సబ్బం హరి
సబ్బం హరి విశాఖపట్నం జిల్లాకు చెదిన రాజకీయ నాయకుడు. విశాఖపట్నం జిల్లా లోని అనకాపల్లి నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున 15వ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించాడు. విశాఖపట్నం నగర మేయరుగా పనిచేసాడు.
సబ్బం హరి | |||
విశాఖపట్నం నగర మాజీ మేయర్, అనకాపల్లి మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి | |||
ముందు | పప్పల చలపతిరావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | అనకాపల్లి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆంధ్ర ప్రదేశ్ | 1952 జూన్ 1||
మరణం | 2021 మే 3 విశాఖపట్నం | ||
జీవిత భాగస్వామి | లక్ష్మి | ||
సంతానం | 1 కొడుకు (వెంకట్), 2 కూతుర్లు (అవని, అర్చన) | ||
నివాసం | విశాఖపట్నం | ||
మతం | హిందూ మతం |
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుఇతడు 1952 జూన్ 1న విశాఖపట్నంలో జన్మించాడు. తగరపువలస సమీపంలోని చిట్టివలస ఇతడి సొంతూరు. నాన్న బంగారునాయుడు. అమ్మ అచ్చియ్యమ్మ. ఆరుగురి తర్వాత ఆఖరివాడు ఇతడు. సొంతూరులోనే పాఠశాల చదువు పూర్తిచేసి ఏవీఎన్ కళాశాలలో ఇంటర్ చదివాడు. అక్కడే డిగ్రీ పూర్తిచేశాడు. ప్రిన్సిపాల్ దివాకర్ల రామమూర్తి ఇతడిని అభిమానించేవాడు.
వివాహం
మార్చుఇతడిది ప్రేమ వివాహము. ఇతడి భార్యపేరు లక్ష్మి. 1970 అక్టోబరు 15 న వీరి వివాహం జరిగింది.[1] ఏవీఎన్ కళాశాలలో ఇతడు బీకాం, ఆమె బీఏ చదువుతుండగా పరిచయం ప్రేమగా మారి పెళ్ళి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. అవని, అర్చన, వెంకట్. ఆడపిల్లలకు పెళ్ళిళ్లయ్యాయి. కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. రాజకీయాలకు దూరంగా వారిని పెంచారు.
వ్యాపారం
మార్చుడిగ్రీ చివరి సంవత్సరలో ఓ మిత్రుడి సలహాతో కంచరపాలెంలో బియ్యం వ్యాపారం ప్రారంభించాడు. అప్పట్లో నాణ్యమైన బియ్యం వంద కిలోల బస్తా రూ.180 నుంచి రూ.190 మధ్య అమ్మేవాడు. కొన్నాళ్లకు దానికి స్వస్తిపలికి రెండు లారీలు కొన్నాడు. 30 మందికి ఉపాధి కల్పించగలిగినా నష్టాలు రావడంతో వదిలేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా అది కూడా కలిసిరాలేదు.
రాజకీయాలు
మార్చురాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో 1995లో మేయర్ ఎన్నికలు వచ్చాయి. భాట్టం శ్రీరామమూర్తి, మరికొందరి సూచనతో పోటీచేసి గెలిచాడు. అప్పటికి మూడు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో అన్నిసీట్లు టీడీపీ గెలుచుకున్నది. అధికారంలోకి వచ్చింది. ఈ కారణంగా ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఇతడి వెంట రాలేదు. ఇతడి గురించి తెలిసిన ప్రజలు మాత్రం ఇతడినే గెలిపించారు. ఇతడు మేయర్‌గా ఎన్నికయ్యే నాటికి అధికారుల హవా సాగుతూండేది. దానికి బ్రేక్ వేసి నగర ప్రథమ పౌరుడి సత్తా చాటాడు. అవినీతి ఆరోపణలు లేకుండా పాలించాడు. ఇతడి హయాంలోనే పారిశుధ్యాన్ని ప్రైవేటీకరణ చేసిన తొలినగరంగా విశాఖపట్నం నిలిచింది.
1984లో ఇందిరాగాంధీని సొంతగార్డులే హత్యచేసిన సంఘటన ఇతడిని బాగా కదిలించింది. హత్య తరువాత, అంత్యక్రియల వరకు మూడు రోజులపాటు టీవీల్లో చూపిన దృశ్యాలను రికార్డు చేశాడు. ఆ తర్వాత ప్రతిరోజూ కంచరపాలెంలో ఇతడి ఇంటి వద్ద వాటిని ప్రదర్శించేవాడు. పెద్ద సంఖ్యలో జనం వచ్చి చూసేవారు. 1985లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ ఇతడి ఇంటి ముందు రాజీవ్‌గాంధీ కటౌట్ పెట్టడం సంచలనం కలిగించింది. విషయం తెలిసి అప్పటి కాంగ్రెస్ పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ, సూర్రెడ్డి, గుడివాడ గురునాథరావులు వీరి ఇంటికి వచ్చారు. అప్పోజీరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన నగర కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా ఇతడిని నియమించిన విషయం చెప్పారు. అలా రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చాడు. తర్వాత నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమితుడయ్యాడు. నగర కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ అనతికాలంలోనే గుర్తింపు పొందాడు. బలమైన వ్యవస్థను తయారు చేశాడు. దీనిని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి 1989లో టికెట్ ఇవ్వజూపింది. తనకు వద్దని చెప్పి గురునాథరావు, సూర్రెడ్డి, ఈటి విజయలక్ష్మిలకు ఇవ్వాలన్నాడు. వారిని గెలిపించాడు.
రాజకీయ పదవులు
మార్చుసబ్బంహరి 1995లో విశాఖ మేయర్‌గా పని చేశాడు. పదవీ కాలం ముగిసిన తరువాత 2000 నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నాడు. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[2]
విశాఖ మేయరుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు
మార్చుఅర్ధరాత్రి 12 గంటల సమయంలో మహిళలు కుళాయిల వద్ద నీళ్లకోసం పడిగాపులు పడడం చూశాక మనస్తాపం చెందాడు. అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి నిబద్ధతతో అమలు చేయడంతో విజయవంతం అయ్యాయి.
- మూడు రోజుల్లో కాపులుప్పాడలో వంద ఎకరాలు డంపింగ్ యార్డుకు కేటాయించేలా కృషి చేశాడు.
- బీచ్ రోడ్డులో విగ్రహాలు, కొండవాలు ప్రాంతాలకు కుళాయిలు ఏర్పాటు చేశాడు.
- రైవాడ కాల్వ లైనింగ్ పనులు పూర్తి చేయడంతో 19 ఎంజీడీల నీటి సరఫరా జరిగి ఎద్దడి తగ్గింది.
- మర్రిపాలెం, కంచరపాలెం, గోపాలపట్నం రోడ్ల విస్తరణ, కంచరపాలెం వంతెన, శివాజీపాలెం పార్కు, నగరంలో పాఠశాలలకు పక్కాభవనాలు, సులభ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టాడు.
మరణం
మార్చుసబ్బం హరి కోవిడ్-19 వ్యాధి బారిన పడి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 మే 3న మరణించాడు. [3][4]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-06. Retrieved 2016-09-25.
- ↑ BBC News తెలుగు (3 May 2021). "మాజీ ఎంపీ సబ్బం హరి మృతి". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
- ↑ Eenadu. "Sabbam Hari: కరోనాతో కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
- ↑ News18 Telugu (3 May 2021). "Sabbam Hari Passed Away: కరోనా కారణంగా మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)