శోభారాజు

ప్రముఖ గాయని, అన్నమాచార్య కీర్తనలతో సుప్రసిద్ధమైంది.

శోభారాజు ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు, రచయిత. అన్నమయ్య సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో విశేష కృషి చేసింది.[1] స్వయంగా అనేక భక్తి పాటలు రాసి స్వరాలు సమకూర్చింది. ఆరు వేలకుపైగా కచ్చేరీలు చేసింది. వేలమందికి సంగీతంలో శిక్షణ ఇచ్చింది. 2010 లో కళారంగంలో ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.[2]

శోభారాజు
SOBaaraaju.jpg
జననం (1957-11-30) November 30, 1957 (age 65)
విద్యబి. ఏ (సంగీతం)
విద్యాసంస్థపద్మావతి మహిళా కళాశాల
వృత్తిగాయని, సంగీత దర్శకురాలు, రచయిత
జీవిత భాగస్వామిఎస్. నందకుమార్
తల్లిదండ్రులు
  • నారాయణ రాజు (తండ్రి)
  • రాజ్యలక్ష్మి (తల్లి)

1983లో అన్నమాచార్య భావనా వాహిని అనే సంస్థను నెలకొల్పింది. దివ్య సంగీతంతో మనుసులోని మలినాలను పారదోలుదాం అనేది ఈ సంస్థ ముఖ్యోద్దేశ్యం. ఈ సంస్థ ద్వారా సుమారు పదిహేను వేల మంది విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇచ్చింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు హైదరాబాదులోని హైటెక్ సిటీ సమీపంలో స్థలం మంజూరు చేసింది. దీన్ని అన్నమయ్యపురం అనే ప్రాంగణంగా అభివృద్ధి చేసి సంగీత శిక్షణ, సంగీత ఉత్సవాలు, అన్నమయ్య కీర్తనలపై పరిశోధన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

శోభారాజు 1957 నవంబర్ 30చిత్తూరు జిల్లా వాయల్పాడులో జన్మించింది. ఆమె తండ్రి నారాయణ రాజు ప్రభుత్వోద్యోగి. తండ్రి ద్వారా ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరుచుకుంది. తల్లి రాజ్యలక్ష్మి పాటలు పాడేది. తల్లి ఆమెకు తొలి గురువు. ఆమె తాత కూడా వయొలిన్ వాయించేవాడు. ఆమె మావయ్యలకు కూడా సంగీత పరిజ్ఞానం ఉండేది. వాళ్ళు హరికథకులు కూడా.[3] నాలుగేళ్ళ వయసునుంచే స్వంతంగా కూడా పాటలు సాధన చేయడం ప్రారంభించింది. తండ్రి చిత్తూరులో బ్లాక్ డెవలప్మెంటు అధికారిగా పనిచేస్తున్నపుడు డెప్యుటేషన్ మీద కొద్ది రోజులు కుటుంబంతో సహా నేపాల్లో నివాసం ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కృష్ణుడి మీద భక్తి కలిగిన ఆమె ఆయన మీద నేపాలీ భాషలో తొలిపాట రాసింది.

ఆధునిక విద్యనభ్యసిస్తూనే సంగీతం సాధన చేసింది. తిరుపతిలో ఉన్నప్పుడు పుల్లయ్య దగ్గర, కర్నూలులో నివాసం ఉన్నప్పుడు డాక్టర్ పినాకపాణి శిష్యుడైన శేషగిరి రావు దగ్గర సంగీతం నేర్చుకున్నది. పాకాల మునిరత్నం, తిరుత్తణి కృష్ణమూర్తి గార్ల దగ్గర వయొలిన్ నేర్చుకుంది. పదహారేళ్ళకు ఆలిండియా రేడియోలో కళాకారిణిగా ఎంపికైంది. పదిహేడేళ్ళ వయసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సంగీతం ప్రధానాంశంగా బి.ఏ చదివింది. అప్పుడే డాక్టర్ కల్పకం దగ్గర సంగీతం నేర్చుకుంది. అప్పుడే శ్రీవేంకటేశ్వరుని మీద భక్తితో అన్నమాచార్య కీర్తనలవైపు దృష్టి మళ్ళించింది. 1976లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య ప్రాజెక్టులో భాగంగా ఆయన కీర్తనలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు వీలుగా ఆమెకు ఉపకారవేతనం మంజూరు చేశారు. అప్పటికే ఆమెకు సినిమా అవకాశాలు తలుపు తడుతున్నా అన్నమాచార్య కీర్తనలు ప్రాచుర్యం చేయడానినే నిర్ణయించుకుంది. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతంలో ఉన్నత స్థాయి శిక్షణ పొందింది.

అన్నమయ్య సంకీర్తనలుసవరించు

ఆమె చిన్నప్పటి నుంచి అన్నమాచార్య వేదికలమీద అన్నమయ్య సంకీర్తనలు గానం చేసేది. పాఠశాల స్థాయిలోనే అనేక పురస్కారాలు అందుకుంది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు పెండ్యాల, సాలూరి రాజేశ్వర రావు, రమేష్ నాయుడు, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం తదితరుల చేతుల మీదుగా అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది. ఎస్. రాజేశ్వరరావు ఆమెను చెన్నైకు ఆహ్వానించి రెండు పాటలను కూడా రికార్డు చేశాడు. కామిశెట్టి శ్రీనివాసులు ఆమెకు అన్నమాచార్య కీర్తనలకు మార్గం సూచించారు. ఆమెకు శిక్షణ ఇచ్చారు. 1976లో అన్నమయ్య పాటలను అధ్యయనం చేయడం ప్రారంభించింది. అన్నమాచార్య సంకీర్తనల ప్రచారమే లక్ష్యంగా పనిచేసి, హైదరాబాదు నగరంలో అన్నమయ్యపురం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అన్నమాచార్య ప్రాజెక్టు తర్వాత 1982 లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రామదాసు ప్రాజెక్టులో పనిచేసింది.

1983లో అన్నమాచార్య భావనా వాహిని అనే పేరుతో స్వంతంగా ప్రాజెక్టు ప్రారంభించింది. అన్నమయ్య వర్ధంతితో పాటు జయంతి, నగర సంకీర్తనం, సంగీత ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా వేలాది మందికి సంగీతంలో శిక్షణ ఇచ్చింది. సంగీతంలో జబ్బులు నయం అవుతాయని నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి ప్రయోగాత్మకంగా నిరూపించింది. మనుషుల్లో మానసిక పరివర్తన కోసం కూడా సంగీతం ఉపయోగపడుతుందని జైళ్ళకు వెళ్ళి సంకీర్తనలు గానం చేశారు. తంజావూరులోని సరస్వతి గ్రంథాలయంలో పరిశోధన చేసి మరుగున పడిఉన్న 39 అన్నమయ్య సంకీర్తనలు వెలుగులోకి తీసుకువచ్చింది. భారత ప్రభుత్వం అన్నమయ్యపై తపాలా బిళ్ళ విడుదల చేసేందుకు కృషి చేసింది. ట్యాంక్‌బండ్‌ మీద అన్నమయ్య విగ్రహం కోసం కృషి చేసింది. కేవలం భారతదేశంలోనే కాక అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి దేశాల్లో కూడా అన్నమయ్య పాటలకు ప్రాచుర్యం తీసుకువచ్చింది. అన్నమయ్య టెలీ సీరియల్ కు రచన, మాటలు, సంగీతంతో పాటు దర్శకత్వం వహించింది.

సంగీత శిక్షణసవరించు

హైదరాబాదులో హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అన్నమయ్యపురంని తీర్చిదిద్దింది. ఇక్కడ నిరంతరం వేంకటేశ్వర నామ సంకీర్తనం, సంగీత శిక్షణ, సంగీత ఉత్సవాలు, అన్నమయ్య తత్వ ప్రచారం, ఆయన కీర్తనలపై పరిశోధన లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇదే ఆవరణలో అన్నమాచార్య సమేత శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఈ ఆలయ గోపురంపై రామదాసు, త్యాగయ్య వంటి వాగ్గేయకారుల విగ్రహాలను కూడా చెక్కారు. ప్రముఖ సినీ గాయకుడు,, నటుడు సాందీప్ శోభారాజు శిష్యుడు.

పురస్కారాలు, పదవులుసవరించు

2010లో కళారంగంలో ఆమె కృషికిగాను భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు పొందింది. 2013లో ఉగాదికి రాష్ట్రప్రభుత్వం తరపున హంస పురస్కారాన్ని కూడా అందుకుంది.[4] తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అన్నమాచార్య ప్రాజెక్టు సలహాదారుగా పనిచేయడంతో పాటు సంగీత సాంస్కృతిక రంగాల్లో అనేక కీలక పదవులు నిర్వహించింది.

మూలాలుసవరించు

  1. "Metro cultural round-up". The Hindu. 14 June 2004. Archived from the original on 17 సెప్టెంబర్ 2004. Retrieved 19 జూన్ 2016. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  2. "This Year's Padma Awards announced" (Press release). Ministry of Home Affairs. 25 January 2010. Retrieved 17 July 2010.
  3. "సంగీతంతో సమాజహితం.. విశ్వ కళ్యాణం". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 2 జూలై 2017. Retrieved 16 December 2016.
  4. సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=శోభారాజు&oldid=3415957" నుండి వెలికితీశారు