యారు. ప్రముఖుల చరిత్రలు, నిఘంటువులు, తెలుగు ప్రముఖులు, బాలసాహిత్యంలో అనేక పుస్తకాలను తీసుకొచ్చారు. నమూనా పౌర గ్రంథాలయ చట్టం రూప కల్పన, గ్రంథాలయాల గ్రంథసూచీలు, అనుక్రమణికల తయారీ, పుస్తక ప్రచురణ, బాలసాహిత్య రచనలో కృషి చేశారు. గ్రంథాలయ శాస్త్రంలో 80కి పైగా రచనలు, సుమారు 300వ్యాసాలు రాసిన డాక్టర్ వెంకటప్పయ్య గ్రంథాలయోద్యమంలో అంకితభావంతో కృషిచేసిన మహోన్నతుడిగా నిలిచిపోయారు. బాలల కోసం 30వేల తెలుగు సామెతలు, వేయి తెలుగుబాలల జానపద గేయాలు, 3వేల పొడుపు కథలు, 15వేల జాతీయాలు సేకరించి ప్రచురించారు.
- కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగంలో సభ్యులైన వెంకటప్పయ్య వివిధ భాషా సాహిత్యాలను ప్రోత్సహించారు.
- గ్రంథాలయ సేవా నిరతులు
- బాల సాహితి వికాసము - డాక్టరల్ థీసిస్
- బాల సాహితి
- బాలానంద బొమ్మల కుమార శతకము
- బాలానంద బొమ్మల పండుగ పాటలు
- పొడుపు కథలు
- బాలానంద బొమ్మల పొడుపు కథలు
- మన పిల్లల పాటలు
- మన వారసత్వం
- తెలుగు వైతాళికులు - ముట్నూరి కృష్ణారావు
- రేడియో అన్నయ్య - న్యాపతి రాఘవరావు
- గ్రంథాలయ వర్గీకరణ (1976) [3]
- గ్రంథాలయ సూచీకరణ (1976, 1987) [4]
- తెలుగు ముద్రణ:ప్రచురణ వికాసం, తెలుగు ముద్రణ ద్విశతాబ్ది(1811-2011) సందర్భంలో ప్రచురణ
- గ్రంథాలయవాణి: అయ్యంకి శతజయంతి సంచిక (సంపాదకులు) 1992
- గ్రంథాలయ పితామహ భారత పౌర గ్రంథాలయ శిల్పి అయ్యంకి వెంకటరమణయ్య (1907-1979) - 1990
గుర్తింపులు సవరించు
- ఉస్మానియూ యూనివర్శిటీ నుంచి లైబ్రరీ సైన్సులో డిప్లొమా పొందారు.
- 1971లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు తెలుగులో బాలసాహిత్య వికాసం, ఆంధ్రప్రదేశ్‌లో బాలల గ్రంథాలయాల ప్రగతిపై ఆయన చేసిన పరిశోధనా కృషికి పీహెచ్‌డీ బహుకరించారు.
- వెంకటప్పయ్య గారు ప్రతిపాదించిన విషయాలతో మోడల్ పబ్లిక్ లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ యాక్టును దేశమంతటికీ వర్తించేలా ఆమోదింపజేశారు.
- వాషింగ్టన్‌లోని ప్రపంచ ప్రసిద్ధ గ్రంథాలయంలో లైబ్రరీ సైన్స్‌పై ఆయన రాసిన పుస్తకాలను ఉంచారు.
- అనేక ప్రత్యేక, సంస్మరణ సంచికలకు సంపాదకత్వం వహించారు.
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యఅలయం ప్రచురణ- దీని సంపాదక వర్గంలో వెలగా వెంకటప్పయ్య ఒకరు.
- భారత గ్రంథాలయోద్యమం, మార్చి ఆఫ్ లైబ్రరీ సైన్స్ తదితర గ్రంథాలకు సంపాదకత్వం వహించారు.
- ఆయన రచించిన మన వారసత్వం గ్రంథానికి తెలుగు విశ్వ విద్యాలయం ఉత్తమ గ్రంథంగా అవార్డు ఇచ్చింది.
- ‘తెలుగులో బాల సాహిత్య వికాసం- ఆంధ్రప్రదేశ్‌లో బా లల గ్రంథాలయాల ప్రగతి’పై ఆయన రాసిన పరిశోధన వ్యాసం, ఆ ఏడాది అత్యుత్తమంగా ఎంపికై బంగారుపత కం అందుకుంది.
- తెలుగు పుస్తకాల అమరిక, నిర్వహణలో ఎదురవుతున్న చిక్కులను తొలగించటానికి విదేశాల్లోని గ్రంథాలయ, సమాచార శాస్త్రవేత్తల సూచనలను పరిశీలించి మన పరిస్థి తులకు అనుగుణంగా, ‘వర్గీకరణ నియమాలు’, ‘గ్రంథ కర్త గుర్తులు’, ‘విషయ శీర్షికలు’ తీసుకొచ్చారు.
- రాష్ట్ర ప్ర భుత్వ పౌర గ్రంథాలయశాఖ తెలుగుపుస్తకాల వర్గీకర ణకు డ్యూయీ దశాంశ వర్గీకరణ విధానాన్ని సవరించినూ తన జాబితాల తయారీలో ప్రముఖ పాత్ర పోషించారు.
- గ్రంథాలయ శాస్త్ర పారంగత, ఉత్తమ గ్రంథ పాలక, బాల బంధు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, గ్రంథాలయ గాంధీ వంటి అనేక పురస్కారాలను అందుకున్నారు.
- ధర్మవరంలోని కళాజ్యోతి సంస్థ వెలగాపై గౌరవంతో పౌర గ్రంథాలయ సేవలోని ఉత్తమ గ్రంథపాలకులకు 1990 నుంచి ఆయన పేరుతో పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు.
- గుంటూరులోని ఒక వీధికి వెలగా పేరిట నామకరణం చేశారు.
- వెలగా జన్మదినం సందర్భంగా 2014 జూన్‌లో విజయనగరం జిల్లా తోటపల్లి, పార్వతీపురంలో 50 గ్రామీణ గ్రంథాలయాలను ఆయనచే ప్రారంభింపజే శారు.
మరణం సవరించు
ఇతడు తన 83వ యేట 2014, డిసెంబరు 29న గుండెనొప్పితో విజయవాడ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.[5]
మూలాలు సవరించు
- ↑ Venkatappaiah passes away
- ↑ Knowledge Management : Today And Tomorrow by S Gopalakrishnan B Ramesh Babu, Ess Ess Publications, 2003
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో గ్రంథాలయ వర్గీకరణ పుస్తకం.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో గ్రంథాలయ సూచీకరణ పుస్తకం.
- ↑ "గ్రంథాలయోద్యమానికి వెన్నెముక". సాక్షి దినపత్రిక. 30 Dec 2014. Archived from the original on 2014-09-24. Retrieved 2018-09-24.
బయటి లింకులు సవరించు
- బాల సాహితి - తెలుగులో బాలల సాహిత్యం - వెలగా వెంకటప్పయ్య రచన - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- బాలసాహిత్యం ఘట్టాలు
- Documentary video on life of Dr. Velaga Venkatappaiah in YouTube
- గ్రంథాలయ గాంధీ 12-06-2016 ఆంధ్రజ్యోతి దినపత్రిక[permanent dead link]